Previous Page Next Page 
నానీ పేజి 17


    అంత టెన్షన్ లోనూ యశస్వి పెదవులు మృదువుగా విచ్చుకున్నాయి.

 

    నిజమే.

 

    హరితని కలిసి ఇరవైనాలుగు గంటలు దాటిపోయింది.

 

    షుగర్ ఫ్యాక్టరీ ఛైర్మన్ కూతురైన హరిత యశస్వికి పరిచయమైంది సుమారు నాలుగునెలలక్రితమే అయినా ఈ నాలుగునెలల్లోను ఎంత దగ్గరయిందీ అంటే నేరస్థులూ, నేరాలమధ్య తలమునకలయ్యే అతనికి పెద్ద రిలీఫ్.

 

    మనిషిమాత్రమేకాదు మాటలూ, అంతకుమించి మొండితనంతో యశస్వి లాంటి టఫ్ పోలీసాఫీసరునే కంగారుపెడుతూ వుంటుంది.

 

    "కానిస్టేబుల్స్ ని పంపమంటారా సర్" అన్నాడు గుర్నాధం వినయంగా.

 

    "దేనికీ?"

 

    "ఆ పెద్దమనిషిని, అదే ఆ కనిపించనాయన్ని వెదికించడానికండి." సిన్సియర్ గా జవాబిచ్చేసరికి "నేను చూసుకుంటాను" అనేసి వెళ్ళమన్నట్టుగా సౌంజ్ఞ చేశాడు.

 

    ఫోన్ రిసీవర్ని అందుకుని డయల్ చేశాడు.

 

    "హల్లో" హరిత అందుకుంది. "ఎవరూ?"

 

    "నేనే. మిస్సింగ్ బోయ్ యశస్విని" వెంటనే అవతలివైపునించి జవాబు రాకపోయేసరికి "కోపంగా వుందా?" అన్నాడు.

 

    "ఉండక... సంతోషంగా వుంటుందా... చూడు మిష్టర్ మిస్సింగ్ పెద్దమనిషి. నిజం చెప్పని క్రిమినల్స్ ని మీరు థర్డ్ డిగ్రీ ట్రీట్ మెంట్ లో పనిష్ చేసారుకదూ."

 

    "ఆఫ్ కోర్స్."

 

    "మరి నిన్న సాయంకాలం కలుస్తానని అబద్ధం చెప్పిన నీకు నేనేం పనిష్ మెంటివ్వాలి అది చెప్పు."

 

    "నేనెక్కడ మాట తప్పానూ?"

 

    "మరో అబద్ధమా."

 

    "అదికాదు... నీ కంప్లయింట్ ప్రకారం కలలోకొచ్చి నానా అల్లరి చేస్తున్నాగా."

 

    "ఛీ... రాయటానికి నాకు సిగ్గులేదు సరే... అడగటానికి నీకన్నా వుండాలా" ఆమెగొంతులో అస్పష్టంగా బిడియం ధ్వనించింది.

 

    "అవునూ... ముద్దులు పెట్టానన్నావు. ఆ ఏరియాస్ కాస్త వివరంగా చెప్పేయరాదూ."

 

    "ఎందుకు?"

 

    "నేరస్థుల వ్రేలిముద్రల్లా నీ ఒంటిమీద నా పెదవుల ముద్రలు ఎక్కడున్నాయో చెక్ చేయటానికి."

 

    నవ్వేసింది. "చెక్ చేసి ఏమి చేస్తావు?"

 

    ఐపిసిలో ఏ సెక్షను ప్రకారం నేను నేరస్థుడ్నో వెరిఫై చేసుకుని ఆ తర్వాత నువ్వు కస్టడీలోకి తీసుకుంటే అక్కడ శిక్ష అనుభవించేద్దామని."

 

    "అబ్బా... ఆశ."

 

    "అయితే వీలులేదంటావు."

 

    "ఆహఁ"

 

    "అయితే ఈసారి కలలోకొచ్చి..."

 

    "వచ్చి..."

 

    "సెక్షన్ 375 తెలుసుగా..."

