Previous Page Next Page 
రక్షరేకు పేజి 19


    సరళ సమాధానానికి సారధితోపాటు వెంకడూ ఆశ్చర్యపోయాడు.
    "అవును! దేవుడు అన్నేయం సెయ్యడు" అని గొణుక్కున్నాడు తనలో తను.
    ముగ్గురూ ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోకుండా నడిచారు! గుడిసె సమీపించాక నాగమ్మ మహంకాళిలా విరుచుకుపడింది.సవతి కొడుకుమీద!
    "యేటిరా! ఈదురన్నేయం? బాపనోరి ఇంటిబిడ్డని లెగదీసుకొచ్చి మా మద్దెన బెడతావా? మేం బతకాలనా? భగ్గుమని పోవాలనా? పెద్ద నిలవనిస్తాడా? పోరా, పో! ఏడకి పోయి ఆ బొమ్మనెట్టుకు కులుకుతావో కులుకు....."
    వెంకడికి ఎప్పుడు ఎదురు తిరిగి పోట్లాడటం రాదు. తన సవతితల్లితో అసలు పోట్లాడలేదు! స్ధాణువులా నిలబడిపోయాడు.
    చంద్ర ముందుకొచ్చి సరళచెయ్యి పట్టుకొని "రండి అమ్మగారూ! మా బావ దగ్గిరకెళదాం, మా బావ మంచివాడు! ఏదో ఆలోచిస్తాడు" అని జైహింద్ బాబు గుడిసెకు దారి తీసింది! వెంకడు వాళ్ళ వెనకాతలే నడిచాడు.
    తెల్లబోయిన జైహింద్ బాబుకి క్లుప్తంగా పరిస్థితి వివరించింది చంద్ర!
    జైహింద్ బాబు తలవంచుకు నిలబడిన సరళను జాలిగా చూస్తూ "ఇన్నాళ్ళూ మాలాంటి కూలి నాలి జనమే అభాగ్యులమనుకునే వాడ్ని! పెద్ద పెద్ద భవంతులలో ఉండే మీబోటివాళ్ళంతా అదృష్టవంతులనుకునేవాడ్ని....." అని ఆగిపోయాడు.
    "ఆ పెద్ద పెద్ద భవంతులలో ఉన్న మా వంటి అభాగ్యురాలిని ఈనాడు కళ్ళారా చూస్తున్నావు" అని పూర్తిచేసింది సరళ.
    గయ్యాళి నాగమ్మ మాత్రమే కాదు. సాత్వికురాలయిన అన్నమ్మ కూడా సరళ. సారధి తమతో ఉండటానికి భయపడింది. చుట్టుప్రక్కల నలుగురు పోగయి నాలుగు మాటలు ప్రారంభించారు.
    అన్నింటినీ ఎదుర్కొని, సరళనూ, సారధినీ తమతో ఉండమన్నాడు జైహింద్ బాబు!
    ఆ తరువాత సిగ్గుపడుతూ "అమ్మగారూ! మీరిక్కడ ఎలా ఉండగలరండీ" అన్నాడు!
    "నాకు చావాలని లేదు జయన్ బాబు! బ్రతుకుతాను! ఎలా అయినా బ్రతుకుతాను. నా బాబు..... నాలో పెరుగుతూన్న నా బాబు నాకు అండగా నిలవడంటావా?"
    ఏమాత్రం ఉద్వేగం లేకుండా స్థిమితంగా అంది సరళ. తలెత్తి ఆ ముఖం చూడలేకపోయాడు జైహింద్ బాబు!
    ఎలాగో పాలు సంపాదించి ఒక గాజ గ్లాసులో పోసి సరళ ముందు పెట్టాడు! సరళ వద్దనలేదు. అవి తాగి, అక్కడే ఒక వారకి కొంగు పరుచుకుని పడుకుంది.
    సారధికి బన్ రొట్టె తెచ్చి పెట్టాడు. అది తిని జైహింద్ బాబుతో పాటు మైసమ్మగుడి మంటపంలో పడుకున్నాడు.

