Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 18


    మమ్మీకేమైంది డాడీ...?

    స్తబ్దంగా నిలబడ్డ అతడి కళ్ళలో నీటి పొరలు పేరుకుంటున్నాయి.

    సబిత ఏం కాబోతూంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండోసారి మృత్యువుకి అతి సమీపంగా వెళ్ళిన తన భార్య దక్కుతుందా?

    ఇదేమిటీ...తన ధైర్యమెందుకిలా సడలిపోతూంది.

    గది బయటికి రాబోతూ మరోసారి సబితవేపు చూసాడు.

    చావులేని సంగీత ఝరిలా పదేళ్ళపాటు శీతల జల్లులా తన బ్రతుకులో ఇమిడిన నేస్తం ఇప్పుడు నేనేం కాబోతున్నాను అని దీనంగా స్వప్నం నుంచి అడుగుతున్నట్టుంది.

    "ఇన్నాళ్లూ నా బాధ్యతల్నే అనుకున్నానుగానీ నిన్ను కూడా ఇంత గాఢంగా ప్రేమిస్తున్నానని ఇప్పటికిగాని అర్ధంచేసుకోలేకపోయాను సబితా...నువ్వు కళ్ళుతెరిస్తే ఈ సత్యం నీకు చెప్పాలని ఎంత ఆత్రంగా వుందని ఇప్పుడేం చేయను. ఏం జరుగుతుందో తెలీని స్థితిలో నీ ఒడిలో తలపెట్టుకుని కన్నీళ్లు చిందించనా లేక నువ్వీ స్థితికి చేరుకుంటావని తెలీక మరో యజ్ఞంలో మన బిడ్డను సమిధగా మార్చే నిర్ణయం తీసుకున్నందుకు పశ్చాత్తాపంతో కుమిలి వెనుకడుగేయనా... ఏం చేయాలి... సబితా నన్నేంచేయమంటావు?"

    యాంత్రికంగా బయటికి వచ్చాడు.

    చుట్టూ ఏడుపులు పెడబొబ్బలు జనం ఆక్రందనలూ ఆర్తనాదాలూ.

    ఇక్కడో సంచలనంలో నిలబడి జరగాల్సిన మరో సంగ్రామం గురించి ఆలోచిస్తున్నారు.

    "మిస్టర్ ప్రసన్నా!"

    ఓ డాక్టరు ఉద్వేగంగా అతడివేపు వస్తున్నాడు.

    అదురుతున్న గుండెలతో శిలలా నిలబడిపోయాడు ఒక దుర్వార్త వినే శక్తిని కూడగట్టుకుంటూ...


                                                          *    *    *    *


    "మీకో అర్జెంట్ ఫోన్ కాల్."

    డాక్టర్ చెప్పింది వినగానే తేలిక పడింది మనసు... ...సబిత గురించి ఏ దుర్వార్తో వినాల్సి వస్తుందనుకున్న ప్రసన్న లల్లీని ఓ కానిస్టేబుల్ కందించి వేగంగా లోపలికి నడిచాడు...

    అప్పటికే డ్యూటీ డాక్టర్ గదిలో ఫోన్ దగ్గర డి.జి.పి. నిలబడి వున్నాడు పోలీస్ కమీషనర్ తో బాటు...

    ఇద్దరి ముఖాలూ చూడగానే బోధపడింది ఆ ఫోన్ ఎక్కడినుంచి వచ్చిందో...

    "ప్రసన్న హియర్" రక్తం సలసలా మండిపోతున్నా నిగ్రహించుకుంటూ అన్నాడు.

    "హల్లో ప్రసన్న పిటీ....నాకు తెలీదు థియేటర్ లో మీ శ్రీమతి కూడా ఉందని."

    "నో రిగ్రెట్స్ బ్లాక్ మాంబా...పాము కక్కాల్సింది విషమేకాని సానుభూతి కాదు...లెట్స్ కమ్ టు బిజినెస్."

    "షీ యీజ్ యువర్ లైఫ్."

    అరిచినట్టుగా "లెట్స్ కమ్ టు బిజినెస్" రెట్టించాడు ప్రసన్న ఆవేశంగా.

    "పాపం...చాలా ఆందోళనగా వున్నట్టున్నావు."

