Home » Yandamuri veerendranath » అష్టావక్ర


    రంగప్రసాద్ చెప్పటం ప్రారంభించాడు.


                                            *    *    *    *


    చాలా రోజులు- దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం సంగతిది.

    అవి నేను ప్రాక్టీసు పెట్టిన కొత్త రోజులు. కొత్తగా ప్రాక్టీసు పెట్టినా నాన్నగారికికున్న పేరువల్ల తొందర్లోనే అది పెరగసాగింది. నాన్న గారికి అప్పటికే జెనెటిక్స్ రంగంలో మంచి పేరొచ్చింది. తరచు విదేశాల నుంచి ఆహ్వానం వచ్చేది.

    నాన్నగారికి నేనంటే చాలా ప్రేమ. నేనూ, అమ్మా, ఆయన- ముగ్గురం ఒక కుటుంబంలా కాకుండా ముగ్గురు మంచి స్నేహితుల్లా వుండేవాళ్ళం. అమ్మ అద్భుత సౌందర్యఅతి. ఆమెని నాన్న చాలా అపురూపంగా చూసుకుంటూ వుండేవాడు.

    శాస్త్రజ్ఞుడిగా ఆయన జీవితం నాతోనే ప్రారంభం అయిందని ఆయన చెప్పుకుంటూ వుండేవారు. దానికొక కారణం వుంది. చిన్నప్పుడు నాకు అర్ధమయ్యేది కాదుగానీ, మెడిసిన్ చదువుతూ వుండగా అర్ధమయింది.

    నేను ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ వల్ల పుట్టిన బిడ్డని. అంటే 'దాత' వల్ల కాదు నా తండ్రివల్లే!

    మా అమ్మకీ, నాన్నకీ వివాహం జరిగిన అయిదారు సంవత్సరాల వరకూ- సంతానం కలుగలేదు. అమ్మ విచారిస్తూ వుండేది- నాన్న అప్పుడే ఈ జెనెటిక్స్ రంగంలో అడుగు పెట్టాడు.

    వివాహం జరిగిన ఇన్నాళ్ళవరకూ సంతానం కలగకపోవటంతో ఆయన తన స్పెర్మ్ ని పరీక్ష చేయించారు. అందులో జీవం కేవలం పాతిక శాతమే వుందని తేలింది.

    అయితే ఆయన కృంగిపోలేదు. ఆ విషయం ఆయన్ని మరింత కార్యోన్ముఖుణ్ణి చేసింది! మరింత శ్రద్ధతో పరిశోధనలు చేశారు. ఆయనకీ విషయంలో డాక్టర్ విలియమ్స్ అనే మరో యువకుడు సహాయం చేసేవాడు. ఒక సంవత్సరం తిరిగేసరికి నాన్న తన ప్రయత్నంలో చాలా వరకూ సఫలీకృతమయ్యారు. స్త్రీ యొక్క O.F.T. ని కనుక్కుని ప్రపంచపు మొట్టమొదటి శాస్త్రజ్ఞుడు ఆయన. O.F.T. అంటే ఆప్టిమమ్ ఫెర్టిలిటీ టైమ్.

    ఇది తెలియకే చాలామంది డాక్టర్లు ఎంతో వీర్యాన్ని వృధాపరచవలసి వచ్చేది. స్త్రీ యొక్క రెండు మెన్సెస్ మధ్యకాలం సగటున 'నెల' అనుకుంటే- దాదాపు పదిహేనోరోజు నాటికి అండం ఫలదీకరణ కోసం సంపూర్ణంగా తయారై వుంటుంది. దాదాపు అయిదురోజులపాటు "బ్రతికి వుంటుందన్న" మాట!

    డాక్టర్లకి ఇక్కడో చిక్కువస్తూ వుండేది, కృత్రిమ గర్భధారణలో పురుషుడి వీర్యాన్ని పరీక్షనాళికల్లో భద్రపరచి, తరువాత స్త్రీని వెల్లకిలా పడుకోబెట్టి ఆమెలోకి దాన్ని ఎక్కించాలి.

    దురదృష్టవశాత్తు ఒకసారి బయటకు తీసిన సెమెన్, పురుషుడి నుంచి బయటకు వచ్చినా చాలా కొద్ది టైములో తన ప్రాణాల్ని కోల్పోతుంది. లిక్విడ్ నైట్రోజన్ లో మైనస్ 196 డిగ్రీల దగ్గిర చల్లబర్చిన వీర్యం, ఒక్కసారి స్త్రీ కాళ్ళ మధ్య నుంచి లోపలకి ప్రవహించటం మొదలుపెట్టగానే ఆ వేడికి అందులో, జీవకణాలు చచ్చిపోతూ వుండేవి. మామూలు రతిలో ఈ సమస్య రాదు. అక్కడ సుమన్ తాజాగా వుంటుంది. కేవలం లిక్విడ్ నైట్రోజన్ స్టోర్ చేసిన వీర్యంతోనే వస్తుంది ఈ చిక్కంతా. దీనివల్ల గర్భం రావాలీ అంటే బ్రతికివున్న కొద్దికాలంలోనే అండాన్ని చేరుకుని, ఫలదీకరణకు తోడ్పడాలి అన్నమాట. 

