సొమ్మొకడిది.....
'మేడమ్! ప్లంబర్ కావాలన్నారు కదా, ఇదిగో తీసుకొచ్చాను' అన్నాడు వాచ్ మెన్ ఉదయం పదిగంటల వేళ పేపరు తిరగేస్తుంటే.
పేపరులోంచి తలెత్తి చూశా.
'ఏడి ఎక్కడ' అన్నాను ఎవరూ కనపడక.
'ఈ అమ్మాయేనండి - ప్లంబింగ్ పనులు చేస్తుంది' అన్నాడు వాచ్ మెన్ నాయుడు.
ఎదురుగా ఇరవై పాతికేళ్ల మధ్య వున్న చామనచాయ రంగులో, చుడీదార్ - కుర్తా వేసుకుని, జుట్టుకి రబ్బరు బ్యాండ్ కట్టుకుని - పెద్ద కళ్లతో కళగా వున్న ఓ అమ్మాయి నిలబడి వుంది. భుజాన టూల్ కిట్ లాంటి బ్యాగుంది.
ఆశ్చర్యంగా చూశా - 'ఈ అమ్మాయా, ప్లంబరా....!
'అవును మేడమ్, ప్లంబింగ్ పని ఆడవాళ్లు చేయకూడదా...' చనువుగా నవ్వుతూ అడిగింది.
అప్పటికి కాస్త తేరుకుని -
'ఏమో, మొదటిసారి చూస్తున్నాను కదా ఆడపిల్ల ప్లంబింగ్ పని చేయడం... అందుకు ఆశ్చర్యం అన్పించింది. ఇంతకీ నీకు ఈ పనులన్నీ వచ్చా. ఎక్కడ నేర్చుకున్నావ్. మీ నాన్న ప్లంబరా...' కుతూహలంగా అడిగా.
'లేదండీ, నేను ఐ.టి.ఐ. లో రెండేళ్ల కోర్సు చేశానండీ'
ఈసారి మరింత ఆశ్చర్యం అన్పించింది.
'కోర్సు చేశావ, ఎక్కడ? టెన్త్ తరువాతా?
'కాకినాడ పాలిటెక్నిక్ లో పదో క్లాసు తర్వాత రెండేళ్ల కోర్సండి. ట్రైనింగు అది అయ్యాక ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పనులు చేస్తున్నానండీ' అంది ఆ అమ్మాయి.
మొహంలో తెలివితేటలు, తనమీద తనకు నమ్మకం కనిపించాయి ఆ మొహంలో. అప్పటివరకు నిలబెట్టి మాట్లాడుతున్న నేను-
'అలా కూర్చో...' అన్నాను గౌరవమిస్తూ.
'అదేమిటి నీవీ కోర్సు ఎందుకు చేశావ్. మోటు పని కదా. సాధారణంగా ఆడవాళ్లెవరూ ఈ పనులు చేయరు కదా! వాల్వులు బిగించడాలు, పైపులైన్లు పనులు ఇవన్నీ నీవల్ల అవుతాయా. అసలీ కోర్సు ఎందుకు చేయాలనిపించింది. మీ ఇంట్లో మగవాళ్లెవరూ లేరా, నీ ఇంటికి నీవే ఆధారమా?' అని అమ్మాయి గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో ప్రశ్నలు గుప్పించాను.
'ఇంతకీ నీ పేరు చెప్పు ముందు' అన్నాను.
'నా పేరు కవిత అండి. ఇంట్లో మా నాన్న, అమ్మ, అన్నయ్య వుంటారండీ, నేను ముందు ఎలక్ట్రీషియన్ కోర్సు చెయ్యాలనుకుంటే సీటు దొరకలేదండి. ప్లంబింగ్ ఎందుకు చేయకూడదనిపించింది. మా నాన్న వాళ్లు వద్దన్నా పంతం వచ్చింది. ఏం అన్ని పనులు ఈ రోజుల్లో ఆడవాళ్లు చేస్తుండగా ఇది మాత్రం ఎందుకు చేయకూడదని చేరానండీ. మా నాన్న ఇన్ కంటాక్స్ ఆఫీసులో ప్యూన్ అండి. అసలు ఇంజనీరింగ్ చెప్పిస్తా, ఎంసెట్ రాయమన్నాడండి. నాకు లెక్కలంటే భయం. పాలిటెక్నిక్ లో చేరతానన్నాను. మొదట్లో నట్లు, బోల్టులు, వాల్వ్ లు బిగిస్తుంటే, స్పానర్లు పట్టుకుంటే చేతులు కందిపోయి, తొక్క రేగిపోయి మంట పుట్టేది. ఇప్పుడు చేతులకు అలవాటయిపోయింది లెండి, మొద్దుబారింది చర్మం' అని నవ్వింది. 'మేడమ్, మీ బిల్డింగ్ లో ప్లంబర్ లేడంట గదా - నేను రోజూ మీరే టైముకి రమ్మంటే ఆ టైముకి వచ్చి ఓ గంట, రెండు గంటలు డ్యూటీ చేసి మీ కంప్లయింట్స్ అటెండయి వెళతాను. మీరు చెపితే వింటారు మేనేజ్ మెంటు అన్నాడు వాచ్ మెన్. ఈ పని ఇప్పించండి నాకు' అంది.
