Home » Yandamuri veerendranath » సంపూర్ణ ప్రేమాయణం


    అనుకోని ఈ సంఘటనకి అందరూ మొహమొహాలు చూసుకున్నారు. ప్రేమ చప్పున లేచి, "నేనిప్పుడే వస్తాను" అని వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూడకుండా వేగంగా బయటకు వచ్చింది. వరండా దాదాపు నిర్మానుష్యంగా ఉంది. వేణు జాడ ఎక్కడా కనబడలేదు. ఆమె బయట గేటు దగ్గరకు వస్తూండగా వేణు రోడ్డు ఎక్కుతూ కనబడ్డాడు. ఆమె అతడి దగ్గరగా వెళ్ళింది. వేణు మొహం కోపంతో జేవురించి ఉంది. మనసులో భావాల్ని అతి కష్టంమీద అణుచుకొంటున్నట్లు కనబడ్డాడు.

    "అదేమిటలా వచ్చేశారు?" అంది, అతని దగ్గరకు చేరుకుంటూ.

    వేణు ఆమె వైపు తల తిప్పలేదు. దూరంగా వెళుతున్న వాహనాల వైపు చూస్తూ, "మరేం చేయమంటారు? మీరిచ్చే డబ్బుకోసం చేతులు కట్టుకుని గుమ్మం దగ్గర నిలబడమంటారా?" అన్నాడు వ్యంగ్యంగా.

    ఆమె మొహం వాడిపోయింది. "మీరు చేసిన సహాయానికి...." అంటూ నచ్చచెప్తున్నట్టు ఏదో అనబోయింది.

    "డబ్బుకు ఆశించి నేనీ సాయం చెయ్యలేదు ప్రేమగారూ! మీ తండ్రిగారిని నేను చూడాలి అనుకున్నది కూడా నేనాయన్ని రక్షించాను అని చెప్పుకోవడానికి కాదు. కేవలం నేనిచ్చిన మందు ఆయన మీద ఎలాంటి గుణం చూపించిందో తెలుసుకోవడానికి మాత్రమే. ఆ విషయం మీకు ముందే చెప్పాను. అయినా మీరు నన్నిక్కడికి పిలిపించి ఘోరంగా అవమానించారు" అన్నాడు.

    "అవమానమా?" అందామె విస్తుపోయి.  

    "కాదా మరి? నన్ను ఉద్యోగంలోంచి తీసేసిన వాళ్ళ దగ్గర్నుంచి నాక్కొంచెం ముష్టి ఇప్పించాలనుకోవడం.... నన్ను అవమానించడం కాదా? ఆత్మాభిమానం ఉన్నవాళ్ళెవరూ ఆ పని చెయ్యరు. ఇప్పుడు కాకపోతే ఇంకో నాల్రోజులు పోయిన తర్వాతైనా నాకు ఉద్యోగం దొరుకుతుంది. రెండ్రోజులు పస్తున్న వాడిని మరో నాల్రోజులు పస్తుండటం అంత కష్టం కాదు."

    "మైగాడ్! రెండు రోజుల్నుండీ పస్తున్నారా?"

    "లేదే! ఎవరన్నారు?"

    "ఇప్పుడు మీరే అన్నారు."

    "ఊహుఁ ! మాటవరసకు చెప్పానంతే." 

    ఆమె అతడివైపు పరీక్షగా చూసింది. బుగ్గలు లోపలికి పీక్కుపోయి నీరసంగా కనబడ్డాడు. తన పరిస్థితిని అవతలివాళ్ళు గుర్తించకూడదు అన్న పట్టుదల- అతడిలో ఆమెకి కనిపించింది.

    ఆత్మాభిమానం, రోషమే ఆమెకు నచ్చేది. (బుగ్గలు లోపలికి పోయేలాగా అతడి నోట్లో గాలి లోపలికి పీల్చేశాడని ఆమెకు తెలీదు)

    ఆమె టాపిక్ మార్చి "ఇంకా విషయం వదిలిపెట్టేసెయ్యండి. మీకెక్కడైనా ఉద్యోగం దొరికిందా?" అని అడిగింది.

