Previous Page Next Page 
అజ్ఞాత బంధాలు పేజి 20

 

    భరించలేకపోయింది రాగిణి.
    "నాకు ప్రేమంటే ఎందుకు తెలియదు? తెలుసు' ప్రేమంటే మీ మణిమాల డాక్టర్ వినోద్ మీద చూపుతున్నది!"
    పట్టరాని కోపంతో వణికిపోయాడు మాధవరావు . లేచి వచ్చి రాగిణి రెండు చెంపలూ టపటప వాయించాడు.
    రాగిణి కళ్ళలోంచి కన్నీరు జలపాతంలా ఉబికింది.
    "అయాం సారీ!" అన్నాడు చేతిని నుదుటి మీద పెట్టుకుని.
    "ఎందుకు సారీ చెప్పటం?" మణిమాల మీ భార్య. ఆవిడని మేం ఏమీ అనకూడదు. అంటే మీరు భరించలేరు. కానీ మమ్మల్ని మాత్రం మీరూ ఎన్నైనా అనగలరు. అతి సునాయాసంగా అనగలరు. చిరునవ్వుతో అనగలరు!"
    ఏడుస్తూనే వెళ్ళిపోయింది రాగిణి.
    చాలా సేపటివరకూ రాగిణి మాటల తాకిడి నుంచి తప్పించుకోలేక పోయాడు మాధవరావు,
    సేవాసదనం బ్రోతల్ లాంటిది కాదు. అక్కడి వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళరు. అంత "హైక్లాస్" జీవితాని కలవాటు పడినవాళ్ళు బయటికొచ్చి మాములుగా బ్రతకలేరు.
    "నేను పెళ్ళి చేసుకుంటాను" అంది రాగిణి శ్యామలాంబతో. నివ్వెర పోయిన శ్యామాలంబ తన భావాలను లోపల అణచుకుంది.
    రాగిణిలో ఏదో మార్పు వచ్చిందని అర్ధమయింది శ్యామలాంబకి. 'ఈ విషయం బాపీనీడుతో ఆలోచించాలి" అనుకుంది.
    "అలాగే! చేసుకో! మీ కోరికలకు నేటికి అభ్యంతర పెట్టాను?" అంది. రాగిణి ముఖంలోకి పరిశీలనగా చూసింది. రాగిణి ముఖంలో వికాసం కనిపించలేదు. ఒక్క నిట్టుర్పు వదిలింది . అంతే!
    శ్యామలాంబ ద్వారా విషయం విన్న బాపీనీడు ఆలోచనలో పడ్డాడు.
    "రాగిణిని బయటకు పోనియ్యటం మంచిదేనా?"
    "మంచిది కాదు. కానీ బలవంతపెట్టటం అంతకంటే మంచిది కాదు.';
    "వివరంగా తెలియవు. కానీ రాజు వ్యవహారంలో మనం తనను ఎలా ఉపయోగించుకున్నామో తెలుసు. అదీగాక తనను అక్కడికీ, ఇక్కడికీ పంపిస్తున్నది మనమేనని బయటపడినా చాలు!"
    "అదంతా రుజువు కావటం కష్టంలే!"
    "అనుమానం మాత్రం ఎందుకు కలిగించాలి?"
    బాపీనీడు ఆలోచనలో పడ్డాడు.
    "రాగిణితో చెప్పు, రాగిణిని నేనే పెళ్ళి చేసుకుంటాను."
    శ్యామలాంబ ఆశ్చర్యపోయింది. "మీరా" అంది.
    "ఏం? ఇద్దరు పెళ్ళాల్ని పోషించలేనా?"
    "కానీ, రాగిణి పెళ్ళయ్యాక ఇలాంటి పనులకు ఒప్పుకోకపోవచ్చు."
    "సరేలే! అది కాకపోతే , దాన్ని తలదన్నిన వాళ్ళు మరొకళ్ళు. అందుకు కాదు."
    శ్యామలాంబ ద్వారా విషయం విన్న రాగిణి శ్యామలాంబ కంటే ఎక్కువ ఆశ్చర్యపోయింది. మనసు పని చెయ్యలేదు. సంతోషం కలగలేదు. కాదనటానికి నోరురాలేదు.
    బాపీనీడు గారితో సేవాసదనంలోనే రాగిణి పెళ్ళయిపోయింది.
    అందరూ "ఎంత అదృష్టవంతురాలివి" అని ఒకటికి పదిసార్లంటే 'కాబోలు' అనుకుంది.
    తనను చూసి మిగిలిన వాళ్ళు ఈర్ష్య పడుతుంటే ఆ ఈర్ష్య చూసి గర్వపడింది.
    బాపీనీడు తనకోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన బంగాళాలోకి బాపీనీడు భార్యగా ప్రవేశించింది.
    ఎదురుగా ఫోన్ కనిపించింది.
    వెంటనే మధావరావు నంబర్ డయల్ చేసింది.
    "హలో! మిసెస్ బాపీనీడు స్పీకింగ్!"
    "..... ......... ........."
    "నాకు ఏం అక్కర్లేదు. ఎలా ఉన్నారో తెలుసుకుందామని. ఒక్కసారి మా ఇంటికి రండి. ఆనంద నగర్ కాలనీలో 17 వ నంబర్ ఇల్లు - ఇంటిముందు బాపీనుడు గారి నేమ్ ప్లేట్ ఉంటుంది."
    ఫోన్ పెట్టేసిన రాగిణిని ఆశ్చర్యంగా చూసాడు బాపీనీడు. గర్వంగా నవ్వింది రాగిణి. ఆలోచించుకుంటూ నవ్వుకునండు బాపీనీడు.