'ఆ పక్క వీధిలో పల్లవి అపార్ట్ మెంట్స్ లో మెయిన్ టెనెన్స్ నాకప్పగించారు. కావలిస్తే వాళ్ళ దగ్గిర కాయితం తెస్తా' అంది.
'ఆ సెక్రటరీ నాకు తెలుసులే, నే మాట్లాడుతాలే. ముందు పైకెళ్లి రెండు మూడు వాల్వ్స్ పోయాయిట. వాచ్ మెన్ చూపిస్తాడు. చూసి బాగవుతాయో, మార్చాలో చూసి ఆపని చేసిరా' అన్నాను.
'నేను మా సెక్రటరీతో మాట్లాడి నెలవారీ డ్యూటీ సంగతి చెబుతాను.'
వాచ్ మెన్ తో - 'ఈ అమ్మాయికి ఏం చెయ్యాలో చూపించు -' అన్నాను.
ఓ గంటన్నర తరువాత ఒకటి కొత్త వాల్వు మార్చి రెండు రిపేరు చేసి వచ్చింది.
'చూడమ్మాయ్! మా బిల్డింగ్ లో అరవై ఇళ్లున్నాయి. మాకు కాస్త నీళ్ల ప్రోబ్లం వుంది. నాలుగు, ఐదు అంతస్తులకి నీరు సరిగా రాదు. దాంతో గొడవలు వస్తున్నాయి. ఇప్పుడు మేం ప్రతి అంతస్తుకి ప్రతి ఇంటికి వేరే కనెక్షన్ ఇచ్చి నీళ్లు అందరికి సరిగా ప్రెషర్ వచ్చేట్టు మార్చాలని ప్లానులో వున్నాం. ఈ పని కాంట్రాక్టు ఇవ్వాలనుకుంటున్నాం. ఇంత పెద్ద పని నీవు చెయ్యగలవా. ఇలాంటివి కాంట్రాక్టు పనులు చెయ్యగలవా.'
ఆ అమ్మాయి మొహం వికసించింది.
'ఎందుకు చెయ్యలేనండి. అన్నీ వచ్చండి. పైపులైన్లు మార్చడం, అవన్నీ మాకు నేర్పుతారండి.'
'మరి ఒక్కర్తివి...'
'నేను హెల్పర్ ని పెట్టుకుంటానండి. అసలు మా అన్నయ్యని నాతో తీసికెళ్లి వాల్వులు, నట్టులు, బోల్టులు, థ్రెడ్డింగ్ పనులు వాడిచేత చేయిస్తూ పని నేర్పుతున్నానండి. నేను తప్పకుండా చేస్తాను మేడమ్! ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, మీలాంటివారు ఇస్తే ఇకముందు ఇంకా కొందరు ఈ కాంట్రాక్టు పనులిస్తారు.
'అయితే ఒకసారి డాబా మీదకి వెళ్లి లైన్లు అవి చూడు. ఎలా చెయ్యాలో వాచ్ మెన్ చూపిస్తాడు. ఐదంతస్తులకి వచ్చే లైను నుంచి విడివిడిగా అందరికీ కనెక్షన్లు ఇవ్వాలి. అదంతా మెటీరియల్, కూలి అవీ ఎంత అవుతాయో సుమారుగా చెప్పాలి. ఐదో అంతస్తు వరకు గనక ఝాలా అది వేసుకోవాలేమో, ఏం చేస్తావో, ఎలా చేస్తావో, ఎందరిని పెట్టుకుంటావో మాకు మొత్తం కాంట్రాక్టు పని కావాలి. ఎస్టిమేట్ ఇవ్వాలి, ఇదంతా నీవల్ల అవుతుందా.'
'ముందు నేను చూసి, మెజర్ మెంట్స్ తీసుకుని ఇంటికెళ్లి ఎస్టిమేట్ రాసి పట్టుకొస్తాను. విత్ మెటీరియల్, వితౌట్ మెటీరియల్ అన్ని వివరాలు రాసిస్తాను. నాకు రేపొక రోజు టైమివ్వండి' అంది ఆరాటంగా. అప్పుడే ఆ పని చేసేయాలన్న ఉత్సాహం కనిపిస్తుందా అమ్మాయిలో.