    "నేను మనిషిని బ్లాక్ మాంబా...నా భార్యాబిడ్డలకోసమే కాదు సాటి మనిషి కెవరికి హాని జరిగినా స్పందిస్తాను. అది నా లక్షణం.... ఇప్పటికి అవకాశం నీది...సాధిస్తున్నావు... ప్రొసీడ్...ఇంకా నీ రాక్షస విన్యాసం కొనసాగించు. ఇప్పుడు నా కూతుర్ని పంపుతున్నాను- దాన్నీ కడతేర్చెయ్. నీ శాడిజం చల్లారడానికి ఆ పసికందు ప్రాణమూ అవసరమే అనుకుంటే సాధ్యమైనంత త్వరలో దాని శవాన్ని నాకు పంపించు...యస్...ఎక్కడో విసిరేయకు_తండ్రిగా అంత్యక్రియలోనా నేను చేసే అవకాశం కలిగించు_" బాధ, ఆవేశం, ఉద్రోషం నిలువునా కుదిపేస్తూంటే రొప్పుతూ అంటున్నాడు. "చెప్పు_ఎక్కడికి పంపాలి లల్లీని?"

    "గూడ్. మరి ప్రదీప్ సక్సేనాని ఎప్పుడు విడిచిపెడతారు?"

    "రేపు ఉదయం తొమ్మిదిగంటలకి."

    "అంటే నీ లల్లీ పదకొండు గంటలకి నీ దగ్గరకి తిరిగివస్తుంది. అదీ సక్సేనా నా దగ్గరికి క్షేమంగా వస్తేనే... లేదూ అనుకో...ఈ రాక్షసకాండ కొనసాగడం మాత్రమే కాదు లల్లీ శవం..."

    "యస్ బ్లాక్ మాంబా...నేను నా అనుభవంలో ఎందర్నో నేరస్థుల్ని చూసాను...చాలా భయంకరమైన క్రిమినల్స్ గురించి విన్నాను. ప్రతివాడిలోనూ కొన్ని ఖచ్చితమైన నియమాలు కనిపించాయి. కాని తొలిసారి నీలాంటివాడ్ని ఫేస్ చేయడం."

    "ఎందుకలా అనిపించింది?"

    "రెండు శతృదేశాలమధ్య యుద్ధవిరమణకి చర్చ జరుగుతున్నపుడు విధిగా కొన్ని గంటలపాటన్నా పోరాటం ఉపసంహరించుకోవడమన్నది యుద్ధనీతి, కనీస ధర్మం. మన మధ్య ఒక ఒడంబడికకోసం చర్చలు జరుగుతూండగా కూడా జరిగిన రెండు సంఘటనలతో అలాంటివి లేని పరమ కిరాతకుడివని బోధపడిపోయింది. అందుకే."

    ఓ నిట్టూర్పులాంటిది వినిపించింది "వెల్...ప్రస్తుతానికి ఆపుచేస్తాను...అంటే రేపు ఉదయం సక్సేనా నన్ను చేరేదాకా-మీపరంగా ఆటంకం, అనుమానాస్పదమైన ఇబ్బందులూ ఎదుర్కోకపోతే ప్రదీప్ సక్సేనా సరిగ్గా తొమ్మిదిన్నరకి నా దగ్గర ఉంటాడు...అంతవరకూ నేను ఎలాంటి హానికీ తలపెట్టను. సో...ఇప్పుడు...మరో పది నిముషాలలో..." చెప్పుకుపోయాడు వెంటనే ఏం చేయాల్సిందీ.

    అప్పుడు గుర్తుకొచ్చింది జఏమ్ద్ర విషయం. దూరంగా బయటికి నడిచాడు ప్రసన్న.


                                                        *    *    *    *


    హాస్పిటల్ ఆవరణలో ఓ చెట్టుక్రింద జయేంద్రతో బాటు నిలబడ్డ శృతి నెమ్మదిగా అంటూంది "ఒకపక్క భార్య చావు బ్రతుకుల్లో వున్నా ప్రసన్న వెనకడుగు వేస్తారని నేననుకోను జయేంద్రా...ఒక వ్యక్తి నిర్ణయాలు వాటి వెనుకవున్న మానవతా దృక్పథం విలువేమిటో తెలుసుకోవాలి అంటే ఒక జీవితకాలం స్టడీ చేయాల్సిన అగత్యం లేదు...ఈ ఒక్క అనుభవం చాలు. మీపైగల నమ్మకంతో మీరు కాదనరన్న ఆలోచనతో మిమ్మల్ని ఒప్పించే బాధ్యత నాకు అప్పచెప్పారు. ఇక మిగిలింది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను."

    చెట్ల ఆకుల మధ్యనుంచి పడుతున్న విద్యుత్ కాంతి పాము పొడల్లా జయేంద్రపై పడుతుంటే సూటిగా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు అరక్షణం.

