Previous Page Next Page 
ఆలోచన ఒక యజ్ఞం పేజి 19


    ఇదెలా జరిగింది? అప్పుడున్న నేను ఇప్పుడూ వున్నాను. కేవలం - నామీద నాకున్న దృక్పథం నాజీవిత గమనాన్ని మార్చేసింది.
    
    మిమ్మల్ని మీరు అంగీకరించేస్థితికి చేరుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు ఎప్రూవ్ చేసుకోండి.
    
    ఈ స్థితికి చేరుకోవడానికి మానసికమైన ఎక్సర్ సైజ్ లు మంచివే కావచ్చు. అంటే లూస్ చెప్పినట్లు "I approve of myself. I approve of myself"ఇలా నిరంతరం మననం చేసుకోవటం ఒక పద్దతి.
    
    కాని దీనివల్ల యాంత్రికత ఏర్పడుతుందేమోనని నా అనుమానం.    
    
    చాలా సందర్భాల్లో మంత్రాలు ఎంత గొప్పవైనా అందుకే ఫెయిలవుతాయి."
    
    నాకు నేను అవలంబించిన పద్దతి. మొదట మన మనసును మనం గౌరవించు కోవటం. ఆలోచనలు అనేవి నేను కొత్తగా కనిపెట్టింది కాదు. మనం అనుకున్నా అనుకోకపోయినా - అవి నిరంతరం ప్రవహిస్తూ వుంటాయి. వాటిని ఆపలేం.
    
    కాని... చెడు ఆలోచన వచ్చినప్పుడల్లా ఉలిక్కిపడండి.
    
    దుఃఖం ఆలోచన కలిగినప్పుడల్లా - అది ఎందుకూ పనికి రానిదని గుర్తించండి.
    
    బూతు ఆలోచన వచ్చినప్పుడల్లా 'ఇది పనికిరాదు' అన్న స్ఫురణలోకి పరుగులు తియ్యండి.
    
    మీ గురించి మీలో ఏర్పడుతున్న క్షీరసముద్రమథనం లాంటిది. మొదలు ఏవేవో జనించినా చివరకు అమృతం పుట్టినట్టు ఆ మథనంలోంచి 'ప్రేమ' అనేది ఉద్భవిస్తుంది."
    
    ఎలాంటి ప్రేమ?
    
    మీలో వున్న శక్తుల్ని కూడదీసి, వాటికి రమణీయ రూపకల్పన చేసేప్రేమ.
    
    అప్పుడు చూడండి మీరు ప్రపంచానికి కనపడే విధానమే మారిపోతుంది.    
    
    ఇది సిద్దాంతంకాదు. నిజం, ఇది సెల్ఫ్ హిప్నాటిజం కాదు. ప్రచండమైన వాస్తవం.
    
    ఈ వాస్తవంలోకి మీరు అడుగుపెట్టండి."
    
    అతను నా మాటలు విన్నాడు. చాలా శ్రద్దగా విన్నాడు అతనిలో కొంత ఆత్మవిశ్వాసాన్ని జొప్పించగలిగాననుకుంటాను.
    
    కొన్నినెలల తర్వాత అతను కలిశాడు. సంవత్సరాలు కాదు. కేవలం కొన్ని నెలల తర్వాత.
    
    అతనికి పెళ్ళయింది. అతని భార్య చాలా అందంగాకూడా వున్నది.
    
    అంతేకాదు.  ఆ తర్వాత కొద్దిరోజుల్లో అతని జీవితంలో చాలా అభివృద్ధి కనిపించింది.
    
    ఇప్పుడతను ఇండియా, జపాన్, అమెరికాల మధ్య మంచినీళ్ళ ప్రాయంగా తిరిగే అత్యున్నత పదవుల్ని అలంకరించాడు.
    
    ఎక్కడ వున్నా నెలకోసారి చాలా ఆప్యాయంగా ఫోన్ చేస్తూ వుంటాడు.
    
    బహుశా అది కృతజ్ఞత!
    
    జీవితంలో కృతజ్ఞతకు మించిన గొప్ప అంశం లేదు. దాన్నిగురించి మరోసారి చెప్పుకుందాం.
    
భార్యభర్తలు

    
    ఒకామె ఉత్తరం రాసింది.
    
    "భార్యాభర్తలంటే ఎలా వుండాలని నేనూహించుకున్నానో తెలుసా సార్?
    
    "వారిద్దరూ బాధ్యతను చాలా గౌరవంగా స్వీకరిస్తూ వుండాలి. ఒకరి మనసు బాధపడితే ఇంకొకరు విలవిల్లాడిపోతూ వుండాలి.
    
    "ఒకరి కష్టాన్ని ఇంకొకరు గుండెల లోతుల్నుంచి అర్ధం చేసుకుంటూ వుండాలి. నిరంతరం వారి మనసులో ఒకరిగురించి మరొకరి ఆలోచన తప్ప, ఆ రూపం తప్ప, ఆ భావన తప్ప వేరొకటి చోటు చేసుకోకూడదు.
    
