"నమ్ము, బిలీవ్ మీ! ఓ డాక్టరుగా చెపుతున్నాను. ఎన్నో సంవత్సరాలు డాక్టరు వృత్తిధర్మంలో వున్న అనుభవంతో, ఓ పరిశీలకుడుగా చెబుతున్నాను. ఇది సాధ్యం.
నీలో వున్న ఆ భావాలు తొలగించుకో ఆహార నియమాలు కూడా అతి జాగ్రత్తగా పాటించు. నీకు ఫలితం తప్పకుండా దక్కుతుంది."
కొన్ని నెలలతరువాత ఆమె మళ్ళీ కలిసింది. ఇప్పుడామె ముఖంలో కొత్త తేజస్సు కనబడుతోంది. వయసు రెండు మూడేళ్ళయినా తగ్గినట్లు ఆరోగ్యం వెల్లివిరుస్తోంది.
"మీరు చెప్పినట్లే నా ఆలోచనా సరళిని మార్చుకోగలిగాను. ఇప్పుడు నాకెంతో బావుంది.
"Every day, Every time I feel better, better and better."
"నేను డిపార్ట్ మెంట్ టెస్ట్ పాసై ప్రమోషన్ కి సిద్దంగా వున్నాను. నా జబ్బులు కూడా తగ్గిపోయినట్లున్నాయి. నా భర్తతో స్వచ్చమైన సంతోషంతో వుండగలుగుతున్నాను."
ఆమె గుండెలోతుల్లోంచి ఈ మాటలు వచ్చినట్లు అర్ధమవుతోంది.
* * *
'నిన్ను నీవు ప్రేమించుకో' అని కొన్ని పేజీల ముందు రాయటం మొదలుపెట్టాను. అదింకా పూర్తికాలేదు.
ఇందాకటి అధ్యాయం క్లుప్తంగా రాద్దామనుకున్నా ఎక్కువ ఎందుకు విశదీకరించాల్సి వచ్చిందంటే ఎంతోమంది జీవితాహాలు అందులో వున్నట్లనిపించింది. ఎంతమందికో అది ఉపయోగపడుతుందనిపించింది. అందుకని లోతుల్లోకి వెళ్ళి పోయాను.
ఇప్పుడిక నీలోకి వద్దాం.
ప్రతివ్యక్తికీ తన రూపంమీదా, మనసుమీదా, ప్రవర్తనమీదా ఒక అవగాహన వుండాలి. ఎలాంటి అవగాహన? ఆత్మపరిశీలనతో కూడిన అవగాహన ఎలాంటి ఆత్మపరిశీలన? నిన్ను నీవు అర్ధంచేసుకోగలిగే. అంగీకరించగలిగే, ఆమోదించగలిగే, అసహ్యించుకునే స్థాయినుంచి బయటపడేసే, నీమీద ఇతరులు నిర్దాక్షిణ్యంగా వేసిన ముద్రలు చెరిపేసే, నిన్ను నీవు ఇతరులతో పోల్చుకునే స్థితినుంచి ఇవతలికి తీసుకు వచ్చే, నిన్ను నీవు భరించుకోగల స్థితినుంచి ప్రేమించుకోగల స్థితికి చేరవేయగలిగే ఆత్మపరిశీలన.
ఆత్మ పరిశీలన.
ఎంత గొప్ప అవసరం!
మనిషి మనసును కవ్వంతో చిలికినట్లు చిలికి అందులోంచి 'ఎదుగుదల' అనే వెన్నును చిలికే శక్తివంతమైన సాధన.
అయితే మనిషి ఆత్మపరిశీలనకూ, ఆత్మన్యూనతకూ తేడా తెలుసుకోలేక పోతున్నాడు.
నన్ను నేను కలుపుకుంటూ ఒక ఉదాహరణతో ఈ అంశాన్ని విశడీకరించటానికి ప్రయత్నిస్తాను.
కొన్ని సంవత్సరాలక్రితం నా దగ్గరకు ఓ యువకుడు వచ్చాడు బాగా చదువుకున్న మేధావిలా కనబడుతున్నాడు. కొంచెం పొట్టిగా, తగుమాత్రం శరీరదారుఢ్యంతో వున్నాడు.
"నాకు తెలివితేటలున్నాయి. చాలా మంచి వుద్యోగముంది. అయినా పర్సనాలిటీ లేకపోవటంవల్ల జీవితంలో చాలా పోగొట్టుకుంటున్నాను" అన్నాడు అతని మాటల్లో చాలా దిగులు నిస్పృహ వినిపిస్తున్నాయి.
