Home » Suryadevara rammohan rao » సాహసి


    యువరాజు చేష్టలకు నవ్వొచ్చింది ఇందుమతికి.

    "లేపు కొచ్చానని అనగూడదు. ఇంకా నయం వైశాలి వినలేదు. వినుంటే పెద్ద గొడవలు పోయేది..." అంది ఇందుమతి నవ్వుతూనే.

    "చెప్పిన పని చేశానుగా- అదీ ఇన్ టైమ్ లో చేశానుగా- గుర్తుంచుకోండి. సిన్సియారిటీ సిన్సియార్టీయే-" ముత్యాలనాయుడు వెనక లోనకెళ్తూ అన్నాడు యువరాజు.

    వైశాలిని, తన గదిలోకి తీసికెళ్ళి అసలు విషయం చెప్పింది ఇందుమతి. "TREASURE HUNTING వాహ్- నేనూ... వస్తాను- ఎన్నాళ్ళ నుంచో నాకు ఆ సరదా ఉంది" మెడలోని లాకెట్ ను తీసి, ఇందుమతి చేతిలో పెడుతూ అంది వైశాలి.

    ఆ లాకెట్ ను విప్పడానికి ప్రయత్నించింది ఇందుమతి.

    అది 'ఓపెన్' కాలేదు వెంటనే.

    చాలాసేపు ప్రయత్నిస్తున్న దశలో-

    దూరంనుంచి ఆ దృశ్యాన్ని చూసిన విశ్వరూపశర్మ, పరుగు, పరుగున అక్కడికొచ్చి-

    "దాన్ని అలా విప్పకూడదు. దోషం..." అని హెచ్చరించాడు.

    గతుక్కుమంది ఇందుమతి- అయోమయంగా చూస్తూ ఆ లాకెట్ ను విశ్వరూపశర్మ చేతిలో పెట్టింది. దాన్ని చూస్తూనే విచిత్రమైన ఉద్వేగానికి లోనయ్యాడు విశ్వరూపశర్మ.


                                          *    *    *    *


    తోటకు తూరుపుదిక్కు కుడివేపున వున్న మహాశక్తి దేవాలయపు ద్వారాలు చాలారోజుల తర్వాత తెరుచుకున్నాయి. ఉదయం ఆరుగంటలు లేత సూర్యుని లేలేత ఎండలో రాలిపడిన ఎండు మర్రాకులు బంగారు కార్పెట్ లా మెరుస్తున్నాయి.  

    గర్భగుడిలో రెండు ఏనుగుల ఎత్తున మహాశక్తి పార్వతీదేవి ఉగ్రరూప విగ్రహం కొత్తకాంతితో ప్రజ్వలిస్తోంది. పట్టుపీతాంబరాలతో మహారాజు కౌశికభూపతి దేవదేవిని ధ్యానం చేస్తూ నిల్చున్నారు. విశ్వరూపశర్మ, యంత్రపూజ చేసిన లాకెట్ వెండిపళ్ళెంలో వుంచి, మంత్రాలు చదువుతున్నారు.

    "ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారతాః
    ఏతేషాం అవిరోధేన, బ్రహ్మ కర్మ సమారంభే"
    "శ్రీ శక్తి దేవతాయై నమః శ్రీ లక్ష్మీదేవతాయ నమః
    సమస్త దేవోపచార పూజాం సమర్పయామి
    మంత్ర హీనం, క్రియాహీనం, భక్తి హీనం జనార్ధనీ,
    యాత్పూజితం మాయాదేవి, పరిపూర్ణం తదస్తుతే
    అన యాధ్యానావాహనాది షోడశోపచార
    పూజా యాచ భగవతీ సర్వత్మకే
    శ్రీలక్ష్మీ స్పుప్రీతస్సుప్రసనో వరదో భవతు"

    పూజా కార్యక్రమం పూర్తయింది.