    అపార్ధం అన్నది ఇద్దరిమధ్యా మచ్చుకైనా కనబడకూడదు.
    
    ఇద్దరిమధ్యా ఏ రహస్యాలూ వుండకూడదు. అలా అని ఒకరి సొంతజీవితంలో ఒకరికి ప్రమేయం వుండదు. అనవసర జోక్యం ఉండదు. అవగాహనే తప్ప అధికారాలూ, హక్కులూ, ఒకరినొకరు హింసించుకోవటాలూ ఎక్కడా కనబడవు. అసలు వాటికి చోటులేదు.
    
    ఎందుకని? ఒకరి సుఖం కోసమే రెండవవారి ఉబలాటం. ఒకరి సేవకోసమే రెండవవారి నిరంతర తపన.
    
    ఆమెకు అన్ని పనులలో అతను అండగా, అంటే ఆడంగిలా అని అర్ధంకాదు. ఓ మోరల్ సపోర్ట్ లా నిలుస్తాడు.
    
    "ఆమె అతనికోసమే... ప్రేమగా వంటచేసి ఆరాధనాభావంతో ఆరగింపజేసి, భోజనమయ్యాక విశ్రాంతి తీసుకుంటుంటే, అతని పాదాలచెంత కూర్చుని, అతను చెప్పే కబుర్లు వింటూ, అతని పాదాలు నొక్కుతూ..."
    
    స్థలాభావం చేత ఉత్తరమంతా రాయటంలేదు. నిజం చెప్పాలంటే నేనురాసించాని కంటే కూడా ఉన్నతభావాలతో, మహోన్నత భావనలతో, భార్యాభర్తల అనుబంధాన్ని ఆ స్త్రీమూర్తి అపురూపంగా చిత్రించుకుంటున్న కమనీయ కావ్యదృశ్యాలతో ఆ సుదీర్ఘమైన లేఖ సాగిపోయింది.
    
    కనులు మూసుకుని ఆ స్త్రీమూర్తి అమృత హృదయంతో రాసిన దృశ్యాలనే ఊహించుకుంటున్నాను.
    
    మూసివున్న నా కనులు చెమ్మగిల్లుతున్నాయి.
    
    ఇక్కడ 'ఊహించుకుంటున్నాను' అని రాశాను. అంటే వున్నది నా కనులముందు తెచ్చుకుని ఊహించుకుంటున్నానా? లేక లేనిది ఉంటే బావుండును అని ఊహించుకుంటున్నానా?
    
    నా మనసులో ఓ యజ్ఞం ప్రారంభమైంది యజ్ఞానికి కావలసిన మంట అగ్గిపుల్లతో వెలిగిస్తే ఆ పవిత్రత రాదు. ఒక ప్రత్యేకమైన కవ్వానికి తాడుకట్టి, మరోచెక్కలోని చిన్నబిలంలో చెమటలు కారుస్తూ మథిస్తే ఆ ప్రక్రియలో నుండి అగ్ని ఆవిర్భవిస్తుంది. (దాన్ని ఆరణి అంటారు) అటువంటివి పవిత్రాగ్నితో ఈ అధ్యాయాలు ఆవిష్కృతమవుతున్నాయి.
        
పెళ్ళితో మొదలుపెడుతున్నాను.
    
    దీన్నిగురించి మొదట్లో సందర్భాన్నిబట్టి ఎక్కడైనా ప్రస్తావించానేమో తెలీదు. అయినా ఇప్పుడు లోతుల్లోకి వెడుతున్నాం కాబట్టి, సుదీర్ఘంగా చర్చించబోతున్నాం కాబట్టి, మళ్ళీ ఇందులోకి అడుగుపెడుతున్నాం.
    
    పెళ్ళి జీవితంలో అన్ని అవసరాలకు మించిన అతి ముఖ్యమైన ఘట్టం అంతకన్నా ముఖ్యమైనది మరొకటి లేదు.
    
    ఆ ప్రాముఖ్యాన్ని గుర్తించారు కాబట్టే పూర్వికులు అంత తతంగం ఏర్పాటు చేశారు. మొదట కుటుంబ సంప్రదాయాలను గురించి విచారించటం, జాతకాలు, గోత్రాలు, పెళ్ళిచూపులు తర్వాత అత్యంత శక్తిమంతమైన ఎంతో లోతైన అర్ధాలున్న మంత్రాలతో కూడిన వివాహతతంగం, అందులో ఎన్నో చిన్ని చిన్ని అధ్యాయాలు హృదయాలను కదిలించే అప్పగింతలు...
    
    ఎన్నో సంవత్సరాల సుదీర్ఘకాలం గడపవలసిన దాంపత్యజీవితం గురించి, కొన్ని గంటలు లేక ఒకటి రెండురోజులు వెచ్చించటం యుక్తమే అనుకుంటాను.

 Previous Page Next Page