    కాబట్టి ఒక స్త్రీని ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ ద్వారా గర్భవతిని చేయాలీ అంటే ఆ అయిదు రోజులపాటూ ఎన్నో ఔన్సులకొద్దీ వీర్యాన్ని మాస్టర్బేషన్ ద్వారా సేకరించాలి. అంటే డాక్టర్లకి కష్టంగానూ, మొహమాటంగానూ వుండేది.

    నిజానికి అండం ఫలదీకరణకు రెడీగా వుంటే కేవలం 'ఒక' జీవకణం చాలు దాన్ని గర్భంగా మార్చటానికి! ఔన్సులకొద్దీ సెమన్ అక్కర్లేదు.

    సరిగ్గా ఆ సమయంలోనే నాన్నగారు O.F.T. ని కనుక్కున్నారు. స్త్రీ శరీరపు ఉష్ణోగ్రతలో వచ్చే స్వల్పమైన మార్పు, వెజీనా సమీపంలో వున్న కణాల్లో ఆ అయిదురోజుల్లో ఆ వచ్చే మార్పులబట్టి స్వాతివానకోసం ముత్యపు చిప్పలా- పురుషుడి కోసం స్త్రీ అండం తహతహలాడే సమయాన్ని 'కరెక్టు'గా పట్టుకోగలిగారు. సరిగ్గా ఆ సమయంలో కేవలం ఒక్క జీవకణాన్ని అక్కడికి పంపినా చాలు!

    తను కనుక్కున్న విషయం నిజమో కాదో ఆయనకు తెలీదు. ప్రయోగం చేయాలి. ఎవరి మీద?

    అందుకు ఆయన తన భార్యని ఎన్నుకున్నారు.

    అప్పటికే వాళ్ళ వివాహమై అయిదారేళ్ళుకావొస్తుంది. ఎలాగూ పిల్లలు లేరు. ఆయనకి తన స్పెర్మ్ జీవకణాలు తక్కువని తెలుసు. మరెందుకు తమ మీదే ఆ ప్రయోగం చేయకూడదు? దీనికి ఆయన విలియమ్స్ సహాయం తీసుకున్నారు.

    తన భార్యయొక్క O.F.T. అని ఆయన గంటతో సహా లెక్క వేసి కరెక్టుగా నిశ్చయించగలిగాడు. సరిగ్గా అదే సమయానికి ఆయన సెమెన్ లోంచి నిర్జీవ కణాల్ని వేరుచేసి, కేవలం జీవకణాల్ని పట్టుకున్నాడు డాక్టర్ విలియమ్స్. ఒక ఆధునాతమైన పరికరంద్వారా ఆయన తన భార్యలోకి- అండానికి అతి చేరువగా- కేవలం కొద్ది నిముషాల్లో అది దాన్ని చేరుకొనేలా ఆ జీవకణాల్ని వదిలాడు.

    రెండు నెలలకి ఆమె గర్భవతి అయింది. సైన్సు చరిత్రలో మరొక కొత్త పుట తెరుచుకుంది! వైజ్ఞానిక ప్రపంచం ఆయనకి జోహార్లు అర్పించింది. న్యూయార్క్ లో ఈ విషయం మీద జరిగిన సెమినార్ లో ఆయన పేపరు చదువుతున్నంతసేపూ ఆగకుండా చప్పట్లు పడుతూనే వున్నాయి.

    ఈ తర్వాత ఎంతోమంది దంపతులకు ఆయన ట్రీట్ చేశారు. తమకిక సంతానం కలగదనుకుని నిరాశచెందిన ఎంతోమందికి, వాళ్ళ సెమెన్ లో ఏ కొద్దిపాటి వీర్యకణాలున్నా చాలు, వాళ్లని తండ్రుల్ని చేశారు.

    ప్రపంచం ఆయనకి హారతి పట్టింది. ఆ సమయంలో నేను జన్మించాను.

    అమ్మ నన్ను అపురూపంగా చూసుకునేది. నాన్నయితే ఇక చెప్పనవసరం లేదు. తన విజయానికి గుర్తుగా నన్ను భావించేవారు. నా ప్రాక్టీసు కూడా రోజు రోజుకీ అభివృద్ధి చెందసాగింది. సరిగ్గా ఆ సమయంలోనే, పొంచివున్న పాము కాటు వేసినట్టు ఈ సంఘటన జరిగింది.

