Previous Page Next Page 
లక్ష్యం పేజి 19


    "ఈ ఏరియాకి విలువ పెరగాలని ఎందుకనుకుంటున్నారు?"

 

    "ఆ ఎడం వైపున్న బార్ ని నేను నష్టానికి కొన్నాను కనుక."

 

    ఇద్దరి మధ్యా కొద్ది క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది.

 

    "ఆ ప్రక్కనే మీ యు.డి.ఏ. కాంప్లెక్స్ కట్టండి. అందుకు నేను మీకు లోన్ ఇప్పిస్తాను. ఈ ఏరియాకి విలువ పెరగకుండా వుండదు కదా?"

 

    "లోన్ అదీ... అసలే మా సంస్థ జీతాలిచ్చుకోలేని స్థితిలో వుంటే, ఏ బ్యాంకు మాత్రం లోనిస్తుంది సార్?"

 

    సందేహం మీద సందేహం యు.డి.ఏ. ఛైర్మన్ ని చుట్టుముట్టాయి.

 

    "నాకు ఫైనాన్స్ బిజినెస్ వుంది. ఫైనాన్స్ నేను చేస్తాను. పూర్తయ్యాక రెండు ఫ్లోర్స్ నేను మీ నుంచి లీజ్ కి తీసుకుంటాను. మిగతా పది ఫ్లోర్స్ మీరు అద్దెకు ఇచ్చుకోండి. ఇటు నా అప్పూ తీరుతుంది. అటు మీకూ ఆదాయం పెరుగుతుంది. ఆ బిల్డింగ్ మీ సంస్థ స్వంతమౌతుంది. వెళ్దామా?" కారెక్కుతూ అన్నాడు రాఘవేంద్ర నాయుడు.

 

    క్షణాల్లో కోట్ల వ్యాపారానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవటం ఉత్తమ వ్యాపారస్తుడి లక్షణమా? అలా సత్వర నిర్ణయాలు తీసుకోబట్టే రాఘవేంద్రనాయుడు  ఆ స్థాయికి ఎదిగాడా?

 

    తమ సంస్థకు ఫైనాన్స్ చేయటం ఒక వ్యాపారం.

 

    రెండు ఫ్లోర్స్ లీజ్ కి తీసుకోవటం మరో వ్యాపారం. ఒ.ఎన్.జి.సి.కి స్థలం ఇప్పించి, ఏరియా విలువ పెరిగేలా చేయటం మరో వ్యాపారం. ఆ పైన తన స్థలం విలువను లక్షల్లోకి తీసుకెళ్ళటం అద్భుతమైన వ్యాపార సూత్రం.

 

    తను బాగుపడుతూ- తనతో ముడిపడిన చిన్న వ్యాపార సంస్థల్ని కూడా పైకి తీసుకెళ్ళటం అత్యుత్తమ వ్యాపారస్తుడి లక్షణం కాబోలు.

 

    అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవి శాశ్వతం కాదు. రేపు సి.ఎమ్. మారితే తను దిగక తప్పదు. అలాంటి తుమ్మితే వూడే పదవిని అడ్డం పెట్టుకొనే తనిప్పుడు రాఘవేంద్ర నాయుడు లాంటి ఇండస్ట్రియల్ ఎంపరర్ తో తన స్నేహాన్ని పెంచుకుంటే, తనకో భవిష్యత్ వుంటుంది.

 

    తనకి తీరిక లేకో- తన స్థాయికి తగకో కొన్ని వ్యాపారాలు రాఘవేంద్రనాయుడు లాంటి పారిశ్రామిక వేత్తల దృష్టికి వచ్చినా చేపట్టరు.

 

    తనిప్పుడు ఆయన చెప్పినట్లు చేస్తే- అలాంటి వ్యాపారాలేవో తనతో పెట్టించే అవకాశం వుంటుంది.మరోప్రక్క యు.డి.ఏ.కి  ఆదాయం వచ్చే వనరుల్ని సమకూర్చినట్లవుతుంది. ఒక ఛోటా రాజకీయవేత్తగా- ప్రభుత్వ సంస్థని సమర్థవంతంగా నిర్వహించిన పేరు ప్రతిష్టలు దక్కుతాయి.

