Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 19


    "గెలిచావు!"


    "నో... నేను ఓడిపోయాను"


    "ఇది ఓటమి కాదు" ఆత్మీయంగా శశాంకని దగ్గరకు తీసుకున్నాడు. "నువ్వు నాకు చెల్లించిన గురుదక్షిణ"


    "ఇది గురుదక్షిణ కాదు. చేయని నేరానికి మనం కలిసి చెల్లించిన మూల్యం"


    "అప్పుడు నువ్వొక్కడివే నష్టపోయినట్టు ఎందుకు కుమిలిపోతావు"


    "మామయ్యగారు..." ఆవేశంతో ప్రకంపించిపోతున్నాడు. "మీరు నష్టపోయింది ఒక్క కృపనే కావచ్చు. నేను జీవితాన్ని నష్టపోయాను. అవును... అడుగడుగునా నాకు బాసటగా నిలిచింది. నా బ్రతుక్కి ఓ అర్ధంగా మారింది కృప... నన్ను చెప్పనివ్వండి. మీకు భరించే శక్తి వుండొచ్చు. బాధల్ని దిగమింగుకుని నిబ్బరంగా బ్రతగ్గలిగే చిత్త సైర్ధ్యం వుండొచ్చు... కాని నేను సామాన్యుడ్ని. ఒకనాడు నాన్న ప్రేమగా అక్కున చేర్చుకోకపోతేనే అలిగి అమ్మ దగ్గర మారాం చేసిన మామూలు మనిషిని. ఒక్క క్షణంపాటు కృప కనిపించకపోతే మనసును సమాధాన పర్చుకోలేని స్థితిలో పెరిగిన అర్భకుడ్ని. అందుకే ఒక్క క్షణం. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. కనీసం నేను నా కృపని దూరం చేసుకోడానికి కారకులైన వాళ్ళని కడతేర్చే ప్రయత్నానికి అడ్డురాకండి"


    ఏ ఆలోచన శశాంకలో రాకూడదని నిన్న రాత్రి నుంచి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడో అది గరళంలా అతడ్ని పూర్తిగా ఆక్రమించిన వాస్తవం అర్ధమైపోయింది.


    "నిన్ను అలా పెరగనివ్వడమే నా ఉద్దేశ్యం అయితే ఇన్నాళ్ళ నా కృషికి అర్ధమేమిటి?" అస్థిమితంగా కదిలిపోతూ అన్నారాయన "అది నీ మార్గం కాకూడదనే శశాంక నీ ఆలోచనల్ని నా దిక్కుకి మళ్ళించింది. నీలోని ఆ వ్యక్తిని బ్రతకనివ్వకూడదనే నిన్ను శక్తిగా మార్చింది. నేను కోరింది ఆ శక్తితోనే నువ్వో చరిత్రని సృష్టించుకోవాలని"   


    "అసాధ్యం"


    "అంటే" ఓ క్షణం సాలోచనగా ఆగేరు. "అంతే ఆవేశంలో నీకు తోచిన దిక్కునే ప్రయాణిస్తానంటావు... వెల్...కేరియన్... కాని ఒక్క విషయం గుర్తుంచుకో... నువ్వు ఆవేశంగా దూసుకుపోయే క్షణమే నాకు చివరిక్షణమవుతుంది"


    ఉలికిపాటుగా చూశాడు శశాంక...


    సుమారు దశాబ్దంన్నర క్రిందట తనకు అండగా వుంటానని వచ్చిన ఓ వటవృక్షం నీడన ఎంత ఒద్దికగా సేద దీర్చుకున్నాడో వినమ్రతతో తల వాల్చేసాడు.


    "కమాన్" ఓ పసికందులా లాలిస్తూ అక్కున చేర్చుకున్న శశాంకని చూస్తూ...


    ఆ రోజే కృపకి అంత్యక్రియలు జరిగిపోయాయి.


    ఒకనాటి అగ్ని సరస్సును చల్లార్చిన వెన్నెల జలపాతం శశాంక జీవితంపై ప్రభావం చూపిన కృప అధ్యాయానికి తెరపడిన చివరి క్షణమిదే...


                                   *    *    *


    అర్ధరాత్రి దాటిన సూచనగా దూరంగా క్లాక్ టవర్ పన్నెండు గంటల పదిహేను నిముషాల్ని చూపెడుతోంది.


    రోడ్డుపై ఒకటి అరా కార్ల చప్పుడు తప్ప అంతటా నిర్మానుష్యంగా వుంది.


    నిర్మాణం పూర్తికాని ఆరంతస్తుల బిల్డింగ్ టెర్రాస్ పై కూర్చున్న రాజన్ ఒడిలోని సబ్ మెషిన్ గన్ పై విసుగ్గా చేతినుంచి "ఈ రాత్రంతా పడిగాపులు తప్పేట్టు లేదు" అన్నాడు సురేంద్రతో.


    అప్పటికే సగం పీటర్ స్కాట్ పూర్తిచేసిన సురేంద్ర జవాబు చెప్పకుండా షాట్ గన్ని ఓమారు ఉక్రోషంగా తడిమేడు నిద్ర ముంచుకొస్తుంటే...


    ఎదురుగా వున్న హోటల్ పార్కింగ్ ప్లేస్ లో అయిదారు మించి కార్లు లేవు.


    హోటలు గదుల్లోని లైట్లన్నీ ఆర్పబడి వున్నాయి.


    బాంబే, ఢిల్లీ, అహ్మదాబాద్ లాంటి నగరాలకు మాత్రమే పరిమితమైన అండర్ వరల్డ్ యాక్టివిటీస్ ప్రస్తుతం హైదరాబాద్ కి విస్తృతంగా వ్యాపించటంతో ఆ రాకెట్స్ కి అధిపతులైన గాడ్ ఫాదర్స్ నిన్ను మొన్నటిలా కత్తులు, నాటు తుపాకులూ, పిస్తోళ్ళకు బడులు మోడరన్ ఆయుధాల్ని వుపయోగిస్తున్నారు.


    చేసే నేరాల్ని బట్టి హెంచ్ మెన్ (అనుచరులు)ని వుపయోగించే అండర్ వరల్డ్ కింగ్స్ అవసరానికుపయోగపడే ఆయుధాలనే సరఫరా చేస్తుంటారు.


    అనుక్షణం అతి జాగురూకతతో తమ పరిధుల్ని కాపాడుతుంటే తప్ప లక్షల్లో నష్టపోవాల్సి రావచ్చు.


    ముగ్గురు బలమైన గాడ్ ఫాదర్స్ ప్రాబల్యంతో నడుస్తున్న భాగ్యనగరంలో ఒక ప్రత్యేకమైన ముఠాకి చెందిన రాజన్ సురేంద్రలు ఆధునికమైన ఆయుధాలను వుపయోగించడంలో నిష్ణాతులు కాబట్టే బాంబే దావూద్ వర్గం నుంచి రప్పించబడ్డారు.


    "డేమిట్" రాజన్ విసుక్కున్నాడు అప్పటికే ఒంటిగంట కావడంతో.


    సరిగ్గా అదే సమయంలో....


    హైదరాబాద్__ బాంబే హైవేలో ఓ అంబాసిడర్ వేగంగా సిటీవైపు దూసుకువస్తోంది.


    సిటీ పొలిమేర్లలో కారు ప్రవేశిస్తుంటే డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వెన్నులో సన్నగా చలి మొదలైంది. సమీపంలో లోడ్ చేయబడిన స్టెన్ గన్ తో కూర్చున్న రావూఫ్ చాలా ఏకాగ్రతగా పరిసరాలు గమనిస్తున్నాడు.

 Previous Page Next Page