    విశ్వరూపశర్మ ప్రసన్నమైన ముఖంతో, కౌశికభూపతి వేపు తల తిప్పి, "మహారాజా! కౌశికా! అపారమయిన శక్తికి, అపారమైన లక్ష్మి కేంద్రమయిన మహాదేవదేవిని ఒకసారి మననం చేసుకొని, ఈ లాకెట్ ను చేతుల్లోకి తీసుకోండి. మీ పూర్వుల్ని ఒకసారి ధ్యానించండి" అని వెండి పళ్ళెంలోని బంగారు హారాన్ని, కౌశికభూపతి చేతికి అందించాడాయన.

    ఆలయ మండపంలో-

    దూరంగా వరసగా యువరాజు, వైశాలీ కపాలేశ్వర్, ముత్యాలనాయుడు నిలబడ్డారు.

    కౌశికభూపతి పక్కన ఇందుమతి నిలబడింది.

    విశ్వరూపశర్మ చెప్పినట్లుగానే చేసి, భగవధ్యానం చేస్తూ ఆ లాకెట్ మీద తన చేతినుంచారు కౌశికభూపతి. చిన్నసైజు కుంకుమ భరిణిలా పలకల ఆకారంలో వున్న ఆ లాకెట్ ను నాలుగువైపులా చూసి, ఒకవైపు ఓపెన్ చెయ్యడానికి ప్రయత్నించారు. రాలేదు.

    "దానికి బటన్ లాంటిదేమైనా ఉందేమో... మరోసారి పరిశీలించండి" సూచించాడు విశ్వరూపశర్మ.

    "లేనట్టుంది- విశ్వరూపా" అన్నారు కౌశికభూపతి.

    ఆత్రుతగా చూస్తోంది ఇందుమతి. అంతకంటే ఆతృతగా చూస్తున్నారు మిగతావాళ్ళు.

    ఆసక్తిని అణచుకోలేక, అదే సమయంలో కొంచెం ముందుకు కదిలాడు ముత్యాలనాయుడు.

    "కౌశికా... కుడిచేతి, బొటనవేలుని, లాకెట్ పై భాగంలో ఉంచి నొక్కి చూడండి"

    కౌశికభూపతి తలెత్తి విశ్వరూపశర్మ వేపు ఒకసారి ఉద్విగ్నతతో చూసి, ఆయన చెప్పినట్లుగానే చేశారు.

    ఒక్కక్షణం... ఒక్క క్షణం-

    అంతవరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఏదో పెనుమార్పు- లేత ఎండ అకస్మాత్తుగా మాయమైపోయింది.

    దట్టమయిన మబ్బులు, ఒక్కసారి ఆకాశంలో నిండిపోయాయి. గర్భగుడిలో మహాదేవి విగ్రహానికి కొంచెం దూరంలో నేలలో పాతి పెట్టి ఉన్న త్రిశూలం నెమ్మదిగా కదిలిన చిరు సవ్వడి- ఆ సవ్వడిని గమనించిన వ్యక్తి ఒక్క విశ్వరూపశర్మ మాత్రమే. బంగారు లాకెట్ నెమ్మదిగా తెరుచుకుంది.

    ఆనంద, సంభ్రమాలతో కౌశికభూపతి కళ్ళు వెలిగిపోయాయి.

    "ఇందూ- లాకెట్ తెరుచుకుంది..." అరిచినట్లుగా అన్నాడాయన. ఇందుమతి ముందుకు అడుగువేసింది.

    తెరుచుకున్న లాకెట్టు పైభాగంలో మిలమిల మెరుస్తూ నవరత్నాలు.

    ఆ నవరత్నాల క్రింద-

    చిన్నగంధం రంగు తోలు ముక్క! ఆ ముక్క పైభాగంలో రంగు మారిపోయి మెరుస్తున్న పసుపు, కుంకుమల బొట్లు... వాటిని చూడగానే-

    ఇందుమతి కళ్ళల్లో, అనంత ఆనందాల తటిల్లత మెరుపులు.

    అందరి కళ్ళల్లో స్పష్టంగా కన్పిస్తున్న వింత కాంతి.

    అదే సమయంలో అకస్మాత్తుగా ఉరిమిన మేఘాల ఉరుములు ఎక్కడ నుంచి కమ్ముకొచ్చిందో తెలీదు.