"ఏం పోగొట్టుకున్నారు?" అన్నాను.
"సొసైటీలో అందరిముందూ గేలిచేస్తూ వుంటారు నా పొట్టితనాన్ని గురించి ఆటువంటప్పుడు చాలా అవమానంగా వుంటుంది. ఎలాగో భరిస్తూ వచ్చాను. పెళ్ళి సంబంధాలొచ్చాయి. ఇద్దరు ముగ్గురు అమ్మయిలకి నా క్వాలిఫికేషన్స్, ఉద్యోగం అన్నీ నచ్చినా, పొట్టిగా వున్నానని తిరస్కరించారు. ఆ గాయాన్ని తట్టుకోలేకుండా వున్నాను."
అతని బాధ అర్ధమవుతోంది.
"వాళ్ళమాటలు అలా వుంచండి. మిమ్మల్ని గురించి మీ ఉద్దేశం ఏమిటి?"
"నన్ను నేను భరించలేకుండా వున్నాను. నామీద నాకే రోతగా వుంది."
"నావంక చూడండి" అన్నాను. అంటూ లేచి నిలబడ్డాను.
"నేనెలా వున్నాను?"
"మంచిపొడవు, తెలుపు... మీ పర్సనాలిటీ చూస్తే అసూయగా వుంది. అమెరికన్ లా వున్నారు."
"ఈ మాటే చాలామంది ఇప్పుడంటున్నారు" అంటూ మళ్ళీ సీటులోకి వెళ్ళి కూర్చున్నాను.
"ఇప్పుడంటే...?"
"ఒకప్పుడు... నారూపం చాలామంది హేళనలకు గురైంది. నన్ను రకరకాల పేర్లుపెట్టి పిలిచేవారు. అలా పిలవటంలో వారనుభవించే వినోదం ప్రస్ఫుటమయ్యేది. ఈ వినోదంలో రెండురకాలున్నాయి ఒకటి- ఏమాత్రం అవకాశమొచ్చినా అవతలి వారిని కించపరచాలన్న రాక్షస మనస్తత్వం రెండు.... అవతలివ్యక్తిని అవమానపరచి తమ గొప్పతనాన్ని పెంచుకోవాలన్న వికృతస్వభావం ఈ రెండూ ప్రతి మనిషిలోనూ దాగుని వుంటాయి ఎంతోకొంత శాతంలో అసలు మానవజాతి మనుగడ అంతా ఈ స్వభావాల పిడికిలిలోనే ఇరుక్కుని వున్నదనిపిస్తుంది. చాలా బాధపడేవాణ్ణి. మామూలు బాధకాదు, జీవితేచ్చ నశించిపోయేటంత బాధ నన్ను నేను ద్వేషించుకునే స్థితికి వచ్చేశాను. ఎందుకంటే.... ఎన్ని అవమానాలకు గురయ్యానో లెక్కలేదు.
"దీన్నిగురించి చాలా ఆలోచించాను మనసును ఓ యజ్ఞవేదికచేసి ఆలోచించాను. ఆ ఆలోచనలలోంచి ఓ కొత్తభావన ఆవిర్భవించింది.
"ఆ భావన కృత్రిమంగా మభ్యపెట్టుకున్నదికాదు. మనసును మథించగా అందులోంచి ఉత్పన్నమైన ఓ శక్తివంతమైన సత్యం.
"హఠాత్తుగా నన్ను నేను అంగీకరించుకునే స్థితికి వచ్చేశాను. ఆ అంగీకారం ప్రేమగా మారిపోయింది."
"అంటే.... నన్ను నేను ప్రేమించుకోసాగాను.
"అలా నన్ను మనసారా ప్రేమించుకోవటం మొదలుపెట్టిన క్షణం నా జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. నా శరీరంలో, మనసులో ఏవో మార్పులు రాసాగాయి."
నా బరువు సమతులం కాసాగింది. అద్దంలో చూసుకున్నప్పుడు నా ముఖం నాకు కొత్తకళతో కనిపించసాగింది.
జీవితంమీద నా అవుట్ లుక్ మారిపోవటం కాదు, నన్ను గురించిన ఇతరుల లుక్ మారిపోసాగింది.
ఇప్పుడు మీరన్నట్టే 'మీ పర్సనాలిటీ చాలా బావుటుందండీ!' అనేవారు చాలామంది.
"నేను కారులోంచి దిగుతుంటే ఆరాధనాభావంతో ఓ హీరోను చూసినట్లు చూసేవారు కొందరు.
ఎందరో ఆడపిల్లలు నాకు ప్రేమలేఖలు రాయసాగారు.