చకితుడైనట్లు తలతిప్పి చూశాడు కృష్ణమోహన్ ఆమె మాటలు అర్ధంకానట్లు ప్రశ్నార్ధకంగా చూశాడు. "బాగుంది వరస నీ గదిలోకి రావడం, నీ వస్తువులు సవరించడం, నీ పనులు చేయడం, నీ వస్తమాణు ఆవిడగారిని పిలవడం-చాలా దూరమే వచ్చిందే వ్యవహారం-బీరువాలు తెరిచి డబ్బులుకూడ వేస్తూందే. రెండునెలల్లో యింత చుట్టమై పోయిందే అది" అంది కసిగా.
"గీతా!" అన్నాడు కృష్ణమోహన్ వారిస్తున్నట్టు "ఏమిటలా మాట్లాడుతావు" అన్నాడు హార్డు అయి.
"యింకెలా మాట్లాడుతాను యీ యింటిలో రెండు నెలల్లో ఓ ముక్కూ మొహం తెలియని దాన్ని తీసుకొచ్చి దాని కంత ఇంపార్టెన్స్ యీయడం ఏమిటి-నేనూ చూస్తూనే ఉన్నాను మోహన్. యీ వరస నాకేం బాగులేదు. కట్టుకున్న పెళ్ళాంకంటే ఎక్కువగా సరోజా సరోజా అని ఆవిడ నామస్మరణ చేస్తున్నావు"ఆమె మొహంలో కనిపిస్తున్న అసూయ చూసి అర్ధమైనట్లు నవ్వి "ఓస్- అమ్మ గారికి ఎంత అసూయ, సరోజతో మాట్లాడుతున్నాననా కోపం. మరేం చెయ్యను. నీవు వచ్చేవరకు నా పనులు ఎవరిచేతో చేయించుకోవాలిగా. తమరు రాగానే ఆ డ్యూటీ లన్నీ హేండోవర్ చేస్తాను" అన్నాడు గీత ముక్కుపట్టుకువూయించి. గీత అదంతా కేవలం అసూయతో అందని ఊహించి, అతనలా ఆ సంభాషణని తేలిగ్గా జమకట్టి మాట్లాడుతూంటే యింకేమనలేక వూరుకుంది గీత. కృష్ణ మోహన్ సరోజ - యిలా అలా అని ఏదన్నా ఎప్పుడన్నా చెప్పబోతే గీత మొహం చిట్లించి "నీకు మాట్లాడటానికి సరోజ తప్ప మరేం లేదేమిటి, పనివాళ్ళ కబుర్లు వినాలంటే అసహ్యం నాకు" అంది. "సరోజ పనిది కాదని ఎన్నోసార్లు చెప్పాను నీకు, ఆ అమ్మాయంటే నీ కంత చుల్కనఏమిటి" నొచ్చుకుంటూ అన్నాడు కృష్ణమోహన్.
"దిక్కుమొక్కూ లేనిదాన్ని యింట్లో పెట్టుకుని మీరు కావాలంటే ఆవిడగారిని నెత్తిమీద నెక్కించుకోండి గాని యీ నాన్సెన్స్ అంతా నాకు చెప్పవద్దు. అసలది వచ్చిం దగ్గరనుంచి నీవు మారిపోతున్నావు, నేను చూస్తూనే ఉన్నాను" అంది ఉక్రోషంగా గీత. ఆ అభియోగానికి విస్తుపోతూ, "నీకు మతిపోతూంది యీ మధ్య" అన్నాడు కృష్ణమోహన్. "నాకు కాదు. నీకు మతిపోతూంది. నీ మతి పోగొడ్తున్నది ఎవరో తెలుసు నాకు" మరింత తీక్షణంగా అంది గీత.
