Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 19


    "నో! అక్కడే అందరూ పొరబాటు పడతారు! సాధారణంగా నేను కుక్కను లైక్ చేయను, కుక్కలకు ఆమడదూరం వుంటాను! అవంటే ఎలర్జీ నాకు! కానీ మీ కుక్కపిల్లను చూసినప్పుడు మాత్రం... ఎందుకో తెలీదు ఎలర్జీ అనేదే వుండదు. కుక్కపిల్లలను అంత అందంగా పెంచడం కూడా ఓ ఆర్ట్ అని నా అభిప్రాయం."
    "ఎగ్జాక్ట్ లీ! నేను వాటి విషయంలో చాలా కేర్ తీసుకుంటాను" అన్నాడు జనరల మేనేజర్ పొంగిపోతూ.
    "నిజంగా మీకు భగవంతుని అండ వుండబట్టే అంత భూతదయగల వారయ్యారు మీరు. కుక్క భగవంతుని స్వరూపం అని నమ్మటం నిజంగా చాలా గ్రేట్."
    "అహ్."
    "అన్నట్లు మొన్నే ఇంకో లోన్ ప్రపోజల్ సబ్మిట్ చేశాను. మీరు అది కొంచెం శాంక్షన్ చేయించారంటే..." నసిగాడు మార్కండేయులు.
    "అలాగా! ఏం లోన్ అది?"
    "రివైవల్. మా పబ్లికేషన్స్ అన్నీ రివైవ్ చేసి పెద్ద ఎత్తున మళ్ళీ రంగంలోకి దిగాలని అరవైలక్షల లోన్ అడిగాను."
    "కానీ పబ్లికేషన్స్ ఏమాత్రం రన్ అవటం లేదన్నారు, క్రిందటిసారి మా నల్లకుక్కని ముద్దు పెట్టుకున్నప్పుడు.
    "అప్పుడు రన్ అవనిమాట నిజమే! కాని ఇప్పుడు సేల్స్ టీమ్ ని మార్చాను. కొంచెం హాప్ ఫుల్ గా వుంది పొజీషన్."
    "ఆల్ రైట్! శాంక్షన్ చేయిస్తాను."
    "మామూలుగా మీకిచ్చే కమీషన్ మీకు ఇచ్చేస్తాను రేపు పొద్దున్నే."
    "భలేవారే! అంత తొందరేముంది? మీరెక్కడికయినా పారిపోతారేమిటి? రేపు సాయంత్రం ఇద్దురుగాన్లెండి!"
    "ఏదో అభిమానం కొద్దీ అలా అంటున్నారు గానీ, లేకపోతే సాయంత్రం వరకూ ఎవరాగుతారు చెప్పండి!" మాట్లాడుతూండగానే అతని దృష్టి ఎదురుగా టీ.వీ. చిత్రలహరిలో కనబడుతున్న సినిమా హీరోయిన్ మీద పడింది. ఆమె ఇద్దరు హీరోలనూ కౌగిలించుకుంటూ పాట పాడుతోంది.
    "మా మిసెస్ కూడా అదే అంటుంది! ఫైనాన్స్ విషయంలో నేను మరీ లీనియేంట్ గా వుంటానని" అన్నాడు జనరల్ మేనేజర్.
    మార్కండేయులుకి అతని మాటలు వినిపించటం లేదు. ఆ హీరోయిన్ గురించి అంతకుముందు రోజు ఓ సినిమా పత్రికలో చదివిన వ్యాసం గుర్తుకొచ్చిందతనికి.
    ఆ హీరోయిన్ కి భర్త కాక అరడజను మంది బోయ్ ఫ్రెండ్స్ వున్నారనీ, రోజుకొకడితో హోటల్ రూమ్ లో గడుపుతుంటుందనీ, అందుకే సంవత్సరానికో భర్త మారిపోతున్నాడనీ రాశారందులో.
    "బ్లడీ బిచ్!" అన్నాడు మార్కండేయులు అలవాటు ప్రకారం మనసులోని మాటలు బయటకు వదిలేస్తూ.
    ఆ మాట వింటూనే జనరల్ మేనేజర్ ముందు తెల్లబోయాడు. తను తన భార్య గురించి చెప్తూంటే వాడు బ్లడీబిచ్ అంటాడా? ఎంత ధైర్యం? ఎంత పొగరు? ఎంత వగరు? తెల్లబోవటం పూర్తయ్యాక అప్పుడు కోపంతో పొగలు కక్కుతూ లేచి నిలబడ్డాడు. హోటల్లో దోశెలు చేసే పెనంలాగా కాలిపోతోందని గుండె.
