Home » Yandamuri veerendranath » మరో హిరోషిమా


    ఆ విధంగా ఒక నాయకుడిని వి-నాయకుడు తయారు చేసాడు. అక్కడేం జరుగుతుందో అర్ధంకాక వెనకవాళ్ళు 'ఏం జరిగిందని' అరుస్తున్నారు. క్షణాల్లో వార్త అక్కడంతా పాకిపోయింది. జరుగుతున్న దానిని చూడడానికి అందరూ ముందుకు తోసుకురావడంతో అక్కడ దొమ్మీ ప్రారంభమైంది. కంట్రోల్ చేయడానికి సరళరేఖ తలప్రాణం తోకకొస్తోంది. మంత్రిగారి భార్య భక్తి పారవశ్యంతో వంగి వంగి దణ్ణాలు పెడుతోంది.

    అక్కడున్న విలేఖరులు ఆ వార్తని తమ పత్రికలకి పంపడానికి యుద్ధ ప్రాతిపదిక మీద సన్నాహాలు చేసుకోవడం ప్రారంభించారు. కానీ అంతకన్నా ముందే ఈ వార్త వేగాన్ని సంతరించుకుంది.

    మంత్రిగారు భార్యతో కలిసి తిరుగు ప్రయాణంలో- కనబడిన మొట్టమొదటి ఎస్.టి.డి. బూత్ దగ్గర ఆగారు. తమ పక్కింటావిడకి ఈ వార్త చెప్తే తప్ప ఆమె మనసు ఆగేటట్టు లేకపోవడంతో మంత్రిగారి మీద (ప్రతిపక్షాల స్థాయిలో) వత్తిడి తీసుకొచ్చి టెలిఫోన్ బూత్ దగ్గర కారు ఆపు చేయించింది. అక్కడినుంచి ఢిల్లీ ఫోన్ చేసి తన స్నేహితురాలికి చెప్పింది.

    వాళ్ళు కారు మరో అరగంట ప్రయాణంచేసి ఒక చిన్న పట్టణం వచ్చేసరికి అక్కడి ట్రాఫిక్ జామ్ అయింది. ఊరంతా వినాయకుడి విగ్రహాలున్న గుళ్ళ దగ్గర బార్లు కట్టి నిలబడి వున్నారు. రోడ్లనిండా జనం ఎందుకున్నారో అర్ధంకాని మినిష్టర్ 'ఏం జరిగిందని' వాకబు చేసాడు.

    "ఢిల్లీలో వినాయకుడు పాలు తాగుతున్నాడట. అక్కడి నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పారు సార్!" అని చెప్పాడు ఓ లోకల్ రాజకీయ కార్యకర్త.

    వార్త ఎంత వేగంగా పయనిస్తుందో చెప్పడానికి ఇంత కన్నా ఏం ఉదాహరణ కావాలి?

    ఆ సాయంత్రాని కల్లా దేశం మొత్తం ఇది సంచలన వార్త అయింది.

    అయితే ఇదంతా 'దైవమహిమ' కాదనీ, శాస్త్రీయంగా నిరూపించవచ్చనీ మేధావులు వాపోయారు. వినేదెవరు?

    'శక్తి- ప్రతిశక్తి సమానం' అన్నాడు న్యూటన్. 'రూమరు- వాస్తవం' ఎప్పుడూ సమానం కావు. రెండో దానికన్నా మొదటిది పదిరెట్లు బలమైంది.

    ఆ తరువాత జరిగిన పరిణామాన్ని అలా పక్కన పెడితే, 'బుద్ధిలేనిపాలెం' లో మాత్రం చాలా సంచలనాత్మకమైన సంఘటనలు కొనసాగాయి. బృహస్పతి దేవుణ్ణి ప్రార్థించి వినాయకుడి చేత పాలు తాగించగానే, విలేఖరి ముందు కాస్త విస్తుపోయినా, వెంటనే తేరుకుని, దాని వెనక ఉన్న శాస్త్రీయ కారణాల్ని వివరించబోయాడు, కానీ బృహస్పతి వినయంగా అన్నాడు-

