ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తెల్ల బట్టల్లో ఠీవిగా గిరి!? ఆమె గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ఏదో పులకరింత, ఏనాడూ ఎరగని ఒక మధురానుభూతి. అతను దగ్గరగా వస్తుంటే కళ్ళు క్రిందకు దించేసుకుంది తడబాటు కనిపించకుండా. అతని స్పర్శ గుండెల్ని ఝల్లుమనిపించింది.
"మన బెడ్ రూమ్ లో పెట్టాలనే కొన్నాను దీన్ని. నీకు నచ్చింది కదూ?" రెండు చేతులతో ఆమెను తనవైపు తిప్పుకుంటూ అన్నాడు గిరి. అతడి చేతుల్లో రతీ మన్మధుల బొమ్మ అందంగా వుంది.
"ఊ" అంటూ అతని గుండెలమీద వాలిపోయింది పద్మజ.
మునివేళ్ళతో చుబుకం పైకెత్తి ఆమె కళ్ళలోకి చూడబోయాడు. ఆమె కళ్ళు దించుకుంది.
"పద్మా, నవ్వు....?" కళ్ళెత్తి అతనివైపు చూసింది. అతని కళ్ళలో ఆశ్చర్యం....కాస్త చిలిపితనం.
తన సిగ్గుని తలచుకుని మరింత సిగ్గుపడింది పద్మజ. ఇంత వయసులో కూడా ఇంకా ఈ పరిస్థితులలో సిగ్గు వదలదేం స్త్రీలను! ఎంత బింకం, జ్ఞానం నటిద్దామనుకున్నా చేత కావడం లేదు.
అతను ఫక్కున నవ్వాడు. ఆమెను గుండెలకు హత్తుకుని పెదవుల మీద సుతారంగా ముద్దుపెట్టుకున్నాడు. పెట్టుకున్నాక "థాంక్యూ" అన్నాడు.
"దేనికి?" అడిగింది ఆశ్చర్యంగా.
"ఇన్నాళ్ళూ నీ మనసునే అనుకున్నాను. ఈ రోజు తెలిసింది నీ తనువునీ నా కోసం జాగ్రత్త చేశావని."
ఆమెకా క్షణం అర్ధంకాలేదు. అతడి కామెంట్ ని అవమానంగా భావించినా "అంత త్వరగా ఎలా బయటపడ్డానబ్బా" అంది నవ్వుతూ.
"తెలిసిపోతూంది - మొదటి కౌగలింతలోనే....నూటికి డెబ్భై అయిదు శాతం ఆ అంచనా నిజమవుతుంది."
"అంత అనుభవం ఉందా?" నవ్వుతూనే అడిగింది. ఆమె కెందుకో మొదటి రాత్రి మొదట్లోనే ఈ టాపిక్ రావటం అంత బాగా అనిపించలేదు.
అంతలో ఆతనన్నాడు - "లేదని అబద్ధం చెప్పను. నాకోసం ఎంతోమంది పడిచచ్చే వారని కోతలు కొయ్యను, యవ్వనంలో ఒకటి, రెండు చిన్న అనుభవాలున్నాయి. అంతే, కానీ ఒక్క విషయం. నువ్వు చదివి అర్ధంచేసుకోనివి నేను జీర్ణం చేసుకోగలిగాను. ఈ విషయంలో మాత్రం నేను జీనియస్ నని నువ్వు ఒప్పుకోక తప్పదు. దాన్నే కొన్ని క్షణాల్లో ఋజువు చేయబోతున్నాను."
పద్మజ నవ్వింది.
"ఎందుకు నవ్వుతున్నావు? నా ఆరాటం చూస్తే నీకు నవ్వుగా ఉందా?"
