స్థాణువులా కూర్చుండిపోయిన డాక్టరు సునంద ముఖంలో రంగులు మారాయి....
* * *
క్షణంలో సగం గడిస్తే ఆ యువతీ యువకుల ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయేవే!
సరిగ్గా ట్రిగ్గర్ ఆపరేట్ అయ్యే ఆ క్షణంలోనే స్థావరానికి ఒక సాయుధుడు పరుగుపరుగున చేరుకున్నాడు. అతనిని చూస్తూనే సాయుధులు రైఫిళ్ళను కిందకు దించారు.
ఆషా, కిరణ్ కుమార్ గుండెల నిండుగా ఊపిరి పీల్చుకున్నారు. తాము ఇంకా ప్రాణాలతో బ్రతికివుండడం ఆశ్చర్యమే ననిపించింది ఆ ఇద్దరికి.
ఇక ఇప్పుడు, తమను తాము ఎలా రక్షించుకోవాలో ఎవరికి వారే ఆలోచిస్తున్నారు ఆ ఇరువురు. ప్రాణభీతి కొత్త తెలివిని తెస్తుంది!
పరుగున వచ్చిన సాయుధుని చాటుకు తీసుకువెళ్ళాడు కమాండరు.
'ప్రభుత్వం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దానికి ప్రత్యేకాధికారిగా నవీన్ ను నియమించారు. ఆ ప్రత్యేక దళం ఏ క్షణంలో అయినా ఈ స్థావరాన్ని చుట్టుముట్టవచ్చు. అందుకు రంగం సిద్దమవుతున్నది....'
పరుగెత్తుకు వచ్చిన సాయుధుడు చెబుతున్న సమాచారం వింటూనే హతాశుడయ్యాడు కమాండరు. అతని నుదురు ముడిపడింది. కనులు చిట్లించాడు. నొసలు విరిచాడు.
కమాండరు కనుసైగను చూసిన సాయుధుడు ఆషా, కిరణ్ కుమార్ కట్లను ఊడదీశాడు. ఒరుసుకుపోయిన చేతులు వెంటనే వాళ్ళ ఆధీనంలోకి రాలేదు.
"జాగ్రత్తగా వినండి! మీ గురించిన పూర్తి వివరాలను మేము సేకరించేంతవరకు మీరు ఇక్కడే వుండాలి. పారిపోవడానికి ప్రయత్నించి ప్రాణాలను పోగొట్టుకోవద్దు" హెచ్చరించాడు కమాండరు.
బుద్ధిమంతుల్లా తలలూపారు ఆషా, కిరణ్ కుమార్.
ఇరువురికీ నలుగురు సాయుధులను కాపలా వుంచి, మిగిలిన సహచరులతో ఎటో వెళ్ళిపోయాడు కమాండరు. చీకటిలో కలిసిపోయాడు.
ఇరువురికీ స్వేచ్చ లభించినా, అక్కడి వాతావరణం వాళ్ళకు రుచించడంలేదు. ఇటువంటి భయానక పరిస్థితి దాపురిస్తుందని వాళ్ళు కలలోకూడా ఊహించుకోలేదు. ముభావంగా మునగదీసుకుపోయారు_ఆషా, కిరణ్ కుమార్ జంట. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
మధ్యాహ్నం గూడెంనుంచి క్యారియర్ తెచ్చాడు ఒక కొరియర్. కాపలాసాయుధులతో సహా అందరూ భోజనాలకు కూర్చున్నారు. ఆవురావున తింటున్నారు.
ఉడకేసిన ముతకబియ్యం, గిరిజనులు తయారుచేసిన కూర, పచ్చళ్ళు రెండు ముద్దలు గతికి, తిన్నామనిపించి లేచారు ఆషా, కిరణ్ కుమార్.
"ఇంతకూ మీరేం నిర్ణయించుకున్నారు?" కడిగిన చేతిని తుడుచుకుంటూ హఠాత్తుగా కిరణ్ కుమార్ ను అడిగింది ఆషా.
కిరణ్ కుమార్ కు ఆ ప్రశ్న అర్ధంకాలేదు. అదే అన్నాడు.
"వాళ్ళు మీరు మారువేషంలో వచ్చిన పోలీస్ ఆఫీసరని అనుకుంటున్నారు. నా అనుమానం కూడా అదే అనుకోండి! తప్పించుకుపోవడానికి వేరే ఉపాయం ఏదైనా ఆలోచించారా అని అడుగుతున్నాను!" జాలిగా ఓరగా చూస్తూ అన్నది ఆషా.
"మీ జాలికి, ఓదార్పుకు చాలా చాలా థాంక్స్! నాకు చావంటే భయంలేదు. ఎందుకనో తెలుసా? నేను చస్తే కన్నీరు కార్చేవారే లేరు కనుక! పైగా, నా స్థానంలో మరొక నిరుద్యోగికి ఉపాది లభించవచ్చు! కనుక, ఏతావతా నేను చెప్పేదేమంటే_ వాళ్ళు పొమన్నా ఇక్కడనుంచి పోను. చావో బతుకో ఇక్కడే, వీళ్ళతోనే తేల్చుకుంటాను, తెలిసిందా?" స్థిరంగా చెప్పాడు కిరణ్ కుమార్.
"అంటే_మీరు పోలీస్ ఆఫీసరు అని అంగీకరించినట్టే!" నిగూఢంగా అన్నది ఆషా.
"భలేవారే! నన్ను ఒప్పించి, మీరు తెలివిగా తప్పుకుందామనుకుంటున్నారా? అసలు -మీరే మారు వేషంలో వచ్చిన పోలీస్ ఆఫీసర్ అని నా అనుమానం. ఈ విషయం బయటపడిన మరుక్షణం మీ మాన-ప్రాణాలు హారతి కర్పూరమే! మీకుగా మీరు నిజం ఒప్పుకుంటే వాళ్ళు జాలిపడి ఏ కాలో, చెయ్యో మాత్రమే తీసేసి, ప్రాణాలతో వదలవచ్చు. కనుక, జీవితం మీద, మీ శీలంమీద మీకు ఆశ వుంటే, వెంటనే మీరు వాళ్ళ ముందు నిజం కక్కేయండి!" కవ్విస్తూ అన్నాడు కిరణ్ కుమార్.
ఆషా ముఖం పాలిపోయింది. చివరకు కిరణ్ కుమార్ కూడా తనను అనుమానిస్తున్నాడు.
టెర్రరిస్టులు కూడా ఖచ్చితంగా ఇదే అభిప్రాయంతో వుంటే తన గతి ఏమిటి?
ఆలోచించిన కొలదీ ఆమె గుండె చెరువవుతున్నది. గుబులు చెలరేగుతున్నది.