    "మీరు నాకొక పరీక్ష పెట్టారు. భగవంతుడి దయవల్ల నేను నా అస్తిత్వాన్ని నిరూపించుకోగలిగాను. ఇంకేమీ వివరాలు ఇవ్వవలసిన అవసరం లేదనుకుంటున్నాను. వచ్చిన ప్రతివాళ్ళ ముందూ నా నిజాయితీని నిరూపించుకోవటం కన్నా ముఖ్యమైన పన్లు నాకు చాలా వున్నాయి. నా ప్రజలు నాకు ముఖ్యం. మీరు నమ్మితే నమ్మండి. లేకపోతే లేదు. భగవంతుడి ఆదేశాలు నిర్వర్తించడమే నా ప్రధాన కర్తవ్యం. లేకపోతే, ఆయనకి కోపం వస్తే నన్ను నరకానికి తీసుకెళతాడు" అన్నాడు బృహస్పతి.

    జనంలో ఒకేసారి ఇద్దరు ఆడవాళ్ళకి పూనకాలు వచ్చాయి. "మా దేవుడినే కాదంటారా!" అని పోలేరమ్మా, "ఆ కుర్రవాడి మీద ఈగవాలినా ప్రపంచాన్ని నాశనం చేస్తాం" అని ముత్యాలమ్మా ఒకేసారి బృహస్పతిని వెనకేసుకొచ్చారు. జనం వాళ్ళకి కూడా పాలు నైవేద్యం పెట్టారు. మద్యం నిషేధాన్ని పక్కన పెట్టి దేవుడి అనుగ్రహం కోసం కొంతమంది సారా తాగి, చిందులు తొక్కుతూ నాట్యం చేసారు. కొంతమంది యువకులు బొటనవేళ్ళు కోసుకుని బృహస్పతికి బొట్లు పెట్టారు. కాబోయే కార్యకర్తలు బృహస్పతికి పాదాభివందనాలు చేసారు. పసిపిల్లల్ని అతడి కాళ్ళవద్ద పడుకోబెట్టి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అప్పటికప్పుడే 'నామకరణ మహోత్సవాలు' కూడా జరిగిపోయాయి. కొంచెం ముందుచూపున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి చుట్టుప్రక్కల స్థలాలు ధరలు వాకబు చేయడం ప్రారంభించాడు. దేశంలో గొప్ప సంచలనం సృష్టించబడుతోందనడానికి తొలి ఉదాహరణగా మరుసటిరోజు పేపర్లలో హెడ్ లైన్స్ ప్రచురితమయ్యాయి.

    మంగళ్ సింగ్ మళ్లీ పుట్టాడు.

    మంగళ్ సింగ్ మళ్ళీ పుట్టాడు.

    మంగళ్ సింగ్ మళ్ళీ పుట్టాడు.

    REINCARNATION OF MANGAL SINGH.

    CHAMBAL VALLAEY DACOIT BE- COMES PEOPLE'LEADER.

    GOD COMES TO RESCUE INDIAN POLITICS.

    Mangal Singh Strikes Again in A Different Way


                                         *    *    *


    న్యూఢిల్లీ.

    సాయంత్రం 5 గంటలు.

    విశాలమైన హాలు పక్కనే ఉన్న చిన్న రూములో చెరొక సోఫాలో ఆశీనులై ఉన్నారు- రాంభగవాన్ లక్ష్మణ్ భరత్, సంకల్పనాధ్ రే. ఆ చిన్న రూములో వారి రహస్య చర్చలు సాధారణంగా చోటు చేసుకుంటూ వుంటాయి.

    "ఏమిటి, మొన్న నీ ఎన్నికల ప్రచార సభలో గొడవ జరిగిందట?" అడిగాడు సంకల్పనాధ్ రే.

    ఆర్.బి.ఎల్.భరత్ నవ్వి "ఎన్నికల ప్రచారం అన్నాక ఆ మాత్రం ఎదురుదెబ్బలు తగలకుండా ఉంటాయా ఏమిటి?" అన్నాడు.

