Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 17



    అతను ఆమె చేతిని చుంబించి వదిలేసాడు. ఆమె కళ్ళలోని కన్నీటి తెర అతని మస్తిష్కంపై అలాగే నిలిచిపోయింది.

    రిషి వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా అడుగులువేస్తూ గుడి దగ్గరకొచ్చి ఆగిపోయాడు. భక్తిగా చేతులు జోడించి నమస్కరించి జేబులోంచి డబ్బులుతీసి కొబ్బరికాయలు అమ్మే అవ్వకి అందిస్తూ "నా పేరు చెప్పి కాయ కొట్టి చిప్పలు నువ్వే తీసుకో" అన్నాడు.

    అతనికి అంతా కొత్తగా, నవ చైతన్యంతో రక్తం ఉరకలు వేస్తున్నట్లుగా అనిపించింది. మధ్యాహ్నం శలవు చీటీ యిచ్చి బయటికి వస్తుంటే వూరుకి బదులుగా యింటికి వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపించింది.

    కానీ ఆశ్రిత చెప్పింది కాబట్టి వూరుకే వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు.

    అతనికి మొదటిసారిగా ఆ ఊరు విడిచి వెళుతుంటే చాలా దిగులేసింది.


                                     *  *  *  *

    రైలు గట్టిగా కూత పెట్టింది.

    శ్రీజ చేతిని కొద్దిగా నొక్కి వదిలేస్తూ "ఉత్తరం వ్రాస్తావుగా!" అంది శ్రీజ.

    శ్రీజ గొంతుకి ఏదో అడ్డుపడ్డట్లయి మాట రాలేదు.

    "ముందు బండెక్కు. తర్వాత మాట్లాడుకోవచ్చును" అంది హైమ.

    ఆశ్రిత పెట్టెలోకి ఎక్కి కిటికీ దగ్గరగా వచ్చి "నన్ను మరిచిపోరుగా ఆంటీ!" అంది.

    "నిన్నెలా మరిచిపోతాం తల్లీ!" అంది అభిమానంగా హైమ.

    శ్రీజ చప్పున ముందుకి వచ్చి ఆశ్రిత చేతిని స్పృశిస్తూ "నిజంగా వెళ్ళిపోతున్నావా?" అంది.

    "నిజంగానే" అన్నట్లుగా బండి అటూ ఇటూ వూగుతూ ఒయ్యారంగా బయలుదేరింది.

    ఆశ్రిత నవ్వింది. ఆమె కంటి నుండి రెండు ముత్యపు బొట్లు రాలి శ్రీజ చేతి మీద పడ్డాయి.

    ఆశ్రిత ఏదో అనబోతూంటే రైలుగట్టిగా కూత పెట్టుకుంటూ వేగం పెంచింది.

    శ్రీజ కొద్ది దూరం రైలుతో బాటు నడిచి క్రమంగా అదృశ్యమయింది.

    ఆశ్రిత వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది.

    ఆ మూసి వున్న కనురెప్పల క్రింద ఓ అమాయకమైన మొహం కదలాడసాగింది.

    రిషి పరుగులాంటి నడకతో ఇంటివైపు వస్తున్నాడు.

    అతని గుండెలకి దగ్గరగా పెట్టుకున్న పొట్లంలో ఆకు సంపెంగ పూలున్నాయి. అతని హృదయ స్పందనకి ఆ పరిమళాలు తోడై మనసంతా రసరాగం రంజితమవుతోంది!

    తెల్లని డ్రెస్ లో డ్యూటీకి వెళ్తున్న హైమా ఆంటీ శాంతికపోతంలా ఎదురొచ్చింది.

    "గుడ్ మార్నింగ్ ఆంటీ!" హుషారుగా అన్నాడు.

    హైమ మొక్కుబడిగా తల వూపి సాగిపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. శ్రీజ గుమ్మం దగ్గర నిలబడి కనిపించింది. ఎప్పటిలాగా ఎదురొచ్చి "నాకేం తెచ్చావు" అంటూ గొడవ చెయ్యలేదు. నిశ్శబ్దంగా ఆమెకి అలవాటులేని నిలకడతో దిగులుగా చూస్తోంది.