    క్షణాల్లో కుండపోతగా వర్షం.

    కోటంతా వర్షంతో తడుస్తోంది. అదే సమయంలో మండపంలో నుంచి రాజభవనంలోకి వచ్చారు కౌశికభూపతి.

    ఆయన కళ్ళల్లో తట్టుకోలేనంత ఆనందోద్వేగం.


                  *    *    *    *


    మధ్యాహ్న భోజనాలయ్యాయి.

    అందరూ విశాలమైన హాల్లో కూర్చున్నారు.

    "అమ్మా ఇందూ... మరిక ఆలస్యం చేయడానికి వీల్లేదు. రేపు ఆదివారం సూర్యోదయాత్పూర్వం... అన్ని రకాలుగా బాగుంది. ముహూర్తము పెడుతున్నాను. బయలుదేరుదాం" చెప్పాడు విశ్వరూపశర్మ.

    "నువ్వు కూడా బయల్దేరతావా విశ్వరూపా ఈ వయస్సులో?" ఆశ్చర్యంగా అడిగాడు కౌశికభూపతి.

    "జీవితమంతా వేటలోనే, వేటకోసమే బతికినవాడ్ని. అసలైన సమయంలో నన్ను హంటింగ్ కి వెళ్ళొద్దామంటావేమిటి కౌశికా... ఎంత దూరం వెళ్ళగలనో అంత దూరం వెళతాను."

    "విశ్వరూప బాబూ! ఆ లాకెట్ లో ఏం వుందో చెప్పేరు కాదు... నిధి రహస్యం ఏమైనా వుందా?" ఆసక్తిగా అడుగుతున్న ముత్యాలనాయుడు వేపు చూశాడు విశ్వరూపశర్మ.

    యువరాజుకి, కపాలేశ్వర్ కి, వైశాలికి కూడా అంతే ఆత్రుతగా వుంది. "ఆ లాకెట్ లో ఏవుందో చెప్పకుండా దాన్ని పట్టుకుని, అలా ఆలోచిస్తూ కూర్చుంటాడేమిటి ఈ ముసలోడు" విసుక్కున్నాడు యువరాజు తనలో తానే.

    "అందులో ఉన్న వస్తువుల్ని ఎనలైజ్ చెయ్యాలి. కొన్ని గంటలు పడుతుంది" కపాలేశ్వర్ చెప్పాడు.

    "నాకిస్తే రెండు నిమిషాల్లో చెప్పేస్తాను. దానికి? 'ఎనలైజేషన్' అని పేరొకటి" విసుక్కున్నాడు యువరాజు.

    "ఏది ఎవరితో చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి. ఎక్కడ చెప్పాలి. అప్పుడే చెప్పాలి. ఆ లాకెట్ ని నేను కొంచెం స్టడీ చెయ్యాలి. నిధి రహస్యము అంత తేలిగ్గా విడిపోదు. అంత తేలిగ్గా డీకోడ్ చేయగలిగితే ఆ నిధి ఇన్నాళ్ళు వుండదు. ఎన్నో మర్మాలు... మంత్రాలు... రహస్యాలు ఇందులో ఇమడ్చబడి వుంటాయి. ఈజిప్టు టుటాంఖమెన్ నిధిలో దొరికిన రాగి ఫలకాల మీద భాషని- సంజ్ఞల్ని ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా, ఇంతవరకూ ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. అప్పటి రాజుల రహస్య నిధి పద్ధతుల్ని ఆకళింపు చేసుకోవాలి. అందుకే దీన్ని డీకోడ్ చేయటానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది. ఈలోపల మీ పనుల్లో మీరుంటే బాగుంటుంది" సాధ్యమైనంత నెమ్మదిగా చెప్పాడు విశ్వరూపశర్మ.

    ఆ మాటలకు ముత్యాలనాయుడు ముఖం చిన్నబోయింది.

    "ఆ లాకెట్ తెరుచుకోవడంతో మా ముత్యాలు, ఎంత హుషారై పోయాడో చూడండి. కధంతా నువ్వే నడపాలయ్యా ముత్యాలూ... కాస్త విశ్వరూపుడికి టైమ్ ఇవ్వు" హుషారుగా నవ్వుతూ అన్నాడు కౌశికభూపతి.

