Previous Page Next Page 
తృప్తి పేజి 20


    కావేరి ఏం మాట్లాడలేదు. దుర్గమ్మకి చీరపెట్టి నమస్కరించి, జయకి చీరపెడ్తుండగా "మరి మా అమ్మాయికో" అంది దుర్గమ్మ.
    కావేరి ఇది వూహించలేదు. అందుకే ఏం చెయ్యాలో తెలీలేదు. "చేసిన పాపం చెప్తేపోయిందీ, తొక్కిన అడుసు కడుక్కుంటే పోయిందిలే కానీ ఈ చీర మా అమ్మాయికి పెట్టు. జయకి మీ వూరెళ్ళాక కొనుక్కోవచ్చు" అని ఉచితసలహా పారేసింది.
    లక్ష్మి కావేరిని ఏంచేద్దాం అని కళ్ళతో అడిగింది. కావేరి జయవైపు చూసింది.
    పెట్టెయ్ తప్పదు అన్నట్టు సైగ చేసింది జయ.
    "అయ్యవారొచ్చేదాకా అమావాస్య ఆగదు. త్వరగా కానీండి" అంది దుర్గమ్మ.
    కావేరి చీరా, రవికలగుడ్డా, తాంబూలం వాళ్ళమ్మాయి వొళ్ళోపెడ్తూంటే "కట్టుకున్నది కూడబెడ్తే, వుంచుకున్నది వూడ్చుకెళ్ళిందట. ఎలా వుంది అత్తయ్యగారూ సామెత" అంది లక్ష్మి నవ్వుతూ.
    తల్లీకూతుళ్ళూ దెబ్బతిన్నట్టు ఒకటి మొహాలొకరు చూసుకున్నారు.
    "భోగీ భోగీ నీ భోగమెన్నాళ్ళే అన్నట్టు ఇక రేపట్నించి ఎలా చేసుకుంటారో ఏంటో పనీపాటలూ" అంటూ ఓ చురకనంటించింది.
    "గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్లు నాకు సామెతలు చెప్తుందేమిటీ" అంది కూతురితో దుర్గమ్మ.
    "తాడిని తన్నేవాడికీ తలదన్నేవాడుంటాడత్తయ్యా" చెప్పింది లక్ష్మి.
    కావేరీ, జయా నవ్వాపుకోలేకపోయారు.
    "మాటలు నేర్పిన కుక్క వుస్కో అంటే వుస్కో అందనీ బాగానే చెప్తున్నావే" అంది మూతి తిప్పుతూ దుర్గమ్మ.
    "కుక్క కాటుకి చెప్పుదెబ్బ" అన్నారు పెద్దలు. అయినా నిలబడి నీళ్ళు తాగలేనివాడు ఒంగుని తీర్థమెళ్తాడన్నట్టూ తెచ్చిన కొద్దిపాటి సారె పంచలేక లోపల పెట్టేశారు. ఇంకా తేలేదేమిటని సాధింపెందుకమ్మా" అడిగింది.
    "కందకు లేని దురద కత్తిపీటకని నీకెందుకులుకు"
    "గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్టు బాగానే ఉంది వరస. ఇక పిల్లని తీసుకుని బయల్దేరమంటారా అత్తయ్యా"
    "గుళ్ళో ఏదో చెయ్యకుండా ఉంటే గుగ్గిలమేసినంత పుణ్యంకానీ బయల్దేరండి" అంది దుర్గమ్మ.
    "వీధి గుమ్మాన అల్లుడిలా రమ్మంటే దొడ్డిగుమ్మాన్నొచ్చి 'మాదాకబళం' అన్నాడటెవరో, అలా వుందత్తయ్యా. చక్కగా తెచ్చిన సారెంతా పంచిపెట్టండి. 'దాచా మగడా వేరుండ' అని వెనకటికో ఇల్లాలు రోజూ కాస్తకాస్త అన్నం కూరలూ దాచిందిట. చివరికి వేరెళ్దాం అని చూసేటప్పటికి పాచిపోయి గబ్బుకంపు కొట్టిందిట" అని "అమ్మా జయా! మీ ఆయనతో చెప్పిరా!" అంది.
    "వాడితో చెప్పేదేమిటి? నాకు చెప్తే చాలు" అంది ఠకీమని దుర్గమ్మ.
    ఆగిపోయిన జయని లోపలికెళ్ళమని సైగ చేసింది కావేరి.
    "వెళ్ళొస్తానండీ! మీ ఆరోగ్యం జాగ్రత్త వేళపట్టున ఇంటికొచ్చేస్తుండండి" అని చెప్పింది.
    "ఆ...ఆ అలాగే!" అన్నాడు శశిధర్.
    "ఉత్తరాలు రాస్తారు కదూ!" అడిగింది.
    "అబ్బే! నాకలవాటులేదు" వెంటనే చెప్పేశాడు.
    "ఇప్పుడలవాటు చేసుకోండి. ఎదురుగా వున్నప్పుడు చెప్పలేని భావాలు, ఉత్తరాల్లో రాయొచ్చు. ప్రయత్నించండి. చాలా బావుంటుంది" అంది జయ.
    వంగి అతని కాళ్ళకి నమస్కరించబోతుంటే "వద్దులే!" అన్నాడు భుజాలు పట్టుకుని.
    "మీకిష్టమని జీడిపప్పు పాకం డబ్బాలలో వేసి బెడ్ రూంలో పెట్టాను. రాత్రిపూట పుస్తకం చదువుకుంటూ తినండి" అంది.
    శశిధర్ కి మనసులో ఏదో మెలిపెట్టినట్టయింది. కానీ అది ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతుంటే కలిగే బెంగని తెలుసుకోలేకపోయాడు. అది అతని తప్పు కాదు. మొదట్నుంచీ గయ్యాళి తల్లీ, ఏమీ పట్టించుకోకుండా తన సరదాల్లో తను మునిగుండే అక్కమధ్యన పెరిగాడేమో! ఆప్యాయతలూ, అనుబంధాలూ అంటే పెద్దగా తెలియవు.
    జయని తీసుకుని చక్రపాణింటికొచ్చారు సుధాకర్ వాళ్ళు. అందరూ భోజనాలు చేసి స్టేషన్ కి బయల్దేరారు. కావేరికీ, జయకీ బొట్టుపెట్టు జాకెట్టు బట్టలు పెట్టింది లక్ష్మి. సుధాకర్, చక్రపాణి పిల్లలకో కిలో స్వీటూ, తన పిల్లలకీ, ప్రభ పిల్లలకీ తలో అరకిలో తొక్కుడు లడ్లూ కట్టించుకొచ్చాడు.
    "ఇంకోరోజుంటే బావుండేది" అని పదే పదే అంది లక్ష్మి.
    "మీ గృహప్రవేశానికొస్తాం కదా!" అన్నాడు సుధాకర్.
    "మాటలు కావు. తప్పకుండా రావాలి" అని మాట తీసుకుంది లక్ష్మి. లతా, బుజ్జీ పూజని వదల్లేక వదల్లేక వదిలారు.