    ఆ రోజు నా క్లినిక్ కి ఒక వ్యక్తి కుంటుకుంటూ, చేతికర్ర సాయంతో వచ్చాడు. అతడికి ఒక కాలు లేదు. అతడి చూపు అదోలా వుంది. అతడు నా దగ్గరికి రావటం నాకు ఆశ్చర్యం అనిపించింది. కొద్ది రోజులుగా అతడిని గమనిస్తూ వున్నాను నేను. కార్లో ఇంటిలోంచి బయటకు వెళ్ళేటప్పుడూ లోపలికి వస్తున్నప్పుడూ గమనించేవాడు. ఎందుకో అర్ధం కాలేదు. ఈ రోజు అతడే వచ్చాడు.

    "ఏం కావాలి?" అని అడిగాను.

    అతడు వెంటనే జవాబు చెప్పలేదు. నావైపే కన్నార్పకుండా చూస్తూ వుండిపోయాడు. నేను విసుగ్గా అదే ప్రశ్న రెట్టించాను.

    "నా ...పేరు విలియమ్స్" అన్నాడు.

    "డాక్టర్ విలియమ్స్" అన్నాను అనుమానంగా.

    తలూపాడు.

    పాతిక సంవత్సరాల క్రితం నాన్నగారితోకలిసి పనిచేసిన వ్యక్తి! నేను లేస్తూ "నాన్నగారు మీ గురించి అప్పుడప్పుడు చెప్తూ వుంటారు... ఇంతకాలం ఏమయ్యారు మీరు? వుండండీ, నాన్నగారిని పిలుస్తాను" అంటూ లేవబోయాను.

    "ఆయన అక్కర్లేదు బాబూ, నీ గురించే వచ్చాను" అన్నాడు.

    నేను విస్మయంతో "నా గురించా? ఎందుకు?" అన్నాను.

    అతడు సమాధానం చెప్పకుండా ఏదో గొణుక్కున్నాడు. లేచి వెళ్ళిపోబోయాడు. మళ్ళీ ఆగి వెనక్కి తిరిగాడు. దగ్గిరకొచ్చి చటుక్కున నా చేతులు పట్టుకుని "వదులుకోలేను. నేను వదులుకోలేను" అన్నాడు. నాకు అర్ధంకాక- "ఏమిటి మీరంటున్నది? ఏమి వదులుకోలేరు మీరు?" అని అడిగాను.

    "నిన్నే...నిన్నే...నా కొడుకువని" అన్నాడు పిచ్చెక్కినట్టు.

    "మీకేమైనా మతిపోయిందా" అని అడిగాను కోపమూ, విసుగూ మిళితమైన స్వరంతో.

    "లేదు బాబూ- లేదు" అన్నాడు. "-పాతిక సంవత్సరాల క్రితం మీ నాన్నగారు చేసిన ప్రయోగంలో ఆయనకి సాయం చేసింది నేనే".

    "అవును. నాకు తెలుసు" అన్నాను. నా మనసులో ఏదో చిన్న అనుమానం చీకటిలా ప్రవేశించసాగింది.

    "మీ నాన్నగారి సెమెన్ ని పరీక్షచేసే బాధ్యత నామీద వుంచబడింది. మీ నాన్నగారు మిగతా పరికరాలు సిద్ధం చేసుకునేలోపు ఆ పని నేను చేశాను. కానీ...కానీ" అంటూ అతడు ఆగి, నెమ్మదిగా అన్నాడు- "ఆయన సెమెన్ లో ఒక్క జీవకణం కూడా లేదు బాబూ. అప్పటికే ఆయనలో పూర్తి వంధ్యత్వం వచ్చేసింది. పాతిక శాతం నుంచి సున్నాశాతానికి జీవకణాలు పడిపోయాయి. ఆ దురదృష్టమైన క్షణంలో నేనో నిర్ణయం తీసుకుని- పరీక్ష నాళికలు మార్చాను. నాన్నగారి ప్రయోగం అపూర్వంగా ఫలించింది. కేవలం కొన్ని జీవకణాలతోనే ఆయన గర్భోత్పత్తి సాధించగలిగాడు. కానీ ఆ కొద్ది జీవకణాలు నావి..."

    వింటూన్న నా కళ్ళముందు క్రమక్రమంగా చీకటి ఆవరించసాగింది. మెదడులో ఏదో హోరు!- తల తిరిగిపోతూంది. నాన్న నన్ను అపురూపంగా పెంచిన నాన్న...నా తండ్రి కాడు...నో...నో... అలా కావటానికి వీల్లేదు. కళ్ళు తెరిచాను. ఎదురుగా అతడు.

