Previous Page
మారనికాలంలో మారినమనుషులు పేజి 19

    అదీ నలుగురు మొగవాళ్ళు ఓ ఆడదానితోనే రాత్రంతా గడపటం వింతగా, విడ్డూరంగా, అసహ్యంగా తలచిన తనని సుందరం మిత్రులతో ఓ యింటికి తీసుకెళ్ళాడు. అక్కడ తమబోటి ఖరీదైన పెద్దమనుషులు కొందరు కుర్చీల్లో ఆసీనులయివున్నారు. హాలులో మినుకు మినుకు మంటూ ఒక్కటే లైటు వెలుగుతున్నది. ఆ హాలులో సమావేశం అంతా గందరగోళంగా వుంది. నోరు తెరిచి అడగబోతే "చూడు- మాటాడకు." అంటూ సుందరం నోరు నొక్కేశాడు.
    పదినిమిషాల తరువాత ఫిలిం చిన్న తెరపై పడింది. కనీవినీ ఎరగని దృశ్యాలు, నరాలను నలిపి పిండిపారేసే భాగాలు. తను చూస్తున్నది "బ్లూ ఫిలిం" అని తరవాత తెలిసింది. నలభై నిమిషాలలో షో అయిపోయింది. ఆ వేడిలో సుందరం పార్టీతో కలసి మొదటిసారి కిరాయి ఆడపిల్ల వంటిపై చెయ్యి వేశాడు. అదిమటుకు వెగటు కలగలేదు, అలవాటయింది. ఖుషీగా కూడావుంది. శకుంతల కాపురానికొచ్చి ఇన్నేళ్ళయినా తన చూపుల్లో చూపులు కలపదు. దగ్గరకు తీసుకోగానే కనురెప్పలు సిగ్గుతో బరువుగా వాలిపోతాయి.
    "పగలు ఇన్నిమాటలు చేపుతావు కోప్పడతావు, కోపంతో తీక్షణంగా చూస్తావు. దగ్గరకు తీసుకున్నప్పుడు కవ్వింపుగా మాటని కళ్ళలోకి చూస్తే ఏంపోయింది? తొలిరేయి వధువులా సిగ్గుతో ముడుచుకుపోతావు? ఎప్పటికి పోతుందోయ్ శకూ! నీకీ సిగ్గు" అంటే, "నేనేం వెలయాలినికాదు, కళ్ళతో రప్పించి, చూపుల గారడిలో పడేసి, మాటల మెస్మరిజం చేయటానికి. అన్నీ చిలిపికోరికలే, ఆడదానికి సిగ్గేభూషణం" అనేది.
    పరాయి ఆడదానిపట్ల ఆమె చూపులు వక్రంగా వుండవు. చెడుతలంపు కలగదు. శకుంతల అన్నివిధాలా తనని సంతోషపెడుతున్నది. తృప్తి పరుస్తున్నది. అయినా సుందరం పిలవగానే తను హాజరుకావల్సిందే. నిజం చెప్పాలంటే అదో త్రిల్ వెరైటీలో ఆకర్షణవుంది. తను లొంగిపోయాడు. శకుంతల ఇలాంటిపనిచేస్తే తను క్షమించేవాడా? ఇప్పుడు శకుంతల ముందు అంతా నిజంచెప్పి శకుంతల తనకి ఏ శిక్షవిధించినా సంతోషంగా స్వీకరించాలి. మరోసారి ఆ గుమ్మం తొక్కనని ప్రమాణం చేయాలి. తను ఆమాట నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకోగల శక్తి తనకుంది.
    ఆ ఇడియట్ సుందరంగాడు శకూని__
    శ్రీపతి ఆలోచనకు సడన్ గా బ్రేకుపడింది. రిక్షా చటుక్కున ఆగిన కుదుపుకి, రిక్షావాడి మాటలకి.
    "ఏంటి సామీ! వీధి చివరంటూ వచ్చేశాను, ఇల్లేదో చెప్పరేంటి?"
    తన ఇల్లుదాటి ముందుకు వచ్చినట్లు గ్రహించాడు శ్రీపతి. "చూసుకోలేదు ముందుకి వచ్చేశాము. వెనక్కుపద" అన్నాడు.