    "కాదులే! గొప్ప తెలివితేటలతో ఏదో ప్లాన్ వేసావటగా! జనం లోంచి ఎవరినో పిల్చి నీ గురించి పొగడమంటే, వాడేదో ప్లేటు తిప్పేసి నానా చెత్తా వాగాడటగా! అదంతా లోకల్ టీ.వీ.లో వచ్చిందట...."

    "దానికి తగిన ఫలితం కూడా అనుభవించాడు! మన కార్యకర్తలు వెళ్ళి వాడి ఇల్లుపీకి పందిరేసి వచ్చారు."

    "నిన్ను పార్లమెంటులోనూ, నీ మెదడును బ్యాంక్ లాకర్ లోనూ ఉంచాలయ్యా! రెండూ ఒకేచోట వుంటే అన్నీ యిలాంటి ఆలోచనలే వస్తుంటాయి నీకు!"

    "అంటే పార్లమెంటేరియన్ కి మెదడు అక్కర్లేదని నీ ఉద్దేశమా?"

    "ఇరవై ఒక్క మర్డర్లు చేసిన బందిపోటు రాణులూ, పెళ్లి చేసుకున్న కూతుర్ని జుట్టుపట్టి కొట్టే సినిమా నటులూ, అధికారికంగా ఒక భార్యా, అనధికారికంగా ఇద్దరు భార్యలూ ఉన్న మాజీ సంస్థానాధిపతులూ వున్న పార్లమెంట్ లో మెంబరు అవడానికి మెదడెందుకు?"

    "ఎన్నికల్లో ఓడిపోయే ఛాయలు కనపడగానే పార్లమెంట్ పై యిలా విరక్తి పెంచుకుని మాట్లాడటం ఏమీ బాగాలేదు" అన్నాడు ఆర్.బి.ఎల్. భరత్.

    ఆ తర్వాత వారి సంభాషణ గవర్నరు రాజీనామా మీదకి మళ్లింది.

    ఆ గవర్నరు ఒకప్పుడు కేంద్రమంత్రి. తర్వాత ప్రధానమంత్రి నిరాదరణతో మంత్రివర్గానికి రాజీనామా చేసి రాష్ట్ర గవర్నరు అవడం జరిగింది. మంత్రి వర్గంలో ఉన్నప్పుడు చేసిన అవకతవకలకి సి.బి.ఐ. ఆ మాజీమంత్రిని విచారణ చెయ్యాలనుకుంది. అయితే ఇటువంటి విచారణకి గవర్నరు పోస్టు అతీతమైనది కాబట్టి, రాజీనామా చేయించవలసిందిగా ప్రధానమంత్రిని కోరింది.

    ప్రధానమంత్రి ఒప్పుకోలేదు.

    సి.బి.ఐ. ఇబ్బందిలో పడింది.

    అప్పుడు రాష్ట్రపతి కల్పించుకొని గవర్నర్ ని మందలించారు- ఎట్టకేలకు గవర్నరు తన పదవికి రాజీనామా చేయడం జరిగింది.

    "రాష్ట్రపతితో మందలింపు పొందేటంతవరకూ వ్యవహారాన్ని మన ప్రధానమంత్రి లాగకుండా ఉండవలసింది. అనవసరంగా రాష్ట్రపతితో విభేదాలు ఉన్నాయన్న అపవాదు తెచ్చుకున్నాడాయన. చివరికి ఎలాగూ పడవలసిన వేటు పడనే పడింది" అన్నాడు ఆర్.బి. ఎల్. భరత్. ఈ సంభాషణంతా హిందీలో జరుగుతోంది.

    "రాజకీయాలంటే రథం మీదనుంచి శంఖం ఊదటం కాదు భరత్! నువ్వుకూడా మామూలు మనుషుల్లా ఆలోచిస్తే ఎలా చెప్పు? ఇదంతా ప్రధానమంత్రికి తెలియకుండానే జరిగిందంటావా? ఆ గవర్నరంటే ఆయనకీ పడదు."

    "అటువంటప్పుడు సి.బి.ఐ. విచారణ రాగానే రాజీనామా చేయమనవచ్చుగా? రాష్ట్రపతితో చెప్పించుకోవడం దేనికి?"