                                              15

    రాగిణి మాధవరావుకు రెండు మూడు సార్లు ఫోన్ చేసింది. తన ఇంటికి రమ్మని. తనదే అయిన ఆ ఇల్లు, తన చీరలు, నగలు , బాపీనీడు భార్యగా తన హొదా, అవన్నీ మాధవరావు కు చూపించాలని తహతహ.
    మొదట కొంచెం సందేహించిన మాధవరావు రాగిణి ఆహ్వానాన్ని అంగీకరించాడు. అతనికి బాపీనీడు బాగా తెలుసు. అలాంటి వ్యక్తీ రాగిణిని పెళ్ళి చేసుకోవటం ఆశ్చర్యంగా ఉంది. బాపినీడు గురించిన వివరాలు తెలుసుకోవాలనీ ఉంది.
    మాధవరావు తన ఇంటికి వస్తానని అనగానే రాగిణి సంతోషానికి హద్దులు లేవు. తనకున్న చీరల్లో మంచి చీర కట్టుకుంది. బోలెడు నగలు పెట్టుకుంది. సన్నని నడుము మీద మువ్వల వడ్డాణం పెట్టుకుంది. కాళ్ళకు గజ్జెల పట్టీలు పెట్టుకుంది. ఫలహారాలు సిద్దం చేసింది. ఒక విధమైన ఆరాటంతో మాధవరావు రాకకోసం ఎదురుచూస్తూ కూచుంది.
    సరిగ్గా వస్తానన్న టైంకే వచ్చాడు మాధవరావు. విశాలమైన ఆ ఇంతినీ, ఇంట్లో వున్నా ఖరీదైన ఫర్నిచర్ నీ మాధవరావు పరీశిలనగా చూస్తోంటే గర్వంతో పొంగింది రాగిణి మనసు.
    "కాంగ్రాచ్యులేషన్స్, మిస్ బాపీనీడు గారు!" చిరునవ్వుతో అన్నాడు మాధవరావు.
    బాపీనీడు భార్యగా తన గొప్ప ప్రకటించుకోవాలనే రాగిణి తాపత్రయమూనూ. అయినా మాధవరావు నోట ఆ కంగ్రాచ్యులేషన్స్ ఎందుకో వెక్కిరించినట్లు వినిపించాయి.
    "ఇన్నాళ్ళు పెళ్ళి మీదకు మనసుపోలేదు. ఎందరెందరో చేసుంటామని వచ్చినా, చేసుకోనని అన్నాను, కానీ, ఎన్నాళ్ళని ఒంటరిగా ఉండగలను? బాపీనీడు గారు చాలా మంచివారు. నన్ను బాగా అర్ధం చేసుకుని పెళ్ళి చేసుకుంటానని అన్నారు, కాదనలేకపోయాను. ఎప్పటి కైనా పెళ్ళి చేసుకుని స్థిరపడటమే మంచిదని అనుకున్నాను."
    "గుడ్ చాలా మంచిపని చేసారు. బాపీనీడుగారెక్కడ?"
    "బాపీనీడుగారికి లక్ష పనులు. ఎప్పుడూ ఏ ఇంట్లోనూ స్థిరంగా ఉండరు. ఈ క్షణం ఇక్కడ మరో క్షణం ఎక్కడో! కానీ ఒక్కరోజైనా నన్ను విడిచి పెట్టి ఉండరు. ఏదో ఒక టైంలో తప్పకుండా వస్తారు."
    "అంటే, ఇప్పుడు రావచ్చా?"
    "ఆహా! ఇప్పుడు రారు. రేపటివరకూ రారు. ఏదో పనిమీద తిరుగుతున్నారు."
    "అయన లేనప్పుడెందు కాహ్వానించారు నన్ను?"
    కావాలని చిపిపిగా అడిగాడు మాధవరావు. అతనికి రాగిణి ఏకాంతంలోనే తనను ఆహ్వానించిందని తెలుసు. ఆతడు కూడా బాపీనీడు లేని సమయంలోనే రాగిణితో మాట్లాడాలనుకున్నాడు. అయినా రాగిణి లోతులు కనుక్కోవాలని అలా మాట్లాడాడు.
    "భలేవారు! కావాలని అయన లేనప్పుడు పిలవలేదు. ఏవిటో అలా కుదిరింది. అసలు అయన కూడా ఉంటేనే బాగుండేది."
    రోషంగా అంది రాగిణి. సరిగ్గా ఆ సమయానికే "ఎవరాయన? ఏం బాగుండేది?" అంటూ నవ్వుతూ ప్రవేశించాడు బాపీనీడు.
    గతుక్కుమంది రాగిణి. కొన్ని నిమిషాలు ఆవిడ ముఖం రక్తం బొట్టు లేనంత తెల్లగా పాలిపోయింది. ఎంతో చతురురాలైన రాగిణి తనను తాను కూడ దీసుకుని మాములుగా ఉండటానికి విశ్వప్రయత్నం చెయ్యవలసి వచ్చింది.

 Previous Page Next Page