"నీకేకాదు నాకూ నచ్చదు. ఆ మాటకి వస్తే ఈ కాలంలో పుట్టిన ఏ ఆడపిల్లకి నచ్చదు. అయినా ఇంకా స్త్రీకి సేఫ్టీ లేక స్వేచ్చ లేక చాలా విషయాల్లో ఒడ్డున పడిన చేపలా గిలగిలలాడుతూ బాధ పడుతున్నది. ఈ విషయమైనా ఒప్పుకుంటావా వందనా!"
"వందన బదులు దీనికి సమాధానం నేను చెబుతాను. స్త్రీలో ఆకర్షణ శక్తి ఎక్కువ. స్త్రీకి శీల ప్రాధాన్యత ముఖ్యం. ఈ ఆకర్షణకిలోనై శీలం మీద దెబ్బ తీయటానికి పశుబుద్ధికల కొందరు మగవాళ్ళు... మోసగాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళనుంచి రక్షించుకోవడమన్నది మన పని, అంతేగాని ఎవరో రావాలి... నన్ను రక్షించాలి... హే కృష్ణా... ముకుందా! అన్న బుద్ధి తక్కువ బుద్ది మనకి ఉండరాదు అంతేనా!"
"కొంతవరకు అంతే. ఈ ప్రయాణం పెట్టింది కూడ ఆ ఉద్దేశంతోనే. "వీళ్ళు ఆడపిల్లలు కాదమ్మా...ఆడపులులు" అన్న రీతిలో ఏదో సాయసయాత్ర చేద్దామని నాకు అనిపించి మీకందరికీ చెప్పాను. మీరు కూడా చాలా ఉత్సాహం చూపించారు. అంతే ఈ ప్రయాణానికి ఏర్పాట్లు చేశాం. అఫ్ కోర్స్! ముందు కాస్త కష్టపడ్డామనుకో. మనవాళ్ళని ఈ ప్రయాణానికి ఒప్పించడానికి అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. అర్థ విజయం అర్ధ రహితమని ప్రయాణం మొదట్లోనే ఆగడం ఇష్టంలేక మన పేరెంట్స్ దగ్గర అబద్ధాలు ఆడామేగాని నిజంగా వాళ్ళని మోసగించడం మనెవరికి ఇష్టంలేదు. ఒకడుగు వేయడం ఎప్పుడయితే నేర్చుకుంటామో రెండో అడుగు ఆటోమాటిక్ గా అదే పడుతుంది. అలా చేయాల్సొచ్చింది ఈ ప్రయాణానికి."
"చేశావ్ సరే! ఈ జర్నీలో ఏముందమ్మా! బెంగుళూరు... మైసూర్ లాంటి ఊళ్ళు చూడటమే కదా! ఎవరెస్ట్ ఎక్కడం...సహారా ఎడారిలో ప్రయాణం చేయడం లాంటివి అయితే సాహసయాత్ర అన్నా అర్థం ఉంది."
"చూడమ్మా సుందర సుకుమారి! మనం పుట్టి పెరిగింది బొంబాయి...కలకత్తాలాంటి మహా నగరాల్లో కాదు. మగవాళ్ళు ఈ ఊళ్ళు పంపించడానికే నానా అడ్డంకులు చెప్పారు. మనం ఇంట్లో అబద్ధాలు ఆడి బయలుదేరాం. ఇదే ఇప్పటికి మన పాలిట మహా సాహసయాత్ర. ఇలాంటి ప్రయాణాలవల్ల మనం కొన్ని జీవిత సత్యాలు నేర్చుకోగలుగుతాం. ప్రస్తుతానికి ఇది చాలదా!" వందనాదేవి అడిగింది.
"ఇంక చాల్లేండే! నాకు మహా బోర్ గా ఉంది. కొత్త సంగతులు మాట్లాడుకొందాం" సుందర సుకుమారి అంది.