    "దొరకలేదు. కాని, పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది కదా! తొందరలోనే దొరకచ్చు" అన్నాడు.

    ఆమె ఆశ్చర్యంగా, "ఏమిటీ! అంత చిన్నతనంలోనే మీరు పనిలో ప్రవేశించారా?" అని అడిగింది.

    ఆ ప్రశ్న కోసమే అతడు పైమాట అన్నాడు. ఆమె అడగగానే అతడు చెప్పడం మొదలుపెట్టాడు.

    "దాదాపు పదేళ్ళ వయసులో నేను మీ ఫ్యాక్టరీలో బొగ్గులు ఏరే కుర్రాడిగా చేరాను. నా తండ్రి కూడా మీ ఫ్యాక్టరీ కార్మికుడే. నా చిన్నప్పుడే ఫ్యాక్టరీ మిషన్ చక్రాల మధ్య నలిగి ఆయన మరణించాడు. ఆ వార్త విన్న నా తల్లి కూడా మరణించింది. నేనూ, నా చెల్లి మిగిలాం. అదృష్టవశాత్తూ నాకు మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది. తర్వాత ఫిట్టర్ నయ్యాను. ఇలా మొత్తం నలభై సంవత్సరాలుగా మా వంశం మీ క్రింద పని చేస్తోంది" అంటూ విషాదంగా నవ్వి-

    "అటువంటిది చిన్న నెపం మీద నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. ఎంత ఇన్ హ్యుమనో చూడండి. డోంట్ యూ థింగ్ ఇటీజ్ బార్బేరియస్" అన్నాడు.

    ఆమె విస్మయంతో, "మీరేం చదువుకున్నారు?" అని అడిగింది.

    ఆమె మళ్ళీ అలా అడగాలనే అతడు ఇంగ్లీషులో మాట్లాడాడు. అందుకే ఆమె అడగగానే_ "బియ్యే" అన్నాడు.

    "అంటే పగలు పనిచేస్తూ రాత్రిళ్ళు చదువుకుంటూ బియ్యే పాసయ్యారా?"

    అతడు మాట్లాడలేదు. ఆమెకి సరిగ్గా ఏం తెలియాలనుకున్నాడో అదంతా చెప్పేశాడు. ఇక చెప్పేందుకేమీ లేదు. ఈ లోపులో ఆమె_ "మీరోసారి లోపలికి నాన్నగారి దగ్గరికి వస్తారా?" అని అడిగింది.

    "ఎందుకు?"

    "చెప్తాను ప్లీజ్."

    "క్షమించండి, నాకు దయానందం అంటే పడదు. ప్రతీదాన్ని డబ్బుతోనే కొనగలం అనుకునేవాళ్ళు. మీ తండ్రిగారి చుట్టూ ఉన్నప్పుడు నేను రావడం నాకిష్టంలేదు."

    "పోనీ సాయంత్రం వస్తారా? అప్పుడెవరూ ఉండకుండా నేను చూస్తాను."

    "మధ్యాహ్నం ఓ ఫ్యాక్టరీలో ఇంటర్వ్యూ ఉంది. అది పూర్తయితే తప్పకుండా వస్తాను."

    "ఏం ఉద్యోగం? ఎంత జీతం?"

    "క్యాజువల్ లేబర్! రోజుకు ముప్పై."

    "ఇక దాని సంగతి మర్చిపోండి.... రండి."

    "మరీ...." అని ఏదో నసగబోయాడు.

    "ఇంకేం చెప్పొద్దు. మీరొస్తున్నారు."

    అతడు తటపటాయించి, "సరే" అన్నాడు.


                                                        *    *    *    *


    "ఏవఁమ్మా! కనబడ్డాడా?" అని అడిగాడు జగపతిరావు ప్రేమ లోపలకు రాగానే.

    ఆమె లేదన్నట్టుగా తలూపింది.

    "అయినా వాడికోసం నువ్వెళ్ళటం ఎందుకు?" అన్నాడు ప్రసాద్.

    ఆమె మాట్లాడలేదు.