    "ఏమన్నావ్? మా మిసెస్ బిచ్చా? ఎంత ధైర్యం నీకు? నువ్వే బ్లడీ బాస్టర్డ్ వి! నీ ఫాదర్ బాస్టర్డ్! నీ తాత బాస్టర్డ్!" ఆవేశంగా అరిచాడతను.
    మార్కండేయులు అదిరిపడి లేచి నుంచున్నాడు "అదేమిటి? నేనేమన్నాను సార్?" అన్నాడు అయోమయంగా.
    "నీకు లోన్ కావాలా? లోన్ కాదురా! క్షౌరం చేయించేస్తాను నీకు! చూస్కో! పాత లోనే ఎగొట్టినందుకు ఆస్తులన్నీ ఎటాచ్ చేయిస్తాను. నా మిసెస్ ని అలా అనటానికి ఎన్ని గుండెల్రా నీకు...గెటౌట్! ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ నిలబడకు పో."
    అప్పుడు అర్థమయ్యింది మార్కండేయులకి. తను పొరపాటున మనసులోని విషయాలు పైకి అనేయటం వలన ఎంత అనర్థం జరిగిందో! ఇంక ఆ క్షణంలో ఏమయినా మాట్లాడితే అతను మరింత రెచ్చిపోవటం ఖాయం.
    నెమ్మదిగా లేచి బయటకు నడిచాడతను. టి.వీ.లో ఇంకా సినిమా హీరోయిన్ పాడుతూనే వుంది. "బ్లడీ బిచ్" అనుకున్నాడు మార్కండేయులు క్లబ్ ఆవరణలోని కార్లో కూర్చున్నాక.
    అతనికి అలాంటి సినిమా హీరోయిన్ ల మీద చాలా కోపమొచ్చింది. తిన్నగా ఇంటికి చేరుకున్నాడు. ఇంటిదగ్గర హాల్లో కూర్చుని టి.వి. చూస్తున్న మేనల్లుడు కె.యస్.ప్రకాష్ ని చూడగానే అతనికి వళ్ళు మండిపోయింది.
    తన మేనల్లుడు అలాంటి పనికిమాలిన హీరోయిన్స్ ని టి.వీ.లో చూడటం చాలా దారుణమయిన తప్పిదం అనిపించింది.
    "ఆఫ్" అరిచాడతను టి.వీ.వైపు చూపుతూ.
    కె.యస్.ప్రకాష్ అర్థం కానట్లు అతనివైపు చూశాడు.
    "నీకే చెప్పేది - టి.వీ. ఆఫ్ చేసెయ్" మళ్ళీ అరిచాడతను.
    ప్రకాష్ ఠక్కున టి.వి.ఆఫ్ చేసేశాడు. మార్కండేయులు కొంచెం శాంతించాడు.
    "నువ్వు ఇకనుంచి టి.వి. ప్రోగ్రాంలు చూడకు" కరవబోయే కుక్క చూసినట్టు చూస్తూ ప్రకాష్ కి వార్నింగ్ ఇచ్చాడు.
    "అలాగే అంకుల్!"
    "అంతేకాదు సినిమాలు కూడా చూడకు."
    "ఓ.కె. అంకుల్"
    ప్రకాష్ కి చాలా ఆనందంగా వుంది. అంకుల్ అలా ఆదేశాలు జారీ చేసినప్పుడు తను శిరసావహిస్తే చాలా సంతోషిస్తాడు. అలా సంతోషంగా వున్న సమయంలోనే తను శిరసావహిస్తే చాలా సంతోషిస్తాడు. అలా సంతోషంగా వున్న సమయంలోనే తను ప్రేమించిన సుష్మ గురించి అతనికి చెప్పేస్తే ఠకీమని వప్పుకుంటాడు.
    మార్కండేయులు తన గదిలోకెళ్ళి ఫ్రిజ్ లోని బీర్ బాటిల్ అందుకుని కుర్చీలో కూలబడ్డాడు.
    ప్రకాష్ గది గడపలో నిలబడి "అంకుల్!" అన్నాడు నెమ్మదిగా.
    "ఏమిటి ప్రకాష్?" ఆప్యాయంగా అన్నాడతను.
    "నేను..."
    "ఎస్! నేను?"
    "నేను ఒకమ్మాయిని ప్రేమించానంకుల్"
    "ప్రేమించానని చెప్పటానికి అలా భయపడతావెందుకు! అందులో తప్పేముందని? నీ జీవితం తాలూకూ నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి ప్రకాష్! నీకు నచ్చిన అమ్మాయినే నువ్వు వివాహం చేసుకోవాలనే నా అభిప్రాయం కూడా!" ప్రేమగా అన్నాడు.

 Previous Page Next Page