Home » Vasireddy seeta devi novels » Dr Vasireddy Seetha Devi Sahityam


    "అందుకే ఆమెకు వసంత అంటే ఎక్కువ ఇష్టం."

 

    "అవును ఎక్కువ ఇష్టమే! కారణం నీకూ తెలుసు." తీవ్రంగా అంది వసంత. వసంతకంటే తను చాలా పెద్దది కాకపోయినా అరుంధతి హృదయంలో వసంత అంటే వాత్సల్యభావం ఏర్పడింది. గుండెలకు హత్తుకుని తల నిమరాలనిపించింది.

 

    "అవును వసంతా! నువ్విక్కడకొచ్చి ఎంత కాలమయింది?" ఆప్యాయంగా అడిగింది అరుంధతి.

 

    "మూడేళ్ళయింది."

 

    "నువ్వంటే శ్రీమతి వైకుంఠానికి చాలా ఇష్టం అనుకుంటాను. రాత్రి సినిమాకు తీసుకెళ్ళినట్లుంది. బాగా పొద్దుపోయి వచ్చావు, కదూ?"

 

    అరుంధతి అమాయకత్వానికి ముగ్గురూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వసంత గాఢంగా నిట్టూర్చింది.

 

    "ఏ సినిమాకు వెళ్ళావు?" వాళ్ళ భావాలేమీ అర్ధం చేసుకోని అరుంధతి మళ్ళీ ప్రశ్నించింది అమాయకంగా.

 

    "నీకింకా ఈ ప్రపంచం తీరు తెలిసినట్టులేదు. ఈ మురికిలోకి కాలు ఇంకా జారినట్లులేదు. కొంత తెలుసుకోవటం అవసరమే. రాత్రి వసంత సినిమాకు వెళ్ళలేదు. ట్రావెలర్స్ బంగళాకు వెళ్ళింది" అంది కమల బాధగా.

 

    "ఎందుకూ? అక్కడ మీటింగ్ జరిగిందా?" అరుంధతి మామూలుగానే ప్రశ్నించింది.

 

    "రాత్రి ఆ బంగళాకు ఒక మంత్రిగారు వచ్చారు." అర్ధయుక్తంగా ఆగిపోయింది సరోజ.

 

    "వస్తే?"

 

    అరుంధతి ప్రశ్నవిని వసంత నెత్తి బాదుకొంది.

 

    "మంత్రిగారి గౌరవార్ధం డిన్నరు జరిగింది. ఏర్పాట్లన్నీ చేసింది శ్రీమతి వైకుంఠంగారే. ఆమెకు సహాయంగా వసంత. అహర్నిశలూ పనుల వత్తిడితో సతమతమయిపోయే మంత్రులకుకూడా కొంత వినోదమూ, ఆహ్లాదమూ కావాలిగదా?" అంది కమల.

 

    అరుంధతికి వెంటనే అర్ధంకాలేదు. అర్ధం అయ్యాక మతిపోయినంత పని అయింది. కళ్ళప్పగించి చూసింది. బయట ప్రపంచం ఇంత నీచంగా వుందా? ఆలోచిస్తూ కూచుంది అరుంధతి.

 

    "ఏంటర్రా చుట్టూ కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?" అంటూ మురిపెంగా అడిగింది శ్రీమతి వైకుంఠం.

 

    "ఆ-ఆ-ఏం లేదు. అరుంధతి ఏదో చెబుతుంటేనూ-" కమల తొట్రుపాటుతో జవాబిచ్చింది.  

 

    ఆవిడంటే వీళ్ళకు ఎంత భయమో? భయపడక ఏం చేస్తారు? ఈ కాస్త ఆశ్రయంకూడా పోతే వాళ్ళ బతుకు బజారుపాలేకదా!

 

    చేతిలోవున్న మల్లెపూల పొట్లం అరుంధతికి అందించబోయింది. అరుంధతి ముఖం చిట్లించుకుంది. అందుకోలేదు. శ్రీమతి వైకుంఠానికి ఒళ్ళు మండింది. కాని, రాజారావు మనిషి, ఏమీ అనలేకపోయింది.

 

    "కమలా! నువ్వెళ్ళి కాఫీ పెట్టు. టిఫిన్ ఏం చేస్తావు? ఇవ్వాళకి ఉప్మా చెయ్యిలే" అంది శ్రీమతి వైకుంఠం.