    "బాగానేవుంది ఇలాంటి బేరమయితే మా చావుకే" అని గొణుగుతూ శ్రీపతి యింటిముందు ఆపాడు వెనక్కి తీసుకువచ్చి రిక్షాని.
    శ్రీపతి రిక్షాదిగి బేరం ఆడినదానికన్నా మరో పావలా ఎక్కువ రిక్షా అబ్బి చేతిలో పెట్టాడు.
    "ఇలాంటి బేరం, ఇంత మంచివాళ్ళు నూటికోసారి ఎక్కుతారు. నా రిక్షాలో ధర్మప్రభువులు కలకాలం సుఖంగా వుండాలి." డబ్బులు చేతిలో పడంగానే ఇందాక తానన్నది మర్చిపోయాడు రిక్షా అబ్బి.
    శ్రీపతి హుషారుగా ఇంట్లో అడుగుపెట్టాడు. ఇల్లంతా చీకటి ,చిన్న లైటుకూడా వెలగటంలేదు. సరాసరి బెడ్ రూమ్ లో అడుగుపెట్టి స్విచ్ నొక్కాడు.
    లైటు వెలిగి గదంతా వెలుగు ఆక్రమించుకొంది.
    శకుంతల మంచంమీద అటుతిరిగి పడుకుని వుంది.
    "అదేంటి శకూ! ఇంటితలుపులు బార్లా తీసిపెట్టావు. లైటు వేయలేదు." శకుంతల దగ్గరకు వస్తూ అడిగాడు శ్రీపతి.
    శకుంతల ఇటు తిరిగి గడియారం వైపు చూచింది. శ్రీపతి వెళ్ళిరావటం గంటన్నరలో జరిగింది. ఎప్పటిలా అర్దరాత్రికో, తెల్లవారుఝాముకో తిరిగి రాలేదు.
    "అదేం, అప్పుడే వచ్చేశారు? పార్టీకి ఏ ఆడదీ దొరకలేదా?" నిష్టూరంగా అంది శకుంతల.
    మంచంమీద నుంచి లేవబోతున్న శకుంతల భుజం మీద చేతులువేసి బలవంతాన కూర్చోబెట్టాడు శ్రీపతి. ఇవాళ జరిగిందేగాక సుందరం స్నేహంనుంచీ తనుచేసుకోబోయిన అలవాట్లు వాటికి తన శరీరమే ఎదురుతిరగటం, యీ విషయంలో పతనం కావటం__పొల్లుపోకుండా అంతా చెప్పి "శకూ! తప్పు మగవాడు చేసినా ఆడది చేసినా ఒకటే. ఏదీ దాచకుండా చెప్పాను. ఎటువంటి శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తాను. నాగుణం నీకు తెలుసు. మాటంటే మాటే. మరోసారి ఏ ఆడదాని శరీరంమీదా చేయివేయను. నీమీద ప్రమాణంచేసి చెపుతున్నాను." శ్రీపతి, శకుంతల తలపై చేయిపెట్టి అన్నాడు.
    శ్రీపతి అబద్దాలాడడు. ఆడవలసిన పరిస్థితివస్తే మాట తప్పిస్తాడు అంతే. ఈ విషయం బాగా తెలుసు శకుంతలకు. ఆడినమాట తప్పడనీ తెలుసు. అయినా అనుమానంగా చూస్తూ "మీరు మారాను అన్నది నమ్మమంటారా!" అంది.
    "అది నాపై నీకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది."
    "అంటే?"
    "నమ్మకమనేది ఎవరికి వారికి కలగాలి. అదిస్థిరంగా వుంటుంది. కల్లబొల్లి మాటలు చెప్పి __ బలవంతాన ఒప్పించేది ,అలాగే వుంటుంది అనుమానస్పదంగా."
    కాసేపు ఆగి "మీరు ఇహపై నే చెప్పినట్లు వినాలి." అంది శకుంతల.
    "అవశ్యం, విన్నవించు ఏంచేయాలో, కృష్ణలో మునగనా? గంగలో దూకనా?"
    "రెండూ వద్దు. అమ్మదగ్గరనుంచి మధ్యాహ్నం లెటర్ వచ్చింది"........
    "మరి ఆఫీసునుంచి రాగానే నాతో చెప్పలేదే?"
