ఏదో వినిపిస్తోంది చూడు పద్మా! ఎవరో నా చెవిలో ఏమో చెపుతున్నారు. అర్ధం కావటంలేదు."
"నాకేమీ వినిపించడంలేదే!" గాభరాగా లేచి కూర్చుంది.
ఉన్నట్లుండి, "ఎవర్నువ్వు?" అని కోపంగా అరిచాడు గిరి.
"గిరీ!" అతన్ని తట్టింది పద్మజ భయంగా.
"నో....నో...." అతను చేతులతో తలను పట్టుకున్నాడు గట్టిగా. కనుగుడ్లు పైకి తేలిపోతున్నాయి. మనిషి వణుకుతున్నాడు.
"గిరీ?" అతన్ని కదుపుతూ అంది పద్మజ.
కాస్సేపటికి అతను కళ్ళు తెరిచాడు. కళ్ళలో ఎర్రటి జీరలు మొహం వికృతంగా తయారైంది.
'నేను సోమశేఖరాన్ని పద్మజా! నన్ను గుర్తుపట్టలేదా?" అడిగాడతను తాపీగా.
పద్మజ తాచుపాముని పట్టుకున్నట్లు ఉలిక్కిపడి అతన్ని వదిలివేసింది. భయం భయంగా దూరంగా జరిగింది. అర్ధనగ్నంగా వున్న తన వక్షోజాలపై అతని చూపు పడడంతో ఒక్కసారిగా చీర తీసి కప్పుకుంది.
"భయపడకండి పద్మజా! నేను మిమ్మల్నేమీ చెయ్యను. నాలో అంత సాహసంలేదని మీకు తెలుసు" అన్నాడతను.
ఇప్పుడు గిరి స్వరం అతడిదిలాలేదు. అచ్చు సోమశేఖరం లాగానే వుంది.
"ఇందాక తోటలో నేను చూసింది నిజమేనా? భ్రాంతి కాదా?"
తనలో తనే అనుకొంటున్నట్లుగా అంది.
"లేదు పద్మజా! పార్టీలో వున్న గిరిని నేనే ఆహ్వానించాను! రమ్మనగానే దగ్గరికి వచ్చాడు. మిమ్మల్ని దగ్గరగా చూసి, మాట్లాడాలనే కోర్కెను అతడి ద్వారా తీర్చుకో గలిగాను."
"ఎందుకు? నేనేం పాపం చేశానని నన్నిలా వేధిస్తున్నారు?" అడిగింది పద్మజ. ఆమె కంఠం వణుకుతోంది. ఇంకా షాక్ నించి పూర్తిగా తేరుకోలేదు.
"నేను మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రేమించాను పద్మజా! కానీ ఎప్పుడూ చెప్పలేక పోయాను. అప్పుడు చేయలేని ధైర్యం ఈనాడు ఇలా చెయ్యగలుగుతున్నాను. మీ సాన్నిధ్యం కోసం తపించి కొట్టుకులాడుతోంది నా ఆత్మ. పూర్తి సంతృప్తి కలిగితేనేగానీ పోలేను.
కొన్నాళ్ళు నాకు మీ సాన్నిహిత్యం కావాలి. నన్ను ప్రేమించక పోయినా ఒక స్నేహితుడిగా నా కోరిక తీర్చమని వేడుకుంటున్నాను."
"శేఖరం - ఇది చాలా అన్యాయం. నా భర్తను, తద్వారా నన్ను మీరెంత బాధపెడుతున్నారో మీకేమయినా తెలుస్తూందా ? మీరు నాకు స్నేహితులయితే నా సుఖం కోరాలిగదా !"
"మీకేం అపకారమూ జరగదు పద్మజా ! నన్ను నమ్మండి."
"నేను ఏం చెయ్యగలను?" అడిగింది భయంగా.
"మాట్లాడండి. కాస్సేపు మాట్లాడితే నాకెంతో తృప్తి కలుగుతుంది. వెళ్ళిపోతాను."
"హు....ఏం మాట్లాడను?"
