Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 18


    "శూలం పాతి, దానిమీద కూర్చోబెడతారు."


    నవ్వి నవ్వి రాజా కళ్ళెంబడి నీళ్ళు తిరిగాయి.


    "తమాషాగానే వుంది" అని, యింకా అన్నాడు రాజా.


    "ఇదేవుంది గానీ, యింతకంటే తమాషా జోకొకటి చెప్తా పైలోకం గురించి" అని చెప్పడం మొదలెట్టాడు.


    "ముగ్గురు మనుషులు చచ్చి పైకెళ్ళారు. అక్కడ ఒక దేవదూత చిట్టా అంతా తిరగేసి మొదటి వాడితో అన్నాడు -


    "నువ్వు చాలా పవిత్రంగా బతికావు! ఎప్పుడూ అమ్మాయిలతో వ్యవహారాలు పెట్టుకోలేదు. అందుకని నీకు ఖరీదయిన మెర్సిడెస్ బెంజ్ కారు ఇస్తున్నా. దీన్లో ఎక్కి షికార్లు కొడుతూ, తింటూ, తాగుతూ కాలం గడిపెయ్" అని మెర్సిడెస్ బెంజ్ కారు తాళాలు ఇచ్చాడు.


    హుషారుగా కూనిరాగం తీస్తూ వెళ్ళి కారెక్కి వెళ్ళిపోయాడు ఆ పవిత్రుడు.


    రెండో వాడివేపు తిరిగాడు దేవదూత.


    "నువ్వు అంత పవిత్రుడివేం కాదు. అయినా అమ్మాయిలతో వ్యవహారాలన్నీ పెళ్ళికి ముందే కానిచ్చేశావ్! పెళ్ళయ్యాక పరాయి ఆడదానివేపు కన్నెత్తి చూడలేదు. అందుకని నీకు ఇదిగో ఈ ఇండియన్ అంబాసిడర్ కారు ఇస్తున్నా! దీన్లో షికార్లు కొట్టు" అని తాళం చెవులు ఇచ్చాడు.


    రెండోవాడు అంబాసిడర్ లో ఎక్కి వెళ్ళిపోగానే, మూడోవాడివేపు తిరిగాడు దేవదూత.


    "నీ సంగతి ఇక్కడ రికార్డయి ఉంది. నువ్వు పెళ్ళికి ముందూ, పెళ్ళికి తర్వాత కూడా చెడు తిరుగుళ్ళు తిరిగావు. అందుకని నువ్వీ స్కూటర్ తో తృప్తిపడు. వెళ్ళు" అన్నాడు.


    బతుకు జీవుడా అంటూ మూడోవాడు స్కూటరెక్కి ఆకాశవీధుల్లో విహారాలు మొదలెట్టాడు.


    కొంత దూరం వెళ్ళగానే పరమపవిత్రుడయిన మొదటివాడు కనబడ్డాడు స్కూటర్ వాలాకి. తన ఖరీదయిన మెర్సిడెస్ బెంజ్ కారుని ఓ పక్కన ఆపి, స్టీరింగు మీద తల పెట్టుకుని దిగాలుపడి ఉన్నాడు.


    "మంచివాడివని మెర్సిడెస్ బెంజ్ కారు ఇచ్చారుగా! ఇంకా దిగులెందుకూ?" అన్నాడు స్కూటర్ వాలా.


    బెంజ్ కారు అతను చెప్పాడు. "ఇప్పుడే నా భార్య కనబడింది. డొక్కు సైకిలు తొక్కుకుంటూ వెళ్తోంది తను" అన్నాడు కళ్ళనీళ్ళ పర్యంతమయి.


    ఆనందరావుగారు ఏమనుకుంటాడో అని భయపడుతున్నట్లు ఆయన మొహంలోకి చూశాడు కృష్ణాజీ.


    అతను ఊహించినట్లు ఆనందరావుగారికి కోపం రాలేదు. దయగా చూస్తున్నాడు ఆయన.

