Previous Page Next Page 
గోరింటాకు పేజి 18


    "నా కర్మని నిందించుకుంటాను."

 

    "నువ్వు పెళ్ళికాని అమ్మాయివిగదా, ఇలా ఒక పరాయివాడిని 'నేనంటే నీకు ఇష్టమా అని అడగొచ్చా?"

 

    "ఎవరుబావా నాకు పరాయివాళ్ళు? నువ్వు ఎంతకఠినంగా మాట్లాడతావు? పోనీ దీనికి సమాధానం చెప్పుబావా! నీ ముందు ఈ రాత్రివేళ సిగ్గూ, బిడియం వదిలి ఇలా గ్రతిమాలినదానిలా మాట్లాడుతున్నందుకు ఎంత కుమిలిపోతున్నానో, నువ్వు అర్థం చేసుకునే రోజు వస్తుందా? ఎందుకు నీకీ మౌనం? నేను చేసిన అపరాధం ఏమిటి చెప్పు బావా! దీనికి సమాధానం పొందకపోతే నాకు శాంతిలేదు."

 

    "ఒక మనిషిని ఇంత ఇరకాటంలో పడెయ్యటం నీకు న్యాయం కాదు సత్యవతీ! ఉన్నపళంగా నేను ఏమి సమాధానం చెబుతాను?"

 

    "ఉన్నపళంగానా? దీన్ని గురించి ఇంతకు పూర్వం నువ్వెప్పుడూ  ఆలోచించనే లేదా?" అందామె నివ్వెరపోయినట్లు.  

 

    ఆమె దుఃఖం ఆపుకుంటున్నట్లుగా అనిపించింది. "ఏం బావా! నేను నీకు తగనా?" అంది కొంచెం ఆగి.

 

    నేను జవాబు చెప్పలేదు.

 

    "నేను చదువుకోలేదని అసహ్యమా?"

 

    నేను పలుకలేదు.

 

    "నేను అందంగా లేనుకదూ! నాకు తెలుసుబావా! దేముడు నన్నిట్లా పుట్టించాడు. నేను కోరరాని కోరికను కోరుకుంటున్నాను.

 

    "సత్యవతీ!" అన్నాను చప్పున. "అలా మాట్లాడొద్దు నువ్వు. నేను నిలకడలేని మనిషిని. నేను ఏ సమయంలో ఏంచేస్తానో నాకే తెలీదు. మా ఇంట్లో అందరకూ నేనంటే చికాకు అందుకే. నన్ను పెళ్ళిచేసుకున్న ఆడదికూడా ఏమీ సుఖపడలేదు. అసలు పెళ్ళిని గురించి ఇంతవరకూ నేనెప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించలేకపోవచ్చు ఇప్పట్లో. అయినా ఎందుకు నేనంటే నీకీ వెర్రి? నేను చాలా అల్పుణ్ని. నువ్వు నాకు ఇంత పెద్దశిక్ష విధించకు. నిన్ను ప్రార్ధిస్తున్నాను సత్యవతీ! నన్ను విడిచిపెట్టు." 

 

    "అయిందా బావా!" అందామె విచారంగా. "ఈ జవాబుకోసమే కదూ నే నిన్నాళ్ళూ వేచివుంది? నేను నీకింత పనికిమాలిన వస్తువునైపోతానని కలలోకూడా తలపోయలేదు బావా! ఏదో ఆశ. పోనీ నిరాశ. ఏనాడైనా కాస్త కనికరం కలిగితే కొంచెం కబురుచెయ్యి బావా! వెయ్యి కళ్ళతో నీరీక్షిస్తున్న ఈ అల్పప్రాణికి."

 

    "ఏడవకు సత్యవతీ!"

 

    "నేను ఏడిస్తే నీకు కష్టంగా వుందా బావా?"

 

    నేను జవాబు చెప్పలేకపోయాను. "చాలా రాత్రి అయింది. వెళ్ళి నిద్రపో సత్యవతీ! ఈమధ్య నీకు వంట్లో బాగాలేదని విన్నాను."

 

    "బాగానే వుంటున్నదే! ఎవరు చెప్పారు నీకు ఈ అబద్ధం?"

 

    అది అబద్ధమోకాదో ఆమెకేసి ఒక నిమిషం పరీక్షగా చూస్తే తెలుసుకోవచ్చు. "వస్తాను బావా!" అంటూ లేచింది.

 

    "నేను మొద్దులా కూర్చుని వున్నాను. పాపం, నీవు నిలబడే వున్నావు. పాపిష్టిదాన్ని. ఇంతసేపూ ఈ విషయం తోచనేలేదు సుమా!" అన్నది.  

 

    నాకు కడుపులో యేదో కదిలినట్లయింది. మెదలకుండా ఊరుకున్నాను.

 

    "సెలవు బావా! నమస్కారం!" అంటూ వెళ్ళిపోయింది సత్యవతి.

