Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 19

    ముద్దుముద్దుగా, తెల్లగా, బొద్దుగావుండే ఆమె పిల్లలు కాన్వెంటుకి వెళుతూంటే ముచ్చటపడుతుంది. ఆమె ఇంటికి తరచూ వెడుతూ ఆ కబుర్లు మహా ఉత్సాహంగా చెబుతుంది సుబ్బారావుతో.
    భార్య ఆడంబరానికి ఇచ్చే విలువ చూసి చూసి- "ఇన్నిసార్లు నువ్వు వెళుతున్నావు. ఆవిడ మనింటికసలు వచ్చిందా?" అన్నాడు ఒకరోజు.
    జ్యోతి గతుక్కుమంది మనసులో.
    నిజమే. శ్యామల ఈ మూడునెలల్లో ఒక్కసారయినా రాలేదు. ఓసారి ఎక్కడికో వెడుతూ కిందికిదిగుతూ గుమ్మందగ్గిర నించున్న జ్యోతిని చూసి పలకరించి.... గదిలోకి తొంగిచూసి-
    "మీ ఇంట్లో ఎన్ని గదులు, రెండేనా?" అంటూ లోపలికి వచ్చి ఇల్లు చూసింది.
    జ్యోతికి తలకొట్టేసినట్లు సిగ్గుపడుతూ "కూర్చోండి" అంది కుర్చీ జరిపి.
    "అబ్బే కూర్చోనండి, షాపింగ్ కి వెళ్ళాలి. ఏం చేస్తున్నారు? పాపం! కాలక్షేపం ఏమీ లేదుగాదూ- ఓ రేడియో అన్నా కొనుక్కోకూడదూ?" అంది సానుభూతిగా అన్నట్టు.
    జ్యోతి గుటకలు మింగింది.
    "వస్తా మరోసారి వస్తా" అంటూ బ్యాగ్ ఊపుకుంటూ వెళ్ళి పోయింది.
    ఆ మరోసారి మూడునెలల్లో ఒక్కసారన్నా రాలేదు. ఆ మాట మొగుడితో చెప్పి తేలిపోవడం ఇష్టంలేక జ్యోతి దర్పంగా "ఎందుకు రాలేదు? ఒకసారి వచ్చింది" అయినా నేనే రమ్మనను. ఆవిడ వస్తే కూర్చో పెట్టటానికి మంచి కుర్చీఅన్నా లేదు. పిలవడం సిగ్గుచేటు."
    "నీవు డజనుసార్లు వెళతావు. ఆవిడ ఒకసారి వచ్చిందన్నమాట. పోనీ ఆవిడకి, నీకు అంత స్నేహమేమో - ఆవిడింట్లో అన్ని పార్టీలు జరుగుతుంటాయి. ఒక్కసారన్నా నిన్ను పిలిచిందా? నీవు వూరికే ఆవిడని పూసుకు తిరుగుతావుగాని...."
    "ఎలా పిలుస్తారు? మీరు ఎన్నడన్నా ఆయనతో మాట్లాడారా? పరిచయం చేసుకున్నారా? నన్ను ఒక్కర్తినే ఎలా పిలుస్తారు పార్టీలకి?" జవాబు దొరికిందని గయ్ మంది.
    ఆయన నేనో క్షుద్రుడనన్నట్టు ఎదుట కనిపించినా ఓ చిరునవ్వు నవ్వితే కొంప మునిగిందన్నట్టు సీరియస్ గా మొహంపెట్టి వెళ్ళిపోయాడు. నాలుగైదుసార్లు మొదట్లో. అలాంటి అతనితో పూసుకుతిరిగి పరిచయం చేసుకుని, వాళ్ళింటికెళ్ళే ఖర్మేమిటి నాకు. ఏదో అతనికింద నేను గుమస్తాలా అనుకుంటాడు గాబోలు" అన్నాడు సుబ్బారావు.
    "ఏం? వెడితే తప్పేమిటి? అనవసమైన స్నేహాలు చేసేకంటే కాస్త పనికొచ్చే వాళ్ళతోచేస్తే ప్రయోజనం వుంటుంది."
    "ఏం? ఆయనగారు నాకేమన్నా ఉద్యోగం యిప్పించాలా? లేక ఏమన్నా మూటఇస్తాడా? నీకు అభిమానం, పౌరుషం లేకపోతే నీవు తిరుగు ఆవిడ ఇంటిచుట్టూ. నాకా అవసరంలేదు" కాస్త తీవ్రంగా అన్నాడు.