    
    రాజాతో మృదువుగా అడిగాడు ఆయన.


    "ఎవరు చెప్పారు ఈ జోకు నీకు?"

    
    "జాస్మిన్!" అన్నాడు రాజా.


    "జాస్మిన్ అంటే...."


    చిన్నగా దగ్గాడు కృష్ణాజీ.


    జాస్మిన్ ఎవరో చెబితే ఆనందరావుగారు పూర్తిగా భయపడిపోయి, రాజాని తన దగ్గర ఉంచుకోననే ప్రమాదం కూడా వుంది.


    "జాస్మిన్ అంటే..." అన్నాడు రాజా మళ్ళీ.


    మాట మార్చేశాడు కృష్ణాజీ.


    "రాజా ఆప్షన్స్ ఇంకేం ఉన్నాయో కనుక్కోండి ఆనందరావుగారూ!"


    "రౌడీలకు రౌడీవయ్యే అవకాశం రానివ్వంగానీ...అది కాకపోతే యింకేం అవుతావు?" అన్నాడు ఆనందరావు.


    ఠకీమని చెప్పాడు రాజా.


    "గ్రేట్ గాంబ్లర్! లేకపోతే కిల్లర్! లేకపోతే రెజ్ లర్! ఏదీ కుదరకపోతే జాకీని అవుతా!"


    నవ్వాడు ఆనందరావుగారు.


    'చాలామంది నీ వయసు కుర్రాళ్ళు డాక్టరో, యాక్టరో అవ్వాలనుకుంటారు. అలాంటి ఆలోచన లేదా?"


    "డాక్టర్ జాబ్ బోరు! యాక్టరంటారా? మొహానికి రంగేసుకోవడం అంటే నాకు నామర్దా!"


    రాజా ఇంట్రెస్టుని తక్కిన విషయాలవేపు మార్చే అవకాశం దొరికినట్లనిపించింది ఆనందరావుకి. వెంటనే అన్నాడు -


    "భాష ఎంత చిత్రంగా ఉంటుందో చూశావా? నామర్దా అంటే ఏమిటి?"


    "చిన్నతనం! సిగ్గు లేకపోవడం."


    "కాదు! నామర్దా అంటే నామరద్...మొగతనం లేకపోవడం... అదే తెలుగు వాడకంలో నామర్దా అయిపోయింది. అలాగే యింకా ఎన్నెన్నో పదాలు ఉన్నాయి. ఉదాహరణకి చిన్నపిల్లలని ముద్దుగా "భడవా" అని తిడుతుంటారు. భడవా అనేదానికి ఎంత భయంకరమైన అర్థం వుందో వాళ్ళకి తెలియదు. 'భడవా' అంటే "తార్పుడుగాడు" అని అసలు అర్ధం."


    "బ్రోకరన్నమాట!" అన్నాడు రాజా తనకు తెలిసిన పదాన్ని ప్రయోగిస్తూ.


    రాజా ఇంట్రెస్టుని ఇంకొంచెం టెస్ట్ చెయ్యదలుచుకున్నాడు. ఆనందరావు చెప్పాడు. "అలాగే, నంగనాచి అని అంటుంటాం. దీనికి మూలం "నంగే నాచీ" అంటే బట్టలిప్పి డాన్సు చెయ్యడం! తెలుగులోకి వచ్చేసరికి "ఏమీ తెలియని" అని అర్థం వచ్చింది."


    "భాషలు చాలా చిత్రంగా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకి ఇంగ్లీషు వుంది. ఎన్ని భాషలనుంచో, ఎన్నెన్నో పదాలని అరువుకి తెచ్చుకుని, అది ప్రపంచ ప్రసిద్ధమైన భాషగా రూపు దాల్చింది. తెలుగు పదాలు కూడా నాలుగైదు చేరాయి ఇంగ్లీషులో."

 Previous Page Next Page