"ఇప్పటికిప్పుడు కొత్త సంగతులు ఏముంటాయ్! ఆ...కాబోయే రాబోయే మన పతిదేముళ్ళ గురించి మాట్లాడుకుందామా!"
రాణి ఆ మాట అనగానే "మహారాణి వారికి పెళ్ళిపిచ్చి పట్టుకుందేవ్!" సరదాగా అరిచి మరీ చెప్పింది ప్రమద.
"నాకేమీ పట్టుకోలేదు. మా ఇంట్లో వాళ్ళకి పట్టుకుంది. డిగ్రీ పూర్తిచేశానో లేదో! పెళ్ళి పెళ్ళి" అంటూ మా ఇంట్లో రోజుకి పదిసార్లు రామభజన చేస్తున్నారు" చిరుకోపంతో చెప్పింది రాణి.
"పోనీ ఆ ప్రభావం నీమీద పడింది అంటావ్. ఎందుకంటే ఏ విషయం మేం ఎత్తినా నీవు వెళ్ళి సతీపతుల దగ్గర తేలుతున్నావ్." వందనాదేవి రెచ్చగొడుతూ అంది.
"కన్నె వయసులో కలలు సహజమే కదే! పాపం దాన్నెందుకే ఎక్కిరిస్తావ్!" రాణి తరఫుల వకాల్తా పుచ్చుకొంటూ అంది ప్రమద.
"అంటే తమరు కూడ...? టట్టటాయ్!" అంది వందన.
"మీరంతా కాసేపు ఈ చర్చ ఆపండే, నాకు మహా బోర్ గా ఉంది కావాలి అంటే కాలక్షేపానికి నా కవిత ఒకటి వినిపిస్తాను. హాయిగా...తీయగా వినండి."
"వద్దు తల్లీ! వద్దు నీ కవిత వినంగానే మాకు వాంతి అన్నా వస్తుంది...నిద్రన్నా వస్తుంది" నమస్కారం పెట్టి మరీ చెప్పింది ప్రమద.
"ఎవరైనా వద్దంటే నాకు వినిపించబుద్ధి పుడుతుంది. కనుక ఇప్పుడో కవిత__మీరు "వద్దు__వద్దు__" అన్నా వినిపించక తప్పదు."
"నీ పేరు వరకే సుందర సుకుమారి__ఆకారం మాత్రం అందుకు భిన్నం. వద్దంటే చేస్తావ్... చేయమంటే మానేస్తావ్. ఏం చేస్తాం? కాని... ఆ కవితనేదో కక్కి పారేయ్" అంది వందన.
"మరే! హాయిగా నిద్రన్నా పోతాను కానివ్వు_కానివ్వు" అంటూ నోటి దగ్గర చిటికలేసుకుంటూ పెద్దగా ఆవులించింది రాణి.
"అదేమిటో నాకూ నిద్ర వస్తున్నదేవ్! కవిత్వం పేరు చెబితే చాలు కళ్ళు మూతలు పడుతున్నాయ్. దీని కవితలు వింటే నిద్రపోవటం ఖాయం. నిద్రపట్టని వాళ్ళకి గురువుగా దీన్ని నియమిద్దామేమిటి!"
కవిత చదువుతున్నాను. ఆపండి మీ గోల ఈ కవిత వీనులవిందుగా ఉంటుంది." ఎనౌన్స్ చేసింది సుందర సుకుమారి.
పెళ్ళి
నూరేళ్ళ పంటకాదు
నిత్యం రగిలే మంట
సంసారంలో
రోజూ తప్పదు వంట
కాదంటే అదో తంట
అలాగే
భర్తని చూస్తుండాలి ఓ కంట
లేకపోతే విడిపోతుందా జంట
"ఒసేయ్ సుందరీ! నీ కవిత మండిపోను! మళ్ళీ పెళ్ళిళ్ళు...జంటలు. అక్కడిదాకా వెళ్ళావేమే! పెళ్ళి...అలాంటి మాటలు ఎత్తవద్దన్నానా!" కోప్పడింది వందన.