Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 17


    చూడు తండ్రీ, చంద్రశేఖర ఆజాద్, ఆడపిల్లను రక్షించి ఓ సాహస కార్యం చేసి నాముందు కాస్త ఎదిగిపోయావ్. ఇకపై నా జీవితం సాహస కార్యాలకే వినియోగిస్తాను. నా ధైర్యం చూడు. నా శౌర్యం చూడు అంటూ డాంబికాలుపలికావు. అవునా, ధైర్యం వుండగానే సరికాదు. సమయానుకూలంగా తెలివి తేటలు కూడా వుండాలి. ఆపదలో చాకచక్యం ముఖ్యం, ఆ తరువాతే ధైర్యం. నేను ఇన్ స్పెక్టర్ వేషంలో వున్నానే అనుకో, గతంలో మన ఇరువురుకి పరిచయం లేదు కదా, మనింటి అడ్రస్ చెపుతుంటే వీడికెట్లా తెలుసు అనైనా అనుకున్నావా?" ఇందర్ అడిగాడు.

    "అణు ను అంతా నీయిష్టం. నా అడ్రస్ మీకెలా తెలుసు అని అడగబోయాను. నోరు తెరిచానో లేదో, నోరు తెరిచావా పళ్ళు రాలతాయి అన్నావు గుర్తుందా!" చంద్ర అన్నాడు.

    "అరే భాయి! నేను అడిగింది ఏమిటి! ఆలోచించావా అని...."

    "ఆలోచించాను. నా బుర్రకేమీ తట్టలేదు."

    "నీకో బుర్ర అంటూ వుంటేగా తట్టడానికి!"

    "పోరా" అంటూ చంద్ర నవ్వాడు.

    "అమ్మయ్య. అమాస చంద్రుడు నవ్వాడు. ఇంతకీ అయ్యగారి కోపం పోయినట్లేనా?"

    "అయ్యో! నీ ముందు నాకు కోపం తాపం కూడానా! నాపాలిట యముడులాంటి మొగుడివి" అంటూ చంద్ర నాలుకకొరుక్కున్నాడు.

    ఇందర్ పకపక నవ్వాడు.


                                                              *    *    *


    రాత్రి ఏడు పది.

    ఓ అందమైన అమ్మాయి, పెళ్ళికూతురు వేషంలో స్కూటర్ మీద వంటరిగా వేగంగా ముందుకు పోతున్నది. స్కూటర్ ని చాలా వేగంగా నడుపుతున్నది. స్కూటర్ ని వేగంగా నడుపుతూ వంటరిగా వెళుతున్న సంగతిని నలుగురైదుగురు గమనించారు. వాళ్ళు గమనించే సరికే వాళ్ళ కళ్ళముందు నుంచి స్కూటర్ మాయం అయింది.

    రెండు లూనాలు ఒక స్కూటరు కొద్దిసేపు తర్వాత చాలా వేగంగా అటు నుంచి దూసుకువచ్చాయి. స్కూటరు మీద నున్న అతను స్కూటరు దిగి రోడ్డుపక్కనున్న అతన్ని అడిగాడు. పెళ్ళి కూతురు ఎక్కిన స్కూటర్ ఎటుపోయిందో తెలియంగానే తన స్కూటర్ ని ముందుకు దూకించాడు. అక్కడే చక్కర్లు కొడుతున్న రెండు లూనాలూ స్కూటర్ బైలుదేరంగానే బైలుదేరాయి. అంగబలం అర్ధబలం వున్నా కూడా ఆపదలో దొంగ బ్రతుకు తప్పదు.

    సమయం సరీగలేకపోతే దొరలు దొంగలుగా అవతారం ఎత్తుతారు. కొండొకచో దొంగలుగా దొరలవుతారు. ప్రముఖ గూఢచారిణి రాక్పీ ఓసారి దేశ ద్రోహుల్ని పట్టడానికి ఆరునెలలకాలం పేవ్ మెంట్ బిచ్చగత్తెలాగడపాల్సివచ్చింది. సీతాదేవికి అరణ్యవాసం తప్పిందా! హిట్లర్ అంతటి వాడికి చావుతప్పిందా!

    ఒక్కో టైము అలాంటిది. కర్తవ్య నిర్వహణలో అవంతికి కష్టాలు తప్పలేదు. మరొక్క పావుగంట పిడుగుపాటులా ఆ విషయం బైటపడి వాళ్ళు రాకపోతే అంతా సవ్యంగా జరిగేది.

    అవంతి కలలో వూహించింది క్షణంలో జరిగిపోయింది. అందుబాటులో వున్న స్కూటర్ అందుకుంది. అవంతికి రాని విద్య ఏముంది! చేపపిల్లకి ఈత నేర్పాలా! స్కూటర్ ఎక్కినా అవంతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బైయలుదేరింది.

    నుదుట కళ్యాణం బొట్టు బుగ్గన చుక్క. పొడుగాటి పూలజడ వంటి నిండా తళతళ లాడే ఆభరణాలు. జరీబుటాలున్న  పాము కుబుసం వంటి మిరపండు కలర్ శారీ, అదే కలర్ బ్లౌజ్. రెండు చేతులకీ నిండుగా ఎర్ర రాళ్ళ గాజులు, వాటి మధ్య వుత్తగాజులు, అర చేతులకి డిజైన్లతో పెట్టిన గోరంటాకు, పెళ్లి కూతురంటే ఇలా వుండాలి సుమా అన్నట్టు వుంది. అంతే కాదు, పెళ్ళాడితే యిలాంటి పిల్లనే పెళ్ళాడాలి అన్నట్లుగా కూడా వుంది అవంతి. మెడలో మల్లెపూల దండ కూడా ఉంది, దండ మధ్య చమ్కీలు. లైట్ల వెలుగులో మెరిసిపోతున్నాయి. మెడలో దండతీసి అవతల పెట్టే టైము కూడా లేని అవంతి అలాగే బైలుదేరింది. 