                                                          9
    కాలేజీలో చేరినా సుధీర్, జైహింద్ బాబుల స్నేహం అలాగే ఉంది. జైహింద్ బాబు ఏనాడూ సుధీర్ ఇంటికి వెళ్ళేవాడు కాదు, సుధీర్ కూడా జైహింద్ బాబు గుడిసెకు వచ్చేవాడు కాదు. కానీ, కాలేజీలో మాత్రం ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. జైహింద్ బాబు సుధీర్ కంటే చురుగ్గా ఉండేవాడు. చదువులో, సుధీర్ కు సహాయం చేసేవాడు. అంచేత సుధీర్ కు జైహింద్ బాబంటే చాలా అభిమానం ఏర్పడింది!
    "సుధీర్ నా కొక్క సహాయం చెయ్యగలవా" అని అడిగాడు జైహింద్ బాబు ఆ రోజు కాలేజీలో!
    "చెప్పు తప్పకుండా చేస్తాను!" ఉత్సాహంగా వీరుడిలాగ అన్నాడు.
    జైహింద్ బాబు సరళా సారధుల విషయం క్లుప్తంగా చెప్పి, "పాపం! వాళ్లు పెద్దింటివాళ్ళు. మా మధ్య మా గుడిసెల్లో వుండలేకపోతున్నారు. నాలుగురోజులు ఆశ్రయమియ్యి. ఏదో ఒకదారి దొరికేవరకూ మాత్రమే వుంటారు. ఆవిడ చాలా అభిమానవంతురాలు....." అన్నాడు!
    విషయం విన్న సుధీర్ లో వీరత్వం ఎగిరిపోయింది. నానుస్తూ "ఇలాంటి విషయాలు నేనెలా చెప్పగలను? మా అమ్మనడిగి చెపుతాను" అన్నాడు.
    "ఎలా అయినా ఆవిణ్ని ఒప్పించడానికి ప్రయత్నించు."
    "అలాగే!"
    జైహింద్ బాబుకి సహాయం చెయ్యటం ఇష్టమే సుధీర్ కి. అందుకే ఇంటికి వెళ్ళగానే తల్లితో అన్ని విషయాలు చెప్పి సరళా సారధులకు కొంతకాలం ఆశ్రయమియ్యమని అడిగాడు.
    తల్లి కళ్ళు పెద్దవిచేసి "సరళంటే. అర్చకాచార్యులు వరదాచారి మరదలు. వెర్రాడి పెళ్ళామేనా? పనివాడితో లేచిపోయిన మనిషేనా?" అంది.
    సుధీర్ తల్లి ధోరణికీ, కంఠస్వరానికీ! భయపడుతూ "ఆవిడ చాలా మంచిదట!" అన్నాడు.
    "మంచిదట...." సుధీర్ కంఠాన్ని అనుకరిస్తూ వెక్కిరించింది ఆవిడ. మరింత మండిపడుతూ "మంచిదో, చెడ్డదో నీకెందుకా గొడవలన్నీ? కాలేజీకి పంపిస్తున్నది చదువుకోడానికా? ఇలాంటి వెధవగొడవల్లో తలదూర్చటానికా? అందుకే దరిద్రపు స్నేహాలు వద్దంటాను. ఇంక ముందయినా ఆ కూలి వెధవల స్నేహం మానకపోయావంటే కాలేజీ మానిపించి నిన్ను కూలిపనిలో ప్రవేశపెడతాను" అని కయ్ మంది.
    ఇంకొక్క మాట మాట్లాడకుండా నోరు మూసుకున్నాడు సుధీర్.
    "మా అమ్మ ఒప్పుకోలేదు" అని చెప్పాడు జైహింద్ బాబుతో.
    "ఆ మాత్రం ఒప్పించలేకపోయావా?"
    "ఒప్పుకోదు. ఆసరళ పనివాడితో లేచిపోయిన మనిషని అంటోంది!"
    "ఆవిడ మంచిదని నువ్వు చెప్పలేదా?"   

 Previous Page Next Page