Previous Page Next Page 
మంచివాడు పేజి 19

పొద్దుటినుంచి రాత్రిదాకా చేసినా ఈ పని తెమిలేది కాదు. ఎకౌంట్సు అంటే తనకు మహా చిరాకు. ఫిలాసఫీ చదివిన తనకు అంకెలంటే మరి చిరాకు కదూ?
"ఇవ్వాళైనా పెందలాడే వస్తారా?" రోజూ నా పెళ్ళాం ఇదే ప్రశ్న వేస్తుంది.
సీటులో కూర్చున్నాడేగాని షణ్ముఖం మనస్సులో ఏదో వేదాంతం జీవితపు విలువల తాలూకు ఆలోచనలు ముసురుకుంటున్నాయి. క్యాష్ రిజిష్టరూ కంటింజెంటు షర్టూ, బిల్లులూ ఓచర్సూ అతని ముఖంలోకి చూస్తున్నాయి.
ఆలోచన - పని - ఒకటి ఉంటే మరొకటి సాగదు. ఆలోచనల్ని బలవంతంగా వెనక్కు నెట్టి పనిలో తలదూర్చాడు. ఎంతసేపు చేశాడో అతనికే తెలియదు.
"అయ్యగారు పిలుస్తున్నారు సార్!"
షణ్ముఖం తలెత్తి చూశాడు. వాల్ క్లాక్ నాలుగుంపావు చూపిస్తోంది. ఇంకా పని పూర్తికాలేదు. మెల్లిగా లేచి ఆఫీసరు గదిలోకి వెళ్ళాడు.
"పూర్తయిందా?"
"ఆఁ అయిపోతూంది సార్."
"ఛ! ఏం మనిషివయ్యా! మనిషి జన్మ ఎత్తావ్ ఎందుకు. ఎన్నిసార్లు చెప్పించుకుంటావు!"
షణ్ముఖం గుండెలోకి బాకులు గుచ్చినట్టు అన్పించింది.
తను మనిషి జన్మ ఎందుకు ఎత్తాడా?
"రాత్రి ఎంత పొద్దుపోయినా పని పూర్తిచేసి రిజిష్టర్సు ఇంటికి తెచ్చి సంతకాలు తీసుకో!"
షణ్ముఖం ఏదో చెప్పాలనుకున్నాడు.
"పో! ఇంకా నిలబడ్డావేం? చీదరించుకొన్నాడు ఆఫీసరు.
"ఇవ్వాళ ఇంటి దగ్గిర అవసరమైన పని వుంది సార్! పిల్లలకు వంట్లో బాగా లేదు సార్" నీళ్ళు నములుతూ అన్నాడు.
"షటప్ ముందు వెళ్ళి పని పూర్తిచెయ్. ఈ సాకులన్నీ నా దగ్గిర సాగవ్. వెళ్ళు."
షణ్ముఖం కాళ్ళీడ్చుకుంటూ బయటకి వచ్చాడు. కారు స్టార్టు అయిన శబ్దం వినిపించింది. ఆఫీసరు వెళ్ళిపోయాడు.
షణ్ముఖం చకచకా రాస్తున్నాడు.
ప్యూన్ వచ్చి లైటు వేశాడు.
"అందరూ వెళ్ళిపోయారా!" షణ్ముఖం అడిగాడు.
"ఆఁ ! ఎస్టాబ్లిష్ మెంట్ సూపర్నెంటుగారు మాత్రం వున్నారు" అని చెప్పి ప్యూన్ వెళ్ళిపోయాడు.
షణ్ముఖం మళ్ళీ ఆలోచనల్లో మునిగిపోయాడు.
వాడు ... వట్టి బి.ఏ. గాడు, తనను ఏమన్నాడూ! తను మనిషి జన్మ ఎందుకు ఎత్తావన్నాడా? అవును తను మనిషి జన్మ ఎందుకు ఎత్తినట్టు? గాడిదలా చాకిరీ చేయడానికేగా!
మళ్ళీ ఈ రోజూ తొమ్మిదవుతుంది. పెళ్లాం నిష్ఠూరం, తల్లి సణుగుడు! పిల్లవాడి గోల! పాపకు ఎలా వుందో? పాపం అది మాత్రం ఏం చేస్తుంది?
ఇంటికి వెళ్ళిపోతే! ఎలా! వచ్చేప్పుడు ఏమేమో తీసుకురమ్మని చెప్పారుగా! వట్టి చేతులతో వెళితే ఇంటి దగ్గిర ఎదురయ్యే దృశ్యం కళ్ళకు కన్పించింది.
ఏమైనా ఈ నరకం నుంచి బయటపడాలి. గబగబా రిజిష్టరు మూసేశాడు.
కాని ... మళ్ళీ తను వెళ్ళేది మరో నరకంలోకేగా. నరకం నుంచి నరకానికి తన ప్రయాణం. ఈ ప్రయాణానికి అంతెప్పుడో!
ఆఫీసు ఒక యంత్రం. అందులో తను ఒక చక్రం. చక్రం గిరగిరా తిరుగుతూ వుంది. దానికి విరామం లేదు. విశ్రాంతి లేదు. మనసు లేదు. మమకారం లేదు. అభిమానం లేదు.
తెల్లారితే ఒకటో తారీఖు . అది ఎన్.జీ.ఓ. లకు పర్వదినం. కాని ఈ రోజు ఒకటో తారీఖు తన చేతి నిండుగా పదిహేనువేలు జీతాలు వుంచుతాడు. అన్ని కట్సు పోగా రెండొందల ఇరవై రూపాయలతో తను ఇంటికి వెళ్తాడు.
"అయ్యగారూ! ఎనిమిదయి పోయిందండీ! అందరూ వెళ్ళిపోయారు." ప్యూన్ అన్నాడు.
"ఎనిమిదయిందా?"

 Previous Page Next Page