                             *    *    *    *


    రోట్లో కందిపచ్చడి రుబ్బుతోంది తులశమ్మ. "అమ్మమ్మగారూ! వాసన ఘుమాయించేస్తోంది" చెప్పింది మల్లెమొగ్గలు కోస్తున్న జయ. జయ వచ్చినప్పటినుంచీ అప్పుడప్పుడూ మధ్యాహ్నం పూట తులశమ్మని పలకరించడం, కబుర్లు చెప్పడం మామూలయిపోయింది.
    "కందిపచ్చడి చేస్తున్నాను తినాలనుందా?" అడిగింది కళ్ళజోడు పైకి తోసుకుంటూ.
    అవునన్నట్లు నవ్వుతూ తలూపింది జయ.
    రుబ్బటం పూర్తయి, రోలు కడిగాక కాసింత అరిటాకులో పెట్టి జయకిస్తూ "కడుపుతోటున్నప్పుడు కోరికలు దాచుకోకూడదు" అంది నవ్వుతూ.
    జయ కూడా నవ్వుతూ లోపలికెళ్ళిపోయిందది తీసుకుని. తులశమ్మ తలవంచుకుని లోపలికి రాగానే కిటికీ దగ్గర నిలబడ్డ నర్మద కనిపించింది. ఆవిడకి పైప్రాణాలు పైనేపోయాయి.
    "ఎన్నాళ్ళనుంచీ సాగుతోందీ వ్యవహారం?" అడిగింది కఠినంగా.
    "ఎన్నడూ లేదమ్మా, ఇవాళే ఇచ్చాను. ఏదో కడుపుతోటున్న పిల్లకదాని" భయపడుతూ చెప్పింది.
    "ఇలా పంపకాలు చెయ్యడానికి మీవారు సంపాదించిన ఆస్తేం లేదండీ ఇక్కడ. మీరు కూర్చుని తింటున్నారు చాలడంలేదా? అయినా ఈ రోజంటే నేను త్వరగా వచ్చాను కాబట్టి నా కళ్ళల్లో పడింది. ఇలా ఎన్ని దానాలు చేస్తున్నారో? అయినా తీసుకునేవాళ్ళకుండాలి బుద్ధి!" అంటూ అంతకంతకూ గొంతు పెంచేయసాగింది.

 Previous Page Next Page