నవరాగం
టక్.. టక్.. టకాటక్... టక్ టక్...
టైపు రైటర్ మీద నాట్యం చేస్తున్న ప్రియాంక చేతివేళ్ళు ముచ్చటగా అన్పిస్తున్నాయి ప్రకాశరావుకు.
ప్రియాంక మాత్రం తల తిప్పి ఎటూ చూడటం లేదు. పని మీదే పూర్తి ఏకాగ్రతంతా! ఆ అమ్మాయికి తనలాగా సమస్యలేవీ లేవు అనుకోటానికీ వీల్లేదు. అయినా ఆఫీసు పని విషయంలో మాత్రం శ్రద్ధ చూపించటం చూస్తే ఎవరికయినా ప్రియాంక అంటే పూర్తి గౌరవభావం కలుగుతుంది. ఆ అమ్మాయి కేసి చూస్తుండిపోయాడు ప్రకాశరావు.
చామన ఛాయ, ఒక మాదిరి పొడవు, విశాలమైన అందమైన కళ్ళు, సన్నని పెదవులు. పెద్ద అందగత్తె అనిపించదు. కానీ ఆకర్షణ మాత్రం ఆ నవ్వులోనే ఉంది. స్వచ్చమైన పాలమీది మీగడలా పసిపిల్లలా ముగ్ధంగా నవ్వుతుంది.
ఆ నవ్వుకు మాత్రం ప్రకాశరావు మనసు దూదిపింజలా తేలిపోతుంది. హృదయ భారమంతా కరిగిపోయి శరత్కాలంలో వెన్నెల నిండినట్లవుతుంది. ఒక్కరోజు సెలవు పెట్టాలన్నా ఆమె నవ్వు చూడకపోతే ఎలా అనే దిగులు!
ప్రియాంక దేనికోసమో ఓ క్షణం టైపు చేయటం ఆపి పక్కకి తిరిగింది. టేబుల్ మీది పేపర్ వెయిట్ ను సరిగ్గా జరుపుతూ అప్రయత్నంగా కళ్ళు తిప్పి చూసింది. తనవైపే తదేకంగా చూస్తున్న ప్రకాశరావును చూసి ఓ నవ్వు గులాబీ హాసంలా విసిరి మళ్ళీ పనిలో నిమగ్నమయింది.
వెన్నెల కిరణం సూటిగా వచ్చి తాకినట్లయింది. ఇంక అతని మనసు పనిమీద లగ్నం కావటం లేదు .ప్రియాంక అంత హాయిగా ఎలా నవ్వగల్గుతుంది! చూచాయగా ఆఫీసు వాళ్ళు అనుకుంటుంటే విన్నాడు. ఆమె చుట్టూ ఎన్నో ముళ్ళ కుంచెలున్నాయని... ఆ కుటుంబానికి ఆమే ఆధారమని.. మళ్ళీ మనసునిండా దిగులు కమ్ముకుంది.
"ప్రియాంక తండ్రి బాగా బతికిన వాడనీ, పూర్వీకుల ఆస్తి వందెకరాల దాకా ఉండేదనీ, మితిమీరిన వ్యసనాల వల్ల ఆస్తి హారతి కర్పూరంలా హరించుకు పోయిందనీ..."
ఆఫీసు వాళ్ళు కష్టపడి సేకరించిన సమాచారం ఇంకా చాలా ఉంది.
ప్రియాంకకు చాలా సినిమా కష్టాలున్నాయట. వాళ్ళమ్మ గుండెజబ్బు మనిషి. పెళ్ళికి ఎదిగి కళ్ళతోనే ప్రశ్నిస్తున్న చెల్లెలు, చదువుకుంటున్న తమ్ముడు, ఇలా... ఇన్ని బాధ్యతల్నీ, భారాలనూ గుండెల్లో దాచుకుని చాలీచాలని జీతంతో చిరునవ్వులు చిందిస్తూ పనిలో కూడా అంత ఏకాగ్రత చూపటం ప్రియాంకకు ఎలా సాధ్యం! ప్రకాశరావుకు అస్సలు అర్ధంకాని ప్రశ్న ఇదే! టైపు చేయటం పూర్తయినట్లుంది.
సన్నని వేళ్ళతో మిషన్ మీది కాయితాలన్నీ తీసి సీట్లో కూర్చొని సరిచూసుకుంటోంది ప్రియాంక. ఆమె పెదవుల మీద పారిజాతం మొగ్గ విరియబోతున్నట్లు అదే నవ్వు!
