మేఖల క్షణకాలం బాధపడింది.
దేనికైతే దూరంగా తన తమ్ముడ్ని ఉంచాలనుకుందో డానికే అసంకల్పితంగా దగ్గరైపోతున్నాడు.
తమలో ఒకడు దెబ్బతినగానే డిఫెన్స్ లో పడిపోతే -అందునా ఇద్దరు ఆడపిల్లల ముందు- తరువాతిక ఆ పేటపై తమ ఆధిపత్యాన్ని వదులుకోవలసివస్తుందని ముగ్గురూ ఒకే పందాలో ఆలోచించి ఆవేశపడిపోయారు.
"ఎవడ్రా నువ్వు....? మా మనిషిని దెబ్బతీసావు... ఎన్ని గుండెల్రా నీకు....?" ఒక యువకుడు ఒకడుగు అభిరామ్ వైపు వేసి అన్నాడు పెద్దగా.
అభిరామ్ మాట్లాడలేదు.
భావరహితంగా వారికేసి చూస్తూ నించున్నాడు.
"ఎంత ధైర్యంరా నీకు?"
"వీళ్ళనంటే నీకు పొడుచుకొచ్చిందే? నీ సిస్టరా? నీ పెళ్ళామా?"
ఆ మాటలకి క్రాంతి ఉలిక్కిపడి చూసింది ఓ క్షణం.
"నీకు రోజులు మూడే మాతో పెట్టుకుంటున్నావు. ఇంతవరకు మాతో పెట్టుకున్న వాళ్ళెవరూ బ్రతికి బట్టకట్టలేదు. మర్యాదగా యిక్కడి నుంచి తప్పుకో" ముగ్గురూ మూడు రకాలుగా బెదిరించారు అభిరామ్ ని.
"గొడవలనవసరం ఆడపిల్లల మీద యిలా దౌర్జన్యం చేయటం మీకు మంచిది కాదు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపొండి" అంది మేఖల అభిరామ్ చూపుల్లోని ఆగ్రహాన్ని పసిగట్టి.
"ఏంటే పెద్ద నీతులు చెబుతున్నావు....?" అంటూ ఓ యువకుడు తన చెయ్యిని మేఖల భుజం మీద వేసి తనవేపు లాక్కొనే యత్నం చేయబోతుండగా ఒక్క అంగలో అతన్ని సమీపించిన అభిరామ్ తన అక్క భుజం మీద పడిన అతని చేతిని విసురుగా లాగి పుల్లను విరిచినట్టు విరిచివేశాడు.
అతని చెయ్యి ఏమయిందో కొద్దిక్షణాలకు గాని అతనికి తెలీలేదు. విరిగిన చేతి బాధ ఒక్కసారి అతని అనుభవంలోకి వచ్చి కెవ్వున కేక వేశాడు. దారుణమైన బాధ అతన్ని విచలితుడ్ని చేసింది. అతను క్రిందపడి బాధతో మెలికలు తిరిగి పోసాగాడు.
అది చూసిన మిగతా ఇద్దరూ ప్రాణభయంతో వణికిపోయారు.
ఆ గొడవ ఎక్కడిదాకా వెళుతుందోనని భయపడిన మేఖల "ఇక నయినా బుద్దితెచ్చుకొని మీ యిద్దరూ
ఆ ఇద్దరినీ తీసుకొని పారిపోండి" అంది.
అప్పటికే చుట్టుపక్కల ఇళ్ళలోని జనం బయటకు వచ్చి ఆ దృశ్యాన్ని చూసి షాక్ తిన్నారు. అభిరామ్ ని చూసి విస్తుపోయారు.
"నువ్వు అరేంజ్ చేసుకున్నావా వీడ్ని...? ఆల్ రడీ నీకు ఒకడున్నాడన్న మాట...." ఒకడు అవమానంతో ఊహిపోతూ క్రాంతికేసి చూస్తూ అన్నాడు.
అభిరామ్ ఎప్పుడు పట్టుకున్నాడో అతని మెడను.... అతను మాటలు పూర్తి చేస్తూనే ఊపిరి అంధక గిలగిలలాడిపోతూ కళ్ళు తేలేసే స్థితికి వచ్చాడు.
క్రాంతి అభిరామ్ కేసి కృతజ్ఞతగా చూసింది.
"తమ్ముడూ.... వదిలేయ్ అతన్ని" మేఖల గర్జిస్తున్నట్లుగా అంది.
