Previous Page Next Page 
8 డౌన్ పేజి 19

    "ఎలా?"    
    "నేనే చెప్పాను"    
    "ఎప్పుడు?"    
    "నువ్ నిద్రపోతున్నప్పుడు!"    
    విమల్ తనను 'ఆంటీ' అంటోంటే సంగీతకు మనసంతా అదోలా అయిపోయింది. "ఒరే విమల్! నేను మీ మమ్మీనిరా" అని చెప్పాలని వుంది. విజయ్ కుమార్ వేపు చూసిందామె. అకస్మాత్తుగా ఇద్దరి చూపులూ కలుసుకున్నాయ్. తనే ఛప్పున చూపులు మరల్చుకుంది. అతనిలోని ఆకర్షణ ఇంక్జా అలాగే వుంది. తను ఎంతో లైక్ చేసే 'అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ లుక్!'.    
    ఆ రోజు తను తొందరపడిందా? అలా వప్పుకోడానికి మనస్సెందుకో అంగీకరించటం లేదు తనేం తప్పు చేసిందని అతని సుపీరియర్ టోన్ ని లెక్క చేయాలి. ఏనాడూ తను తప్పు అనేది చేయలేదు. తనకు ఓ వ్యక్తిగా పూర్తి పరిజ్ఞానం వచ్చాక తను 'మంచిది' అని నమ్మిన పనులేతను చేసింది వివాహానికి ముందు తనను విపరీతంగా ఆకర్షించిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవటంకూడా అలాంటిదే. తనెప్పుడూ అందుకు పశ్చాత్తాప పడలేదు.    
    విజయ్ కుమార్ తో అకారణంగానే తన సంసారం విచ్చిన్నమయినప్పుడు కూడా తను విచారించలేదు.    
    అకస్మాత్తుగా ఆమెకు తనిప్పుడు వివాహం చేసుకోబోతున్న హౌస్ సర్జన్ గుర్తుకొచ్చాడు. ఎందుకో లోలోపల తనకు సంశయంగానే వుంది, వయసులో చిన్నవాడయిన అతనిని చేసుకోవటమా అని!    
    కొంతకాలం యవ్వనం ఉధృతం ఉన్నంతకాలం ఇద్దరూ ఆనందంగానే జీవితం గడుపుతారు. ఆ తర్వాత ప్రారంభమవుతాయ్- అసంతృప్తీ, డిమాండ్స్-వయసుల్లో తేడా అప్పుడు బలం పుంజుకుంటుంది. పైగా ఇద్దరి మధ్యా సుష్మ సుష్మ కూడా అతని అసంతృప్తికి ఒక అంశం కావచ్చు. ఇదంతా తను ఇమేజినేషన్ అని తనకు తెలుసు. తనూహించినట్లుజరగనూ వచ్చు, జరగకపోనూ  వచ్చు. అతను జీవితాంతం తనను ఆరాధించవచ్చు.    
    అయినా నెగెటివ్ సైడ్ ని తను నిర్లక్ష్యం చేయలేకపోతోంది. అయినా ఇంకొద్ది గంటల్లో పెళ్ళి అవబోతుండగా ఇవన్నీ అనవసరం! ఇంక ఆలోచించలేక అలసటగా కళ్ళుమూసుకుందామె.    
    హోమ్ మినిస్టర్ రఘునాథ్ నెమ్మదిగా తలపక్కకు తిప్పి సంగీత వేపు చూశాడు. అందమయిన నిష్పత్తితో వున్న ఆమె శరీర సౌష్టవం అతనిలోకలవరం కలగజేసింది.    
    ఇంత చక్కని షేప్ లీ డాక్టర్ రాత్రంతా తనపై బెర్త్ మీదే వుందని తనకు తెలీదు.    
    తెలిస్తే...    
    మరోసారి ఆమె వంక చూశాడతను.    
    డిమ్ లైట్ కాంతిలో ఆమె రూపం ఎంతో మనోహరంగా వుంది. హాస్పిటల్ సూపర్నెంట్ అంటే వయసు మళ్ళిన స్త్రీ అనుకున్నాడు తను. బహుశా సూపర్ స్పెషాలిటీస్ చేసి వుంటుందామె.    
