Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 18


    త్రినాథ్ మెల్లగా పెదాలు విడీ విడనట్లు నవ్వాడు.

    "మీకు స్వధర్మమేదో వుండి వుండాలి. అది నాతో నెరవేరవచ్చని మీ నమ్మకం అయి వుండాలి. అది ఏమిటని నేనడగను. అడగకుండానే నెరవేర్చుకోగల అసాధారణ ప్రజ్ఞాపాటవాలు మీకున్నాయి. దాన్ని నేను నెరవేర్చటమే నా గురుదక్షిణ అవుతుంది" అంటూ కదిలాడు.

    ఇద్దరూ జీప్ దగ్గరకు నడిచారు. ముందుగా త్రినాథ్ ఎగిరి డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. ఆ తర్వాత ఆమెవేపు చూసి చిరునవ్వు నవ్వాడు.ఆమె అర్ధమయిందన్నట్లుగా తలూపి అతని ప్రక్కనే కూర్చుంది.

    ఆమె ఇప్పుడు అతనికి డ్రైవింగ్ నేర్పబోతోంది.

    అద్భుతమైన లావణ్యాన్ని సంతరించుకున్న ఆమె నాజూకయిన చేతివేళ్ళు ఇనుపముక్కలాంటి అతని మొరటు వేళ్ళపై పడ్డాయి.

    ఆమె డైరెక్షన్ లో అతని చేతిలోని జీప్ ముందుకు దూకింది.

    "నీ ఛాలెంజ్ లో నీవెలా విజయం సాధించాలో ఇప్పుడు చెబుతున్నాను. గుర్తుపెట్టుకో.

    యావానర్థ ఉదాపానే   
    సార్వత స్సంప్లుతోదతె
    తావాన్ సర్వేషు వేదేషు
    బ్రహ్మణన్య విజానతః!||

    అంతటా నీరు సమృద్ధిగా దొరుకుచున్నప్పుడు నూతియొక్క ఉపయోగమేమీ వుండదు. అలాగే బ్రహ్మము నెరిగిన బ్రహ్మణునకు వేదములు కూడా అంత మాత్రమే సాయపడును-"

    త్రినాథ్ చూపులు రహదారిపైకి, ఆలోచనలు ఆ శ్లోకం పైకి వెళ్ళాయి.

    అతని మెదడు పాదరసం కన్నా వేగంగా పనిచేసుకు పోతుంది.

    "ఈ శ్లోకంలోంచే నీ లక్ష్యసాధనకో మార్గం ఉద్భవిస్తుంది- శోధించు అదేమిటో-" అని తర్వాత మౌనం వహించింది.

    జీప్ సిటీ వేపు దూసుకుపోయింది.


                                                   *    *    *    *


    అర్దరాత్రి నిశ్శబ్దంలో పల్చటివెన్నెల వెలుగులో గది బయట కూర్చున్నారు త్రినాథ్, హిందూ, ఇంజనీర్, సైంటిస్ట్ లు.

    తన నేలమాళిగలోనే చంపి అవతల పారేస్తాడని సుదర్శన్ రావు నుంచి తామూహించిన ప్రమాదాన్ని నేర్పుగా దారి మళ్ళించాడు. దాన్నే ఇంకా నమ్మలేకపోతున్నారా ముగ్గురు. అంతలోనే మరో కొత్త ఆలోచన చెప్పాడు. ఎలా సాధ్యం-? ప్రతి విషయాన్ని ఎంత తేలిగ్గా, విశ్వాసంతో ఆలోచిస్తున్నాడు? ఏమిటీతని ధైర్యం...?

    తలవంచుకుని వున్న త్రినాథ్ వేపు ఆ ముగ్గురూ విస్మయంగా చూస్తున్నారు.

    కొద్ది ఘడియల నిశ్శబ్దం తర్వాత త్రినాథ్ తలెత్తాడు.

    "అంత కష్టమా...?" త్రినాథ్ పదినిమిషాల క్రితం వేసిన ప్రశ్నే తిరిగి వేశాడు.