 

    నేను నిశ్చేష్టుడనై నిలబడిపోయాను. అప్పుడే అక్కడనుంచి పారిపోయి వచ్చేద్దామనుకున్నాను. కాని అది అనుమానానికి హేతువు. అందుకని మనసు ఎంత క్షోభిస్తున్నా అక్కడనే పడుకున్నాను. వచ్చి వెళ్ళిపోయింది సత్యవతి.

 

    సంభాషణకూడా సాధ్యమైనంతవరకు లోతుగా పోకుండా వుండేందుకు నేను జాగ్రత్తపడ్డాను. కాని దీనివల్ల నాకేం ఒరుగుతుంది? ఎందుకు, ఆమె అంటే నాకు జాలితప్ప మరోభావం కలగడంలేదు. ఈ సన్నివేశం ఏదో మనోహరంగానే వుంది. కాని ఆమె నా హృదయాన్ని ఆక్రమించుకోలేకుండా వుంది. నేను కఠినాత్ముణ్నా? లేక నాకు హృదయం అనేది లేదా? మేమిద్దరం కలిసి చనువుగా మెలిగింది ఎప్పుడూ లేదు. ఏ కొద్దినాళ్ళో తప్ప ఆమెతో ఎక్కువ సంభాషించలేదు. పెద్దదైనాక మరీ కొద్దిసార్లు. మరి ఎందుకు నేనంటే ఈ భ్రాంతి? నేను దక్కాలని నోము నోచింది. పాణీ! దీనికి సమాధానం నువ్వే చెప్పు. వద్దు, చెప్పకు. నీ సున్నిత హృదయాన్ని ఇలాంటి కఠినమైన ఆలోచనల్తో బాధపెట్టకు. నిజమే, నాకు వాళ్ళంటే ఏమీ అభిమానంలేదు. మంటకూడా. అదేనా ఆమె అంటే ఈ అనాదరణకి కారణం? అదే అయితే నేను చాలా తుచ్ఛుడనని చెప్పుకోవాలి. కాని నన్ను పరివేష్టించివున్న ఏదో అమానుష శక్తి నన్ను "నీకీ పెళ్ళివద్దు" అని ఘోషిస్తున్నట్లుగా వుంది. ఏమయినా నేను నా మనసుకి ఎదురు తిరగలేను. కొంచెం కన్నీళ్ళు కారితే కారనియ్యి. గుండె కాస్త మండితే మండనీ. మతి కాస్త చలించితే చలించనీ."

 

    "పాణీ! నీకు చెబుదామనుకున్న అసలు విషయం ఒకటుంది. తీరా ఇంతవరకూ వచ్చేసరికి రాయనా, వద్దా అని సంకోచంగా వుంది. ఎవరికో ఒకరికి చెప్పకపోతే ఆందోళన తగ్గేటట్లు లేదు."

 

    "ఏమిటో పాణీ! నా జీవితానికి చెత్తశకం వచ్చినట్లుగా వుంది. అనుభవాలు మనసుని గందరగోళపరచటం ఇదే తొలిసారి. ఈమధ్య ఒక పుస్తకంలో చదివాను. యాదృచ్ఛికంగావచ్చిపడే సంఘటనలకూ, జీవితానికీ అసలు సంబంధంలేదనీ, కొంచెం వున్నా అది మనస్సులోనేగాని ఆత్మలో కాదనీ. నిజానికి అలా జరిగితే బాగుండునని నాకూవుంది. కాని బయటకు చెప్పనుగాని, ప్రతిదాన్నీ నాలో హత్తుకునేటట్లు చేయటం, నా జీవితంలో అలావచ్చే ప్రతిచిన్న అంశానికీ చోటు ఇవ్వడం నాలోవున్న ఒక దుర్గుణం."

 

    "నా గది పరిసరాలనుగురించి కొంచెం రాయనియ్యి. ఒక మేడమీద రెండుగదుల చిన్నభాగం నేను నివసించే స్థలం. మిగతాదంతా డాబాయే. ఐతే డాబాకి ఇంకా కొన్ని మెట్లు యెక్కి పైకిపోవాలి. చుట్టు ప్రక్కల అంతా పెద్ద పెద్ద హోదాలలో వున్న వ్యక్తులు. క్రిందిభాగంలో ఓ ఆఫీసరుగారు కాపురముంటున్నారు. వాళ్ళందరిలోకి నేనే అనుకుంటా తక్కువస్థితిలో ఉంది. పల్లెటూరు బైతుని, సభ్యత అంతగా తెలియనివాడినికదా."  

 

    "ఆఫీసరుగారికి ఓ ముప్ఫై ఐదు ఏళ్ళుంటాయి. మనిషి ఎర్రగా, బలంగా, పొట్టిగా వుంటాడు. ఆయనకి నెలకి ఇరవై రోజులు క్యాంపు. ఆయన ఇంట్లో ఎవరెవరు ఉంటారో, స్థితిగతులేమిటో నాకు నిన్న మొన్నటిదాకా తెలియవు."

 Previous Page Next Page