    ఒక్కసారిగా అతనిలోని 'అధికారం' నిద్ర మేల్కొంది. హోమ్ మినిస్టర్ హోదాతో తను ఎంతోమంది తనకు నచ్చిన స్త్రీలను తనకులొంగేట్లు చేశాడు. తమ్ముడికి ఇన్ స్పెక్టర్ సెలక్షన్ చేయించడానికి ఒకామె లొంగుతే, ఢిల్లీలో ఇన్ ఫ్లుయెన్స్ చేసి ఐ.పి.యస్. సెలక్షన్ కోసం ఇంకొకామె, విరోధులమీద దొంగ కేస్ లు పెట్టించడానికి ఒకామె, తనకూ, తనతో వివిధ రకాలయిన పనులున్నవారికీ మధ్య బ్రోకర్ గా పనిచేసి డబ్బుతో పాటు శరీరాన్ని కూడా అప్పజెప్పేలేడీ ఎమ్మెల్యే ఒకామె - ఇలా ఎంతోమంది - ఇప్పుడీ లేడీ డాక్టర్ ని కూడా తన వలలోకి లాక్కోవటం పెద్ద కష్టమేమీ కాదు. మినిస్టర్లతో పనులు లేని గవర్నమెంట్ అధికారులెవరూ వుండరు. ఆ సాకు చాలు తనకు.    
    "మీరెక్కడ వర్క్ చేస్తున్నారు మేడమ్?" అడిగాడు రఘునాథ్.
    సంగీత అతను తనను పలుకరించేసరికి ఆశ్చర్యపోయింది. అతను హోమ్ మినిస్టరన్న విషయం రాత్రేతనకు తెలిసింది.    
    "మెడికల్ సూపరింటెండెంట్ గా వర్క్ చేస్తున్నానండీ!"    
    "ఓ! అలాగా! మా గవర్నమెంట్ సర్వీసేనన్నమాట! ఏ హాస్పిటల్?"    
    "విజయవాడ"    
    "ఓ! అలాగా! చూశారా! అదృష్టం అంటే ఇలా కలిసి రావాలి! విజయవాడలో దిగగానే నేనే మీ హాస్పిటల్ కి రావాలనుకుంటున్నాను."  
    "అలాగా, ఎందుకండీ?"    
    "రాత్రి ఛాతీలోకొంచెం నొప్పి వచ్చింది. హార్ట్ ఎటాక్ కాదనుకోండి! ఎందుకంటే నొప్పికుడివేపు వచ్చింది. అయినా డౌటెందుకుని ఓసారి ఇ.సి.జి. తీయించుకుంటే..."
    "షూర్! తప్పకుండా రండి!"    
    "అన్నట్లు ఇప్పుడు మీ డైరెక్టర్ ఎవరు?"    
    "కనకరాజులుగారండీ!"   
    "ఓ! అతనా? నేనే డి.ఎమ్.ఎస్ పోస్ట్ ఇప్పించానతనికి. చాలా మంచి డాక్టర్! మన గవర్నమెంట్ ఎలా తయారయిపోయిందంటే మాలాంటి వాళ్ళెవరయినా తల్చుకుంటే తప్ప అలాంటి పనులు అస్సలు కావు! మీక్కూడా ఏమైనా ప్రాబ్లెమ్స్ వుంటే సంకోచించకుండా నాతోచెప్పండి- ప్రమోషన్స్, ట్రాన్స్ ఫర్స్ - ఏమయినాసరే! ఈ హోదా, ఈ పదవులూ ఇవన్నీ ఎంతకాలంనిలుస్తాయ్? ఇవి వున్నప్పుడు నలుగురికీ చేసిన సహాయాలే చివరికంటా నిలబడతాయ్. ఏమంటారు?"  
    "అవునండీ!"    
    "విజయవాడలో ఎక్కడుంటున్నారు మీరు?"  
    "గవర్నర్ పేట దగ్గర ఫ్లాట్స్ లో"    
    "ఓ! అలాగా అయితే మీ ఇంటికి కూడా రాక తప్పదు నేను!" ఆ ఫ్లాట్స్ లోనే మాకజిన్ కూడా ఒకతను ఉన్నాడు!"   
    "తప్పకుండా రండి! యూఆర్ వెల్ కమ్!"  
    "ఈ పాపెవరు? మీ అమ్మాయా?"    