 

    "తిండి బాగానే పెడుతుంది. పెద్దగా ఎవర్నీ ఏమీ అనదు. ఆప్యాయంగా చూస్తుంది. మొత్తానికి తెలివైన ఘటం!" అనుకుంది అరుంధతి.

 

    "సరోజా! ఈ పూలు మాలకట్టి అరుంధతికి పెట్టు. ఇవ్వాళ మీకెవరికీ తేలేదు" అంది మల్లెల పొట్లం సరోజకు అందిస్తూ.

 

    "ఇవ్వాళ నీకు కొత్త అనుభవమే దొరకబోతుంది" అన్నట్లు చిరునవ్వుతో చూసింది సరోజ అరుంధతి ముఖంలోకి. అరుంధతికి ఏదోలా ఉంది.  

 

    "అరుంధతమ్మా! చూడు. పెందలకడ స్నానంచేసి మంచి చీర కట్టుకో. వసంతా, నీ పౌడరూ వగైరా అరుంధతికి ఇవ్వు" అంది శ్రీమతి వైకుంఠం.

 

    అరుంధతికి ఏమీ అర్ధం కావటంలేదు. కాని. వైకుంఠం మాటలూ, వసంతా, సరోజా చిరునవ్వులూ, అక్కడి వాతావరణం ఆమెకు ఊపిరి సలపటంలేదు. మేఘావృతమైన ఆకాశం, గాలి స్తంభించిపోయింది. నలువైపులా మసకచీకట్లు కమ్ముతున్నాయి. ఒక్క ప్రాణికూడా ఆ దరిదాపుల్లో లేదు. దెబ్బతిని కిందపడ్డ ఒకే ఒక పక్షి విలవిల కొట్టుకుంటూంది. రెక్కల్లోకి బలం కూడదీసుకొని ఎగరబోయి కిందపడి, నిస్సహాయంగా ఆకాశంకేసి చూస్తూంది. అరుంధతి మానసిక పరిస్థితి ఆ పక్షిలాగే ఉంది.   

 

    "అలా దిగులుపడి కూచుంటే ఎలాగమ్మా? చక్కగా ముస్తాబయి ఆ పువ్వులు పెట్టుకో. ఆయన ఏవేళప్పుడు వస్తారో?" అంది శ్రీమతి వైకుంఠం.

 

    ఆయన వస్తారా? ఎవరు? అరుంధతికి అర్ధంకాలేదు.

 

    "సరోజా! ఇల్లంతా చక్కగా సర్దు. రాజారావుగారు వస్తున్నారు. ఆయన వచ్చేటప్పటికి మీరంతా బయట కనిపించకూడదు. సాయంత్రం నేను బంగళాకు వెళ్ళి ఆయన్ను తీసుకొస్తాను." పులిచెమట్లు పట్టివున్న శరీరాన్ని లోపలకు దొర్లించింది శ్రీమతి వైకుంఠం.

 

    "నువ్వు అదృష్టవంతురాలవు. నీకు స్పెషల్ గౌరవం. అది నీ అందం గొప్పతనమే. నిన్ను కాలు బయట పెట్టనిచ్చేలా లేదు ఆవిడ. కాని, ఆశ్చర్యంగా ఉంది. ఈ మూడు సంవత్సరాలుగా ఇంటిదగ్గర ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడూ ఎవరికోసం చెయ్యలేదు." వసంత కంఠంలో అసూయ తొంగిచూసింది.   

 

    అరుంధతికి వసంతను లాగి చెంపకాయ కొట్టాలనిపించింది. జుగుప్సాకరమైన విషయాలను ఎంత సాధారణంగా మాట్లాడుతున్నారో! జుగుప్సతో అరుంధతి ప్రాణాలు దహించుకుపోతుంటే, అసహ్యంతో శరీరం కాలిపోతూంది. ఆమె దిగ్గున లేచి తన గదిలోకి వెళ్ళింది. వసంత తెల్లముఖం వేసి ఆమె వెళ్ళినవైపే చూస్తూ "ఖర్మ" అంటూ నుదురు బాదుకుంది. "అయోమయం మనిషి!" అనుకుంది.

