Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 20



    "లింగం" అన్న తీయని పిలుపు వినిపించి ఇహలోకంలోకి వచ్చాడు ఎదురుగా కనిపించిన అమ్మాయిని చూసి ఆనందంగా "అమ్మాయిగారూ! వచ్చేసారా? ఇప్పుడే మీమాట అనుకున్నాం" అన్నాడు.

    "నాన్నగారు లేరా?" అడిగింది ఆశ్రిత.

    "లేరమ్మా అదేమిటీ పెట్టె బేడా ఏమీలేకుండా?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు లింగం.

    తను కట్టుకున్న ముతక నేత చీరవైపు మురిపెంగా చూసుకుంటూ "అదంతా పెద్ద కథ!" అంది ఆశ్రిత.

    "అత్తయ్యగారి వూరికి మీరు వెళ్ళలేదా?" అడిగాడు లింగం.

    "వెళ్తాను. హైమత్తా, శ్రీజా నన్ను చూసి ఎంతగానో పొంగిపోయారు. కాళిదాసు మావయ్య మాత్రం ఇంకా దిగజారిపోయాడు. వారి దుస్థితి చూస్తే గుండె చేరువైంది. కానీ అసహాయురాల్ని. ఏమీ చేయలేక పోయాను? కాళిదాసు మావయ్యతో కనీసం మా అన్నయ్య కూతురు అని కూడా హైమత్త చెప్పలేదు. ఎక్కడ వచ్చి నాన్నని డబ్బుకోసం పీడిస్తాడో అని! అంతటి అభిమానస్తురాలు" అంది భారంగా ఆశ్రిత.

    "నాకు తెలుసమ్మా" అన్నాడు లింగం.

    "నాకోసం నాన్న కంగారుపడ్డారా?" అడిగింది ఆశ్రిత.

    "అవునమ్మా! కబురు కనుక్కోమని నన్ను తెగపోరారు! నేనే మీమీద నమ్మకంతో ఆ ప్రయత్నమేమీ చెయ్యలేదు" చెప్పాడు లింగం.

    "థాంక్స్" ఆమె నవ్వింది.

    "నేను స్నానం చెయ్యాలిగానీ.... నాన్నగారికి నేను వచ్చినట్లు తెలియజెయ్యి" అంటూ ఆమె లోపలికి వెళ్ళింది.

    రిషి బస్టాప్ లో నిలబడి ఆరోజు దినపత్రిక చూస్తున్నాడు.

    ప్రక్కనే నిలబడ్డ వ్యక్తి మునివేళ్ళమీద నిలబడి రిషికంటే స్పీడుగా వెనుక వైపునున్న మేటర్ చదివేస్తున్నాడు. రిషికి చిరాకేసింది. పేపర్ మడిచేస్తూ విసుగ్గా చూసాడు.

    అతను వెంటనే "ఓసారి ఇలా ఇవ్వండి చూసి ఇచ్చేస్తాను" అన్నాడు.

    "అలాగే! సగం రేటిచ్చి మహారాజులా తీసుకోండి" అన్నాడు రిషి.

    రిషి మాటలు ఆరగించుకోలేనట్లు ఆ వ్యక్తి తెల్లబోయి "ఆ!" అన్నాడు.

    రిషి కొద్దిగా నవ్వి అన్నాడు "ఒకడుకొంటే పదిమందిమి చదివేద్దాం అనే పోరంబోకు ఆలోచనలు నాకు నచ్చవు!"

    ఆ వ్యక్తి మొహం గంటు పెట్టుకుని అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో నవ్వు వినిపించి పక్కకు చూసాడు రిషి.

    రిషి స్నేహితుడు మధుసూధన్ కనిపించాడు. "నువ్వేం మారలేదురా, ఎప్పుడొచ్చావు హైద్రాబాద్?" అడిగాడు చనువుగా భుజం మీద చెయ్యివేసి.

    రిషికి మధుని చూడగానే మొహం ఆనందంతో వెలిగిపోయింది. "మధూ నేనే నిన్ను వెతుక్కుంటూ వద్దామనుకుంటున్నారా, వెదకబోయిన తీగలా దొరికావు" అన్నాడు.

