విదూషకుని ఆత్మహత్య
కొవ్వొత్తు లారిపోయినై
క్లోరోఫారంలా చీకటి కమ్మింది
ప్రపంచం తన మరణశాసనం రాసుకుంది.
విదూషకుడు ఆత్మహత్య చేసుకున్నాడు
యంత్రాల మంత్రగానం
విషధూమాల తుపాను
స్టీమర్లో చింపంజీ
నాందిలో భరత వాక్యం
మృత్యువులో సృష్టి
విదూషకుని ఆత్మహత్య.
విదూషకుని వికట హాసంలో
కపాలం పకాలన్నది.
ఆకలి అన్నం వండుకుంది,
హంస ఆకాశం అందుకుంది.
విదూషకుని విషాదం
సముద్రంలో బడబాగ్ని
భూకంపంలో ఫ్రూట్ శలాడ్,
కాని
కొవ్వొత్తులు మళ్ళీ వెలిగి
మరణం శాసనం మండిపోయింది.
- ప్రతిభ త్రైమాసిక సంపుటి, 4 - 1940