స్విచ్చాఫ్ చేసిన మెఘా మెషిన్ లా తన చేతి పట్టు సడలించాడు అభిరామ్.
రిమోట్ కంట్రోల్ ఏదయినా ఆమె మాటల్లో దాగి వుందా....? అన్నంతగా ఆశ్చర్యపోయింది క్రాంతి.
అక్కడున్న ముగ్గురు యువకులకు, క్రాంతికి, అభిరామ్ మేఖల తమ్ముడన్న విషయం అర్ధమయింది. ఆ నలుగురిలో మిగిలిన యువకుడు గుర్రుగా చూస్తూ-
"ఓహో... ఒకరు అక్కా.... రెండు కాబోయే ప్రక్క.... అన్న మాట. అందుకు పొడుచుకొచ్చిందా పౌరుషం" అన్నాడు అభిరామ్ కి దూరంగా వెళుతూ.
అభిరామ్ మరోసారి వేగంగా అతనికేసి దూకబోయాడు.
ఆ ప్రమాదాన్ని ముందే ఊహించిన మేఖల రెండంగల్లో అభిరామ్ ని సమీపించి అతని చేతిని పట్టుకుంది.
"మమ్మల్నే చావగొట్టి మా బస్తీలో ఎలా బ్రతుకుతావో చూస్తాం. పదండిరా" అన్నాడు తన ఫ్రెండ్స్ కేసి చూస్తూ.
మేఖల అభిరామ్ ని కదలకుండా ఆపి వుంచింది.
అప్పుడాపని చేయకపోతే ఏం జరుగుతుందో ఆమెకి బాగా తెలుసు.
క్రితం రోజు రాత్రి తమ గదికి ఎదురుగా ఉన్న గదిలో దిగినవాళ్ళు వీళ్ళేనన్న మాట. ఆమెకి ఇతను తమ్ముడు. చిరుతపులి లాంటి యువకుడు. స్టేర్ లుక్స్ -- లోతైన చూపులు. అనుక్షణం ప్రమాదాలు తననే చుట్టుముడతాయేమోనన్న అప్రమత్తత. తన అదృష్టం బావుండే వాళ్ళు గతరాత్రి ఎదురు గదిలో అద్దెకు దిగి వుంటారు. క్రాంతి అలా ఆలోచిస్తుండగా మిగిలిన ఇద్దరూ స్ప్రుహ తప్పిపడిపోయిన యువకుడ్ని, చేయివిరిగి కూలబడిపోయిన యువకుడ్ని, చేయివిరిగి కూలబడిపోయిన యువకుడ్ని అటుగా వెళుతున్న రిక్షాలో వేసుకొని వెళ్ళిపోయారు.
"థాంక్యూ వెరీమచ్...." అంది క్రాంతి కృతజ్ఞత నిండిన చూపులతో అభిరామ్ మేఖలకేసి చూస్తూ చిన్నగా నవ్వి ఫర్వాలేదన్న భావాన్ని వ్యక్తం చేసి అభిరామ్ ని తీసుకొని ముందుకు సాగిపోయింది మేఖల.
వాళ్ళు కనుమరుగయ్యేవరకు చూసిన క్రాంతి లోపలకు వెళ్ళి తలుపు లేసుకొని అభిరామ్ గురించి ఆలోచించసాగింది.
* * * * *
"ఎందుకురా అంత ఆవేశం నీకు? అయినా అంత బలాన్ని ఎలా పొందావో నా కర్ధం కావటం లేదు...." అంది మేఖల రోడ్డువారగా నడుస్తూ.
"ఎందుకో అర్ధం కాలేదా?" అతను అసహనంగా అన్నాడు.
"అన్ని వేళలా అంత ఆవేశం, కోపం మంచిది కాదు. అవెంత చేటు తెస్తాయో తరువాత గాని అర్ధం కాదు" అంది మేఖల షాప్ ల కేసి చూస్తూ.
"నేనా సమయంలో ఆవేశపడి ఉండకపోతే ఆ అమ్మాయికి, నీకు ఎంత అవమానం జరిగి ఉండేదో వూహించి చెప్పు"
"కాదనటం లేదు. కాని, ప్రపంచంలోని కసి, ఆవేశం, అసంతృప్తి, ఆవేదన అంతా నీలోనే దాగి వున్నంతగా రియాక్ట్ అవ్వాలా?"
