Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 19


    ఆమె ఒక్క విసురున లేచి లోపలకు వెళ్ళిపోయింది. నేను స్తంభీభూతుడినై కూలబడిపోయను. గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇంతకాలం ఆమెను గురించి విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను కూడా.... లేచి పారిపోవాలనుకొన్నాను. ఎలుగెత్తి కేక వేద్దామనుకొన్నాను. చీకట్లో చిరిగిపోదామనుకొన్నాను.    
    కాని మిగిలిపోయాను - స్తంభీభూతుడినై కూలబడి-    
    తలుపు చప్పుడైంది. అదిరిపడి చూశాను. తలుపులు తెరుచుకొన్నాయి. భయంతో ఒళ్ళంతా ముడుచుకుపోయింది.    
    తలుపులు తెరచుకొని ఒక నవయవ్వన మోహనాంగి, నవనీరజగంధి, అపూర్వమైన అలంకారంతో, కాదు అసభ్యకరమైన వేషధారణతో, ధవళీమ వెదజల్లుతున్న చిరునవ్వుతో, లావణ్యమయమైన వయ్యారమైన నడకతో ఎదుట ప్రత్యక్షమైంది.    
    ఊర్వశి ప్రియ గుర్తుకువచ్చింది. మనోహర్ తో వచ్చిన రేఖ మెదడులో మెదిలింది. హైదరాబాద్ పురవీధుల్లో కారులో జవజవలాడుతూ పోయే నవనాగరిక సుందరాంగి మనసులో మెసలింది.    
    చప్పున కళ్ళు మూసుకొన్నాను.    
    అనసూయ కంఠం గర్వంగా వినిపించింది. "డాక్టర్! కళ్ళు తెరవండి, సిగ్గెందుకు? నాకంటే సౌందర్యవతియైన స్త్రీని ఎక్కడైనా చూశారేమో చెప్పండి."    
    ఛీ ఎటువంటి దారుణమైన వాక్కులు!    
    "చెప్పండి మహాశయా! నేను అనసూయను...మాట్లాడుతున్నాను" నేను కళ్ళు అసహ్యంతో మూసుకునే "మన యిద్దరిమధ్య బాంధవ్యం ఏమిటో మరిచిపోయారా? ఒకప్పుడు మిమ్మల్ని పిన్నీ అని పిలిచాను. ఎంత సిగ్గుచేటు" అన్నాను.   
    "నేను మీ దగ్గరనుంచి నిందను కోరటంలేదు డాక్టర్! ఎలాంటి పరిస్థితిలో నైనా మిమ్మల్ని సహృదయంతో ప్రేమించగలను. ఈ వేషం ధరించనప్పుడు యే మాటలు చెబుతానో యిప్పుడూ అవే చెబుతాను. ఇంత ప్రయాసపడి యీ రాత్రివేళ యివి ధరించి, మీచేత కళ్ళుమూయించటానికనా? కళ్ళు తెరవండి డాక్టర్! తెరిచి యే జీవితంకోసం నేను నిరంతరం కలలు గంటున్నానో, ఢిల్లీలో నా వాని దగ్గరకు ఏ రూపంతో వెళ్ళిపోతానో అవలోకించండి."    
    "అబ్బ! మీది రాక్షస హృదయం..."    
    దీర్ఘమైన నిట్టూర్పు వినిపించింది. "నాది రాక్షస హృదయమని అనేబదులు రాక్షసే అని పిలవండి. కోపగించుకోను. నేను రాక్షసిని రాక్షసిని డాక్టర్! మీ మనుష్యుల్ని మీ అల్ప బుద్దుల్ని చూస్తే నాకు జాలి, రోత."    
    సరిగ్గా యిదే సమయంలో "ఎక్కడున్నావే రాక్షసీ' అనే రోగి బలహీనమైన కంఠం కోపంతో వినపడింది. నేను ఉలికిపడి కళ్ళు తెరిచేసరికి ఆ అసభ్య రూపం త్వరత్వరగా కదలి లోపలకు వెళ్ళిపోతుంది. రోగి అరుపులు అంత కంతకూ యెక్కువవుతున్నాయి. 'రాక్షసీ,. భూతమా' అని తిడుతున్నాడు. నేను ఆ సమయంలో కర్తవ్య విమూఢుడ్ని అయినాను. నాలో నేను ఘూర్ణిల్లసాగాను.    
                                                         * * *    
    ఆయన మా మాటలన్నీ ఆలకించాడు. ప్రాణం పోకముందే దురదృష్టవంతుడైన బాబాయి తన దుర్భర స్థితిని తెలుసుకున్నాడు.    
    అనసూయ బయటకు వచ్చింది. తన యిదివరకటి రూపంతో నావంక కొంటెగా చూసి నవ్వి 'వస్తున్నా' అంటూ కంగారుతో, తడబడుతున్న అడుగు లతో ఆయన వున్న గదిలోకి వెళ్ళింది.    
    "ఎక్కడ చచ్చావే యింతసేపూ?" అంటూ ఆయన క్రోధపూరిత స్వరం వినబడింది. ఆమె ఏదో జవాబు చెప్పిందిగాని స్పష్టంగాలేదు. వెంటనే ఏదో వస్తువు విసిరేసిన చప్పుడు 'పగిలిపోయింది. యింకో గ్లాసు తీసుకువస్తున్నాను' అంటూ ఆమె బయటకు వచ్చి త్వరగా బల్లమీదవున్న గ్లాసునందుకొని చర్రున ఇటు తిరిగింది. ఆమె విశాలనయనాలు మంట వలయాల్లా వున్నాయి. 'అతను చేతులు చాచి నన్ను ఆహ్వానిస్తున్నాడు. అక్కడికిపోయే తరుణం దగ్గరపడింది' అంటున్న ఆమె నుదుటిమీద గ్లాసు పగిలిన చిహ్నంగా రక్తం జలజలమని పారుతూండటం చూసి చలించాను. గిరుక్కున తిరిగి లోపలికి పోయి "మీరు ఆయాసపడకూడదు. ఈ మందు త్రాగివేయండి" అంటోంది.    
    నా నరాలు ముక్కలుగా కోసి అన్ని దిక్కులకు విసిరేసినంత బాధ కలిగింది. ఆమెను తలచుకొని వణికిపోయాను. ఈమె ఎవరు? ఆమె అన్నట్టు రాక్షసి యేనా?...    
    పదినిముషాలు గడిచాక బయటకు వచ్చింది. "నిద్రపోయారు" అంటూ ఆ గది తలుపులు మూసింది. "డాక్టర్ మందు వేస్తారా? బాధగా వుంది" అంది.    
    నేను లేచి నిలబడ్డాను. "బాధగా వుందా? మీ బాధ నా మందుతో తీరుతుందా? నాకు సెలవియ్యండి బాబాయిని క్షమించమని అడిగానని చెప్పండి. నిజమే మీరన్నది. ఆయన ఒకటి రెండురోజులు మినహా బ్రతకడు. మీరు అతడ్ని వెతుక్కొంటూ ఢిల్లీ వెళ్ళిపోవచ్చు. ఆఁ, నాక్కొన్ని సందేహాలను దయవుంచి తీర్చండి చివరిసారిగా మీ మాటలు కొన్ని వినాలని వుంది. మీరు వెనక ఒకసారి చెప్పినప్పుడు నాకు అర్ధంకాలేదు. నీతీ, అవినీతీ పట్ల మీకు విశ్వాసం లేదా?"

 Previous Page Next Page