డయాస్ పైన రెండు టేబుల్స్ ముందు కూర్చుని ఉన్నారు ప్రణయ, ఆదిత్య ప్రబంధ, సుధీర్.
"నిజానికి ఎంట్రీస్ చాలా అందినా చివరి క్షణంలో కాన్సిల్ చేసుకున్నారు."
దానికి కారణమైన శౌరి ఈ స్టేట్ మెంట్ కి ఆనందించలేదు. పార్టీసిపేషన్ కి వచ్చిన గుంటూరు ఏసి కాలేజి, విజయవాడ లయోలా కాలేజీ విద్యార్ధుల్ని బెదిరించి చివరి క్షణంలో రంగంనుంచి తప్పుకునేట్టు చేశాడు కాని ఆదిత్య ప్రణయల్ని నిరోధించలేకపోయాడు.
"సో... ఇప్పుడు పోటీలో మిగిలింది..." పరిచయం చేశాడు రాధాకృష్ణ. "రెండు జంటలూ యూనివర్శిటీ కాంపస్ కి చెందినవాళ్ళు కావడం విశేషంగా భావిస్తున్నాను."
అందరూ ఉత్కంఠగా చూస్తుండగా నిబంధనల్ని తెలియజేశాడు రాధాకృష్ణ.
"నిర్వహణ సమయం గంట. ఈ సీల్డ్ కవర్ లోని క్విజ్ క్వశ్చనీర్ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ప్రతి జవాబుకీ మార్కులు ఐదు. జవాబు ఆలోచించుకునే వ్యవధి ముప్పై సెకండ్లు మాత్రమే. గడువు పూర్తికాగానే క్విజ్ మాస్టర్ గా నేను బజర్ నొక్కుతాను. వెంటనే రెండో బాచ్ నుంచి జవాబు రావాలి. యాభయ్ రెండు నిమిషాలపాటు ఇలా కార్యక్రమం కొనసాగాక మిగిలిన ఎనిమిది నిమిషాలు ఒక్కోజంటకి నాలుగు నిమిషాల చొప్పున కేటాయిస్తారు. ఇట్సే టెస్ట్ ఫర్ స్పాంటేనిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఒక్కో జంటనీ ఆ నాలుగు నిముషాల వ్యవధిలో ఎనిమిది ప్రశ్నలు అడగడం జరుగుతుంది. పది సెకనుల గడువులో జవాబు చెపుతూపోవాలి. అలా మరో నాలుగు నిమిషాలలో రెండో జంటని మరో ఎనిమిది ప్రశ్నలు. ఈ ప్రశ్నలు క్విజ్ మాస్టర్ గా నేను అడిగేవి. అంటే నా నిర్ణయానికీ, నా అభిరుచికీ సంబంధించినవి"
ఆడిటోరియం ముందువరుసలో కూర్చున్న శౌరిని క్షణంపాటు చూశాడు రాధాకృష్ణ. అన్నమాట ప్రకారం తన అమ్ములపొదిలో కొన్ని అస్త్రాల్ని దాచుకున్నాడు రాధాకృష్ణ. అది కేవలం ప్రబంధని రక్షించాలని. అర్ధం పర్ధం లేని ప్రశ్నలతో ఆదిత్య, ప్రణయల్ని యిబ్బందిపెట్టడానికే అని శౌరి గ్రహించడంతో ఉత్సాహంగా పిడికిళ్ళను బిగించాడు.
"చివరిలో నేను అడిగే ఆ బిట్ క్వశ్చన్స్ కి ఒక్కోదానికి నాలుగు మార్కులుంటాయి" చెబుతున్నది ఆపిన ప్రొఫెసర్ రాధాకృష్ణ తన సీటు దగ్గరకు వెళ్ళాడు.
క్విజ్ మాస్టర్ పక్కగా కూర్చుని వున్న ఓ అమ్మాయి యూనివర్శిటీ విద్యార్ధిని స్కోర్ నోట్ చేస్తూ మాస్టర్ కి సహకరించటానికి వచ్చింది.
"నౌ.... లెట్స్ స్టార్టిట్" సరిగ్గా అయిదు గంటల నలభయ్ అయిదు నిముషాలకు మొదలయింది క్విజ్ కార్యక్రమం.
టీమ్ 'ఎక్స్'కి చెందిన ప్రబంధ, సుధీర్ లను చూస్తూ అడిగాడు "హీబ్రూలో జీసస్ అంటే రక్షకుడు అని అర్ధం. మరి క్రూస్ట్ అంటే అర్ధం ఏమిటి? అసలు ఆ పదం ఎలా వాడుకలోకి వచ్చింది?"
ప్రబంధ ఆలోచించలేదు "క్రైస్ట్ కమ్స్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ "క్రిస్టోస్' ఆ గ్రీకు పదం తెలుగులో క్రీస్తుగా మారింది. క్రిస్టోస్ అంటే అర్ధం అభిషేకం."