"ఏదయినా యిదివరకు మనం మాట్లాడుకునేవి. ఆఫీసు విషయాలు దేశభక్తి, సాహిత్యమూ, సంగీతమూ ఏదయినా సరే."
"నో....నేను మాట్లాడలేను" రెండు చేతుల్లో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది పద్మజ.
"వద్దు పద్మజా - మీరలా బాధపడితే నేను భరించలేను. వెళ్ళిపోతున్నాను. మీ మనసు బాగున్నప్పుడే వస్తాను."
అతని స్వరం వినిపించటం ఆగిపోయింది.
నెమ్మదిగా కళ్ళు తెరిచింది పద్మజ. గిరి కళ్ళు మూసుకుని మంచానికి చేరగిలబడి కూర్చున్నాడు. అతని ముఖంనిండా చెమటలు.
"గిరీ" మెల్లిగా పిలిచింది.
నెమ్మదిగా కళ్ళు తెరిచాడతను. కళ్ళు మామూలుగానే ఉన్నాయి.
"ఏమిటిది? నేను కూర్చునే నిద్రపోయానా? ఏమయింది నాకు" లేచి తల విదిలించాడు. "ఏదో జరగకూడంది జరిగినట్లుగా అనిపిస్తూంది పద్మా!"
పద్మజ అతన్ని పరిశీలనగా చూసింది. అతను గిరే. అప్పటివరకూ అతనిలో కనిపించిన విపరీతపు లక్షణాలేవీ కనిపించడం లేదిప్పుడు.
"గిరీ" ఒక్కసారి అతని మీదకు వాలిపోయింది.
"అరే, ఏడుస్తున్నావా? ఏమయింది - నిన్నేమైనా హర్ట్ చేసానా?" అడిగాడు.
"లేదు నాకేమిటో భయంగా ఉంది."
"భయమా! నీకా!!" అతను పకపకా నవ్వాడు, "ఎందుకు? ఈ రాత్రి నిన్ను భయాందోళనలకు దూరంగా స్వర్గానికి అతి దగ్గరగా తీసుకెళ్ళే భారం నాది. ఓ.కే?" అంటూ దగ్గరికి తీసుకున్నాడు.
జీవితంలో అవతలి పార్టనర్ ని సంతృప్తి పర్చటం కోసం ఎన్నో కొన్ని పన్లు చేయాలి, కానీ సెక్స్ లో అవతలి పార్టనర్ ని సంతృప్తిపర్చే ఒకే ఒక పని....మనం హాయిగా సంతృప్తి చెందటమే! అలా చెందినట్టు అవతలి వ్యక్తికి తెలిసేలా ప్రవర్తిస్తేచాలు. అంతకన్నా సంతోషం అవతలి వ్యక్తి (ఈగో) వేరే ఏమీ వుండదు.
7
రాత్రి రెండు గంటలు దాటింది. గుజరాత్ రాష్ట్రంలోని గంగా నగర్ జిల్లా నుంచి పంజాబ్ లో ఫిరోజ్ పూర్ జిల్లావైపు వెళ్ళే సరిహద్దు హైవే.
పాత మిలటరీ ట్రక్కు అది. డ్రైవరు కాకుండా మరో ఇద్దరూ జవాన్లు కూర్చున్నారందులో. సరిహద్దు చెకింగ్ పోస్టు యింకో పదిమైళ్ళ దూరంలో ఉండగా ట్రక్కుని పక్కదారిలోకి నడిపాడు డ్రైవర్. రోడ్డు గతుకులు గతుకులుగా ఉంది. మిలటరీ ట్రక్కు కాబట్టి నిదానంగా సాగిపోతోంది రాళ్ళూ, గుట్టలూ ఎక్కుతూ.
వెనుక నుంచి హారను వినిపించడంతో రియర్ వ్యూ మిర్రర్ లోంచి చూశాడు డ్రైవర్.
మోటారు సైకిలు మీద యిద్దరు ఖాకీ దుస్తుల వాళ్ళు....ట్రక్కుని ఆపాడు డ్రైవర్, మోటారు సైకిలు వచ్చి అడ్డంగా ఆగింది. ఒక ఇన్ స్పెక్టర్ దగ్గరగా వచ్చాడు.