    మెయిన్ రోడ్డుమీద నుంచి సన్నని సందులోకి వచ్చింది అవంతి. అక్కడ అంతగా జనసంచారం లేదు. అయితే అవంతి సందుచివరికి వెళ్ళేసరికి అదే సందు మొదట్లోకి స్కూటరు లూనాలు వచ్చాయి.

    పూర్తి తల తిప్పి వెనక్కి చూడకుండానే ముంచుకోస్తున్న ప్రమాదాన్ని క్షణాల్లో చేరువవుతున్న మృత్యువుని అవంతి పసిగట్టింది. ఇప్పుడు తను మెయిన్ రోడ్డువైపు వెళ్ళటం కోరి మృత్యువుని కొనితెచ్చుకోటమే. ప్రాణ రక్షణకి సందులూ గొందులూ చాలా చక్కగా వుపయోగపడతాయి.

    అవంతి స్కూటర్ ని ముందుకు దూకించింది. మరో నిమిషంలో స్కూటర్ మరో సన్నటి సందులో ప్రవేసించింది. వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళాలంటే ఈ సందు గొందులే గతి.

    అవంతి వక సన్నని సందులో ప్రవేశించింది. సందంతా నిర్మానుష్యంగా ఉంది. సరీగ అప్పుడే అవంతికి ఓ ప్రమాదం ఎదురైంది. స్కూటర్ లో పెట్రోల్ అయిపోయింది. ఇంక ఒక అడుగు ముందుకు వేసేది లేదన్నట్లు స్కూటర్ మొరాయించింది. దూరంగా దూసుకు వస్తున్న వాహనాల చప్పుడు.

    అవంతి సిక్త్ సెన్స్ హెచ్చరించింది. 

    అవంతి స్కూటర్ మీద నుంచి ఒక్క దూకు దూకింది. స్కూటర్ ని గోడకి ఆనించింది. గేటు తీసుకుని ఓ ఇంట్లో ప్రవేశించింది. ఆ సందులో కొన్ని ఇళ్ళలో లైట్లు వెలుగుతున్నాయి గాని బైట దీపాలు లేవు. అందుకని బైట చీకటిగానే ఉంది.

    అవంతికి తెలుసు తనని తరముకు వచ్చే వాళ్ళు మామూలు మనుషులు కారని....

    అవంతి తెలివిగా చాకచక్యంగా అంతకన్నా క్విక్ గ ఓ పని చేసింది. మెడలో దండ తీసి గుమ్మంకి కాస్త పక్కగా పడేసింది. ఆ తర్వాత పక్క ఇంటికి ఈ ఇంటికి మధ్యనున్న పిట్టగోడ పొట్టిగా వుండటంతో ఆ గోడ దూకి పక్కింట్లో ప్రవేసించింది. రెండు ఇళ్ళు అలాగే దాటుకుంటూ వెళ్ళి బైటకి వచ్చింది. గోడ పక్కలగా నడుస్తూ ముందుకు సాగింది.

    ఆ సందు చివరికి వచ్చేసరికి అవంతికి ఒకటి కాదు రెండు ప్రమాదాలు వచ్చి పడ్డాయి. ఆ సందు అక్కడితో ఎండ్ అయింది. ఇటేమో తరుముకు వస్తున్న వాళ్ళ తాలూకూ స్కూటర్ లూనాలు వచ్చి ఆగాయి. వాళ్ళు వాహనాలు దిగి అక్కడే వదిలేసిన స్కూటర్ ని పరీక్ష చేస్తున్నారు.

    చివరగా వున్న ఆయింటి తలుపు చాలా కొద్దిగా తెరిచివుంది. లైటు వెలుతురు బైటకి పడుతున్నది. అవంతి ఇంకా ఆలోచించలేదు. ఆలోచించే టైము కూడా లేదు. నెమ్మదిగా తలుపు తీసి లోపలికి అడుగు పెట్టింది. గదిలో ఎవరూ లేరు. ఆ పక్కగా వున్న గదిలోంచి చిన్నగా ఈలపాట వినపడుతున్నది.

    అవంతి గదిలోకి రాంగానే తలుపులోపల గడియ వేసింది. పిల్లిలా నడుస్తూ గదిలోకి తొంగిచూసింది. అదే సమయంలో.

    ఆ గదిలో వున్న శాల్తీ స్నానం చేయడానికి అటు తలుపు తీసుకొని బాత్ రూంలోకి వెళ్ళింది. మరునిమిషంలో నీళ్ళచప్పుడు హుషారుగా ఈలపాట బాత్ రూంలో నుంచి విన వచ్చాయి. ఈ ఇంట్లో ఒక వ్యక్తి తప్ప మరో ప్రాణిలేదు అన్న విషయం అవంతికి బాగానే అర్ధమయ్యింది. ఒక్కసారి అంతా పరికించి చూసింది. వెళ్ళి బీరువా చాటున చూసుకుంది. తన తేలిగ్గా అక్కడ దాక్కోవడానికి చోటుకావాలి అంతే. అవంతి బీరువా చాటుకెళ్ళి దాక్కుంది. ఈలపాట ఆగిపోయింది. బాత్ రూం తలుపులు తీస్తున్న చప్పుడు. అవంతి బొమ్మలా నుంచొండి పోయింది.   

 Previous Page Next Page