'సరే, ఈలోగా నేను మావాళ్లతో మాట్లాడతాను. నెల జీతానికి పెట్టుకునే విషయం సెక్రటరీతో చెపుతాను. ఇప్పుడెవరూ ఇంట్లో లేరు. రేపు నీవు వచ్చాక చెబుతాను. ఈ పనికి కూడా రేపు డబ్బిప్పిస్తా. అవునూ, నీ కోర్సులో మెజర్ మెంట్స్ తీయడం, ఎస్టిమేషన్ ఇవ్వడం లాంటివి కూడా నేర్పుతారా. ఆహా, ఈ కోర్సు గురించి తెలుసుకోవాలని అడుగుతున్నా - తెలిస్తే ఎవరికన్నా చెప్పొచ్చు కదా అని' అడిగాను.
"థియరీలో కొలతలు, లెక్కలు, ఎస్టిమేషన్ వేయడం లాంటివన్నీ నేర్పుతారండీ. ప్రాక్టికల్స్ లో అన్నీ స్వయంగా చేయిస్తారండీ. థ్రెడ్డింగ్, డ్రిల్లింగ్, పైప్ కటింగ్, వాల్వులు వగైరా బిగించడం... అన్నీ నేర్పిస్తారండి.'
'బాగానే వుంది. ఆడపిల్లవైనా నీ కాళ్లమీద నీవు నిలబడాలన్న నీ ఆలోచన నాకు నచ్చింది. కష్టమైనా కోర్సు చేసి నీలాంటి అమ్మాయిలకి దారి చూపుతున్నావు' అన్నాను.
'మొదట్లో మా ఇంట్లో వద్దన్నా బలవంతంగా నేనే చేశానండి. ఎలక్ట్రీషియన్ తరువాత ప్లంబింగ్ కి గిరాకీ బాగా వుందండి. ఇన్ని ప్లాట్లు కడుతున్నారు కదా, మంచి అవకాశాలు దొరుకుతాయని ఆశ అండి. ప్రతి బిల్డింగ్ కి ఓ ప్లంబరుకి పార్ట్ టైమ్ కైనా పెట్టుకుంటారు గదా, రెండు మూడు బిల్డింగుల మెయిన్ టెనెన్స్ చేస్తూ మధ్య మధ్య ఇలాంటి కాంట్రాక్టులు వస్తే కొద్దిరోజులలోనే నిలదొక్కుకుంటానండి. మీరీ కాంట్రాక్టు పని ఎవరితోనూ మాట్లాడకండి మేడమ్. దయచేసి నాకే ఇప్పించండి.ఇదొక్కటి చేస్తే నాకు ఎక్స్ పీరియన్స్ వచ్చి కాన్ఫిడెన్స్ వస్తుంది'- ప్రాధేయపూర్వకంగా అంది.
'సరేలే, కానీ ఇది నా స్వంత ఇంటి పని కాదు కదా. మేనేజ్ మెంట్ ఒప్పుకోవాలి. నీ కొటేషన్ మాకు నచ్చాలి. మేమూ ఇద్దరు ముగ్గురిని అడిగి కదా, 'ఎవరికివ్వాలి అని నిర్ణయించుకోవాలి... సరే వెళ్లు.. రేపు పది లోపల రా - సెక్రటరీని కలుద్దువుగాని' అని చెప్పి పంపాను.
మా బిల్డింగులో ముందునించి యాక్టివ్ మెంబర్ ని. ఒకసారి ప్రెసిడెంటు, రెండుసార్లు ట్రెజరరుగా వుండి, అన్నింట్లో సలహాలు ఇస్తూ, బిల్డింగు మీద శ్రద్ధ తీసుకునే నలుగురయిదుగురిలో నేనూ ఒకరిని అవడం వల్ల మేనేజ్ మెంట్ మారినా నా మాటకి కాస్త విలువ వుంది. మగాళ్లు సెక్రటరీ వగైరాలు ఇళ్లలో రోజంతా వుండరు గనక ఎవరైనా ఏదన్నా మాట్లాడాలని వస్తే నా దగ్గరకి తీసుకొస్తారు. కవిత విషం ప్రెసిడెంటు, సెక్రటరీతో చర్చించా. మెయిన్ టెనెన్స్ కి ఫరవాలేదు కానీ లైన్లు మార్చే పని ఆడపిల్ల ఏం చేయగలదు' అన్నారు. 'చాలా నమ్మకంగా చేసి చూపిస్తానంటోంది గదా, ఆడామగా తేడా ఏముంది. మనకి పని కావాలిగాని... అయినా చూద్దాం ఎస్టిమేషన్ అది ఎలా చేస్తుందో చూసి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగులో చెప్పి నిర్ణయిద్దాం' అని ఒప్పించాను.