"వేళా పాళా లేనట్టు ఈ టైం లో వచ్చి..." అంటూ మనవరాలిమీద ఉడుకుమోత్తనంతో కోపం ప్రకటించాడేగానీ విజూష మొహం చూసి ఆగిపోయాడు.
విజూష ఎప్పటిలా లేదు.
ఏకాంతపు గదిలో తనని తానే ప్రతిష్టించుకునే తన స్వప్నరాగాల సరాగాన్ని మరెవరికయినా ఎందుకు పంచాలమ్మా అనుకునే పసిపాప మనస్తత్వంతో నిశ్శబ్దపు వూడలపై వూయలలూగుతున్నట్టు విజూష కళ్ళు ఆందేళన్ని నింపుకున్నాయి.
మనసు గదిలో ఏ మూలనో పేర్చుకున్న భాస్వర స్వప్నాల్ని తల అనుమతి లేకుండా ఎరో అంటించడానికి ప్రయత్నిస్తుంటే అలజడి చెందుతున్నట్టు....
తన ఆలోచనల సజీవ ముగ్దలావణ్య శాఖలకి ఒద్దికగా అంటించుకున్న నందివర్దనాల దరహాస వీచికల్ని ఏకీచకులో దోచుకుంటున్నట్టు....
వెన్నెలలో ముంచిన మనసు కుంచెతో ఇప్పుడిప్పుడే ఏ రూపాన్నో చిత్రించాలని....
కుంకుమ పూల అంతర్లోకంలోకి అడుగుపెడుతుంటే చీకటి జడివానలో ఎగరలేని చక్రవాకంలా రెక్కలు తెగిపోతున్నట్టు....
ఎదను 'ఎర' లా కొరుకుతున్న ఏ భావమో మనసుకి పట్టిన స్వేదమై
పలుకలేని నాదమై.....
పగలడానికి సిద్దంగా వున్న నినాదమై...
అర్దంకాని వివాదమై....
అంకురించిన ప్రళయ ప్రణయాక్షరాల వేదమై....
"ఎందుకు గ్రాండ్ పా.. .నేను ఎవరికి భార్యని కావాలీ అన్నది డాడీ మాత్రమే ఎందుకు నిర్ణయించాలి?"
గౌరీనాధంగారి ముఖం వివర్ణమైపోయింది.
అణువంత ప్రశ్నట
కాని...
అణ్వాయుధమంత జవాబు వుంది.
అయినా ఎన్నోసార్లు విజూష ముందే ప్రసాదభూపతి ఈ ప్రసక్తి తీసుకొచ్చాడే....
ఎప్పుడూ లేనిది ఈ రోజు ఎందుకిలా రియాక్టవుతోంది విజూష?
"కొంపదీసి ..." అనలేదు.
"ఎవర్నయినా ప్రేమించావా?"
సాధ్యమైనంత ప్రసన్నంగా అడిగాడు తన మొహంలో కదిలే నీడలు కనిపించకుండా జాగ్రత్తపడుతూ.
విజూష కళ్ళల్లో ఓ కాంతిరేఖ మెరిసి మాయమైంది.
ఆమె చెంపలు క్షణకాలం ఒలికించిన మధూలికల రాసులయ్యాయి.
ఆకతాయిగా మాట్లాడే విజూషని చిలిపిగా అల్లపి పెట్టాలనుకుని ఇప్పుడు ఏ కూడని విషయమో తెలుసుకున్నట్టు వెంటనే అన్నాడు "మీ డాడీకి ప్రేమంటే గిట్టదని నీకు తెలుసుకదమ్మా"
"తెలీదు గ్రాండ్ పా... డాడీ గురించి చాలా తెలిసిన నాకు డాడీకి ప్రేమంటే గిట్టదని తెలీదు."
గౌరీనాధంగారి గొంతు తడారిపోయింది.
నిజమే!
సూటిగా విజూషకి ఆ విషయం ఆమె తండ్రి చెప్పలేదు.
అసలు ప్రేమనే పదం ఆ లోగిలిలో వినబడితే సహించలేని ప్రసాదభూపతి ఎందుకలా మారిందీ విజూషకి తెలియకుండా పెంచారు.
బహుశా ఆ భావం విజూష జీర్ణించుకోవాలనే తను ఎన్నుకున్న అబ్బాయే ఆ ఇంటి అల్లుడవుతాడని ప్రసాదభూపతి పరోక్షంగా ఆమె ముందు చాలాసార్లు వ్యక్తం చేసాడేమో.
"అయినా...."
గౌరీనీధంగారి గొంతు తడబడింది.
"అర్దరాత్రి హఠాత్తుగా వచ్చి ఈ టాపిక్ దేనికమ్మా? ఇందాక మీ డాడీ ఫోన్ లో అన్న మాటల్ని విని రియాక్ట్ అయ్యావ్ కదూ?"
ఓదార్చబోయాడు గానీ ఆమె అవకాశం యివ్వలేదు.
"అదొక్కటే కాదు గ్రాండ్ పా! ఆ తరువాత మీరు, డాడీ నా కోసం ఫైనలైజ్ చేయబోతున్న కెనడా సంబంధం గురించి కూడా విన్నాను.
నిర్లిప్తంగా చూసారాయన.
నిజమే...
తన కొడుకు ఇప్పటికే పైనలైజ్ చేసాడు.
వయోవృద్దుడు మేధస్సు కలవాడయినా కొడుక్కి ఎదురు చెప్పలేని మనిషి.
అందుకే తన నిస్సహాయతని కప్పిపుచ్చుకుంటూ అన్నారాయన.
"అయినా ఆ కెనడా సంబంధం మంచిదేగా. "
"ఇప్పుడు నేను మంచి చెడుల గురించి మాట్లాడటానికి రాలేదు గ్రాండ్ పా" ఆపితే ఆమె నేత్రాల నుంచి అశ్రువులు జారేట్టు ఉక్రోషంగా అంది.
"ఒక ఆడపిల్ల పెళ్లికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది పెద్దలు కాదు. అలా మీరు డిసైడ్ చేస్తే నేను సరే అనలేను."
"కానీ మీ డాడీ ఎంత మొండిఘటమో...."
"మీకు తెలుసు గ్రాండ్ పా" ఆర్దోక్తిగా అంది విజూష.
"కానీ నేను రేపు ప్రదర్శించే మొండితనం గురించి మీ యిద్దరికీ తెలీదు" ఆవేశంగా బెడ్ రూం లో నుంచి నడవబోతూ ఠక్కున ఆగింది.
"ఒక్క విషయం గ్రాండ్ పా. నేను కోరుకుంటున్నది ఖచ్చితంగా నాకు దక్కుతుందో లేదో నాకు తెలీదు.
అది దక్కినప్పుడే నేను పెళ్లికూతురుగా మీకు కనిపించేది.
లేదూ అంటే నా జీవితంలో పెళ్లనే ప్రసక్తి వుండదు.
ఉన్నట్టుండి ఈ రోజు ఎందుకిలా మాటాడుతున్నానూ అని ఆలోచించి మనసు పాడుచేసుకోకు గ్రాండ్ పా.
ఎందుకంటే మనసు పాడుతుందని, పాడవుతుందని నాకూ తెలిసింది ఈ రోజే. ఒక విస్పోటనం తర్వాత వేగంగా వెళ్లిపోయింది విజూష.