నింగీ నేల ఏకమైపోయేలా ఏకధాటిగా ఆరుగంటలసేపు వర్షం పడింది. తుఫాను గాలులు వీచాయి.
ఆ తర్వాత క్రమంగా తగ్గిపోయింది. మెల్లిగా తూర్పు ఎర్రబడింది.
స్వప్న తిరిగి కళ్ళు తెరిచేసరికి ప్రశాంతంగా ఉంది వాతావరణం.
సందీప్ వంగి, తన మొహంలోకి ఆదుర్దాగా చూస్తున్నాడు. వాన నీరు ప్రతి రెండు చెట్ల మధ్య నుంచీ ఒక కాలవలా ప్రవహిస్తూ స్వప్నని తడిపేస్తోంది. ఆమె పొడుగుపాటి జడ విడిపోయి అలలు అలలుగా పరుచుకుని ఉంది జుట్టు. ఆ అలల్లో ఈదుతున్న చేపలలా అటూ ఇటూ కదిలాయి ఆమె విశాల నయనాలు. తదేకంగా చూశాడు సందీప్. చెయ్యి అందుకుని, లేవబోయాడు.
మాట్లాడకుండా అతన్ని చెయ్యి విదిలించుకుని, పిడుగుపడి కాలిపోయిన చెట్లవైపు చూసింది స్వప్న. అయిదారు పిడుగులు పడినట్లు ఉన్నాయి. పిడుగుపాటుకి గురి అయినవి అన్నీ పొడుగాటి చెట్లే!
స్వప్నకి గుండె లయతప్పినట్లయింది. పెదిమలు తడి చేసుకుంటూ, "ఆకాశంలోనుంచీ పడ్డ పిడుగు వెదికి, వెదికి చెట్లమీదే ఎందుకు పడుతుంది?" అంది, తనలో తానే మాట్లాడుకుంటున్నట్లు.
నవ్వాడు సందీప్. "చాలా మంది భ్రమపడే విధంగా పిడుగు ఆకాశంలోనుంచి భూమిమీద నుంచి చెట్లలాంటి వాటిద్వారా ఎగబాకి ఆకాశంలోని మేఘాలని అందుకుంటుంది."
"నన్ను ఫూల్ చెయ్యాలని చూడకు." అంది స్వప్న కోపంగా.
"నేను చెప్పేది వినండి ! అసలు మెరుపులూ, పిడుగులూ ఎలా వస్తాయో తెలుసా ? మెరుపులు అంటేనే ఎలక్ట్రిసిటి అన్నమాట. వర్షించడానికి రెడీగా వున్న మేఘానికి కిందవైపున నెగటివ్ కరెంట్ ఉంటుంది. భూమిలో పాజిటివ్ కరెంటు వుంటుంది. అయస్కాంతంలో వ్యతిరేక ధృవాలు ఒకదానిచేత ఒకటి ఆకర్షింపబడినట్లే మేఘాల క్రింది భాగానవున్న నెగటివ్ కరెంటుని, భూమిమీద వున్న పాజిటివ్ కరెంటు అందుకోవడానికి ఆరాటపడుతూ, చెట్ల ద్వారా, కొండల ద్వారా, గోపురాల ద్వారా, నిలబడి వున్న మనుషుల ద్వారా ఎగబాకడానికి అర్రులుజాస్తూ వుంటుంది. అది అందుకోగలిగితే, బ్రహ్మాండమైన వెలుగు వస్తుంది. దాన్నే మెరుపు అంటాం. ఇదేగనుక మరీ పెద్దది అయితే, దాన్ని పిడుగు అంటాం. ఒక్క పిడుగు శక్తి లక్ష మిలియన్ల వాట్ల దగ్గర నుంచి, మిలియన్ మిలియన్ వాట్ల దాకా కూడా వుంటుంది. వేడిమి దాదాపు ఇరవై ఎనిమిదివేల డిగ్రీల సెంటిగ్రేడు వరకూ వుంటుంది.
అందుకని మిస్ ! పిడుగులు పడుతున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, పొడుగాటి చెట్లకింద నిలుచోకూడదు. నీళ్ళలో వుండకూడదు. చేతుల్లో లోహపు వస్తువులేవీ ఉంచుకోకూడదు. దగ్గరలో ఎత్తయినవి ఏవీ లేకపోతే, అందరిలోకీ పొడుగ్గావున్న మనిషిని తాకుతుంది పిడుగు. అందుకని, నిలబడకుండా ఆరుబయట బోర్లా పడుకుని ఉండిపోవడం ఉత్తమం" అన్నాడు సందీప్, మళ్ళీ స్వప్న చెయ్యి అందుకుని లేవదీస్తూ.
అతన్ని చిత్రంగా చూసింది స్వప్న. "పిడుగుల గురించి ఇంత వివరంగా ఎలా తెలుసు నీకు ?"
"తనే చిచ్చరపిడుగులాంటి వాడు ! అందుకని" అన్నాడు భూతాలరాజు మంటగా.
అందరి బట్టలూ బురద కొట్టుకుపోయి ఉన్నాయి. దగ్గరగావున్న వాగులో శుభ్రంగా బట్టలు పిండుకుని, స్నానాలు చేశారు. అప్పటికి బాగా తెల్లారిపోయింది.
"జీబులో ఇన్ స్టంట్ కాఫీ, మిల్కు పౌదరూ ఉన్నాయిగానీ, నిప్పు చెయ్యడానికి ఎండు పుల్లలే లేవు" అన్నాడు సందీప్ నొచ్చుకుంటూ.
"ఖర్మ ! చుట్టూ అడవి పెట్టుకొని, నాలుగు ఎండు పుల్లలకి మొహం వాచిపోతున్నాం. కొంతమంది వచ్చి చేరిన వేళా విశేషం అలా వుంటుంది" అన్నాడు ఓరగా స్వప్నని చూస్తూ భూతాలరాజు.
"ఏయ్!" అంది స్వప్న విసురుగా.
భూతాలరాజు అది గమనించనట్లుగా పొగాకు కాడని వదిలి, చుట్ట తయారు చెయ్యడంలో మునిగిపోయాడు.