    "నాకు తెలుసు జయేంద్రా...ఇందులో చాలా ప్రమాదముందన్న విషయాన్ని నేనూ అంగీకరిస్తాను."

    "కదా" కొద్దిగా ముందుకు జరిగాడు. ఇప్పుడు పూర్తిగా కాంతి పడుతున్న అతడి కళ్ళు మేఘంచాటు నుంచి తప్పుకున్న చంద్రుడ్ని గుర్తుచేస్తున్నాయి.

    ఆమెకు తెలిసిపోయింది జయేంద్ర ఎంత జోవియల్ గా తీసుకుంటున్నదీ "నవ్వులాట కాదు జయేంద్రా."

    ""శృతీ...నేను పాముల్ని టేమ్ చేయగలిగినవాడ్ని. అహంకారమనుకోకు. ప్రమాదాల్ని చెలిమిగా చేసుకుని బ్రతికినవాడ్నికూడా... ఇంతకాలం నలుగురికీ దూరమై పెరిగానేమోగాని మనుషుల గురించీ, మనస్తత్వాలగురించీ తెలుసుకోవడంలో పూర్తిగా మిస్సయానని అనుకోవడంలేదు. ఇది నీ ప్రపంచంలో అడుగుపెట్టిన నాకు తొలిపరీక్షగా అంగీకరిస్తున్నాను. అఫ్ కోర్స్ లుంగీ కట్టుకోవడంలో అజాగ్రత్త చూపించిన మాట నిజమే కాని..." ఆ విషయాన్ని రిఫర్ చేస్తుంటే ఆ స్థితిలో కూడా నవ్వాపుకోలేక పోయింది.

    చీకటి క్రీనీడలో ఆమె చెంపలు సిగ్గుతో ఎరుపైన విషయం అతడు గమనించలేదు.

    "జయేంద్రా, విషయాన్ని సీరియస్ గా తీసుకోండి."

    "పాము విషమంత సీరియస్ గా తీసుకుంటున్నాను. ఓ.కే?"

    సరిగ్గా అప్పుడు వచ్చాడు ప్రసన్న అక్కడికి లల్లీతో.

    "రా అమ్మా" జయేంద్ర చేతులు చాచేసరికి ఇందాక తననూ, అమ్మనూ ఆదుకున్న మంచి అంకుల్ అన్న భావమేమో గొడవచేయకుండా అతడి చేతుల్లోకి వచ్చింది. "మమ్మీ విషయం మీ డాడీ చూసుకుంటారు కాబట్టి ఈ రాత్రంతా నువ్వు నాతో కబుర్లు చెప్పుకుంటూ వుంటావన్న మాట."

    జయేంద్రని చూస్తుంటే లల్లీ సినిమాల్లో చూసేటంత ధైర్యవంతుడైన హీరోలాగా మమ్మీ చెప్పిన యుద్ధం కథల్లో రాజకుమారుడిలాగా అనిపించాడు. "మరి నీకూ మంచి కథలొచ్చా అంకుల్" అడిగింది వెక్కిపడుతూనే.

    "ఓ బోలెడు."

    "నిజం" లల్లీ కళ్ళలొ చెప్పలేనంత విస్మయం.

    "ఒట్టు-నీకు తెలుసా! నేను పెద్ద పెద్ద దొంగల్తో, పులుల్తో-పోరాడి గెలిసాను."

    "మరి పాముల్తో-"

    "పాములంటే నిన్నెత్తుకున్నంత సర్దాగా పట్టుకుని ఆడుకుంటాను. ఇందాక థియేటర్ లొ అందరూ భయపడుతుంటే నేను రయ్యిన ఎలా వచ్చానో చూశావా? అంటే నాకు బోలెడు బలముందని అర్ధం."

    నిజమేననిపించింది.

    లల్లీని ఒప్పించే ఒక మౌలికమైన సమస్యని అతడు చాలా సునాయాసంగా పరిష్కరిస్తున్నాడని బోధపడిన ప్రసన్న, శృతి ఇద్దరూ చూస్తుండగానే "బయల్దేరుదామా" అన్నాడు జయేంద్ర టైం కావస్తుందన్న సూచనగా.

    ఒక విషవలయంలో అడుగుపెడుతూ ఏమాత్రం సంశయాన్ని, అధైర్యాన్ని ప్రకటించని జయేంద్ర జీపుదగ్గరికి ప్రసన్నతోబాటు నడుస్తుంటే రెండడుగులు ముందుకేసింది. "జయేంద్రా." 

 Previous Page Next Page