    "ఏదీ ఆఫీసునుంచి వస్తూనే 'రాణీ' వద్దకు బయలుదేరే కంగారులో వుంటిరి." రాణీ అన్నమాట నొక్కి పలుకుతూ అంది శకుంతల.
    "సారీ! చూచావా ఆ మాట మరిచిపోయాను. అన్నమాట నిలబెట్టుకోవడం అప్పుడే మొదలైంది నాలో!"
    "ఎవరినివాళ్ళు మెచ్చుకుంటూ తననిగురించి ఎదుటివాళ్ళకు వెగటుగా ఉంటుంది."
    శ్రీపతి మళ్ళీ నోరు విప్పలేదు.
    లెటర్ తీసుకువచ్చి శ్రీపతి చేతిలో పెట్టింది శకుంతల. లెటర్ సాంతం చదవటం చూచి అంది.
    "అమ్మ రాసింది చదివారుగా? ఇన్ని కాగితాలతో తిరిగొచ్చిన కథలా లెటర్ వుంటే ముందు కంగారుపడ్డాను. మొత్తం చదివింతరువాతగాని స్థిమితపడలేకపోయాను. నాన్నగారు వచ్చి జరిగిందానికి ఎంతో బాధపడుతున్నారట. జరుగుతున్నప్పుడు ఏ బాధా వుండదు. జరిగింతరువాత పరిణామం సరిగా వుండకపోతే పెద్ద బాధగా వుంటుంది.
    "అమ్మ ఏపనిచేసినా సరే ఆయన నిర్ణయం తీసుకొనే చేస్తుంది. నాన్నగారు రావటమే ఓ తమాషా! అన్నట్లు పండక్కి పిలవటానికి కృష్ణ వస్తున్నాడు. పండక్కి వారంరోజుల ముందుగా వెళదామా?"
    "వెళదామా? అని అడగకు వెళ్ళాలి ఆఫీసుకి సెలవు పెట్టండి అని ఆజ్ఞాపించు. మీ నాన్నగారు రావటం విచిత్రంగా వుంది."
    "మీరు మారటం నాకూ చిత్రంగానే వుంది."
    "వాళ్ళ మాటలు వినకపోతే నన్ను మార్చటం నీ తరం అయ్యేదికాదేమో శకూ! నిన్ను ఇష్టంవచ్చినట్లు అంటుంటే నా మనసు తూట్లుపడింది. నేను ఆడినమాట తప్పనని తెలుసుకదా? అలాంటిచోట్లకు రానని, ఆ గుమ్మం తొక్కనని ప్రతిజ్ఞ చేసివచ్చాను. నీమీద ప్రమాణం చేశాను. నాకంఠంలో ప్రాణంవుండగా ఆడినమాట తప్పను." శ్రీపతి ఆవేశంగా అన్నాడు.
    గడియారం ఠంగ్ మని అరగంట కొట్టింది.
    "గంటకొట్టింది చూచారా?" అంది ఆనందంతో శకుంతల.
    "అవును. అరగంట అంటే ఎనిమిదిన్నర అయింది. అయితే ఏమిటి?"
    "మీరు ఆడినమాట తప్పరు. మొండిమనిషి అని తను సాక్ష్యం ఇచ్చింది." తృప్తిగా శ్రీపతివైపు చూస్తూ అంది శకుంతల.
    "అంటే?"
    "బుద్దావతారంగారూ! మనమేదయినా అనుకున్నప్పుడు తుమ్ము వినిపించటం అశుభలక్షణం, గంట మోగటం శుభ లక్షణం" మంచంమీద నుంచి లేచి వంటగదికేసి బయలుదేరుతూ అంది శకుంతల.
    శకుంతలను చూస్తూ అనుకున్నాడు శ్రీపతి.
    "మగవాడి తప్పు ఆడది క్షమించినంత తొందరగా ఆడదాని తప్పు మగవాడు క్షమించడు. ఆడది క్షమాధరిత్రి. అవసరమయితే ఆదిశక్తి అందుకే ఆడదాన్ని అబల, సబల అన్నారు పెద్దలు."
    శ్రీపతి అనుకున్నది పూర్తి నిజమే. తన సంసారం కోసం స్త్రీ అన్ని అవతారాలూ ఎత్తుతుంది.
    అదే స్త్రీలో ప్రత్యేకత.
                                __: సమాప్తం :__                         

 Previous Page