    "అవునండీ!"    
    "ఈ పాప తండ్రేం చేస్తూంటారు?" సంగీత చటుక్కున విజయ్ కుమార్ వేపు చూసింది. విజయ్ కుమార్ తనకు సంబంధం లేనట్లు చూపులు మరల్చుకున్నాడు.    
    లోలోపల అతనికి రఘునాథ్ మీద మండిపోతోంది. రఘునాథ్ ఎంతటి స్త్రీలోలుడో అతనికి తెలుసు. ప్రతిరోజూ అతనింటికి ఒక స్త్రీ వచ్చి రాత్రంతా గడిపి వెళ్ళాల్సిందే! కొంతమంది కరప్టెడ్ పోలీస్ అధికారులే అతనికి ఆ ఏర్పాట్లన్నీ చేస్తూంటారు. సంగీత తో సంభాషణ ప్రారంభించటంతో రఘునాథ్ ఉద్దేశ్యమేమిటో తనకి స్పష్టంగా తెలుసు. ఆమె మీద అతని కన్నుపడింది.    
    ఎలాగోలా ఆమెను మోసగించి వశం చేసుకోడానికే ఈ ఎత్తులన్నీ వేస్తున్నాడు. అతనికి ఈ విషయమై సంగీతను హెచ్చరించాలని వుంది.        
    కానీ ఎలా సాధ్యం?    
    "ఆయన కూడా గవర్నమెంట్ సర్వీసులోనే వున్నారు. కానీ ప్రస్తుతం అయాం ఎలోన్-"    
    "ఓ! అలాగా! డైవర్స్ తీసుకున్నారనుకుంటాను-"    
    "యస్"    
    "నిజం చెపుతున్నానండీ! మీ ఎదురుగ్గా మాట్లాడటంకాదు. రాన్రాను మగాళ్ళకు స్త్రీలను తోటిమనుషులుగా చూసే మనస్తత్వమేలేకుండా పోతోంది. ఆడదంటే మగాడి ఉద్దేశ్యంలో ఒక బానిస. అంతే! ఉద్యోగం చేసే స్త్రీ అయినా సరే ఇంటికొచ్చే సరికి ఇంటిదగ్గర పనంతా ఆమే చేయాలి. పిల్లల్ని ఆమే చూసుకోవాలి. ఇంకో మగాడితో మాట్లాడకూడదు. ఛఛ! నిజంగా చాలా దారుణంగా తయారయింది మా జాతి!"    
    సంగీత మళ్ళీ విజవై కుమార్ నే చూసింది. విజయ్ కుమార్ అతికష్టం మీద కోపం అణచుకుంటున్నాడు. రఘునాథ్ కావాలని తనను ఇన్సల్ట్ చేస్తున్నట్లుంది.    
    "మీరు నమ్ముతారో నమ్మరో - నా విషయంలోనూ మీకువచ్చిన ప్రాబ్లమే వచ్చింది. నేనంతప్రేమగా చూసినా నా మిసెస్ కి నా మీద ఎప్పుడూ అనుమానమే! ఆ అనుమానంతోటే పుట్టింటికెళ్ళి పోయింది. అఫ్ కోర్స్! నేనెప్పుడూ రమ్మని కోరలేదు మళ్ళీ ఎందుకంటే నిజంవాళ్ళంతటవాళ్ళే తెలుసుకోవాలి! ఏమంటారు? నాకొక్కోసారి అనిపిస్తూంటుంది- ఇంక ఆమెను మర్చిపోయి, బాగా ఎడ్యుకేషన్, మంచిఫామిలీ బాక్ గ్రౌండ్ వున్న విడోనెవర్నయినా చేసుకుని జీవితం సుఖమయంచేసుకుందామా అని".    
    విజయ్ కుమార్ అదిరిపడ్డాడు. సంగీత వాడి ట్రాప్ లో పడిపోదుకదా! ఎలా సంగీతను హెచ్చరించడం? హెచ్చరించగలిగినా ఆమె తన మాటలు ఖాతరు చేస్తుందా? అతనికి తనమీద తనకే చిరాకుగా వుంది.    
    సుష్మను చూస్తుంటే పితృ ప్రేమ పొంగి పొరలుతోందతనికి.

 Previous Page Next Page