"మీరంటున్న దాని గురించి కాదు నా స్నేహితురాలు పారిజాతం ఉత్తరం గుర్తొచ్చి! గ్రాడ్యుయేషన్ అవగానే పెళ్ళయింది దానికి. మొదటి రాత్రి భర్తతో ముద్దు పెట్టుకుంటేనే పిల్లలు పుట్టేస్తారనీ, దానికి మించి సెక్సంటే మరొకటుందని తనకు తెలియనే తెలియదనీ చెప్పిందట. అది బి.యస్సీ చదివిందని తెలిసీ, అన్ని నవలలూ, డిటెక్టివ్ నవలలతో సహా చదువుతుందని తెలిసినా పాపం నమ్మేశాడట ఆయన. 'తొమ్మిదో క్లాస్ నించి స్వపరాగా సంపర్కం, పరపరాగ సంపర్కమూ చదువుకుని వెధవ జోకులన్నీ వేసేదానివి కదే, ఎందుకలా చెప్పావని అడిగాను. 'పెళ్ళయేంతవరకు సెక్సంటే ఏమిటో తెలియని స్త్రీని ఎక్కువ గౌరవిస్తారు మగాళ్ళు. అది వాళ్ళ ఈగోని సంతృప్తి పరుస్తుంది' అంది. దాని విషయంలో అది నిజమే అయింది. ఇప్పటికీ 'పెళ్ళయేవరకూ నా భార్యకు సెక్సంటే ఏమిటో తెలియదు' అని అందరికీ చెప్పుకుంటాడాయన. ఎంత అమాయకుడు అని నవ్వుకుంటాం ఆయన గురించి. కాబట్టి మొదటి స్పర్శలోనే స్త్రీ గురించి ఒక నిర్ణయానికి వచ్చేయకండి." నవ్వుతూ రిటార్ట్ ఇచ్చింది.
"కానీ నీ విషయంలో మాత్రం నా అంచనా తప్పదు పద్మా! నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళూ సోమశేఖరంతో నీ పరిచయం ఎంతవరకు ఉందోననే ఆలోచన అప్పుడప్పుడు నాకు వచ్చేది. అంటే నీ మీద అనుమానంతో మాత్రం కాదు. జస్ట్ క్యూరియాసిటీ అంతే. అతడంటే అసూయ కూడా కలిగేది. కానీ ఇప్పుడు నువ్వు చెప్పకుండానే నా క్యూరియాసిటీ తగ్గింది. నేను అదృష్టవంతుడిని! సోమశేఖరం కన్నా ముందు నిన్ను అప్రోచ్ అవటం....
సోమశేఖరం ప్రసక్తి రాగానే పద్మజ ముఖంలో మార్పు వచ్చింది. "వద్దు! అవన్నీ ఏమీ చెప్పనవసరం లేదు. దటీజ్ పాస్ట్" అంది కాస్త సర్దుకుని.
పద్మజ శరీరాన్ని గాలిలోకి రెండుచేతులతో ఎత్తి మెత్తటి పరుపు మీద అతి సున్నితంగా దించాడు గిరి.
ఆమెలో ఏళ్ళనాటి యవ్వనం మేల్కొన్నట్లనిపించింది. కోరికలు, వాంఛా....ఎదురుగా పురుషత్వానికి మారుపేరుగా కనిపించే భర్తా. ఆచ్చాదన తొలగి, భావాలు యవ్వన భారాలై తొంగి చూస్తున్న తరుణం - ఒక్క క్షణం మాటల్తో నివారించబోయి, అతని పెదవుల తాళంలో మూతపడి, ఎగిసిపడ్తున్న ఆవేశానికి యిక కట్టలు వేయడం సాధ్యం కాక, పిల్ల కాలువలో నుంచి తన పొలంలోకి పారే నీటిని చూసుకుంటున్న రైతు కళ్ళలోని సంతృప్తి, అకస్మాత్తుగా పెద్దతనం నిండిన భావన - ఏదో తెలియనితనంలో అంతా అవగాహన అయిపోయిన అనుభూతి....
అలాంటి అనుభూతిలో,
ఒక్కక్షణం,
రెండు క్షణాలు....
అయిదు క్షణాలయినా గిరి అలికిడి వినిపించకపోవడంతో కళ్ళు తెరిచింది.
గిరి మంచంమీద నిటారుగా కూర్చున్నాడు. అతని కళ్ళు శూన్యంలో దేన్నో వెతుకుతున్నాయి.
"ఏమిటి గిరీ - ఏమయింది?" అడిగింది ఆశ్చర్యంగా.