"ఛా గీతా, సరోజ నాకు సోదరిలాంటిది. మా సీతలా చూసుకుంటున్నాం అమ్మా, నేను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ బుర్ర పాడుచేసుకోకు" అన్నాడు మందలిస్తున్నట్టు. "అయినా నీలాంటి అందగత్తెణు వుంచుకొని సరోజలాంటి అమ్మాయి వెంటపడేంత తెలివితక్కువ వాడిలా కనిపిస్తున్నానా నేను" అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి కాస్త సంబరపడింది గీత మనసులో. గర్వమూ తొంగి చూసింది ఆమె కళ్ళల్లో నిజమే తన ముందు సరోజ చాలా సామాన్యంగా వుంటుంది. తనని, తన డబ్బు, హోదా, అందం అన్నీ ఉన్నదాన్ని కాదని సరోజ వెంట ఎందుకు పడ్తాడు. కేవలం అన్ని పనులు చేస్తూందని, చనిపోయిన చెల్లెలిలా ఉందని కాస్త అభిమానిస్తున్నాడు గాబోలు - అయినా యింకెన్నాళ్ళు మరి నాలుగు నెలల్లో ముహూర్తం పెట్టారు పెళ్ళికి. ఆ తర్వాత ఆ యిల్లు ఆ యజమాని అన్నీ తనకేగా-అప్పుడీ ఆటలు సాగనిస్తుందా తను -ఈలోగా వూరికే గొడవ పడడం ఎందుకు. కృష్ణ మోహన్ మాటలతో సంతుష్టి చెందిన గీత అప్పుడు యింకేం అనలేదు. కృష్ణమోహన్ తనవాడు, తనకాబోయే భర్త. అది కాకుండా చేసే శక్తి సరోజ కేంలేదు అలాంటి దానిపట్ల తనకి అసూయ ఏమిటి! సమాన స్థాయిలో ఉన్నవారిపట్ల అసూయపడితే పడాలిగాని ఓ నౌకరీ దానితో తనకు యీసు ఏమిటి, అని తనకు తాను నచ్చచెప్పుకుంది.
అయినా సరోజ కృష్ణమోహన్ లు చనువుగా మాట్లాడుకుంటున్నా - ఆ యింట్లో సరస్వతమ్మ కృష్ణ మోహన్ సరోజ కిస్తున్న గౌరవం, అభిమానం అవి చూస్తుంటే ఆమెకి తెలియకుండానే ఆమె మనసు క్రోధావేశాలతో అసూయతో భగ్గుమనేది.
మొదట్లో గీత మాటలని, ఆమె హావభావాలని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్ కాని రాను రాను ఏ విషయం ఎత్తినా, సరోజ గురించిన ప్రసక్తి రాగానే, ఆమె కనపడగానే చుర చుర చూస్తూ, ఏదో ఒకటి అంటూ ఎత్తి పొడుపుగా, హేళనగా తిరస్కారంగా మాట్లాడే గీతని ఏమనాలో తెలియక, సరోజపట్ల ఆమె విముఖతని అర్ధం చేసుకోలేక యిటు గీతకి నచ్చచెప్పలేక అటు సరోజ ఏమనుకుంటుందోనన్న చింతతో యిద్దరికీ సమన్వయం ఎలా కుదర్చాలనుకుని మదనపడేవాడు.
ఈరోజు వరకు గీత సరోజ వెనకాల తనతో ఎన్ని అన్నా ఆమె అయిష్టతని చేష్టలద్వారా వ్యక్తం చేసింది గాని యిలా ఆమె ఎదురుగా ఇంత నిష్కర్షగా ఆమెని అవమానపరచలేదు.
ఈ మాటలన్నీ విన్న సరోజ ఏమనుకుంటుందో, ఆమె వెళ్ళిపోతానంటుందేమో. ఆమెకి తన మొహం ఎలాచూపడం- ఇంటిలో బలవంతాన వుంచుకుని ఆమెని అవమాన పరిచాము తాము. యిప్పుడెలా-
కృష్ణమోహన్ కళ్ళు మూసుకుని చింతాక్రాంతుడై అలా వుండిపోయాడు.
* * *
"అదేమిటి, నిద్రపోతున్నారా ... ఆస్పత్రికెళ్ళరా యివాళ. వేళయిపోతూంది....కాఫీకూడా అడగలేదే యివాళ..." సరోజ మాటలకి చివుక్కున కళ్ళువిప్పి చూశాడు కృష్ణమోహన్. కాఫీ పట్టుకు వచ్చిన సరోజని, ఆమె మొహంలో ఎప్పటి సౌమ్యత, చిరునవ్వు చూసి ఆశ్చర్యపోయాడు. సరోజ కోసం తెచ్చుకున్న బాధపడిన చిహ్నాలు మొహాన కనపడక ఏదో బరువు దిగినట్లు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.
"అరే ఏమిటలా చూస్తున్నారు. కాఫీ తీసుకోండి చల్లారి పోతూంది. ఐదు గంటలవుతూంది. ఆస్పత్రి కెళ్ళారా యివాళ. ఉ-లేవండి" అంది చనువుగా నవ్వుతూ. యాంత్రికంగా చెయ్యి చాపి కప్పు అందుకుంటూ, తప్పుచేసిన వాడిలా కళ్ళు దించుకుని "క్షమించు సరోజా - నన్ను క్షమించు" అన్నాడు నెమ్మదిగా.