    "అందుకే నువ్వు మామూలు మంత్రివయ్యావు. ఆయన ప్రధానమంత్రి అయ్యాడు."

    "విషయం సరిగ్గా చెప్పకూడదు?"

    "రాజీనామా యివ్వమని రాష్ట్రపతి ఎలాగూ అడుగుతాడు. '....నేను నీవైపే ఉన్నానూ! కానీ పరిస్థితులు యిలా వచ్చాయి. ఏం చెయ్యమంటావ్.... చివరికి నీ గురించి రాష్ట్రపతితోకూడా చివాట్లు తిన్నాను.... నీ రాజీనామాపట్ల నేనుకూడా బాధపడుతున్నాను....' అన్నట్టు ప్రవర్తించాడు ప్రధానమంత్రి. తన చేతులకి మట్టి అంటకుండా జరగవలసిన కార్యం జరిపించాడు. ఇప్పుడు ఆ గవర్నరుది మింగలేని, కక్కలేని పరిస్థితి."

    "భలే దెబ్బ కొట్టాడు సుమా!"    

    "మంత్రి వర్గంలోంచి తీసేసి గవర్నరుగా వేసినప్పుడే ఆయన ముందుచూపు మనం అర్ధం చేసుకోవాలి."

    "అదెలాగా?"

    "మంత్రివర్గంలో వుంటే ప్రధానమంత్రి సపోర్ట్ చెయ్యవలసి వస్తుంది కదా!"

    "మంత్రులని కూడా రాజీనామా చేయమని కోరి, పార్టీ ప్రతిష్ట పెంచాడుగా ప్రధానమంత్రి."

    "ఆ వ్యక్తులు వేరు... ఈ గవర్నరు వేరు. ఈ గవర్నరు వెనక భారతదేశానికి స్వతంత్రం తెప్పించిన ఘనత గల కుటుంబం వుంది. వారిలో వైరం పెట్టుకుంటే- మాజీ ప్రధాని రంగంలోకి దిగే ప్రమాదం వుంది. ప్రస్తుత ప్రధాని అంత రిస్క్ తీసుకోడు. అదే చాణక్య వ్యూహం అంటే...."

    "తల్చుకుంటేనే గుండె గుభేలుమంటోంది. మనల్ని కూడా అలాంటి కేసుల్లో ఇరికించవలసి వస్తే ముందు గవర్నర్లని చేస్తాడంటావా? లేక మంత్రివర్గంలో వుండగానే అరెస్ట్ చేయిస్తాడంటావా?" అన్నాడు భరత్ సందేహాస్పదంగా.

    "వయసు పెరుగుతున్నకొద్దీ అనుమానాలు కూడా పెరుగుతున్నాయి నీకు! ప్రధానమంత్రి మనల్ని ఎందుకు తొలగిస్తాడు? ప్రతిపక్షాల వాళ్ళు పనిలేక, మనమీద రకరకాల ఆరోపణలు చేస్తుంటారు.... అవన్నీ పట్టించుకోకూడదు."

    భరత్ గొంతు తగ్గించి రహస్యంగా "అసలు మనిద్దరిలో ఒకరు పార్టీ సభ్యుల విశ్వాసం పొందగలిగితే ప్రధానమంత్రి అవచ్చు కదా! అప్పుడు ఇంకెవ్వరికీ భయపడవలసిన అవసరం వుండదు...." అన్నాడు.

    అంతలో సి.బి.ఐ. చీఫ్ వారికోసం వేచి వున్నారన్న కబురు వచ్చింది. ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

    "రమ్మను" అన్నాడు సంకల్పనాథ్ రే. సి.బి.ఐ. చీఫ్ లోపలికొచ్చి, కొంచెంసేపు మామూలు సంభాషణ జరిగాక- "ఆగష్టు 15 దేశంలో ఎవరో ఏదో పెద్ద ఘాతుకం తల పెట్టబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది సర్. మిగతా వివరాలు ఏమీ తెలియడంలేదు" అన్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra