Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 21

    "వడ్డించకపోతే?" శ్రీకర్ సహనం చచ్చిపోయింది. అంతే! చాచి చెంపచెళ్ళుమనిపించాడు. "అమ్మా!" అంటూ చెంపపట్టుకుని అరచింది ఆమె.

    ఆవేశంలో చేయి చేసుకున్నాడేగానీ! వివేకం అతను చేసిన పనిని మెచ్చలేదు అంతరాత్మ ఎదురు తిరిగింది. ఏమిటి నీవు చేసినపని? ఆమెకు, నీకు తేడా ఏమిటి? ఇదేనా సంస్కారం?" అని చెప్పింది.
    జ్యోతీ ఎర్రబడిన చెంపని అరచేతితో రుద్దుకుంటూ కౄరంగా చూసింది.
    ఆ చూపులకు శ్రీకర్ తట్టుకోలేక పోయాడు.
    "సారీ జ్యోతీ! ఆవేశంలో తొందర పడ్డాను..." అని చకచకా అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు శ్రీకర్.
    పుట్టి బుద్ధి ఎరిగిన తరువాత దెబ్బలు తిన్నది అదే ప్రధమం జ్యోతికి.
    పళ్ళు పటపటా కొరికింది. ఉక్రోషం, కోపం, రోషం బుస్సున పొంగాయి.
    "నన్ను...నన్ను చెంపదెబ్బ కొడతారా? చూస్తాను జ్యోతిమీద ఎవరయినా పెత్తనం చెలాయింప చూస్తే-వాళ్ళను జ్యోతి క్షమించదు. మిస్టర్ శ్రీకర్..." అని పళ్ళు నూరుకుంది.
    ఎదురుదెబ్బ తీయాలన్న పట్టుదల ఆమెకళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
                                       22
    మామూలుగా ఫ్యాక్టరీకి వచ్చాడు శ్రీకర్.
    అతని మనస్సేమీ బాగలేదు. దిన దినానికీ జ్యోతి మనస్తత్వం చిత్రంగా తయారవుతోంది. ఒక్కోసారి తనేం మాట్లాడుతుందో తెలిసే మాటాడుతోందా అనే ఆలోచన కూడా వస్తోందతనికి. జ్యోతి నాయనమ్మ, అమ్మా చనిపోయాక చాలా మారిపోయింది. ప్రతి దానికీ గిల్లికజ్జాలు పెట్టుకున్నట్టుగా వుంటుంది ఆమె వ్యవహారం. ఆమె మనసేమిటో తెలుసుకోవటం కష్టంగా వుంది అతనికి.
    అందుకనే సాధ్యమైనంత ఎక్కువకాలం ఫ్యాక్టరీలోనే గడుపుతున్నాడతను. దానివల్ల ప్రొడక్షన్ వాల్యూ పెరుగుతుంది. వర్కర్స్ కీ, గోవర్ధనానికీ మధ్య వారధిలా వ్యవహరిస్తున్నాడు అతను. అది ఇద్దరికీ సంతోషంగానే వుంది. ప్రతి చిన్న విషయానికీ ఆయన వద్దకి వెళ్ళకుండా అతను మేనేజర్ కి చెప్పి పూర్తి చేయిస్తున్నాడు. ఇలా వర్కర్స్ లో అతని విలువ హిమాలయమంత యెత్తు కెదిగింది.
    గోవర్ధనానికి మొట్టమొదట ఈ వ్యవహారం కొంత కంటకింపుగా వుండేది. అయితే భార్య పోయిన కొత్తలో ఏ చిక్కయినా అతనిదాకా వెళ్ళకుండా శ్రీకరే పరిష్కరించి, ఆఖర్న అతనికి చెప్పేవాడు.
    ఓ సారి ఓ వర్కర్ ఇన్సూరెన్స్ విషయంలో శ్రీకర్ చాలా చక్కగా వ్యవహరించాడు. అతను యీ ఫ్యాక్టరీలో పనిచేస్తూ చనిపోయాడు. పాలసీ ఫేక్టరీ కేరాఫ్ అడ్రస్ లో వుంది. శ్రీకర్ వెంటనే ఆ పాలసీ మొత్తం ఆ వర్కర్ భార్యకి యిప్పించి, తర్వాత కంపెనీ వారితో సొమ్ము రాబట్టాడు. దాంతో ఫేక్టరీ ప్రిస్టేజ్ పెరిగింది. వర్కర్స్ లో ఫ్యాక్టరీ తమ సొంతం అన్నంత ప్రేమ, బాధ్యత పెరిగాయి. ఎప్పుడూ సూపర్ వైజర్ పొడిస్తేగాని అవని పనులు కేవలం శ్రీకర్ మాటలతో అవుతూ వచ్చాయి.