    దయానందం కల్పించుకుంటూ, "అతని ఇల్లు మనకు తెలిసిందే! అతని డబ్బు ఎవరితోనైనా పంపిద్దాంలెండి" అన్నాడు ఆ ప్రసంగం అక్కడితే ఆపుచేద్దాం అన్నట్లు.

    "సరే-సరే" అన్నాడు జగపతిరావు. కాసేపవీ యివీ మాట్లాడి తండ్రీ, కొడుకులిద్దరూ వెళ్ళిపోయారు.

    ప్రేమ కూడా లేచి_ "నేనూ యిప్పుడే వస్తాన్నాన్నా!" అంది.

    "ఎక్కడికమ్మా?"

    "ఒక విషయం నిర్ధారణ పరచుకోవాలి. ఇప్పుడే వచ్చేస్తాను" అని బయటకు వచ్చి ఆస్పత్రి ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఫ్యాక్టరీకి ఫోన్ చేసి పర్సనల్ మేనేజర్ కి కనెక్షన్ ఇమ్మంది. యజమాని కూతురు అవతల్నుంచి మాట్లాడుతోంది అనగానే పర్సనల్ మేనేజర్ గొంతులో భయం ప్రతిధ్వనించింది.

    "ఏం కావాలి మేడమ్?" అని అడిగాడు వినయంగా.

    "మన ఫ్యాక్టరీలో వేణు అని ఒక వర్కరుండేవాడు. అతడ్ని ఉద్యోగంలో నుండి తలగించమని నాన్నగారు చెప్పారట. తొలగించారో లేదో నన్ను కనుక్కోమన్నారు" అని అడిగింది ఏమీ తెలియనట్టు.

    "ఆ పని ఎప్పుడో చేసేశాం మేడమ్!"

    "కంగ్రాట్స్! అంత సులభంగా యూనియన్ తో ఏ గొడవా రాకుండా ఎలా చెయ్యగలిగారు? అఫ్ కోర్స్! ఇది నాన్నగారు అడగమన లేదనుకోండి నా ఇంట్రస్టుతో అడుగుతున్నాను."

    పర్సనల్ మేనేజర్ ఉత్సాహంతో, "దానిదేముంది మేడమ్! ఆ ట్రిక్ నేనే చెప్పను. మిషన్ బ్రేక్ డౌన్ కి కారణం అతడే. తాగి పనిలోకి వచ్చాడని మన డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. అంతే!" అన్నాడు ఉత్సాహంగా.

    "థాంక్స్!" అని ఫోన్ పెట్టేసింది. పది నిముషాల్లో తిరిగి తండ్రి దగ్గరకు చేరుకుంది.

    "నాన్నా! ఈ వేణు అనే అతని గురించి మీకేమైనా తెలుసా? తప్పుడు నేరం మోపి మనవాళ్ళతన్ని ఉద్యోగంలోంచి తీసేశారట" అంది.

    కానీ ఆమె ఊహించినట్లు అతడి మొహంలో విస్మయం ఏమీ కనబడలేదు.  

    "అయి ఉండొచ్చమ్మా! ఫ్యాక్టరీలో అల్లర్లూ అవీ రెచ్చగొడుతున్నాడని చెప్పి ఆ మిషమీద తీసేసి ఉంటారు. అందులో వింతేముంది?"

    "అందులో వింత లేకపోవచ్చు నాన్నా! వాళ్ళ తండ్రి మన ఫ్యాక్టరీ, మిషన్ల మధ్యలోనే ఇరుక్కుని చచ్చిపోయాడు. ఇతడు అల్లర్లు చేయించే వాడయితే స్ట్రయిక్ నాడు గెస్ట్ హౌస్ లో మనల్ని రక్షించడానికి పూనుకోడు. అంతవరకూ ఎందుకు? నువ్వుద్యోగంలో నుండి తీసేసినా నువ్వని తెలిసి కూడా ఆస్పత్రిలో చేర్పించాడు. డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటే ఆత్మాభిమానంతో వెళ్ళిపోయాడు. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు" అంది.

    "అయితే ఏం చేద్దామంటావ్?"

    "మనం తిరిగి అతనికి ఉద్యోగం ఇవ్వాలి."