    "ఇంటికి వెళ్తున్నాను పద!" అంటూ బస్ స్టాప్ కి కాస్త దూరంగా ఆపిన తన మోటార్ సైకిల్ వైపు నడిచాడు మధు. అతను ఎమ్.బి.ఏ. చేసి ఓ ప్రైవేట్ ఎంటర్ ప్రైజెస్ లో పని చేస్తున్నాడు. దార్లో మిత్రులిద్దరూ కాలేజీరోజుల గురించి మాట్లాడుకున్నారు.

    "మధూ నువ్వు ఏం మారలేదురా! అదే మొహమాటం, అదే సిగ్గూ!" అన్నాడు రిషి.

    మధు నవ్వి "ఇదే మన గమ్యస్థానం దిగు" అన్నాడు.

    పెద్ద కాంపౌండ్ లోపల చాలా వాటాలున్నాయి. ఎదురుగా అరుగుమీద ఓ ముసలాయన గోచీతో ఆసనాలేస్తున్నాడు. బావి దగ్గర బట్టలుతుక్కుంటూ ఓ ముసలావిడ పెద్ద గొంతుతో ఏదో అరుస్తోంది.

    మధూ బైక్ ఆగగానే అక్కడ ఆడుకుంటున్న నలుగురు పిల్లలు బిలబిలలాడుతూ వచ్చి "అంకుల్.... అంకుల్.... ఏం తెచ్చావు?" అంటూ చుట్టేసారు.

    "అబ్బ వదలండిరా! ఇదిగో చాక్లెట్లు" అంటూ జేబులోంచి చాక్లేట్లు తీసి అందించాడు.

    "మరి నాకో!" పక్క వాటా కిటికీలోంచి ఓ అమ్మాయి అరిచింది.

    "నువ్వు అడిగిన వారపత్రిక ఇంకా మార్కెట్లోకి రాలేదుట" చెప్తూనే మధు తన వాటావైపు నడిచాడు.

    ఆసనాలేస్తున్న ముసలాయన తల క్రిందకీ, కాళ్ళు పైకీ పెట్టే అరిచాడు. "ఇంత లేటయిందే? ఎక్కడ తిరిగొస్తున్నావు?"

    "కాస్త బజార్లో పని చూసుకొని వస్తున్నాను" ఒందిలీకంగా చెప్పాడు మధు.

    బావి దగ్గర ముసలావిడ గట్టిగా అరిచింది. "ఎంత సేపలా మొండిమొలతో వుంటావయ్యా! ఈడొచ్చిన అమ్మాయిలు అటూ ఇటూ తిరుగుతున్నారన్న ఇంగితం అన్నా లేదేం?"

    ముసలాయన ఆవిడ అరుపులు పట్టించుకోలేదు.

    మధు రిషితో "పద" అంటూ మేడమెట్లు ఎక్కసాగాడు.

    "సార్! జరంగ ఆగు" అని వినిపించి వెనక్కి తిరిగాడు.

    నల్లగా లావుగా ఎత్తుగా వున్న వస్తాదులాంటి వ్యక్తి నిలబడి "ఎవులు సార్! దోస్తా?" అన్నాడు రిషిని ఎగాదిగా చూస్తూ.

    "అవును మల్లేష్" అన్నాడు మధు.

    "గట్లనా! తెస్తె తెచ్చినవ్ గాని జర పాటలు గిట్ట పెట్టకుండ్రి సార్ పోరగాల్లకి పరీచ్చలంట" అన్నాడు.

    "అలాగే" అని మధు పైకీ నడిచాడు.

    రిషి కూడా అతనివెంట పైకి వెళ్ళాడు. "అయ్యో. అక్కడే నిలబడండి పైకి రాకండి" అంటూ ఓ స్త్రీ గొంతు గాభరాగా అరిచింది.

    మధు కంగారుగా రెండు అడుగులు రిషి నాలుగు అడుగులూ వేసి మళ్ళీ మెట్లమీద కొచ్చేసారు.

 Previous Page Next Page