"హలో...బ్రదర్... టీకి వస్తారా"
ముత్యాలరావు చెయ్యి భుజం మీద పడటంతో ఉలిక్కిపడ్డాడు ప్రకాశరావు.
'ఆ! పదండి' మొహమాటంగానే లేచాడు. ప్రియాంక తలెత్తటం లేదు. ఆమె నవ్వు మరోసారి చూద్దామనుకున్న ప్రకాశరావుకు నిరాశ మిగిలింది. ముత్యాలరావుతో కలసి అయిష్టంగానే క్యాంటిన్ వైపు నడిచాడు.
ఆఫీసునుంచి సాయంత్రం ఇంటికి బయల్దేరిన ప్రకాశరావుకు గుండె నిండా దిగులు గుబులు.
రోజూ దాదాపు ఇలాగే ఉంటుంది. కానీ ఇవ్వాళ మరీ దిగులుగా ఉంది.
గుమ్మంలో దుర్గ కాళికా రూపాన్ని ఊహించుకుంటేనే గుండెల్లో దడగా ఉంది.
పదిహేను రోజులుగా భార్య కోరిన శ్రావణ మాసపు పట్టుచీర కొనాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంక రేపు వరలక్ష్మి వ్రతం. దుర్గ బతకనిస్తుందా! అప్పు కూడా ఎవరిస్తారు? పట్టుచీర అంటే మూడు వేలయినా కావాలి. 'మన కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఇదీ' అని దుర్గకు బుజ్జగించి చెప్పినా అర్ధమయి చావదు. మనసులోనే భార్యపై చిరాకుపడ్డాడు.
ఇక తప్పదన్నట్లు జేబుల్ మీది కాయితాలన్నీ సర్దేశాడు. ఫైల్స్ మూసేసి, జేబులోంచి కర్చీఫ్ తీసి గట్టిగా ఓసారి మొహం తుడుచుకున్నాడు.
ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకోక తప్పదు. అటూ ఇటూ చూశాడు. అంతా జారుకున్నారు. ప్రియాంక కూడా వర్క్ క్లోజ్ చేసి హ్యాండ్ బ్యాగ్ లో లంచ్ బాక్సు సరిచేసుకుంటోంది. మనసు కూడదీసుకుని ధైర్యం చేశాడు.
'ప్రియాంక గారూ!'
చురుగ్గా చూసిందామె. కళ్ళతోనే ఏమిటన్న ప్రశ్న!
'మీతో కొంచెం మాట్లాడాలి.'
'మాట్లాడండి.... ఏమిటి ప్రాబ్లం' సానుభూతిగా అడిగింది.
ఆ సానుభూతినే అతను భరించలేకపోతున్నాడు.
'ఇక్కడ కాదు. అలా ట్యాంక్ బండ్ మీదికెళ్దాం' అన్నాడేగానీ బిక్కుబిక్కు మంటున్నాడు. ప్రియాంక సమాధానం ఏమిటో తెలిసేదాకా ప్రతిక్షణం నరకమే! ఈడ్చి తన చెంపమీద కొడితేనో! భయం వేసింది.
'పదండి' చల్లగా నవ్వింది.
మనసులోకి కొత్త శక్తి ప్రవేశించినట్లయింది.
ఇద్దరూ ట్యాంక్ బండ్ వైపు నడుస్తున్నారు మౌనంగా. ఒకరిద్దరు తెల్సిన వాళ్ళు కన్పించి విడివిడిగా విష్ చేశారు. ఇద్దరూ తిరిగి వాళ్ళకి విష్ చేశారు గానీ మాట్లాడుకోలేదు. మరికొందరు తెల్సినవాళ్ళు ఇద్దర్నీ విచిత్రంగా చూస్తూనే వెళ్ళిపోయారు.
టాంక్ బండ్ మీద అంతగా జన సంచారం లేని చోటు చూసుకొని ఓ బెంచ్ మీద కూర్చున్నారు.
గాలికి ఎగిరిపడే ముంగురుల్ని సరిచేసుకుంటూ హుస్సేన్ సాగర్ లోని అలలకేసి చూస్తుంది ప్రియాంక. గాలికి ఎగిరే కొంగును చుట్టూ తిప్పి భుజాల మీదుగా కప్పుకుంది.
ఈమెలో ఎంతటి ప్రశాంతత! మరొకరైతే ఇలా రమ్మన్నందుకు ఎన్ని అపార్ధాలో! ఎవరో ఎందుకు. దుర్గకీ సంగతి తెలిస్తే!