    "కుళ్ళు, అసూయ. అంతకంటే ఏంకాదు. దీన్నే ఇన్ ఫీరియార్టి కాంప్లెక్స్ అంటారు ఇంగ్లీష్ లో" హేళనగా ఎత్తి పొడిచింది జ్యోతి.
    సుబ్బారావు ఒళ్ళు మండింది.
    "అలాంటి కుళ్ళు, అసూయ, ఏడుపులు అవన్నీ నీకు. వీళ్ళని, వాళ్ళని చూసి మనకి లేవని ఏడిచేది నీవుగాని, నేనుకాదని నీకూ తెలుసు. నోటికి వచ్చినట్లు మాట్లాడకు. ఊరుకుంటుంటే మరీ ఎక్కువవుతూంది" తీక్షణంగా అన్నాడు.
    "ఊరుకోక ఏంచేస్తారు?" రెట్టించింది జ్యోతి.
    "ఏం చేస్తానా? చెంప పగలగొట్టి నోరు మూయించగలను. కాని అంత కుసంస్కారిని కాదుగనుకనే ఈబాధ" విసురుగా అని అక్కడనించి వెళ్ళిపోయాడు.
    ఇలాంటి తగవులు ఇంచుమించు ప్రతిరోజూ ఏదో ఒకటి ఇద్దరి మధ్య వచ్చేవి. ఏదో అంటూ, అతన్ని రెచ్చగొట్టేది.
    ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతంచేసి సాధించడం, దెప్పడం, అది చిలికి చిలికి గాలివాన అవడం మామూలు అయిపోయింది. రెండురోజులు భార్యాభర్తల మధ్య మాటలు బంద్ అయ్యేవి.
    ఎన్నాళ్ళయినా సుబ్బారావే జరిగింది మరిచి, తన తప్పు లేకపోయినా కిందకి దిగివచ్చి జ్యోతిని బతిమిలాడుకుని, ప్రసన్నురాలిని చేసుకోవలసి వచ్చేది.
    ఆమె మాటలకి. దెప్పులకి అతనికీ మనసు దెబ్బతిని పౌరుషం వచ్చేది. ఎంత వద్దనుకున్నా ఒకోరోజు అతని అహం దెబ్బతిని, అతడూ అరిచేవాడు.
    ఆ ప్రధమకోపం తగ్గగానే పశ్చాత్తాప పడేవాడు. పట్టుకుని పెళ్ళి చేసుకుని మూడునెలలన్నా గడవకముందే తామిద్దరిమధ్య ఈ తగువులేమిటి అని బాధ పడేవాడు.
    వైవాహిక జీవితం గురించి ఎన్నో మధురానుభూతులని ఊహించాడు. ఇలా జరిగిందేమిటి? ఈ జ్యోతికి బుద్ధిలేకపోతే తనబుద్ధి ఏమైంది? ఆడదాని మనసు ఎరిగి ఆమెని తనవైపు తిప్పుకోడం మగాడి పని. ఆమెని ఆకర్షించలేకపోవడం తన లోపం గాబోలు అంటూ తప్పు తనమీదే వేసుకుని బాధపడి, మళ్ళీ జ్యోతితో మాటలు కలిపాడు.
    అవతల జ్యోతీ అంతే. ఒక్కొక్కసారి ఆమె మనసు కాస్త బాగున్నప్పుడు పాపం సుబ్బారావు మంచివాడే. గుమస్తా ఉద్యోగం అంటే అతనేం చేస్తాడు?
    అది తెలిసేగా చేసుకుంది. ఇప్పుడనుకొని బాధపడి ప్రయోజనం ఏముంది? అని సరిపెట్టుకుని కాస్త సౌమ్యంగా ప్రవర్తించేది. కాని ఇంతలోనే మూడ్ మారిపోయేది.
    ఏ అందమైన జంటని చూసినా, ఏ మంచి సినిమా చూసినా, ఏదన్నా నవల చదివినా. మంచిచీర కంటపడి అది తను కొనుక్కోలేనిది అనుకున్నా, బజార్లో ఏదన్నా ఫర్నిచర్ చూసినా ఆమె మనసు మళ్ళీ కోతి అయ్యేది.
    "ఏం జీవితం యిది? ఛీ ఛీ!" అన్పించేది.                        

 Previous Page Next Page