 

    ఛ! ఎంత అసహ్యం! ఇంత అవమానకరమా! రాజారావు తనను ఇక్కడవుంచి ఇంత అవమానం చేస్తాడా! అరుంధతిలోని ప్రతి అణువూ ఎలుగెత్తి పిచ్చిగా అరవాలని ఉద్రేకపడుతోంది. హృదయంలో కసి ఇంతింతై, కొండంత అయి నిలిచింది.

 

    తనను అందరూ అవమానిస్తూనే ఉన్నారు. భర్త, రాజారావు, శ్రీమతి వైకుంఠం అందరూ అవమానిస్తున్నారు. ఆమెలో తలెత్తిన కక్ష ప్రతీకారం కోసం బుసలు కొడుతూంది. ఎవరిమీద కసీ? సీతాపతి...రాజారావు...శ్రీమతి వైకుంఠం బంగళాలో తినేసేలా అసహ్యంగా గుడ్లప్పగించి వెకిలిగా చూసిన ఆ మగవాళ్ళు....అందరిమీదా....కసిగానే ఉంది. అందరికంటె ఎక్కువ ఆమెమీద ఆమెకే కసిగా ఉంది.

 

    తను కసి తీర్చుకుంటుంది లోకంమీద. తనను అవమానించిన వాళ్ళమీద, తనమీద కసి తీర్చుకుంటుంది.

 

    బుసలు కొడుతూ అశాంతిగా అటూ యిటూ నిరుద్దేశంగా ఇల్లంతా కలియ తిరుగుతున్న అరుంధతికి శ్రీమతి వైకుంఠం నోరు తెరుచుకొని చూసింది.


                                         24


    "రాజారావుగారు ఎనిమిది గంటలకు వస్తున్నారట. శ్రీమతి వైకుంఠం కబురు పంపించింది" అంది కమల అరుంధతిని పరీక్షగా చూస్తూ. అరుంధతి వాలకం చూస్తుంటే ముగ్గురిలో ఎవరికీ మాట్లాడే ధైర్యం కలగటంలేదు. సాయంత్రం అంతా అరుంధతిణి ఎవరూ పలకరించే సాహసం చేయలేకపోయారు. కొత్తగా బోనులో పెట్టబడిన ఆడపులిలా తిరుగుతూంది అరుంధతి.

 

    "కాస్త తలన్నా దువ్వుకో! ముఖం కడుక్కుని ఆ పూలు పెట్టుకో. అలాగే కూచుంటే శ్రీమతి వైకుంఠానికి కోపం వస్తుంది" అంది కమల భయపడుతూ చిన్నగా.

 

    "ఏమిటి మీ ఉద్దేశం? రాజారావు వస్తున్నాడని నేను పూలు పెట్టుకోవాలా? కొత్తచీర కట్టుకోవాలా? అలంకరించుకొని అతని కోసం ఎదురుచూస్తూ కూచోవాలా? ఛీ! ఛీ!" అంటూ దిగ్గున అక్కడనుంచి లేచి వెళ్ళిపోయింది. కమల గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోయింది.  

 

    దాదాపు ఎనిమిది గంటల ప్రాంతంలో వాకిట్లో కారు ఆగింది. కమలా, సరోజా, వసంతా తమ గదిలోకి పరుగెత్తుకెళ్ళారు. అరుంధతి మాత్రం మెల్లా ఇంట్లో బల్లమీద అలాగే కూచుంది. సాయంకాలమే వసంత అరుంధతి గది సర్ది అలంకరించింది. అప్పటినుంచి అరుంధతి ఆ గదిలో కాలు కూడా పెట్టలేదు. రాజారావును తలుచుకున్నప్పుడల్లా అతని జుట్టు పీకాలనీ, ముఖం రక్కాలనీ, పిచ్చిగా తిట్టాలని అనిపిస్తూంది అరుంధతికి.

 

    ఇంట్లో అడుగు పెట్టిన శ్రీమతి వైకుంఠం అరుంధతి రూపం చూసి తెల్లబోయింది. తలన్నా దువ్వుకోలేదు. ఆమె వెనకే రాజారావు ప్రవేశించాడు. అరుంధతి అలాగే కూచుంది. అరుంధతిని చూసి రాజారావు గతుక్కుమన్నాడు. మూర్తీభవించిన కరుణలా కనిపించింది.

 

    "ఆ గది...నీ గదిలోకి తీసుకెళ్ళి కూచోపెట్టమ్మా!" అంది శ్రీమతి వైకుంఠం ఏమనాలో తోచక.

