Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 19


                                                               9


    "టక్కుం.... టక్కుం.... టక్కుం.... టక్కుం...." ఉన్నట్టుండి కొద్ది దూరంలో వినిపించిన శబ్ధానికి తలతిప్పి చూసిందా అమ్మాయి.
    అక్కడికి ఓ వందగజాల దూరంలో ఏదో తమాషా జరుగుతోంది. అప్పటికి పదినిమిషాలనుండి ఆటో కోసం ప్రయత్నిస్తోందామె. అది విజయవాడలోని లయోలా కాలేజీ ప్రాంతం. తను విజయవాడ వచ్చింది 'మనోరమ' హోటల్ లో ప్రెస్ రిపోర్టర్స్ కాన్ఫరెన్స్ కే అయినా నగరంలోని ఎవరో రాజకీయ నాయకుడిపై హత్యాప్రయత్నం జరిగిన సందర్భంగా రేగిన అలజడిలో తమ పత్రికకి ఏదైనా వేడి వార్త సంపాదిద్దామనే ప్రయత్నంతో అక్కడికి వచ్చిందామె.
    "టక్కుం.... టక్కుం.... టక్కుం.... టక్కుం...." మళ్ళీ వినిపించిందా శబ్దం. అప్రయత్నంగా అటుకేసి నడిచిందామె.
    అప్పటికే జనం బాగా గుమిగూడి వున్నారక్కడ. తమాషాలో లీనమైనవారు కొందరయితే, వారి జేబుల్లోని పర్సులపైన దృష్టి కేంద్రీకరించినవారు కొందరు. తనంతదూరం వచ్చినందుకు కనీసం అక్కడైనా ఏదయినా వార్త దొరుకుతుందేమోనని గుంపులో దూరిందామె.
    "దేఖో భాయ్ దేఖో....సూడండమ్మా సూడండి.... కానీ ఇని ఎరగని ఇంత సూడండి. భగవంతుడి లీలలో మడిసిసేసే ఇసిత్రం సూడండి"
    అక్కడ మధ్యలో బుర్రమీసాలతో నిలబడ్డ వ్యక్తి అరుస్తున్నాడు.
    ఓ మూలగా యుక్తవయస్కులైన ఓ యువతి, ఓ యువకుడు కూర్చొని వున్నారు. మరో మూల పదేళ్ళపాప సంచిలోంచి సామాన్లు తీసి బయటపెడుతోంది. ఇంకో ప్రక్క పన్నెండేళ్ళ కుర్రవాడు డప్పు పుచ్చుకుని కూర్చుని వున్నాడు.
    బుర్రమీసాల వ్యక్తి ఢమరుకాన్ని ప్రక్కనుంచి ఖాళీస్థలం మధ్యలో చాప పరిచాడు. తరువాత పన్నెండేళ్ళ కుర్రాణ్ని దగ్గరకు పిల్చి అతని కళ్ళకు గంతలుకట్టి చాపమీద పడుకోబెట్టాడు. తరువాత అతని శరీరం మొత్తం కప్పేశాడు.
    "సూడండి బాబూ సూడండి....సీకట్లో సూడగలిగే మా సీనయ్య కంటి ఎలుగు సూడండి"
    అతను గబగబా గుంపులోని ఓ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు.
    "రేయ్ సీనయ్యా. మనస్తో సూసి సెప్పరా ఈ అయ్య సొక్కా రంగేటి?"
    అతనికీ ఆ కుర్రాడికీ చాలా దూరం వుంది.
    గుంపులోని ఇంకెవ్వరూ కూడా ఆ కుర్రాడి దగ్గరలో లేరు. ఆ కుర్రాడు ఒకవేళ కళ్ళు తెరచుకునే వున్నా, ఆ బుర్రమీసాల వ్యక్తి వున్నవేపు కనిపించే అవకాశం ఎంతమాత్రమూ లేదు. అందరిలోనూ ఆసక్తి పుంజుకుంది. ఆ అమ్మాయిలో కూడా.
    విచిత్రం....
    "ఎరుపు...."
    ఠకీమని జవాబిచ్చాడు కుర్రాడు.
    "ఈ అయ్యగారి జేబులో ఏముందిరా?"
    "పెన్ను"
    "ఈ అమ్మగారి సీర రంగేంట్రా?"