"అదేమో నాకు తెలీదు. కాని అన్యాయం నా కళ్ళెదుట జరుగుతుంటే ణ అరక్తం సలసల కాగిపోతుంది. చూస్తూ వూరుకోలేను."
"సరి.... సర్లే... అక్కడ పోయిందనుకుంటే, ఇక్కడ వీళ్ళ రూపంలో మరలా రౌడీయిజం, గూండాగిరీ మన వెంట బడ్డాయి. వచ్చిన మరుసటి రోజే ఇలా కావటం నాకు ఆందోళన గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం" అంది రోడ్డువారగా కట్టిన పెద్దపెద్ద క్లాత్ బ్యానర్స్ ని చూస్తూ.
అభిరామ్ మాట్లాడలేదు.
మేఖల ఆ బ్యానర్స్ మీద వాటర్ కలర్స్ తో వ్రాసిన మేటర్ ని చదివి అక్కడే ఓ క్షణం ఆగిపోయింది.
ఆ బ్యానర్స్ వెనుక వున్న పెద్ద రెడీమేడ్ బట్టలషాపు వచ్చేపోయే జనంతో కిటకిటలాడిపోతూ కనిపించింది. కొద్దిసేపు ఆగి అప్పుడు షాప్ లోకి వెళ్ళటం బెటరనుకొని ప్రక్కనే కనిపించిన హోటల్ లోకి దారి తీసింది మేఖల.
ఇద్దరూ ఫ్యామిలీ సెక్షన్ లోకి వెళ్ళి టిఫెన్ కి ఆర్డరిచ్చి కూర్చున్నారు.
"When I want to discover something. I begin by read- ing up everything that has been done along that line in the past-that is want all the books in the library are for. I see what has been accomplished at great labor and expense in the past. I gather the data of many thousands of experiments as a starting point and then I make thousands more. The three essentials to achieve anything worth while are first, hard work, second, stick-to-it-iveness, third, common sense.
ప్రపంచ ప్రఖ్యాత పరిశోధకుడు, ఇన్ వెంటర్ అయిన థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పిన విజయ సూత్రం ఇది. దీనినే స్మరించుకుంటూ ఏదయినా చేసి మనం బ్రతకగలం అని నిరూపించు, అప్పుడు అమ్మ దగ్గరకు వెళ్ళాలి. నువ్వు నీ ఆవేశానికి ఆనకట్ట వేసుకొని నాకు సహకరిస్తేనే మనం నిలదొక్కుకోగలిగేది" మేఖల తనెప్పుడో చదివిన ఎడిషన్ కొటేషన్ ని గుర్తుతెచ్చుకుంటూ అంది.
అవేమీ అభిరాం దరిచేరవు.
అతను అర్ధం చేసుకోడు.
అతనికి అర్ధం కావు.
ఈ చెవితో విని ఆ చెవిగుండా వదిలేస్తాడు.
టిఫిన్ వచ్చింది.
ఇద్దరూ టిఫిన్ చేసి బయటకు వచ్చారు. రెడీమేడ్ బట్టల షాపులో జనం కొద్దిగా తగ్గారు.
ఇద్దరూ రోడ్డు దాటి షాప్ లోకి ప్రవేశించారు.
ఆ షాప్ పేరు 'ధర్మాస్'
ఆ నగరంలోకెల్లా పెద్ద రెడీమేడ్ బట్టల దుకాణం అదే. షాప్ ముందు భాగంలో క్యాష్ కౌంటర్ వుంది. ఆ ప్రక్కనే క్యాష్ పెయిడ్ స్లిప్స్ తీసుకొని కష్టమర్స్ సెలెక్టు చేసుకున్న దుస్తుల్ని యిచ్చే కౌంటర్ ఉంది.
వాటిని దాటి ముందుకు వెళ్ళగా అండర్ గ్రౌండ్ సెల్లార్ కి దారి తీసే స్టెప్స్ కనిపించాయి.
వాటి ద్వారా క్రిందకు వెళ్ళారు.
క్రింద ఏజ్ గ్రూప్ ని బట్టి డివైడ్ చేసిన కౌంటర్స్ ఆరేడు కనిపించాయి. ఎదురుగా అదొక చిన్న వీధా అన్నంత భ్రమను కలిగించే కిడ్స్ విభాగం...మేఖల అంతకు ముందెప్పుడూ అంత పెద్ద రెడీమేడ్ దుస్తుల షాప్ ని చూడలేదు.