Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 18


    అన్నీ సమస్యలే, సందేహాలే మాకు.
       ...     ...    ...
    ప్రశ్నలే. ప్రశ్నలే.
    జవాబులు సంతృప్తి పరచవు.
       ...     ...     ...
    వూరుకున్నాను.
    "చూశావా. ఎంత మూర్ఖంలో, అజ్ఞానంలో ఉన్నావో"
    "కాని ఎవరు జ్ఞానులు యీ గుంపులో! ఎవరికి తెలుసు? వాళ్లని వచ్చి నన్ను నమ్మించ మనండి."
    "వాళ్లకేం పట్టింది నీ దగ్గిరికి వచ్చేందుకు?"
    "పోనీ నేను నెడతాను, వాళ్ళ దగ్గిరికి"
    "అంత సులభమా! ఎన్నేళ్లు శుశ్రూష చెయ్యాలి!"
    "ఏమీ? సత్యం తెలుసుకోడానికి అంత శ్రమా?"
    "ఒక్క వయసు తెలుసుకోడానికి పదిహేనేళ్ళు చదువుతారే__"
    "అప్పటిదాకా యిట్లా సందేహంలోనే వుంటాను."
    "అప్పటిదాకా యీ కష్టాలు పడడమెందుకు? అందరిమల్లే_"
    "ఇప్పుడు నన్ను రానిస్తారా?"
    "నేను చేరుస్తాను. నువ్వు మాత్రం, ఆ జంధ్యం వేసుకుని_"
    తల వూయించాను__
    "ఎట్లానూ బ్రహ్మసమాజంలో లేవుగా?"
    జంధ్యం వేసుకుంటే గొప్ప ఉద్యోగాలు ఇప్పిస్తానన్న బంధువుడి సంగతి చెప్పాను.
    జంధ్యం కోసం నేను చేసిన త్యాగాలు మా చుట్టూ పకపక నవ్వాయి.
    కులం వదిలేశానన్నవాణ్ణి చూస్తే, కులహీనత్వంతో బాధపడేవాళ్లకే చాలా కోపం - కులంలో అధికులమనుకునేవాళ్లమీది కోపం వల్ల, వాళ్ళు కులాలు వదులుకుంటే సంతోషం రాదు. కులంలో వుండి ఆ కులానికి చెందడం వల్ల వాళ్లు బాధలు పడితేగాని కసి తీరదు. మాకో అధికారి వుండేవాడు. అతని కులం అతనికే సందేహం. అందుకని కులం వున్నవాళ్లని చూస్తే మండిపడేవాడు. అంతేకాదు, తన ధనాన్ని, మానాన్ని, సుఖాన్ని, త్యాగం చేసి, నీచత్వానికి లోబడి, ఆ గొప్ప వుద్యోగం సంపాయించడం వల్ల, తాను త్యాగం చేసిన వాటి విలువ, ప్రస్తుతం అందరి మొహానా తన ఘనత చూపించుకుని, తిరిగి ప్రతిష్టించుకోవాలని ప్రయత్నం. ఎట్లానన్నా తన పుటకనీ, past నీ మరిచి 'మరిపించి' తన శక్తీ తెలివీ తనని పైకి తీసుకొచ్చాయని ప్రతివారికీ చూపాలని అగచాట్లు.
    'నన్ను చూడండి, నేను...' అని లెక్చర్లు. లోకచరిత్రలో తన ఎగపాకడం వంటి ఘనవిషయం ఎన్నడూ జరగలేదని యితరుల మీద impress చెయ్యాలని. అది గుర్తించకపోతే, తాను చెప్పినా అంగీకరించకపోతే ద్వేషం. ప్రమోషన్లు గాక వేరు విలువలున్న మనుషుల్ని చూస్తే, కసి. ఉన్నత కులాలమీద ద్వేషాన్ని పరిశీలిస్తే ఈనాడు అదే తేలుతుంది. ఎంత ప్రపంచం మారినా, ఎంత న్యూనత సంభవించినా, యీ భౌతిక విషయాలనించి అధికమైన విలువలవైపు చూస్తారనీ, ఏంచేసినా, తమ plane లోకి దిగరనే కోపం ఇంకా.