 

    ఎవరి జాతకమైనా గొప్ప మలుపు తిరగాలంటే- కింగ్ మేకర్స్ చేతుల్లోనే పడాలి- వారి దృష్టికే వెళ్ళాలి.

 

    కొద్ది క్షణాల్లోనే ఇవన్నీ ఆలోచించిన యు.డి.ఏ. ఛైర్మన్, రాఘవేంద్రనాయుడి ప్రపోజల్స్ అన్నిటికీ తన అంగీకారం తెలిపాడు.

 

    "మీరు కట్టించిన పన్నెండు ఫ్లోర్స్ లో నాకు రెండు ఫ్లోర్స్ పోగా, మిగతా పది ఫ్లోర్స్ ని స్టాక్ ఏక్స్ఛేంఙ్ కి లీజ్ కివ్వాలి" తిరిగి అన్నాడు రాఘవేంద్రనాయుడు కారులో వెళుతున్నప్పుడు.

 

    "స్టాక్ ఏక్స్ఛేంఙా! అదసలు మన నగరంలో లేదుగా? దానికి అద్దెకివ్వటమేమిటి?" యు.డి.ఏ. ఛైర్మన్ కి మతిపోతోంది.

 

    "వస్తుంది- మనం తలుచుకుంటే రాదా? చూస్తుండగా దాన్ని ఈ నగరానికి రప్పిస్తాను... ఇకపై ఇవన్నీ మా ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడండి. ప్రతీదీ యుద్ధప్రాతిపదికపై పూర్తవ్వాలి. నేనీ రాత్రికే ఒ.ఎన్.జి.సి. ఛైర్మన్ తో మాట్లాడతాను. అర్థమైంది కదా?" రాఘవేంద్రనాయుడు కళ్ళు మూసుకుని సీటుకి జారగిలబడుతూ అన్నాడు.

 

    అసలిప్పుడు జరిగినవన్నీ నిజాలా?

 

    కలా...?

 

    ఎక్కడో ఏదో జరిగివుంటుంది. అది ఆయన్ని కదిలించి వుండాలి. అలాంటప్పుడే కదా రాజు కోటనుంచి వెడలేది... వెడలాక రవితేజములదరక ఏమవుతుంది?

 

                              *    *    *    *    *     

 

    "నువ్వు మరీ ఇంత పిరికివాడివనుకోలేదు- పరిస్థితి అక్కడిదాకా వస్తే ఊరికే భుజం పట్టుకుని ఒక్కక్షణం ఊపేసి వస్తావా? చూసిన వాళ్ళంటే తెలిసింది- నువ్వు రుద్రుడిలా ఆ అమ్మాయి మీదకు వెళ్ళినా, ఆ అమ్మాయి చీమకుట్టి నంతయినా రియాక్టు కాలేదట! అవ్వ... అంత అవమానమా? నువ్వెలా తలెత్తుకు తిరగగలవు?"

 

    మూర్తి తనకున్న జాకాల్ ఇంటిలిజెన్స్ ని వుపయోగిస్తూ, మధుకర్ లో చల్లారిపోతున్న పగ, ప్రతీకారాలకు తిరిగి ఊపిరిపోయసాగాడు.

 

    "అవును- నిజమే- అంత మీదకెళ్ళినా, మహతి లేశమాత్రమైనా బెదరలేదు. ఏమిటావిడ ధైర్యం?" స్వగతంలో అనుకున్నా, ఆ మాటలు మూర్తికి వినిపించాయి.

 

    "అదే కదా నేను మొత్తుకునేది. నువ్వేం చేసినా, నిన్నేమయినా చేయగలిగేవాడు ఈ నగరంలో వున్నాడా? లేడు. అలా అని ఆ అమ్మాయికీ తెలుసు. తెలిసే అలా చేసిందంటే- ఏమిటావిడకున్న ఒత్తాసు? అండ? బలం? బలగం?" మూర్తి అగ్గిమీద గుగ్గిలాన్ని ఉండుండి చల్లుతున్నాడు.

