Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 21

    "దేనికయినా ఇచ్చి పుచ్చుకోవడాలుండాలి. ఈ సొసైటీలో కేవలం వివాహితులే ఉండాలి. కన్యలు, బ్రహ్మ చారులూ ఉండకూడదు. వారు ఒకరివలన లాభం పొందడమేతప్ప ఒకరికివ్వగలిగిన దేమీలేదు" అన్నారు కొందరు.
   
    డాక్టర్ విలాస్ వెంటనే ఆ అభ్యంతరానికి అంగీకరించాడు. అందుకు కలవరపడిన బ్రహ్మచారులకూ, కన్యలకూ త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకొనమని అతడు సలహా ఇచ్చాడు.
   
    కేవలం ఫ్రీ లవ్ సొసైటీ కోసం అక్కడ ఒక్క రోజులో ఇరవై వివాహాలు జరిగాయి. ఆ విధంగా డాక్టర్ విలాస్ స్మిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
   
    ఈలోగా డాక్టర్ విలాస్ కు ఇండియానుంచి ఏదో ఆఫర్ వచ్చింది అతడు వెంటనే ఇండియా బయలుదేరి వచ్చాడు. బయలుదేరే ముందు స్మితకు విడాకులిచ్చాడు. ఫ్రీ లవ్ సొసైటీకోసం మాత్రమే అతడు స్మితను వివాహం చేసుకున్నాడు.
   
    డాక్టర్ విలాస్ కు ఉత్తర హిందూస్థానంలో ఉద్యోగం వచ్చింది. అక్కడకూడా అతడు కొందరు ఔత్సాహికుల్ని పోగుచేసి ప్రభావితుల్ని చేసి మళ్ళీ ఫ్రీ లవ్ సొసైటీని ప్రారంభించాడు సుమారు ముప్పయి జంటలతో ఫ్రీ లవ్ సొసైటీ ప్రారంభమయింది. విధవలయిన ఇద్దరు, ముగ్గురు ఉద్యోగినులుకూడా అందులో చేరారు. బ్రహ్మచారులకూ కన్యలకూ అందులో స్థానం లేదని విలాస్ ముందే చెప్పాడు. అతడు తన అమెరికా అనుభవాలను సభ్యులకు వివరించి "త్వరలోనే నేనూ వివాహం చేసుకుంటాను. సొసైటీ స్థాపకుడిని కాబట్టి నాకామాత్రం తాత్కాలిక అనుమతివ్వండి" అన్నాడు.
   
    ఫ్రీ లవ్ సొసైటీ చక్కగా నడుస్తున్నది కానీ కొందరు సభ్యులు విలాస్ విషయమై అభ్యంతరం చెప్పారు. అతడు తన వివాహాన్ను వాయిదా వేస్తున్నాడు. ఇన్ని రోజుల్లో వివాహం చేసుకుంటే తప్ప అతడికి సభ్యత్వం ఉండదన్నారు వారు.
   
    ఇండియాలో ఫ్రీ  లవ్ సోసైటీ మరింత పకడ్బందీగా వున్నది. సొసైటీకి ఓ పెద్ద హాలుకూడా ఉన్నది. అందరూ అక్కడ సమావేశమవుతుంటారు. జంటల నిర్ణయానికి కూడా కొత్త పద్దతి రూపొందించారు.
   
    రోజు రోజుకీ జంట మారాలి. ముందు హాజరయిన మగవాళ్ళందరి పేర్లూ వ్రాసి వాళ్లకు వరుసగా నంబర్లు ఇస్తారు. నెంబరు ఒకటి వచ్చిన వాడిది అదృష్టం. అంత వరకూ ఎన్నుకున్నవారిని మినహాయించి మిగిలిన యువతులలో తనకు తోచినవారిని ఎన్నుకొనవచ్చును. ప్రధమ తాంబూలం అన్నమాట!
   