 

    అరుంధతి ముఖం చూసిన రాజారావు ఆమె మానసిక స్థితి అర్ధం చేసుకున్నాడు. శ్రీమతి వైకుంఠం అన్న మాటలు రాజారావుకు కూడా అదోలా అనిపించాయి.

 

    "అక్కర్లేదు. ఒక కుర్చీ ఇక్కడే వెయ్యండి" అన్నాడు రాజారావు.

 

    శ్రీమతి వైకుంఠం లోపలకు వెళ్ళి కుర్చీ తెచ్చి వేసింది. వాళ్ళిద్దరి గొడవా అర్ధంకాక తికమకపడింది. ఇలాంటి కేసులు తనకు ఎప్పుడూ తటస్థపడలేదు అనుకుంటూ లోపలకు వెళ్ళిపోయింది.

 

    రాజారావు కుర్చీని అరుంధతికి దగ్గరగా లాక్కొని కూర్చున్నాడు. "అరూ బాగున్నావా?" ఆ కంఠంలో ఆదరణ, ఆప్యాయతా "ఖంగ్" మన్నాయి.

 

    అరుంధతి ఈసడింపుగా చూసింది, మాట్లాడలేదు.

 

    "చాలా రోజులకు వచ్చినందుకు కోపం వచ్చిందా? పనులు వత్తిడిలో..."

 

    "అసలు మీ ఉద్దేశం ఏమిటి?" రాజారావు మాటల్ని మధ్యలోనే విరిచేస్తూ తీవ్రంగా ప్రశ్నించింది అరుంధతి.

 

    రాజారావు అదిరిపడ్డాడు. అయోమయంగా చూశాడు.

 

    "నన్ను ఇక్కడవుంచి ఇలా రాత్రిళ్ళు నాకోసం వస్తారా? ఆవిడ.... ఆవిడేమో గదుల్ని అలంకరిస్తుందా? మీ దృష్టిలో నేను వేశ్యను అయిపోయానా?" నిలదీసి అడిగినట్లు అడిగింది.

 

    రాజారావు మతిపోయినవాడిలా పిచ్చిచూపులు చూశాడు.

 

    "నన్ను ఇలా అవమానిస్తారా? స్త్రీ అంటే మీ దృష్టిలో ఇంత తేలిక భావం ఉందని ఏనాడూ ఊహించలేదు. మీరు నేను గౌరవించిన రాజా కాదు. నేను ప్రేమించిన రాజా-ఆదర్శమూర్తి. అతనికి ఆడవాళ్ళను ఎలా గౌరవించాలో తెలుసు. నువ్వు...నువ్వు.." మాటలు పెగల్లేదు. అరచేత్తో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది.

 

    రాజారావు కలలో మాట్లాడుతున్నట్లు చిన్నగా అన్నాడు.

 

    "నన్ను అంత నీచునిగా అర్ధంచేసుకున్నావా? స్త్రీ అంటే ఏనాడూ నాకు తృణీకారభావం లేదు. అందునా నిన్ను నేను చులకనగా చూస్తానా? అవమానిస్తానా? నా దృష్టిలో పురుషుడికంటే స్త్రీకే చాలా ఉన్నతమైన స్థానం వుంది. పురుషుడు సృష్టి అయితే స్త్రీ పరంపర. పురుషుడు ఆవేదనా జనిత అగ్నిజ్వాల అయితే స్త్రీ ఆ జ్వాలను శాంతపరచే పీయూషధార. స్త్రీని నేను చాలా గౌరవిస్తాను అరూ! మిగతా విషయాల్లో నేను మారిపోయి ఉండవచ్చు. ఈ విషయంలో మాత్రం కాదు. నిన్ను- నాకోసం నీ సర్వస్వాన్ని కాలదన్ని వచ్చిన నిన్ను, నేను అవమానిస్తున్నానా? అవును! నిజమే కావచ్చు. లేకపోతే నువ్వింత దారుణ వ్యధకు ఎందుకు గురి అవుతావు? నేను నీచుణ్ణి." అంటూ అతనికి తెలియకుండా గుప్పెడు మూసి చేతిని అరుంధతి కూర్చునివున్న బల్లకు కొట్టుకోసాగాడు.  

 

    అరుంధతి కళ్ళుతుడుచుకుంది. చటుక్కున అతని చేతిని పట్టుకుంది.