    అదే ప్రశ్నను రెట్టించటంలోనే అతని ఆత్మవిశ్వాసం కన్పిస్తోంది.

    ముగ్గురూ విస్తుపోయి చూశారే తప్ప సమాధానం ఏం లేదు.

    హిందూ మాత్రం నోరు విప్పింది.

    "మోసం అవుతుందేమో త్రినాథ్?"

    "మోసం కాదు. వాడికా అవసరం కల్పించి, మనం సొమ్ము చేసుకుంటాం. ఇంకేం ఆలోచించవద్దు. నీవా హోటల్ మేనేజర్ తో మాట్లాడి కేవలం నాలుగు రోజులు పర్మిషన్ ఇప్పించు చాలు..." అంటూ త్రినాథ్ లేచాడు.


                                                   *    *    *    *


    కౌంటర్ లో కూర్చున్న ఓబరాయ్ హోటల్ మేనేజర్ హిందూని దూరం నుంచే చూసి పలకరింపుగా నవ్వాడు.

    హిందూ వచ్చేసరికి అతను కౌంటర్ నుంచి బయటకు వచ్చి "ఏమ్మా, బావున్నారా?" అన్నాడు.

    పల్చటి చిరునవ్వుతో తలూపింది హిందూ. అప్పటికే మేనేజర్ హిందూ ఏదో పనిమీద వచ్చినట్టు గ్రహించాడు.

    "ఒక నాలుగురోజులపాటు నా ఫ్రెండ్ కి మీ హోటల్ స్విమ్మింగ్ ఫూల్ దగ్గర జాబ్ ఇప్పించాలి..."

    ఎవరి రికమండేషన్స్ తో వచ్చే జాబ్ నాకక్కర్లేదని ఇంట్లోంచి వెళ్ళిన ఈమె హఠాత్తుగా ప్రత్యక్షమయి ఎవరో ఫ్రెండ్ కి, అదీ నాలుగు రోజులపాటు మాత్రమే జాబ్ అడగటం, అందులోనూ స్విమ్మింగ్ ఫూల్ దగ్గర అడగటం ఆశ్చర్యంగా వుంది మేనేజర్ కి.

    అయినా అదంత తేలికైన విషయం కాదు. అలా అని కాదనలేడు.

    "సరేనమ్మా... కేవలం నాలుగురోజులపాటు మీ ఫ్రెండ్ కి మీరు కోరినట్లే జాబ్ ఇస్తాను. ఒకసారతన్ని తీసుకొచ్చి చూపించమ్మా. మరో విషయం... స్టార్ హోటల్స్ లో జాబంటే సాధారణ విషయం కాదు. అయినా మీకోసం ఇప్పిస్తున్నాను. జాగ్రత్తగా, మా కస్టమర్స్ కి ఇబ్బంది కలిగించకుండా వుండాలి" అన్నాడు మేనేజర్. తను చేయబోతున్న సాయం చాలా గొప్పదన్న భావం హిందూకి కమ్యూనికేట్ చేస్తూ.

    "థాంక్స్. అది మీకు, నాకు మధ్యే వుండాలి" అంటూ హిందూ వడివడిగా బయటకు నడిచింది.


                     *    *    *    *


    వాసమ్మకి తన కొడుకులో వచ్చిన చిత్రమైన మార్పును పసిగట్టడం అంత కష్టమేం కాలేదు. ఎప్పుడూ బారెడు పొద్దెక్కేదాకా నిద్రలేవని తన కొడుకు తెల్లవారుఝామున నాలుగు గంటలకే ఉలికిపాటుగా లేవటం, హడావుడిగా బయటికెళ్ళటం ఆమెకు విస్మయంగా వుంది.

    అందుకే ఆమె ఆ రాత్రి నిద్రపోలేదు. చాపమీద పడుకుందేగాని ప్రశాంతంగా వుండలేకపోతోంది.

    క్షణాలు- నిమిషాలు- గంటలు- కరిగిపోతున్నాయి ఆ నిశీధి గర్భంలో.