    జంటల ఎన్నిక ముగిసినాక మగవాడు యువతిని తన ఇంటికి తీసుకుని వెళతాడు. ఆమెను జాగ్రత్తగా తిరిగి ఇంటివద్ద దిగబెట్టవలసిన బాధ్యత అతడిదే!
   
    "ఈ సొసైటీనుంచి తప్పుకొనడం విలాస్ కు ఇష్టం లేదు. అందుకని అతడు తన స్వరాష్ట్రమయిన ఆంద్రప్రదేశ్ కు వెళ్ళి ఓ యువతిని వివాహం చేసుకుని వచ్చాడు. సభ్యులందరూ తృప్తిపడ్డారు."
   
    ఇలా కొంతకాలం జరిగినాక డాక్టర్ విలాస్ తిరిగి స్వరాష్ట్రం వెళ్ళాడు సెలవు మీద అప్పుడతడి భార్య రేవతి సొసైటీలో విలాస్ తర్వాత ప్రముఖస్థానంలోవున్నా ఉత్పల్ ని కలుసుకుని_"ఆయన నన్నిక్కడ ఒంటరిగా వదిలి తను స్వరాష్ట్రానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? వివాహం చేసుకునేందుకు__" అన్నది.
   
    "ఒక భార్య ఉండగా మరో వివాహమా?" అన్నాడు ఉత్పల్.
   
    "నేనాయనకు భార్యను కాను...." అన్నది రేవతి.
   
    "అయితే నువ్వెవరు?" అన్నాడు ఉత్పల్ ఆశ్చర్యంగా.
   
    "ఒక హోటల్లో కాల్ గర్ల్ గా వుంటున్నాను. వారు నన్ను ఆరు నెలల కాంట్రాక్టు మీద విలాస్ కు ఇచ్చారు" అన్నది రేవతి.
   
    జరిగినది ఉత్పల్ కి అర్ధమయింది.
   
    "ఇంతకాలం ఈ విషయమెందుకు దాచిపెట్టావు?"
   
    "ఆయనకు భయపడి డాక్టర్ విలాస్ భార్యగా ఇక్కడ నాకు ఏర్పడిన స్థానం వదులుకోవాలని అనిపించడం లేదు నాకు. మీరంతా సాక్ష్యముండి మా వివాహం జరిపించాలి" అన్నది రేవతి.
   
    "ఒక కాల్ గర్ల్ కు మా సొసైటీలో సమానస్థానమూ?" అన్నాడు ఉత్పల్ సహించలేనట్లు.
   
    ఆ సొసైటీలో ఉన్న వారందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు పేరు పొందిన వ్యాపారవేత్తలు.
   
    రేవతి అసహనంగా "మీ సొసైటీలో వున్నవారందరూ కాల్ గర్ల్స్ కాదా?" అన్నది.
   
    "మాతో పోల్చుకోకు. మాకు మంచి కుటుంబచరిత్ర లున్నాయి. పొట్టకోసం ఆడది బరితెగిస్తే అధి వ్యభిచారం అనిపించుకుంటుంది. మది వ్యభిచారం కాదు. అదొక సరదా అంతే!" అన్నాడు ఉత్పల్.
   
    "మరి నా విషయం?" అన్నది రేవతి.
   
    "డాక్టర్ విలాస్ వచ్చేక చెబుతాను" అన్నాడు ఉత్పల్.
   
    సరిగ్గా రెండు వారాల సెలవు అనంతరం డాక్టర్ విలాస్ మళ్ళీ ఫ్రీ లవ్ సొసైటీకి వచ్చాడు. అప్పుడు ఉత్పల్ అతన్ని రేవతి చెప్పిన విశేషాల గురించి నిలదీశాడు.
   
    డాక్టర్ విలాస్ దెబ్బతినలేదు. "అంతా మీరు నమ్మేరా?" అన్నాడు.
   
    "నేను త్వరగా ఒక నిర్ణయానికి రాను. మీరు చెప్పేదికూడా చెప్పండి, నమ్మదగ్గదిగావుంటే నమ్ముతాను" అన్నాడు ఉత్పల్.

 Previous Page Next Page