Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 19


    నేరములందు మంచి నేరములు వేరయా. మా కాలనీవాళ్ళందరికీ మిగతా తెలుగు జనమందరిలాగానే ఓ కోరిక వుంది. అదేమిటంటే మనుషుల్లా బ్రతకటానికి ప్రయత్నించడం! అయితే చివరకు ప్రభుత్వం ఆ ప్రయత్నాలను విఫలం చేయడం కూడా మీ అందరికీ తెలిసిందే! ఈ మధ్య మా కాలనీ చుట్టుపక్కలున్న ప్రాంతాల్లో కొంతమంది దారికాచి దోచుకోవడం, ఒంటరిగా రోడ్ మీద వెళ్ళే స్త్రీల మెడలో మంగళసూత్రాలు తెంపుకు పారిపోవడం, ఇళ్ళు, షాపుల్లో దొంగతనాలు, బ్యాంకులు లూటీ చేయడం, ఎదురు తిరిగిన వారిని హత్యలు చేయడం మరీ ఎక్కువైపోయింది.
    అలాంటి వాళ్ళను సంస్కరించాలన్న అభిప్రాయం మా కాలనీ వారికి కలిగింది. కలగడం ఆలస్యం అలాంటి నేరస్థుల లిస్ట్ ఒకటి తయారుచేసి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళాం. వాళ్ళ కుటుంబాల వాళ్ళు ముందు మమ్మల్ని చూసి పోలీసులని చిరాకుపడ్డారు. కాని తర్వాత మేము వారికి సహాయం చేయడానికొచ్చామని తెలిసి మాకు సహకరించారు. ఏం బతుకులమ్మా మావి! మా మగాళ్ళకు ఉద్యోగం లేదు.
    మాకూ, పిల్లలకూ తిండితిప్పలూ లేవు. వాళ్ళేదో నేరం చేయకపోతే మాకు తిండికి గడవదు. నేరం చేస్తేనేమో పోలీసులతో గొడవ- జైలుకెళ్ళడం. మమ్మల్నందరినీ మాట్లాడితే పోలీసులొచ్చి బెదిరించడం, మగాళ్ళు జైల్లో వున్నప్పుడు మేము అడుక్కు తినడం..." అంటూ కన్నీరు పెట్టుకున్నారు వాళ్ళు.
    "మీకు సహాయం చేయడానికే మేమొచ్చాం!" అన్నాడు సాయిరామ్. "మీ మగాళ్ళందర్నీ జైలు నుంచి రాగానే మా కాలనీకి తీసుకురండి."
    చెప్పినట్టుగానే ఆ తరువాతి ఆదివారం నేరస్థులనందరినీ కాలనీ వేదిక దగ్గర సమావేశ పరిచాం! మనది అసలే క్రైమ్, వయొలెన్స్ లను సినిమాల ద్వారా ఆరాధించే జాతి కాబట్టి మొత్తం కాలనీ వాళ్ళంతా ఆ నేరస్థులను చూడ్డానికి మూగిపోయారు.
    సమావేశానికి మా ఏరియా ఇన్ ఛార్జీ శంకర్ అధ్యక్షత వహించాడు. నేరస్థులు ఒక్కొక్కరూ వచ్చి తమ బాధలన్నీ వెళ్ళబోసుకున్నారు.
    "మీరు చేసే నేరాల వల్ల మిమ్మల్నందరినీ మన సమాజం చాలా హీనంగా చూస్తోంది. మీకు గాని, మీ కుటుంబాలకు గాని, మీ పిల్లలకు గానీ ఏమాత్రం గౌరవం వుండదు. మీరు అంటరానివారయిపోతారు. కనుక మీరికనుంచి నేరాలు చేయడం మానేయాలి!" అన్నాడు రంగారెడ్డి.
    "నేరాలు మానేస్తే మాకు తిండి సంగతేమిటి?" మంగళసూత్రాలు తెంపే నేరస్థుడడిగాడు. అక్కడకు చేరిన మా కాలనీ ఆడాళ్ళందరి మెడలవేపు చకచకచూస్తూ. రంగారెడ్డి విరగబడినవ్వాడు.
    "పిచ్చివాళ్ళారా! మిమ్మల్ని నేరాలు చేయవద్దని మేమనడం లేదు" కానీ ఇలా నలుగురిలోనూ అవమానం, పోలీసులతో గొడవ, మాట్లాడితే జైలు లాంటివి లేకుండా వుండే నేరాలు చేయండి" అన్నాడు జాలిగా.
    అందరూ మొఖాలు చూసుకున్నారు. ఎవరికీ రంగారెడ్డి మాటలు అర్థం కాలేదు. "అలాంటి నేరాలెక్కడుంటాయసలు!" ఆశ్చర్యంగా అడిగాడొక బ్యాంక్ లూటీ దారుడు. ఈ కాలనీలో వున్న బ్యాంక్ వేపు మార్చి మార్చి చూస్తూ.