 

    "ఏమిటిలా కొట్టుకుంటున్నారు? చెయ్యి చిట్లి రక్తం కూడా వస్తూంది" అంది గాబరాగా తన కొంగుతో రక్తాన్ని అద్దుతూ మెత్తని స్వరంతో.

 

    "బాగా దెబ్బ తగిలినట్లుంది" అంది వాచివున్న చేతిని నిమురుతూ.

 

    "హుఁ దెబ్బ! అది ఏనాడో తగిలింది!" అంటూ పేలవంగా నవ్వాడు రాజారావు.

 

    "నాకు ఇక్కడ వుండటం ఇష్టంలేదు. శ్రీమతి వైకుంఠం వ్యవహారం అదోలా ఎబ్బెట్టుగా, జుగుప్సాకరంగా వుంది. అందుకే మిమ్మల్ని చాలా బాధ పెట్టాను" అంది అరుంధతి జాలిగా. రాజారావు బాధపడటం చూసిన అరుంధతి అన్నీ మర్చిపోయింది.

 

    "గత్యంతరంలేదు అరూ! కొంతకాలం ఓపికపట్టు." అన్నాడు.

 

    "అయితే, నేను ఇక్కడ వుండగా మీరు ఇలా చూట్టానికి రాకూడదు." ఖచ్చితంగా అన్నది.

 

    సాలోచనగా అరుంధతి ముఖంలోకి చూశాడు. ఓ క్షణం మౌనంగా తలవంచుకుని కూచున్నాడు.

 

    "ఈ విధంగా ఈ ఇంట్లో దొంగతనంగా కలుసుకోవడం నాకేమిటో అసహ్యాన్ని కలిగిస్తున్నది. నా శరీరం, ప్రాణాలూ అవమానంతో దహించుకుపోతున్నాయి" అంది అరుంధతి.

 

    "అలాగే అరూ! నీకు ఇష్టంలేని పని, నిన్ను బాధించే పని ఏదీ నేను చెయ్యను.

 

    కావాల్సిన డబ్బు శ్రీమతి వైకుంఠానికి ఇస్తూవుంటాను. అప్పుడప్పుడు నీకు ఉత్తరాలు రాస్తూంటాను. ఎలక్షన్స్ ఇంకా రెండు నెలలుకూడా నిండాలేవు." అన్నాడు రాజారావు, అరుంధతి చేతిలో వున్న తన చేతిని చూసుకుంటూ. అంతవరకూ రాజారావు చెయ్యి తన చేతిలో వున్నట్లు తెలియని అరుంధతి చటుక్కున చేతిని వదిలేసింది. రాజారావు అదోలా నవ్వాడు. "నీది చాలా చిత్రమైన స్వభావం అరూ! నేను అర్ధం చేసుకోగలనో లేదో!" అన్నాడు ఆ మాటలు తనకు తనే చెప్పుకుంటున్నట్లుగా వున్నాయి.

 

    "ఇక మీరు వెళ్ళిపోండి!"

 

    ఆ మాట అరుంధతి నోటినుండి వచ్చీ రాకుండానే రాజారావు దిగ్గున లేచినిల్చున్నాడు. గబగబా బయటకు తలవంచుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న రాజారావును చూస్తూ నిట్టూర్చింది అరుంధతి. అతన్ని వెనక్కి పిలిచి లాలించాలనీ, నవ్వించాలనీ అనిపించింది.

 

    కార్లో కూచుని రాజారావు శ్రీమతి వైకుంఠం కోసం డ్రైవరును పంపించాడు. శ్రీమతి వైకుంఠం కారు దగ్గరకు వచ్చింది. వచ్చి పదినిముషాలయినా కూచోకుండా ఆయన వెళ్ళిపోతున్నందుకు విచారాన్ని వెలిబుచ్చింది. రాజారావు ఆవిడ మాటల్ను వినిపించుకోనట్లు వూరుకున్నాడు.

 

    "ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. నా గురించి మీరు ఆమె దగ్గర ఏమీ మాట్లాడకండి. డబ్బు పంపిస్తూ వుంటాను. మీరు నాకు కనిపిస్తూనే వుంటారుగా? మరో రెండునెలలు మాత్రమే మీకు ఈ కష్టం!" అన్నాడు రాజారావు భారంగా వున్న స్వరంతో.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra