కాని తన మనసు ఆలోచనల ఇసుకపై అతడు చేయాల్సిన సంతకం తనది కాక సశ్య సొత్తుగా మారితే -
పడగెత్తిన అహంకృతిని కోరి కృతిగా మలచుకుని -
"మనం రోడ్డు మీదనే నిలబడి వున్నాం" అంది అతనితో చాలా సేపు మరెక్కడైనా గడపాలన్న ఆలోచనతో.
"నేను ఫ్రీ" సుముఖతని వ్యక్తం చేశాడు.
"మీరు సరేనంటే"
"ఇందిరా పార్కుకి వెళదాం" అంది విజూష.
రుత్వి అభ్యంతరం చెప్పలేదు.
మరో రెండు నిముషాలలో "సీలో" విజూష రుత్విలతో బాటు ముందుకు కదిలింది.
ఆమె ఎందుకు తనమీద అంత శ్రద్ద చూపిస్తున్నదీ అతడికి అర్దం కావటం మాట అటుంచి ఆ తర్వాత ఆమెతో జరిపే చర్చ గురించి అతడు ఆలోచిస్తున్నాడు.
"లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?" అడిగింది విజూష వున్నట్టుండి.
"అసలు తొలిచూపు ప్రేమని మీరు అంగీకరిస్తారా?"
వెంటనే జవాబు చెప్పలేదు రుత్వి.
కొన్ని క్షణాలపాటు ఓరకంట విజూషని గమనిస్తూ వుండిపోయాడు.
ఆ తర్వాత జోవియల్ గా నవ్వేస్తూ
"ఏం... మీకు అలాంటి సమస్య ఏమైనా ఎదురయ్యిందా?" అన్నాడు.
ఛెళ్ మనిపించిందేమో.
"అబ్బే...." తత్తరపడింది విజూష.
"మీకు జనరల్ నాలెడ్జి ఎక్కువ కాబట్టి తెలుసుకోవాలనిపించింది."
"యవ్వనంలో అడుగుపెడుతున్న ప్రతి అమ్మాయీ, అబ్బాయీ సామాన్యంగా ముందుగా ఆలోచించేది తనకి కాబోయే భాగస్వామిని గురించి"
విజూష క్షణంపాటు అతన్ని చూసి తల తిప్పుకుంది.
"అబ్బాయికి కానీ, అమ్మాయి కానీ కొన్ని అభిరుచులుంటాయి.... ఇష్టా యిష్టాలుంటాయి.
వాటి కనుకూలంగా కొన్ని రూపాల్ని మనసులో పేర్చుకుంటారు. ఆ అస్పష్టమైన రూపాన్ని ఆరాధించటం మొదలు పెడతారు.
సరిగ్గా తమ ఆలోచనలకు దగ్గరగా వున్న వ్యక్తి కనిపించగానే ఆకర్షితులవుతారు."
"అలా ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు."
"ఏ అవాంతరాలు లేకపోతే" టక్కున అన్నాడు రుత్వి.
విజూష వులికిపాటుగా చూసింది.
ఆక్షణంలో ఆమె కళ్లముందు తండ్రిరూపం మెదిలింది.
"అవాంతరాలని ఎదిరించి పెళ్లి చేసుకున్నవాళ్ళూ వున్నారు" గుర్తు చేసింది విజూష.
"ఆ తర్వాత అంత వేగంగా విడిపోయిన జంటలూ వున్నారు."
రుత్వి ఇలా మాట్లాడటం ఆమెను నచ్చలేదు.
సమర్దిస్తాడూ అనుకుంటే నిరాశావాదాన్ని ప్రకటిస్తాడేం?
"బహుశా మీకు అలాంటి జంటలే ఎక్కువ తారసపడి వుండవచ్చు"
"కోపం వచ్చిందా?"
అడిగాడు రుత్వి.
వెంటనే సర్దుకున్నాడు విజూష తీక్షణ హృదయాన్ని చూస్తూ -
"నేను జనరలైజ్ చేయడం లేదు విజూషా! టీనేజ్ లో ఆలోచనలకి, ఆకర్షణలకి పరిపక్వత వుండదు.
అంటే వ్యామోహమే తప్ప ప్రేమనే పదానికి సరయిన నిర్వచనం తెలీదు.
అందుకే ప్రేమించామూ అనుకున్న వాళ్లు అందర్నీ ఎదిరించిపెళ్లి చేసుకున్నా కొంతకాలానికి వయసుతోపాటు మనసు, మనసుతో పాటు విచక్షణా జ్ఞానం పెరిగి చేసింది తప్పేమోనని గుర్తిస్తారు... ఆ తర్వాత తప్పు చేశామని కన్ ఫాం చేసుకుంటారు."
విజూష ఏదో అనబోయింది గాని రుత్వి అవకాశమివ్వలేదు.
"ఇది నా అభిప్రాయం కాదు. ప్రఖ్యాత మనస్తత్వవేత్తకు విశ్లేషణ అది."
"ఆ తర్వాత ఓ జీవితకాలం కుమిలిపోతూ వుంటారు. అంతేగా" విజూష వ్యంగ్యంగా అంది.
"మీ నుంచి యిలాంటి జవాబు నేను ఆశించలేదు."
ఉద్విగ్నంగా చూశాడు రుత్వి.
"ఎలాంటి జవాబు కావాలనుకుంటున్నారో చెబితే ఆ ఏంగిల్లో కూడా మాట్లాడతాను."
"ఏదయినా చెప్పి ఒప్పించగలనన్న నమ్మకం అనుకుంటాను."
"అవును" విజూష ఉక్రోషాన్ని చూస్తూ అన్నాడు రుత్వి. "మీకు మరో విషయం చెప్పాలి"
కారు నడుపుతూనే అంది. "ఏమిటి?"
"ప్రేమంటే మనిషి మనసుమీద పుట్టుమచ్చలాంటిది"
"అర్దం కాలేదు.
"పుట్టుమచ్చలన్నవి చెరిగిపోనివి విజూషా! అందుకే ఓ ఇంగ్లీషు కవి మనసుకీ ఓ భౌతిక రూపం యిచ్చి మనసుమీద పుట్టుమచ్చగా ప్రేమను అభివర్ణించాడు.
అంటే ప్రేమ అమరం అన్నది ఆయన అభిప్రాయం. Love is stronger than death అన్నాడు థామస్ మన్.
అలాంటి ప్రేమ మనుషుల్ని కలుపుతుంది. కలిసిన మనుషులు పోయేదాకా కలిసి బ్రతికే బంధాన్ని అందిస్తుంది."
"అంటే" ఇందాక రుత్వి మాటల్ని గుర్తుచేసుకుంటూ అంది.
"తొలిచూపు ప్రేమయినా మలిచూపు ప్రేమయినా అసలు ప్రేమన్నది గొప్పేగా....
అలాంటి ప్రేమ గురించి ఇంత అందంగా చెప్పగలిన మీరు యిందాక చులకనగా ఎందుకు మాట్లాడారు."
"అంటే యిప్పుడు చెప్పింది మీకు కన్విన్సింగ్ గా కనిపించింది కదూ!"
"అవును"
"కానీ ఇందాక ప్రేమ గురించి అతితక్కువ చేసి మాట్లాడినప్పుడు మీరు కన్విన్స్ అయ్యారు"