    సరీగ్గా నాలుగుగంటలు కొట్టింది దూరంగా వున్న చర్చ్ గంట. చటుక్కున ఆమె చూపులు కొడుకువేపు తిరిగాయి.

    త్రినాథ్ ఉలికిపాటుగా లేచాడు. ఓసారి వళ్ళు విరుచుకొని, కళ్ళు నులుముకొని తల్లివైపు చూశాడు. వాసమ్మ చప్పున కళ్ళు మూసుకుంది.

    త్రినాథ్ లేచి గుడిసె తలుపు పక్కకు లాగి వడివడిగా వెళ్ళిపోతున్నాడు ఎవరో మంత్రించినవాడిలా.

    వాసమ్మ కూడా చటుక్కున లేచి త్రినాథ్ ని అనుసరించింది.

    సరీగ్గా వీధి చివరకు వెళ్లాడు త్రినాథ్. అక్కడో జీప్ ఆపి వుంది.

    వాసమ్మ చూస్తుండగానే త్రినాథ్ ఎగిరి జీప్ లో కూర్చున్నాడు. ఆ జీప్ లో మరెవరో వున్నట్టు అనిపించింది వాసమ్మకు.

    అంతలోనే జీప్ ముందుకు దూకింది.

    జరుగుతున్నదేమిటో అర్ధంకాక నిశ్చేష్టురాలైపోయింది వాసమ్మ.

    రోజూ వీడు ఎక్కడికి వెళుతున్నట్టు....? ఆ జీప్ ఎక్కడినుంచి వస్తోంది...?

    "ఎవరిది...?"

   
                     *    *    *    *


    శివాలయ ప్రాంగణంలో కూర్చున్నారిద్దరు. కొద్దిక్షణాల మౌనం తర్వాత మాలిని నోరు విప్పింది. "ఎలా ప్రారంభించబోతున్నావు నీ వ్యాపార జైత్రయాత్ర?"

    త్రినాథ్ మాలినివైపు చూసి చిరునవ్వు నవ్వాడు.

    నీరు సమృద్ధిగా దొరికేచోట నూతితో పనిలేదు, బ్రహ్మము ఎరిగిన బ్రాహ్మణులకు బ్రహ్మజ్ఞానం బోధించాల్సిన అవసరం లేదు కదా...?"

    మాలిని త్రినాథ్ వైపు విస్మయంగా చూస్తోంది.

    "గీత ఎంత గొప్పది గురువుగారు! మనిషికి జ్ఞానబోధ, తత్వబోధే కాదు- బతుకుతెరువు కూడా సూచిస్తోంది గీత. అభినవ వాణిజ్య విజ్ఞానం కొన్నివేల పేజీల్లో ఎలా వ్యాపారం చేయాలో చెబితే, గీతలోని ఒక శ్లోకం- ఒకే ఒక్క శ్లోకం ద్వారా ఆ మర్మాన్ని, మార్గదర్శక సూత్రాన్ని తెలియచెప్పింది. మీరు మూడో శ్లోకం చెప్పి అందులోనే నాకో దారి దొరుకుతుందన్నారు. అది నిజమే. నాకు దారి దొరికింది. మాస్టర్ ఆఫ్ కామర్స్- వాణిజ్యంలో మాస్టర్ డిగ్రీ. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. వ్యాపార నిర్వహణలో మాస్టర్ డిగ్రీ- ఈ రెండూ వ్యాపారం ఎలా చేయాలో చెబుతాయి. కాని ఏ వ్యాపారం చేయాలో చెప్పవు. అది నాకు గీత చెబుతోంది. మీ తెలివితేటలకు నా ప్రణామాలు గురువుగారు" అన్నాడు త్రినాథ్ భక్తిభావంతో చూస్తూ.

    మాలినికి ప్రపంచపు అద్భుతాన్ని చూస్తున్న విస్మయానందం కలిగింది.

    ఎన్నాల్టిది తన పగ? తీరని ఆ పగ, ప్రతీకారంతో ఎన్నేళ్ళుగా కుళ్ళిపోతోంది తను?