    అందువల్లనే సులభంగా తమ దుర్గతికి యీ కులాలూ, అందులో అగ్రకులాలూ కారణమనీ, వాళ్లని కూలతోస్తేనేగాని లోక కళ్యాణం కలగదనీ వాదన. తమ బలహీనత్వమే, తమ అవసరమే, తమ క్షేమమే సుఖమే. ఒకనాడు యీ సమస్యల్ని ఏర్పరిచిందని మరిచిపోతారు. కావలసి ఏదో మోసం చేసి ఎవరో ఆధిక్యతలోకి దూకి అన్యాయం చేశారనుకుంటారు. ఈ దేశస్థులు ఇంగ్లీషు వాళ్ళనీ, స్త్రీలు పురుషుల్నీ నిందించడానికి కూడా ఇదే కారణం.
    ఆ అధికారి నన్ను తీసుకువెళ్ళి, "ఈ పుస్తకం తీసుకుని రాత్రికి చదువుకోండి" అన్నాడు.
    తనకి అంత మంచి taste వుందని నాకు చెప్పడం కోసం.
    "ఆ కథలు చిన్నతనంలో చదివేవాణ్ణి. వాటిని ఇప్పుడు భరించలేను" అన్నాను.
    రెండు నిమిషాలు తెరిపారచూశాడు, తన చెవులు నిజంగా ఆ మాటల్ని విన్నాయా అని_ జన్మకి ఆరోగ్యవంతమైన ఓ అనుభవాన్ని పొందుతున్న ఆ మనిషి. "మీరేం చదువుతారు ఐతే?" అన్నాడు ఒణుకుతున్న కంఠంతో.
    సామాన్యంగా అందరూ చదివే బతికివున్న కొత్త ఊహలిచ్చే నలుగురు ఇంగ్లీషు రచయితల పేర్లు చెపితే, ఎన్నడూ ఆ పేర్లన్నా వినలేదు ప్రమోషన్ల వ్యాపారంలో ఇరవైయేళ్ళు గడిపిన ఆ మనిషి.
    "అందరూ గొప్పవాళ్ళూ, దొరలు కూడా చదువుతారు యీ కథల్ని."
    గొప్పవాళ్ళూ, ఇంగ్లీషు వాళ్లూ అనే మాటలు synonyms కావని అనేది ఈనాటికి కూడా తెలుసుకోని అధికారి.
    అధికారం రాగానే దాంతోపాటు సర్వజ్ఞత్వం, సకల సుగుణత్వం...సర్వ శక్తిత్వం... వచ్చిందనే.
    తనకన్నా తక్కువ జీతం గలవాడు_ కాయితం మీద తనని, sir అనేవాడు, తనకన్నా గొప్పవవాడని భరించడం ఎంత కష్టం_
    అధికారం చేతులో వున్నా, ఎంత ఆ అధికారాన్ని రుద్దినా, తమకి లోబడుతూ వున్నా...
    డిగ్నిటీ వున్న dependant ప్రజల్ని,
    తృణీకారం చూపే భార్యల్ని,
    మాటపడని నౌకర్ని,
    ఆధిక్యత చూపే subordinate ని చూస్తే ఎంత క్రౌర్యం! ఎంత ద్వేషం!
    ఈ ద్వేషం ముఖ్యంగా unsucessful artists మీద చూపుతారు. "ఏమిటి? బొమ్మలు గీసాడూ? ఇంకేమీ చెయ్యకూడదూ?"
    "ఎవరండీ?"
    "నేను సంగీత విద్వాంసుణ్ణండి"
    ప్లీడరు గారి తలకాయి కాయితాల మీదికి దిగుతుంది.
    "అయితే__"
    ఆ పాటకుడి అరికాలు దుమ్ము తలని ధరించడానికి తగని ఆ 'డబ్బు ఏరుళ్ల గాడి' తల.
    "ఎందుకండీ యీ కథలూ, పద్యాలూ_ ఏం లాభమండీ_"
    అని డాక్టర్లు, తమ శవాల్ని కాల్చిన బూడిద! disintegrate అయ్యి పంచభూతాల్లో కలిసిన వెయ్యేళ్లకి లక్షలకొలది ప్రజలకి సౌందర్యానికి కళ్లు చూపే కవిని.

 Previous Page Next Page