"రైట్" ఈసారి టీమ్ 'వై' వేపు తిరిగాడు క్విజ్ మాస్టర్ "నౌ టీమ్ వై.....శిలువ వేసున్న సమయంలో తన తల్లి విషయంలో శ్రద్ద తీసుకోమని జీసస్ ఎవరికి చెప్పాడు?"
ఆదిత్య చెప్పాడు "ఆయన ప్రియ శిష్యుడు జాన్ కి."
"రైట్."
టీమ్ 'ఎక్స్' ని ప్రశ్నించాడు "రెండో ప్రపంచ యుద్ద ప్రారంభకాలంలో డెన్మార్క్ దేశంలో ఓ అండర్ గ్రౌండ్ ఉద్యమం మొదలైంది. వినాశకులుగా మారిన దేశభక్తులు గల ఆ ఉద్యమంలో వ్యక్తులు చేసిన పనులను బట్టి బి ఎస్., ఎం. ఎస్. డిగ్రీలు యిచ్చారు. వాటి ఫుల్ ఫార్మ్ చెప్పాలి."
హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
పది సెకండ్ల గడువు మిగిలి వుందనగా చెప్పింది ప్రబంధ "బి.ఎస్. అంటే బేచులరాఫ్ సెబడేజ్, ఎం.ఎస్ అంటే మాస్టరాఫ్ సెబడేజ్."
"వెరీ కరెక్ట్"
"హుర్రే" శౌరి కేకతో ఆడిటోరియం ప్రతిధ్వనించిపోయింది. తన చెల్లెలు గొప్ప ఫారంలో వుండటం గమనించి వుత్సాహపడుతున్నాడు.
"నౌ.... టీం వై రెండో ప్రపంచ యుద్దంలో అమెరికా తరపున యుద్దంలో పోరాడి యోధుడుగా కీర్తి పొందిన ఓ వ్యక్తి ఆ తరువాత హాలీవుడ్ స్టార్ అయ్యాడు. అతని పేరు?"
టక్కున అంది ప్రణయ "ఫస్ట్ లెఫినెంట్ అడిలియాన్ మర్ఫీ..."
ఆడిటోరియం నిశ్శబ్దంగా వుంది.
మొదటి వరుసలో శౌరితోబాటు సూరి కూడా కూర్చున్నాడు. కాని రియాక్షన్ లేదు. అది ఉద్విగ్నతో, ప్రశాంతతో అతనికే తెలీదు. స్థబ్ధంగా చూస్తున్నాడంతే.
క్విజ్ మాస్టర్ ఈ సారి టీం ఎక్స్ ని అడిగాడు.
"ప్రపంచంలో హెవీ వెయిట్ బాక్సింగ్ లో ఛాంపియన్ అయిన మొదటి నల్ల జాతీయుడెవరు?"
ఇప్పటికి పెదవి విప్పాడు సుధీర్ "మొహమ్మద్ ఆలీ...."
"రాంగ్..." క్విజ్ మాస్టర్ నిర్ణయం చెబుతుండగానే కరెక్టుచేసింది ప్రబంధ.
"జాక్ జాన్సన్."
"రైట్" తలపంకించాడు క్విజ్ మాస్టర్.
"ఐ ఆబ్జెక్ట్ సర్!" ప్రణయ జోక్యం చేసుకుంది. "మిష్టర్ సుధీర్ జవాబు తప్పు చెప్పాడు. ఆ తరువాత మిస్ ప్రబంధ కరెక్టు వేస్తే మీరు రైట్ అనటం సరికాదు. ఒకే ప్రశ్నకి జవాబు చెప్పే అవకాశం వుండేది ఒకేసారి."
"అవును" ఆడిటోరియంలో కేకలు వినిపించాయి.
క్విజ్ మాస్టర్ ప్రొఫెసర్ రాధాకృష్ణ ఎటు మొగ్గాలో తెలీక సందిగ్ధంలో పడి ఆలోచిస్తుంటే, ఆవేశంగా లేచాడు శౌరి "సరే.... ముఫ్ఫై సెకండ్ల గడువులో ఎన్నిసార్లు తప్పు చెప్పినా ఆ గడువు తీరేలోగా కరెక్టు ఆన్సర్ చెబితే చాలు."
"అఫ్ కోర్స్..." శౌరిని సమర్ధించబోయాడు రాధాకృష్ణ.
"సర్!" ప్రణయ లేచింది మళ్ళీ "మధ్యంతరంగా మీ ఊహల నుంచి పుట్టుకొచ్చిన నిర్ణయాలు నియమాలుగా మారిపోవు. జవాబు చెప్పే ముందు కావాలీ అంటే మిస్ ప్రబంధ, మిస్టర్ సుధీర్ ఓసారి చర్చించుకోవచ్చు కాని ఒకే ప్రశ్నకు జవాబు చెప్పాల్సింది ఒకేసారి"