 

    నిజమే- ఏమీ చేయకుండా వచ్చానేమిటి?

 

    "నేనేదయినా చేస్తే- ఏమయిపోతుంది? పరువు దక్కుతుందా?ఇంకెవరైనా పెళ్ళి చేసుకుంటారా ?"

 

    "లేదు. బుద్ధున్నవాడెవడూ చేసుకోడు. అయినా అందరిలో బార్ కొనిపించి, వెర్రి వెంగళప్పను చేయించింది నేనే అని చెప్పటం, మితిమీరిన ఆమెలోని పొగరుబోతుతనానికి నిదర్శనం..." మూర్తిలాంటి వ్యక్తులకు గుగ్గిలం కరువు ఎప్పుడూ వుండదు. చల్లబడిన పగ, ప్రతీకారం, అవమానభారం తిరిగి మధుకర్ లో రెట్టించిన వేగంతో ఊపిరి పోసుకోసాగాయి.

 

    "ఆ... ఏం లేదు. మితిమీరిన అహంభావం. అంతా కలిపినా ఆమెకున్న ఆస్తులు యాభైలక్షలకు దాటవు. మరి నీకో? ఐదొందల కోట్లు... ఒకటా, రెండా ఐదొందల కోట్లు. మరి నీకెంత అహం వుండాలి? ఆ చెప్పు? మూర్తి రెచ్చగొడుతూ మధుకర్ మొహంలోకే చూస్తూ, అప్పుడతని ముఖంలో మారే భావాల తీవ్రతను గమనిస్తూ ఆనందిస్తున్నాడు.

 

    పచ్చగడ్డిని నిప్పు లేకుండానే భగ్గుమనిపించటం, వసుదైక కుటుంబంలో చిచ్చు పెట్టడం, పచ్చగా వున్న ప్రాంతాన్ని నైబీరియా ఎడారిలా మార్చటం, ఎవ్వరినీ మనశ్శాంతిగా ఉండనివ్వకపోవటం, సుఖసంతోషాలతో కొనసాగానివ్వకపోవటం లాంటివి ఈ సమాజంలో కొంతమందికి గొప్ప ఆనందాన్ని, ఆత్మ సంతృప్తిని కలిగిస్తాయి. వీరికి వేరే ధ్యేయం వుండదు, లక్ష్యం వుండదు. పై కార్యక్రమాలే వారికి ఊపిరి. నేరస్తుల కన్నా , గుండాలకన్నా, వీరి మూలంగానే వ్యక్తులకు, సంస్థలకు, సమాజానికి, దేశానికి కీడు. అదిగో అలాంటి వర్గానికి చెందినవాడే మూర్తి.

 

    మూర్తిలో ఒక గుంటనక్క ఒక జాకాల్, ఒక తోడేలు, క్యారియన్ ఏనిమల్స్ లక్షణాలన్నీ పుష్కలంగా ఊపిరి పోసుకునున్నాయి.

 

    "ఏదో చేయాలి. ఏం చేయాలి?" మంచి చెడుల మీమాంస మధుకర్లో.

 

    పాప పుణ్యాల ఊగిసలాట మధుకర్ లో. చెప్పానుగా- కన్యత్వం వున్న, అదే- వర్జినిటీ వున్న యువతిలో అహంభావం పాళ్ళే ఎక్కువగా వుంటుంది. దాన్ని త్రుంచేస్తే- కృంగిపోవటం, మాధనపడటం ప్రపంచాన్ని చూడటానికి భయపడటం లాంటి మానసిక రుగ్మతలు మొదలవుతాయి. అప్పుడిక ఏ విధంగానూ, ఎందులోనూ గెలిచే అవకాశాలుండవు. కమాన్- డూ- ఇట్- ఐసే- రేప్ చేసేయ్- అప్పుడిక మరొకర్ని చేసుకునే ప్రయత్నం కూడా చేయదు. అదేకదా నీకూ కావల్సింది-" మంట తగ్గుతున్నప్పుడల్లా కొద్దిగా గుగ్గిలం, ఆపైన కొన్ని ఎండుకట్టెలు.

 Previous Page Next Page