    ఈసారి అందరూ వూపిరి బిగపట్టారు. ఆ అమ్మాయి కూడా కుతూహలంగా చూస్తోంది.
    బుర్రమీసాలతను ఆ అమ్మాయి పక్కనేవున్న వ్యక్తికేసి చూపిస్తూ అడిగాడు ప్రశ్న.
    అతను పురుషుడు.
    .........
    "సెప్పవేం? ఈ అమ్మాయిగారి సీర రంగేటి?"
    "........."
    "........."
    "మాట్లాడవేంరా? నా పరువు తీస్తావా ఏటి?"
    "నువ్వు సూపిస్తున్నది అమ్మగారైతేగా సెప్పడానికి? అది అయ్యగారు. సొక్కా రంగు నీలం"
    చప్పట్లు మారుమ్రోగాయి.
    తరువాత అతను సైకిల్ చక్రంలో దాదాపు సగం వ్యాసం కలిగిన ఇనుప చట్రాన్ని అందరికీ చూపించాడు దగ్గరికి తీసుకెళ్ళి. కొందరు తాకి కూడా చూశారు. చాలా గట్టిది ఆ ఇనుపచట్రం. ఒక మనిషి అందులోనుండి దూరి వెళ్ళడం దాదాపు అసంభవం. అతను తన తలమీదుగా చట్రాన్ని వేసుకున్నాడు. అతని భుజందాటి క్రిందికి దిగలేదా చట్రం.
    తిరిగి దాన్ని తీసి తనతోపాటున్న ఆ యువజంటకి అందించాడు. అప్పుడక్కడ జరిగిన విచిత్రాన్ని అక్కడున్నవాళ్ళంతా స్థాణువులై చూస్తూండిపోయారు.
    ఆ యిద్దరూ కలిసి ఒకేసారి తమ తలలగుండా ఆ చట్రాన్ని పంపి సరిగ్గా మూడు నిమిషాల వ్యవధిలో తమ యిద్దరి శరీరాల్ని ఒకేసారి మైనపు ముద్దల్లా వంచుతూ ఆ చట్రంగుండా దాటించారు.
    మళ్ళీ చప్పట్లు మారుమ్రోగాయి.
    ఆ తరువాత కుర్రాడు డప్పువాయించసాగాడు. రెంటికీ మధ్య సుమారు యాబై అడుగుల దూరం ఉండేటట్లుగా పైన సన్నటి ప్లాస్టిక్ వైరు కట్టబడిన రెండు కర్రలను పాతాడు బుర్రమీసాలవాడు.
    ఆ తరువాత చేతికి చిన్నగొడుగునిచ్చి ఆ పదేళ్ళపాపని ఆ తాటిమీద కెక్కించాడు.కుర్రవాడి డప్పు శబ్దాని కనుగుణంగా గొడుగుని బాలన్స్ చేసుకుంటూ నెమ్మదిగా తాటిమీద నడవసాగిందా పాప. నేలనుండి తాడు దాదాపు యాభై అడుగుల ఎత్తున వుంది. పడితే బలమైన గాయాలు తగలడం ఖాయం.
    చూస్తున్న ఆ అమ్మాయి ఒళ్ళు గగుర్పొడిచింది. రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
    యువజంట అందరి దగ్గరికి చిన్న డబ్బా పుచ్చుకుని వెళ్ళసాగారు. ఎవరికి తోచినంత వారు వేస్తున్నారు.
    ఆ అమ్మాయి హాండ్ బాగ్ లో చెయ్యిపెట్టి ఉలిక్కిపడింది....
    పర్సు మాయం. తను హైదరాబాదునుండి తెచ్చుకున్న డబ్బంతా ఆ పర్సులోనే వుంది. కొంత డబ్బుని సూట్ కేస్ లో వుంచుకోకుండా తానేదో పెద్ద హీరోయిన్ లా వచ్చేసినందుకు తనను తను తిట్టుకోవటం మాట ప్రక్కనుంచి ఒక్కసారిగా ఉక్రోషం తన కటు యిటు నిలబడ్డ వాళ్ళమీద కోపం ముంచుకు వచ్చిందామెకు.
    ఇందాకట్నుంచి తన ప్రక్కనే తనని తాకుతూ నిలబడ్డ నీలం వ్యక్తిని ఓసారి తీక్షణంగా చూసి అతని చొక్కా పట్టుకుందామె.
    "ఏయ్ మిస్టర్. ఏది నా పర్సు? మర్యాదగా ఇచ్చెయ్యి" ఒక్క క్షణం బిత్తరపోయి ఆమెకేసి చూశాడా వ్యక్తి.

 Previous Page Next Page