    "గెటౌట్...." అరిచాను. "నేను నా చేతుల్తో నిన్ను చంపెయ్యక ముందే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో".

    అతడు కదల్లేదు. నా వైపే చూస్తూ "నా తప్పులేదు బాబూ" అన్నాడు. "మీ నాన్నగారు సంతానోత్పత్తికి అనర్హులని ఆ క్షణం వెల్లడించలేకపోయాను. అప్పటివరకూ ఆయన తనలో ఇంకా కొన్ని జీవకణాలున్నాయనే భ్రమలోనే వున్నారు. ఒక చిన్న 'మార్పిడి' ద్వారా ఆయన సంతృప్తిని శాశ్వతం చెయ్యవచ్చుననుకున్నానే తప్ప అది నాలో ఇంత మానసిక సంఘర్షణకి దారి తీస్తుందని నేను ఊహించలేదు. నిజానికి నేనా విషయం అప్పుడే మర్చిపోయాను. మీ నాన్నగారు సాధించిన విజయం తక్కువదేమీ కాదు. దానికి తగినట్టుగానే ప్రపంచం ఆయనకి బ్రహ్మరథం పట్టింది. ఎంతో మంది దంపతులు ఆయనవల్ల సాయం పొంది అదృష్టవంతు లయ్యారు. కానీ నన్ను మాత్రం దురదృష్టం వెంటాడింది. ప్రమాదంలో వెన్నెముకకి దెబ్బ తగిలి సంసార సుఖానికి అనర్హుడనయ్యాను. ఒక్కసారి ఈ విషయం తెలిశాక నా మనసులోకి రాక్షసిలా ఒక కోరిక ప్రవేశించి, తొందర్లోనే అది మహావృక్షమైంది. జీవితంలో అన్నీ కోల్పోయి, ఒంటరివాడినైన నేను- నిన్ను చూడాలన్న కోరికని మాత్రం ఆపుకోలేకపోయాను. నాకొక కొడుకున్నాడు! కాలంతోపాటే అతడూ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు!! ఈ ఆలోచనే..."

    లోపల్నుంచి ఏదో దబ్బున పడ్డట్టు శబ్దం వినిపించటంతో అతడు ఆగాడు. ఏదో అనుమానం వచ్చి నేను లోపలికి పరుగెత్తాను. అమ్మ...

    అమ్మ నేలమీదకు పడిపోయి వుంది. తల నాన్న వళ్ళో వుంది. ఇంత చేదు వాస్తవాన్ని భరించలేని ఆమె గుండె ఎప్పుడో ఆగిపోయింది! బ్రతికుంటే ఏర్పడే పరిణామాల్ని తట్టుకోలేని ఈ సమస్యకి అదే పరిష్కారం అన్నట్టు ఆమె మొహం ప్రశాంతంగా వుంది. డాక్టర్ విలియమ్స్ చలనంలేని శిలాప్రతిమ అయ్యాడు. తను వెల్లడించిన నిజం ఇంత దారుణంగా బలి కోరుతుందని అతడు బహుశా కలలో కూడా ఊహించి వుండడు. అతడితప్పు లేదు. అంతా మంచిమనసుతోనే చేశాడు. కానీ విధి అలా చేసింది. అతడు కుంటుతూనే పిచ్చివాడిలా బయటకు పరుగెత్తాడు, నాన్న మాత్రం శూన్యంలోకి అలా చూస్తూ వుండిపోయాడు. జీవితంలో మరి షాక్ నుంచి ఆయన తేరుకోలేదు. అప్పుడే ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయింది- అని ఆగి, "ఇప్పుడు చెప్పింది వంశీకృష్ణా! ఈ కృత్రిమమైన పద్ధతులు మంచివేనా?" అని అడిగాడు.

    వంశీకృష్ణ అతడివైపు జాలిగా చూశాడు. అతడి మనసు రంగప్రసాద్ చెప్పిన కథతో భారమైంది.

    "బహుశా మీరు గుంటూరులో ప్రాక్టీసు వదలి ఇలా పల్లెటూరు రావటానికి కారణం అదే అనుకుంటాను" అన్నాడు సానుభూతిగా.

    "అవును. ఇక అక్కడ వుండలేకపోయాను. నాకా- ఎవరూలేరు. వివాహమూ, శారీరక సంబంధమూ- వీటన్నిటిమీద ఇచ్చ నశించింది. ఒక రకమైన నిర్లిప్తత వచ్చేసింది" విషాదంగా నవ్వేడు. "అనుక్షణమూ నేనేదో బీజం నుంచి పుట్టానన్న భావన చాలా దారుణమైన బాధ కలిగిస్తుంది. ఇది వివరించటానికి మాత్రం ఏమీ వుండదు".

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra