టీనేజర్స్ లో ఈ సూచనలను సూసైడ్ టాక్ వల్లా, మూడీగా ఉండడం, చాలా ఎక్కువగా డైరీ మీద ఆధారపడటం, స్కూల్లో ఫెయిలవడం, చావును గురించి వేదాంతంగా మాట్లాడడం వల్లా బయటపడతాయంటారు.
భానురేఖ తనకి తెలియకుండానే ఇస్తున్న ఆ సున్నితమైన క్లూలు ఎవరికీ అర్థం కాలేదు.
* * * *
కాంప్లెక్సు ముందు పార్క్ చేసి ఉన్న తెల్ల నిస్సాన్ కారునీ, దానికి దగ్గరలోనే ఆగివున్న ప్యాకర్స్ కంపెనీ వ్యానునీ మార్చి మార్చి చూశాడు రవిచంద్ర.
ఆ తెల్లకారు భానురేఖా వాళ్ళదని తెలుసు అతనికి. వాళ్ళకి ఆకుపచ్చ అంబాసిడర్ ఒకటి ఉంది. అది ఉండగానే కొత్తకారు ఇంకొకటి కొన్నారు.
కానీ ప్యాకర్స్ కంపెనీ వాళ్ళ వ్యాన్ ఇక్కడెందుకుంది? ఎవరన్నా ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా?
కొంపదీసి భానురేఖా వాళ్ళు... అతను అంతకంటే ముందుకి ఆలోచించలేకపోయాడు. గబగబ లిఫ్టులో నాలుగో అంతస్తుకి వెళ్ళిచూసాడు.
అతని అనుమానం గుండెలు పగిలేలా నిజమయింది. ఫ్లాట్ ఖాళీ చేస్తున్నది భానురేఖా వాళ్ళే!
మెదడు స్థంభించి పోయింది రవిచంద్రకి. ఏం చెయ్యాలి ఇప్పుడు తను? భానురేఖని పొద్దస్తమానూ కనిపెట్టుకుని ఉండవచ్చని చెప్పి ఈ లిఫ్టు ఆపరేటర్ ఉద్యోగంలో చేరాడు. భానురేఖ ఇక్కడనుంచి వెళ్ళిపోతున్నప్పుడు తను మాత్రం ఎందుకిక్కడ? ఈ ఊడిగం ఎందుకింక?
కానీ, ఇక్కడ ఉండక ఎక్కడికి పోతాడు తను? భానురేఖ ఎక్కడికి వెళితే అక్కడికి వెంటపడి వెళ్ళడం కుదురుతుందా తనకి?
మెరుపులా ఒక ఐడియా తట్టింది అతనికి. కుదురుతుంది. ఎందుకు కుదరదూ? తను వాళ్ళ దగ్గర కారు డ్రైవర్ గా చేరితే సరి!
ఎక్స్ లెంట్ అయిడియా ఇది! యస్!
ప్యాకింగ్ కంపెనీ వాళ్ళు సామాన్లు అన్నీ వ్యాన్ లో సర్దిన తర్వాత విలాసినీ, పింకీ వెళ్ళి కార్లో ఎక్కారు. వాళ్ళ వెనుకగా భానురేఖ భుజం మీద చెయ్యివేసి నడిపించుకు వస్తున్నాడు రఘురాం.
చందమామ నింగి నుండి దిగి నడిచి వస్తున్నట్లు అనిపించింది రవిచంద్రకు. అందమైన ఆ అమ్మాయి సహజ వయ్యారంతో నడిచి వస్తుంటే.
అతన్ని గుర్తుపట్టినట్లు కనిపించలేదు భానురేఖ. పైగా తిరుగుతున్న చిన్న ఫ్యాను వైపు చూస్తూ ఉండిపోయింది.
రఘురాం మాత్రం రవిచంద్రవైపు చూసి పలకరింపుగా నవ్వాడు. "ఆ రోజు చాలా హెల్ప్ చేశావ్ నువ్వు. థాంక్యూ!"
"ఇటీజ్ మై డ్యూటీ సర్!" అన్నాడు రవిచంద్ర వినయంగా.
లిఫ్టు కిందికి వచ్చింది. బయటికి వచ్చింది భానురేఖ. రఘురాం కూడా బయటికి వచ్చాడు.
వెళ్ళిపోతున్నారు! ఈ అధ్యాయం ముగిసిపోతుంది! గుండెలు పిండేసినట్లవుతోంది రవిచంద్రకి.
"సర్!" అన్నాడు ధైర్యం కూడదీసుకుంటూ.
"ఏమిటీ?" అన్నట్లు చూశాడు రఘురాం.
"మీ కొత్త కారుకి డ్రైవర్ కావాలా సర్?"
"ఏం? నువ్వు చేస్తావా?"
"అవును సర్! ఈ లిఫ్టు ఆపరేటర్ జాబ్ మరీ మెకానికల్ అయిపోయింది. చిన్న గదిలో బందీనయి పోయినట్లు ఉంటుంది నాకు." అని, అవకాశం తప్పిపోతుందేమో అని భయపడుతున్నట్లు, జీతం తక్కువయినా సరే సర్! సంతోషంగా చేస్తాను" అన్నాడు.
పరిశీలనగా రవిచంద్ర వైపు చూశాడు రఘురాం. ఈ కుర్రాడు ఒక సందర్భంలో తన కూతుర్ని రక్షించడం ఇంకా మర్చిపోలేదు అతను. చూడగానే కొందరిమీద సదభిప్రాయం కలగడం సహజం. అలాంటి అభిప్రాయమే అతనికి రవిచంద్ర మీద కలిగింది.
"ఓకే! ఎప్పుడొచ్చి చేరతావ్?"
"మీరెప్పుడు రమ్మంటే అప్పుడు సర్! రేపు వచ్చెయ్యనా?"
"సరే! అని తన అడ్రసు ఉన్న విజిటింగ్ కార్డు అందించాడు రఘురాం.
భాగ్యలక్ష్మి లాటరీ బహుమతి అందుకున్నంత బ్రహ్మానందంగా దాన్ని అందుకుని, భానురేఖ వైపు చూశాడు రవిచంద్ర.
అపార్ట్ మెంట్స్ బయట నిశ్చలంగా నిలబడి, నీలి ఆకాశం వైపు చూస్తుంది భానురేఖ.
కొద్ది నిమిషాల తర్వాత వాళ్ళ కార్లు కొత్త బంగళా వైపు సాగిపోయాయి.
* * * *
మర్నాడే లిఫ్టు ఆపరేటర్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు రవిచంద్ర. అతను నోటీసు ఇవ్వకుండా మానేస్తున్నాడు కాబట్టీ ఆ వారం రోజుల జీతం ఇవ్వనన్నాడు సూపర్ వైజరు. "వెరీ గుడ్!" అని చెప్పేసి వచ్చి భానురేఖ నిస్సార్ కారుకి డ్రైవర్ గా చేరాడు రవిచంద్ర. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అతని మీద రఘురాంకి చాలా నమ్మకం ఏర్పడిపోయింది. క్రమక్రమంగా భానురేఖ కారుకి డ్రయివరే కాకుండా, ఆమెకి బాడీగార్డు కూడా అయిపోయాడు రవిచంద్ర.
రోజూ సాయంత్రం పూట ఆమెని కారెక్కించుకుని షికారు తీసికెళ్ళడం అతని డ్యూటీలలో ఒకటి.