    తనకున్న మానసిక స్థయిర్యమే చాలదు ఆ సుదర్శన్ రావుని ఎదుర్కోటానికి. శారీరకంగా పులిపంజాలాంటి బలమైన వ్యక్తికోసం చేస్తున్న శోధనలో నిరీక్షణలో అనుకోకుండా దొరికిన వజ్రాయుధం- కాని తనిప్పుడు చూస్తున్నది ఆ బలం, దృడత్వం కాదు. అపారమైన అతని మేధా సంపత్తిని ఇలా అందిస్తే అలా అందుకుపోగల పాదరసం లాంటి తెలివితేటల్ని.

    "అదే శ్లోకం నాకు ఎలాంటి వ్యాపారాలు చేయాలో చెప్పింది. నీరు లేనిచోట నుయ్యి త్రవ్వితే అదే వ్యాపారం. అంటే ఆ నీళ్ళను అమ్ముకోవటమే. బ్రహ్మజ్ఞానం లేని వారికి అది అందించటమే వ్యాపారం అయితే, అవసరం అంత బలీయమైనది కావాలి అంటే- తీరని మనిషి అవసరం దగ్గరే నా వ్యాపారానికి శంకుస్థాపన చేస్తాను.

    "అవసరాన్ని కనిపెట్టి, దాన్ని నెరవేర్చు..."

    తృళ్లిపడింది మాలిని త్రినాథ్ తెలివితేటలకు.

    "ఈ మాటలే నాకు మంత్రం. ఈ మంత్రంలోంచే లక్షలు, కోట్లు సంపాదిస్తాను. మనిషి జీవితం రోజు రోజుకు సమస్యల పర్వంలో ఇరుక్కుపోతుంటుంది. కాలం విలువ పెరుగుతుంటుంది. నేను వారి కాలానికి విలువ ఇస్తాను. వారి జీవితాన్ని సులభతరం చేస్తాను.

    నేను పొదుపు చేసే వారి కాలానికి, సులభతరం చేసే వారి జీవితానికి వారు నాకు డబ్బు చెల్లిస్తారు తప్పదు.

    నాకు ఆర్ధికశాస్త్రంలో ఎ.బి.సి.డి.లు రాకపోవచ్చు. కాని మానవ జీవితంపై, జీవన విధానంపై అవగాహన వుంది" త్రినాథ్ ఓ క్షణం ఆగాడు.

    ఆమె కళ్ళ లోతుల్లో ఇదివరకు కనిపించిన నిర్లిప్త, నిస్పృహల స్థానంలో ఇప్పుడు వెలుగు కనిపిస్తోంది.

    తన స్థాయికి తగు శిష్యుడు దొరికినప్పుడు ఒక గురువు కళ్ళలో కనిపించే మెరుపు ఇప్పుడామె కళ్ళలో ప్రతిఫలిస్తోంది.

    ఆమె లేచి నిలబడింది.

    "ఇంత ఉన్నత స్థాయిలో నీ ఆలోచనలుంటాయని గ్రహించలేక పోయినందుకు సిగ్గుపడుతున్నాను.

    కొద్దిరోజుల్లోనే నీకు ప్రపంచ అభినవ వ్యాపార శాస్త్రాన్ని బోధించే శక్తి లేకే ఆ శ్లోకాన్ని చెప్పాను. ప్రపంచంలో ఈనాడు కోటీశ్వరులైన వ్యాపారవేత్తల కిటుకును నువ్వు గ్రహించగలిగావు.

    సరైన మంత్రాన్ని శోధించావు. ఇప్పుడు చెబుతున్నాను విను.

    FIND A NEED
    AND FILL IT అనంటారు దాన్నే ఇంగ్లీషులో.

    ఈ ఆరుమాటల ఆంగ్ల మంత్రం నీ మనస్సులో మెదలాలి అనుక్షణం. ఆ మెదిలే క్షణాల్లోంచే నీ శోధన ప్రారంభం కావాలి.

    Discovered A Genuine Need
    And Found A practical Way.
    And Fulfil it
    Half the Battle was Won.

 Previous Page Next Page