    రిషి విస్మయంగా చూస్తూ "ఏయ్- వసపిట్టా! ఏవిటలా వున్నావు? అమ్మ తిట్టిందా?" అని అడిగాడు.

    శ్రీజ మౌనంగా గుప్పెట తెరిచి తాళం చెవి అందించి, తమ ఇంటివైపు అడుగులేస్తూ చకచకా వెళ్ళిపోయింది.

    రిషి తాళం చెవి వైపు కళ్ళు పెద్దవి చేసి చూసి అప్పుడే తట్టినట్లు "శ్రీజా.... ఆగు....ఆశ్రిత ఎక్కడ?" అంటూ కేకేసాడు.

    శ్రీజ అప్పటికే వెళ్ళిపోయింది.

    రిషి తలుపు తీసి అడుగు లోపలికి పెట్టాడు. శూన్యమైన కుటీరం రాగాలు పలకలేని వెదురు బద్దలా కనిపించింది. అతని మనసు కీడుని శంకించింది. ఆమెకి అంతా గుర్తొచ్చిందా? ఆమెని వాళ్ళ వాళ్ళు వచ్చి బలవంతంగా తీసుకుపోయారా? అనిపించింది. 'విఫలమైన నా కోర్కెలా.... వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినబడే అంతలో పోయాయా....' అని ఎవరింట్లోంచో సన్నగా వినిపిస్తోంది.

    నిరర్ధకం అని తెలిసినా "ఆశ్రితా!" అని పిలిచాడు. అదే ఆశ!

    నిశ్శబ్దం జాలిగా కరిగింది.

    మంచంమీద గులాబీ పువ్వు అమాయకంగా నవ్వింది! దాని క్రింద గులాబీ రంగు కాయితం రెపరెపలాడింది.
    రిషి ఆత్రంగా కాయితాన్ని చేతిలోకి తీసుకున్నాడు.

    "రిషీ.... నిన్ను నిర్ధాక్షిణ్యంగా విడిచి వెళ్ళిపోయానని అలుగుతావని తెలుసు! ఆ అలిగిన బుంగమూతి అందం వూహించగలను. కానీ, ప్చ్! లాభం ఏవిటీ? ఆ గుబురు మీసాల క్రింద పల్చని పెదాలను నేను ముద్దాడలేనుగా! తీపి అంటే తేనే, కలకండా లాంటివి అనుకుంటూ వచ్చాను. కానీ తీపి అంటే నీ అధరామృతం లాంటిదని ఇప్పుడు తెలుసుకున్నాను. హాయి అంటే కడుపునిండా తినడం.... కంటి నిండా నిద్రపోవడం అనుకున్నా.... కాదు! అన్నం సహించకపోవడం, నీ తలపులతో జాగారం చెయ్యడం అని ఇప్పుడే తెలుసుకున్నా! లిపి లేని నీ కంటి బాస నాకు తెలుసు! సడిలేని నా నిశ్శబ్ద భాష నీకు అర్ధమౌతోందా?

    వేసవిలో చల్లని పిల్లగాలి కబుర్లు చెప్పుకుందాం! శీతాకాలం వెచ్చని కోర్కెల సెగళ్ళు వేసుకుందాం. సరేనా! ఎక్కడా? అంటున్నావా? ఈ లోకంలో మనం ఎక్కడ కలుసుకున్నా జనం కుళ్ళుకుంటూనే వుంటారు కానీ మనం ఎవరికీ చిరునామా తెలీని మన స్వప్న లోకంలో యధేచ్చగా ప్రతిరోజూ విహరిద్దాం!

    నేను ఒంటరిగా వెళ్ళడం లేదు. నీ జ్ఞాపకాలని నాతో మూట గట్టుకుని పోతున్నాను. అవి నాకు ప్రతి ఆలోచన ముందూ, మధ్యా, వెనుకా ఎదురుపడుతూనే వుంటాయి.

 Previous Page Next Page