    "లేకపోవడమేమిటి? ఉదాహరణకు మీరు బ్యాంక్ లో డబ్బు అర్థరాత్రుళ్ళు వచ్చి దోచేయకుండా, పట్టపగలు వెళ్ళి బ్యాంక్ అధికారులకు లంచాలిచ్చి దొంగ ఋణాలు తీసుకుని ఎగ్గొట్టవచ్చు లేదా దొంగ బ్యాంక్ రసీదులు అమ్మేసి ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు కొట్టేయవచ్చు. అప్పుడు మీజోలికి పోలీసులు రారు. మీకు జైలుశిక్ష పడదు. సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది. అందరూ మీకు సన్మానాలు చేసే సంఘాలు కూడా చాలా వున్నాయ్. న్యూస్ పేపర్ వాళ్ళు మీ ఇంటర్వ్యూలు వేస్తారు. మీ జీవిత చరిత్రలు సినిమాలుగా తీస్తారు..." చెప్పాడు రంగారెడ్డి.    
    అందరూ తప్పట్లు కొట్టారు ఆనందంగా. "హియర్ హియర్" అని అరిచారు కొంతమంది చిల్లర దొంగలు.
    శాయిరామ్ ఆవేశంగా మైక్ ముందుకొచ్చాడు. "అంతేకాదు. మీలో కొంతమంది స్టాక్ ఎక్స్చేంజ్ లో బ్రోకర్స్ గా చేరి పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ నీ, బ్యాంక్ లనీ, కేంద్రమంత్రులనూ కూడగట్టుకుని వేలకు వేలు కోట్లు ముంచేయవచ్చు... అలా చేసినందువల్ల మీ మీద కోర్టులో కేసు వుంటుంది గానీ అది తేలేప్పటికి మీరు ముసలివాళ్ళయి పోతారు. గనుక దానివల్ల సమస్యేమీ వుండదు. పోలీసులు మీ జోలికిరారు. సమాజంలో మీకు తెగ గౌరవమ౧ మొత్తం మంత్రులూ, ఉన్నత ప్రభుత్వాధికారులూ మీ గడపముందు పడి వుంటారు" అంతా తప్పట్ల వర్షం.
    నేనూ పరుగెత్తుకెళ్ళి మైక్ ముందు నిలబడ్డాను. ఆవేశం పట్టలేక. కావాలంటే మీరు దొంగ కంపెనీలు పెట్టి విదేశాలలోని ఆయుధాల కంపెనీలతోనూ, రైలింజన్ల కంపెనీలతోనూ, కంప్యూటర్ల కంపెనీలతోనూ ఒప్పందం చేసుకుని మన ప్రభుత్వంతో వాటినన్నింటినీ అసలు ధరకన్నా పాతికరెట్లు ఎక్కువతో కొనిపించి కోట్ల కొద్ది మీరు కమీషన్ లు కొట్టేసి అందులో కొంత ప్రబుత్వాదికారులకూ, రాజకీయ నాయకులకూ ముష్టి పడేయవచ్చు- ఎవ్వడూ మిమ్మల్ని పట్టుకోరు - పట్టుకున్నా మిమ్మల్నేమీ చెయ్యలేరు- ఎందుకంటే ఇది విదేశాలతో వ్యవహారం!
    ఆడా - మగా పిల్లలు కూడా ఆనందం పట్టలేక తప్పట్లు కొట్టేశారు.
    గోపాల్రావ్ కి కూడా ఓ అయిడియా వచ్చినట్టుంది. పరుగుతో మైక్ దగ్గరకొచ్చాడు.
    "కావాలంటే మీరు కాంట్రాక్టర్లని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర ఫిఫ్టీ-ఫిఫ్టీ పద్ధతిలో కాంట్రాక్టులు తీసుకుని ప్రభుత్వాలను ముంచేయండి. ఏం ఫర్లేదు - అడిగేవాడుండడు" అన్నాడతను.
    "ఇంకో మంచి పద్ధతి కూడా వుంది. మీ గుడిశెలోనే ఇంజనీరింగ్ కాలేజో, మెడికల్ కాలేజో పెట్టడానికి విద్యామంత్రినీ, ముఖ్యమంత్రినీ పట్టుకోండి. మీకు వచ్చిన డబ్బులో సగం వాళ్ళకిచ్చేయండి. ఇది నేరమే అయినా ఎవరూ దీనిని నేరం అనరసలు" మళ్ళీ తప్పట్లు-
    "ఇంకా కావాలంటే మంత్రులకూ, ముఖ్యమంత్రులకూ, ప్రధానమంత్రులకూ బ్రోకర్లుగా పనిచేయండి తెగ డబ్బు! మీ ఇష్టమొచ్చినంత అవినీతి పనులు చేయండి. అందులోనూ మీకు పరపతి పెరుగుతుంది" అన్నాడు జనార్ధన్.
    "ఫలానా గవర్నమెంట్ అద్భుతమైనదని డాక్యుమెంటరీలు తీయండి! కోట్ల రాబడి! సగం ప్రభుత్వాధికారులకూ- మంత్రులకూ!"
    నేరస్థులందరి మొఖాల్లోనూ పశ్చాత్తాపం - కళ్ళల్లో ఆనందభాష్పాలు. "మాకింతవరకూ ఇంత మంచి గౌరవప్రదమయిన, ఎక్కువ డబ్బు తక్కువ శ్రమతోనూ, రిస్క్ తోనూ, పోలీసులకు సంబంధం లేకుండానూ చేయగలిగిన నేరాలున్నాయని తెలీలేద్సార్! ఇవాళ మీ కాలనీ వాళ్ళు మా కళ్ళు తెరిపించారు. వస్తాము సార్." అంటూ మా అందరి కాళ్ళూ మొక్కి సెక్రటేరియట్ వేపు పరిగెత్తారు.
                                     *    *    *

 Previous Page Next Page