 

    "ఏంటి?"

 

    "ఒక ఆడపిల్ల ఇష్టానికి విరుద్ధంగాగాని, ఆమెను బెదిరించిగాని, బలాత్కారంగా..."

 

    "రేప్."

 

    "కరెక్టు."

 

    "రాక్షసుడివి."

 

    "అవును నేరస్థులంతా నన్నలాగే పిలుస్తుంటారు."

 

    "అందుకని నన్ను రాక్షసంగా 'అదే...' చేసి అల్లరి పెడతానంటావు" ఆగింది క్షణం! "ఒకవేళ నేను ఇష్టపడ్డానే అనుకో!"

 

    "అప్పుడు అది బలాత్కారం క్రిందరాదు."

 

    "నీ ఐ.పి.సి. బుక్ మూలకి విసిరేసి నా దగ్గరకిరా."

 

    "దేనికి?"

 

    "నీ శక్తిసామర్ధ్యాలు ప్రదర్శించడానికి."

 

    "నిజం" ఉత్సుకతగా అడిగాడు.

 

    "కాకపొతే దానికి ముందుగా నువ్వో చిన్న పజిల్ కి జవాబు చెప్పగలగాలి" ఆగిందో క్షణం. "మరేంలేదు... మీ డిపార్టుమెంటంటే నాకు పాపం చిన్నచూపు. అందులో నువ్వు కాస్త అరుదైన కేరెక్టరువీ అన్న నమ్మకం వుందనుకో. అందుకే పన్నెండుగంటల టైమ్ యిస్తున్నాను. అంటే సాయంకాలం ఏడుగంటలదాకా అన్నమాట. కరెక్టుగా జవాబు చెప్పావనుకో నీ ఇష్టం. నీ సెక్షన్ 375 తో సంబంధం లేకుండా నువ్వన్నదానికి నేను సిద్ధపడతాను."

 

    "ఓకే."

 

    రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది హరిత "చాలా చాలా శతాబ్దాల క్రిందటి మాట. ఓ రాజ్యాన్ని నాలాంటి ఓ యువరాణి పాలిస్తూందట. అక్కడ నీలాంటి విప్లవకారుడు మహా అల్లరి పెట్టేస్తుండేవాడట. ఒకనాడు తన సేనలతో అతడ్ని బంధించి కస్టడీలోకి తీసుకుందట. అర్థమైందా?"

 

    "అయింది."

 

    "అప్పుడా రాణి ఆ తెలివైన విప్లవకారుడితో చిన్న సమస్య ఇచ్చింది. నీ ప్రాణాలు తీయడం మాత్రం ఖాయం. కాకపోతే పోయేముందు నువ్వేదన్నా "ఒక నిజం" చెబితే సింపుల్ గా ఉరితీస్తాను. లేదా ఆడపిల్లల్ని నీమీదికి పంపి నిన్ను ఇష్టమొచ్చినట్టు సెడ్యూల్ చేయించి ప్రాణాలు తీస్తానందట. బోధపడిందా?"

 

    "పడింది పడింది."

 

    "అప్పుడు ఆ యువకుడు ఓ నిజం చెప్పాడు. చెప్పి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. అదేదో నువ్వు చెప్పగలగాలి. చెబితే సాయంకాలం ఏడుగంటలకి మా డాడీ ఎలాగూ క్లబ్బుకి వెళతాడు కాబట్టి ఇక నీ ఇష్టమొచ్చినట్టు నన్నేమన్నా చేసుకోవచ్చు సరేనా!"

 

    "అలాగే!"

 

    "నమ్మమంటావు."

 

    "నీ శీలంమీదొట్టు."

 

    "చూస్తాగా!" ఫోన్ క్రెడిల్ చేసింది.

 

    హరిత చెప్పిందోమారు మననం చేసుకున్న యశస్వి పెదవులపైన సన్నగా చిరునవ్వు మెదిలింది అప్పుడే జవాబు స్ఫురించినట్టు.  

 

                                        *    *    *

 Previous Page Next Page