    వర్కర్సులో ఛోటా నాయకునకూ, మేనేజర్ కీ ఇది కొంచెం అసంతృప్తినీ, అసూయనీ పెంచింది. అయితే శ్రీకరే అసిస్టెంట్ మేనజర్ అయినా అయ్యగారి అల్లుడూ ఫ్యాక్టరీ వారసురాలు జ్యోతికి భర్తా కావటంతోనూ, వర్కర్సు దేవుడిలా చూసుకుంటూ వుండటంతోనూ, వాళ్ళ ఆటలు ఏ మాత్రం సాగలేదు.
    ఉదయం చాలా చిన్న విషయానికే పోట్లాడిన జ్యోతి మనస్తత్వం గురించి ఆలోచిస్తూ కూర్చున్న శ్రీకర్ కి ఫోర్ మేన్ జయన్న ఆందోళనగా రావటం కాస్తా భయాన్ని కలిగించింది.
    "సార్! సార్" తడబడుతూ అన్నాడు అతను.
    "ఏమిటి జయన్నా?"
    "చాలా ఘోరం జరిగిపోయింది."
    అంతలో అతని గది బయట వర్కర్సు అంతా గుంపుగా చేరి గలగల మాట్లాడుతున్న మాటలు వినిపించాయి...
    "శాయన్న మిషన్ లో పడ్డాడు. చక్రాలక్రింద నజ్జునజ్జుగా నలిగిపోయాడు సార్! చూట్టానికే భయంకరంగా వున్నాడు పాపం! గంపెడు సంసారం!"
    "మైగాడ్!" షాక్ తిన్నట్టయి కుర్చీలోంచి అధావత్తుగా పైకి లేచాడు. శ్రీకర్ చప్పున బయటికి వచ్చాడు అతను. వర్కర్సు అంతా ఆందోళనగా వున్నారు.
    శ్రీకర్ ముందుకి కదలగానే దారిచ్చారు అంతా అతను నేరుగా స్పాట్ కి వెళ్ళాడు. మిషన్స్ అన్నీ ఆగిపోయి శాయన్న మరణానికి సంతాపసూచకంగా మౌనం పాటిస్తున్నట్టుగా వున్నాయి.
    దూరంనుంచే శాయన్న శవాన్ని చూసి తటాలున ఆగిపోయాడు. అతనికడుపులో దేవినట్టయింది.
    అంతలో ఫ్యాక్టరీలో లోడింగ్ సెక్షన్ లో పనిచేస్తున్న శాయన్న భార్య భర్తకి జరిగిన యాక్సిడెంట్ విషయం విని గోడుగోడున విలపిస్తూ వచ్చింది. శ్రీకర్ ని చూడగానే "అయ్ గారండీ! ఎంత గోరం జరిగిపోయిందండీ! నా మావకెట్టుందండీ?" అని ప్రశ్నించింది ఏడుస్తూనే. శోకదేవతలా వున్న ఆమెని చూళ్లేక పోయాడు శ్రీకర్.
    అడుగు ముందుకు వేసి శాయన్న దేహాన్ని చూసింది. "ఓరి మావో!" అని కెవ్వున కేకేసి అతని శవంపైబడి భోరున ఏడవసాగింది.   
    తను ఆ శరీరాన్ని చూళ్ళేకపోయాడు. అదే అతని భార్య మీదబడి దుఖిఃస్తుంది. ఎక్కడొచ్చిందీ తేడా? ఆత్మీయతేకదా!" అనుకున్నాడు శ్రీకర్.
    మెల్లగా మేనేజరుగదికి వెళ్ళాడు నేరుగా.
    శ్రీకర్ ని చూసి చూడనట్లుగా పేపరు చూస్తున్నాడు మేనేజరు శివపాదం. శ్రీకర్ వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.
    పేపరుదించి "ఓ మీరా! ఏమిటి సంగతి?" అని అడిగాడు.
    "మీకింకా తెలియదా? యాక్సిడెంట్ విషయం?"
    "ఆఁవిన్నాను!"
    "శాయన్న దారుణంగా చనిపోయాడు!"
    "పోయాడా! వెరీసారీ! అయినా మనమేం చేస్తాం. అది అతని అజాగ్రత్త!" ఏమీ పట్టనట్టుగా అన్నాడు శివపాదం.
    "అజాగ్రత్తగా కాదు మేనేజర్. మెషిన్ లో లోపం అంతే! సూపర్ వైజరు చెవుతున్నాడటగా! ఫోర్ మేన్ కూడా చూశాడట. అది మెషిన్ ఫాల్టె!"
    శివపాదం మాట్లాడలేదు.
    "ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం బలి అయిపోయింది. ఈ రోజు పూర్తి వేతనంమీద సెలవు ప్రకటించండి.
    శాయన్న అంత్యక్రియలకి ఓ వెయ్యి రూపాయలు యివ్వండి. తర్వాత నష్టపరిహారం క్రింద అతని పూర్తి జీతంగా రిటైర్ అయ్యేదాకా లెక్కకట్టి బ్యాంక్ లోవేసి భార్యకివ్వండి. శాయన్న కొడుక్కి అదే ఉద్యోగం యివ్వండి!"  

 Previous Page Next Page