    జగపతిరావు విస్తుపోయి, "ఏమిటి నువ్వు మాట్లాడుతోంది?" అన్నాడు.

    "నాన్నా! ఈ బిజినెస్, ఫ్యాక్టరీలు, డబ్బూ ఇవన్నిటికన్నా నాకు నువ్వు ముఖ్యం. నీ ప్రాణాలు రక్షించినవాడు ఎలాంటివాడైనా సరే అతనికి సాయపడడం కనీస కర్తవ్యం. అతడికి నేను మాటిచ్చాను కూడా" అంది దృడంగా.

    కూతురికి తన మీదున్న ప్రేమకి జగపతిరావు కదలిపోయాడు. ఎటూ చెప్పలేని ఇరకాటంలోపడి, "ఒకసారి తీసేసిన వాడికి తిరిగి ఉద్యోగం ఇవ్వడానికి దయానందం ఒప్పుకోడేమోనమ్మా! ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ అతనే చూస్తున్నాడు కదా!" అన్నాడు.

    "ఫ్యాక్టరీ కాకపోతే మన దగ్గర ఇద్దాం."

    "మన దగ్గరా! అంటే?"

    "మన సొంత వ్యవహారాలన్నీ నువ్వు ఒక్కడివే చూసుకోలేకపోతున్నావు. నీకో పర్సనల్ సెక్రటరీ ఉంటే బాగుంటుంది కదా? అతడు బియ్యే పాసయ్యాడట కూడా."

    జగపతిరావు ఆలోచనలో పడ్డాడు.

    ప్రేమే తిరిగి అంది, "అతడు చేసిన గొప్ప పనికి కాస్త డబ్బు పడేయడం ద్వారా మనం తక్కువ బుద్ధి చూపించుకున్నాం. దాన్ని సరిదిద్దుకోవాలంటే ఈ మాత్రం చెయ్యడం మన కనీస కర్తవ్యం."

    "సరేనమ్మా! అతడ్ని రమ్మను" అన్నాడు.

    ప్రేమ ముఖం వికసించింది. లేచి నిలబడుతూ, "నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు నాన్నా! సాయంత్రం అతడ్ని రమ్మనమని ముందే చెప్పి వుంచాను" అంది.

    ఆ సాయంత్రమే వేణు జగపతిరావుకి పర్సనల్ అసిస్టెంటుగా నియమించబడ్డాడు.


                                                                           3


    "రొట్టె విరిగి నేతిలో పడటం అంటే ఇదే!" అన్నాడు ప్రసాదరావు. సాయంకాలం ఎండలో అతని మొహం మరింత బ్రైట్ గా ఉంది.

    "నేను కూడా అనుకోలేదు- ఇంత సులభంగా అవుతుందని" అన్నాడు వేణు. "నేను ప్రొద్దున ఆస్పత్రికి వెళ్ళేసరికి అక్కడ దయానందం, వాడి కొడుకు ఉండటంతో మొదటికే మోసం వచ్చిందనుకున్నాను. నేను చేసిన పనికి వాళ్ళు డబ్బు రూపేణా బహుమతి ఇస్తాననేసరికి ఒళ్ళు మండినట్టు నటించి అక్కడినుండి బయటకు వచ్చేను. అదే ఈ విధంగా లాభించింది" అన్నాడు.

    "దయానందం తీసేసినవాడిని మళ్ళీ పర్సనల్ అసిస్టెంటుగా జగపతిరావు తీసుకున్నాడంటే ఆశ్చర్యమే! దీంట్లో ప్రేమ వత్తిడి చాలా ఉండి వుంటుందని నా ఉద్దేశ్యం. నువ్వెప్పుడు జాయిన్ అవ్వాలి."

    "రేప్పొద్దున్న."

    "ఇదిగో నీకోసం నేను కొంత నోట్సు తయారుచేసి ఉంచాను- రకరకాల నవలల్లో హీరో హీరోయిన్లు ఒకరికొకరు ఎలా ఎట్రాక్ట్ అయ్యేది పాయింట్లుగా వ్రాసేను_నీ పని కాస్త సులువవ్వడం కోసం."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra