నలుగురు బయటకొచ్చి నడచి అంతా చూశారు. అక్కడెవరు కనబడలేదు. రూము దగ్గరకెళ్ళి చూసారు. అన్ని రూమ్స్ తలుపులు వేసే వున్నాయ్. ఎందుకయినా మంచిదని హోటల్ మేనేజర్ దగ్గరకెళ్ళి చెప్పారు.
"మా హోటల్లో ఇంతవరకు అగ్గిపుల్ల కూడా పోలేదు. మీరేదో పొరబడి వుంటారు. ఎవరిని చూసుండరు. అదంతా భ్రమ. మీ మానప్రాణాలకి నేను రక్ష" వీళ్ళ నలుగురి మాన ప్రాణాలు ఆయనగారి చేతిలో ఉన్నట్టు ఫోజు పెట్టి మరీ చెప్పాడు.
చేసేదేంలేక నలుగురూ కాళ్ళీడ్చుకుంటూ మళ్ళీ తమ రూమ్ లోకి వచ్చారు. ఈ తఫా కిటికీవైపు చూస్తూ ప్రసంగం మొదలుపెట్టారు.
9
"నాకు చాలా కోపంగా ఉంది" వందనాదేవి అంది.
"ఎందుకు కోపం? ఎవరి మీద కోపం?" ప్రమద అడిగింది.
"మనం వెళ్ళి హోటలు యజమానికి చెప్పాంకదా! మన రూమ్ దగ్గరకొచ్చి చూడకపోగా వెధవ! వెకిలి నవ్వొకటి నవ్వుతూ మన మన ప్రాణాలు వాడి చేతిలో ఉన్నట్టు మాటలు చెప్పాడు" చాలా కోపంగా అంది వందన.
"ఈ హోటల్ రూమ్ ఖాళీచేసి ఇంకో హోటల్లో బస చేద్దామా!" రాణి అడిగింది.
"అవసరంలేదు. నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి" అంది వందన.
"ఇంతకీ మన సుందర సుకుమారి నిజంగా చూసిందో లేక భ్రమపడిందో! బాగా గుర్తు తెచ్చుకుని చెప్పవే సుందరి."
"భ్రమకాదే! నిజంగా చూశాను. నేను చూడబట్టే కదా వాడు టక్కున మొహం చాటేశాడు. కావాలంటే ప్రామిస్. నేను చూశాను గట్టిగా చెప్పగలను."
"సుందరి చూసిందని నేను నమ్ముతున్నాను. నా అనుమానం ఏమిటంటే కిటికీలోంచి చాటుగా మన రూమ్ లోకి తొంగి చూసిన వ్యక్తి వేరే రూమ్ లో ఉన్న అల్లరి మొగవాడా! లేక నిజంగా ఏ దొంగవెధవన్నానా! ఈ రెండూ కాని వేరే మోసగాడా! అని...!"
"నీవలా అంటుంటే నాకో అనుమానం వస్తున్నదే వందనా" రాణి అంది.
"అదేమిటో కక్కు. అనుమానం ఎప్పుడు దాచుకోకూడదు.
"మనం ఎక్కిన రైలులోనే ఎక్కి మూడు స్టేషన్ల అవతల మనకి తెలీకుండా మళ్ళీ అదే రైలు ఎక్కి మనతోపాటు ఈ ఊళ్ళో దిగిన ఆ అందగాడు...మనం జర్నీ మొదలుపెట్టింది మొదలు ఊరి వరకు రైళ్ళు మారుతూ వచ్చిన వికార స్వరూపుడు... ఉన్నారు చూశావ్ కదా! వాళ్ళలో ఎవరైనా కిటికీలోంచి తొంగి చూశారేమో! వాళ్ళిద్దరి మీద నాకు మొదటినించి అనుమానంగా ఉంది.
"రాణి చెప్పినట్టు ఒక విధంగా ఇది ఆలోచించదగ్గ విషయం. కాని వాళ్ళిద్దరూ ఎవరు? వాళ్ళు మన్ని నీడలా వెంటాడి ఇక్కడికి వచ్చే అవసరమేమిటి? వాళ్ళది ఈ వూరు కావొచ్చు...మనతోపాటు రైలుదిగి ఉండవచ్చు. ఎలా అనుమానిస్తాము? ఆధారం ఏది?" వందనాదేవి అంది.
"నిజమే! మరోసారి వాళ్ళిద్దరిలో ఎవరైనా కనబడితే వారిని పూర్తిగా అనుమానించవచ్చు" రాణి అంది.
కనుక అందాక మనం అనుమానించి ప్రయోజనంలేదు. కాని మన జాగ్రత్తలో మనం ఉండటమే" వందన చెప్పింది.
"జాగ్రత్త అంటే?" ప్రమద అడిగింది.
"మనం ఒంటరిగాలేం. ఒకళ్ళకి నలుగురమున్నాం. దిగటంకూడ ఓ మోస్తరు పెద్ద హోటల్లోనే దిగాం. రాత్రిపూట తలుపులు...కిటికీలు జాగ్రత్తగా వేసుకొని పడుకుంటే సరిపోతుంది."
"అంతేనంటావా వందనా!"
"ప్రస్తుతానికి అంతే."
"ఆడవాళ్ళం కాబట్టే ఈ జాగ్రత్తలు...ఈ భయాలు. హాయిగా మగాడిగా పుడితే ఇలాంటి గోలలేవి ఉండేవికాదు" ప్రమద అంది.
"చుప్ రహో! అంటే నోరు మూసుకో తల్లీ! అని అర్థం. నీకు మీ అమ్మా నాన్న ఏరికోరి చాలా చక్కని పేరు పెట్టారు. "ప్రమాదావనం" అని...ఇంకా నయం "వనితావేణి" అని పెట్టలేదు వందన నాలుక బైటపెట్టి వెక్కిరించి మరీ చెప్పింది.
ఉడుక్కుంది ప్రమద. "నన్నేమీ వెక్కిరించనక్కరలేదు. ముందీ ప్రశ్నకు జవాబు చెప్పు! మనం ఆడపిల్లలం అవునా! కాదా!"
"అబ్బ! ఇదో పెద్ద ప్రశ్న! ఆడపిల్లలమే అయితే ఏంటట?"
"కనుకనే ఈ భయాలు. ఇదే నలుగురు మగపిల్లలనుకో. ఇలాంటి భయాలు...గియాలు ఏమీ ఉండవ్ సరికదా...ఇలాంటి టూర్లలో హాయిగా ఎంజాయ్ చేస్తారు."
"మరోసారి చెబుతున్నాను. "నోరు మూసుకో తల్లీ!" అని వందన అంది.
"నోరు మూసుకుంటే ఆడపిల్లని కాకుండా పోతానా!" కయ్ మంది ప్రమద.
"సేఫ్టీ విషయానికొస్తే స్త్రీకి రక్షణ ఉండదు...పురుషుడికి రక్షణ ఉండదు. "ఆడ" అనే మాట నిషేధించేమాట అయినట్టు ఆడపిల్ల...అమ్మో గూచి...అయ్యో ఎట్లా? అన్నదే నాకు నచ్చదు. స్త్రీకి ఎన్నో విషయాల్లో హక్కులు... స్వాతంత్ర్యం ఉన్న ఈరోజుల్లో ఇంకా అమ్మమ్మ నాటి కబుర్లు చెప్పడమే నాకు నచ్చదుగాక నచ్చదు."