    "ఆదివారం బయల్దేరమంటే మధ్యలో ఒకరోజే టైముంది. ఏం చెయ్యమంటారు. మీ ప్లాన్ ఏమిటి?" అడిగింది ఇందుమతి. చెప్పడం ప్రారంభించాడు. విశ్వరూపశర్మ.

    "ఒకప్పటి పరిభాషలో చెప్పుకోవాలంటే, నిధి కెళ్ళడం, కాళీ కెళ్ళడం ఒక్కటే. అడవులు, అగాధాలు, కొండలు, లోయలు, జలపాతాలు, ఊబులు, క్రూరమృగాలు, గిరిజనులు, అమాయకమైన కొండ మనుషులు, మనుషుల్ని తినే మనుషులు అంటే కానిబాల్స్... ఒకటేమిటి అన్నిటికీ ఎదురు నిలవగలగాలి. వాటిని ఎదర్కోవడానికి మనమెప్పుడూ సందిద్ధంగా వుండాలి. ఆయుధాలే కాదు, మన అవసరాలు... కట్టుకునే బట్టల దగ్గర్నుంచి తినే తిండివరకు ఏం కావాలో... అన్నీ సమకూర్చుకోవాలి" 

    "కాని బాల్స్... అంటే మనుషుల్ని తినే ఆదిమజాతి మనుషులు ఈ తూర్పు కనుమల్లో ఇప్పటికీ ఉన్నారంటారా?" ఆశ్చర్యంగా భయంగా అడిగాడు కపాలేశ్వర్.

    "ఏం ఎందుకుండరు... ఉండొచ్చు. ఎదురుపడొచ్చు. మన జాగ్రత్తలో మనం వెళితే మంచిది కదా" విశ్వరూపశర్మ అన్నాడు.

    "ముసలాయన, మనం అక్కడకు వెళ్ళడానికి ముందే మనల్ని భయపెట్టేస్తున్నాడు" తనలో తను గొణుక్కుంటూ అంది వైశాలి.

    "ఈయన మనతో వస్తానంటున్నాడు కదా. తిండి దొరక్క ఈయనే మనల్ని పీక్కు తినేస్తాడేమో" యువరాజు నవ్వుతూ అన్నాడు. ఆ మాటకు నవ్వి అంతలోనే తనని తను కంట్రోల్ చేసుకుంది వైశాలి.

    "యువరాజా... ఇలారా. మనకు ఏవేం కావాలో... చెపుతాను. లిస్టు రాసుకో" పిలిచాడు విశ్వరూపశర్మ. ఆ మాటకు బిక్కమొహం వేసేసాడు యువరాజు. అంతలోనే యువరాజు మొఖం ఎందుకలా అయిపోయిందో అర్ధం కాలేదు ఎవరికీ.

    "యువరాజూ... ఇలా....రా" పిలిచింది ఇందుమతి.

    "లేదండీ... నాకు రాయడం రాదు- చదువుకోలేదు" తలదించుకుని చెప్పాడు యువరాజు నెమ్మదిగా.

    యువరాజు బలం, మాటకారితనం, మేధాసంపత్తి చూసిన అక్కడి వారికి యువరాజు అసలు చదువుకోలేదనే విషయం తెలిసి ఆశ్చర్యంగా నోళ్ళు తెరిచారు.

    విశ్వరూపశర్మ పరిస్థితిని అర్ధం చేసుకున్నాడు.

    "అమ్మా... ఇందూ... కరెక్ట్ మనిషినే, అడవిలోకి తీసుకెళ్తున్నావమ్మా... పచ్చని అడవిలో ఏ భయం లేకుండా పెరిగే మద్దిచెట్టులాంటి మనిషి- మాకు చదువుంది. నీకు ధైర్యముంది. తెలివితేటలున్నాయి. చాల్లేవోయ్ అందరికీ అన్నీ వచ్చేస్తే- లోకమిలా వుంటుందా?" నవ్వేస్తూ అన్నాడాయన.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra