ఏదయితేనేం బ్రతుకు తెరువుకి? అనుకున్న శివయ్య కొడుకు మార్గానికి అడ్డం రాలేదు. వడ్లవ్యాపారమల్లా బియ్యం వ్యాపారంగా మార్చాడు. తండ్రి పోయాక చిన్న షెడ్ వేయించి, అందులో మర వేయించి బియ్యం ఎగుమతి ప్రారంభించాడు రామశేషు, లారీలకు లారీలుగా బియ్యం ఎగుమతి ప్రారంభించాడు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో రామశేషు బియ్యం వ్యాపారం ముమ్మరంగా సాగుతూంది. అతను మద్రాసులో చిన్న బ్రాంచిలాంటిది ఏర్పాటు చేసుకున్నాడు.
అతనికి డబ్బుయావ పట్టుకుంది. పొలాలూ, ఇళ్ళూ కొనాలని లేదు. ఉన్న ఇల్లుని అధునాతనంగా తన అభిరుచికి అనుగుణంగా కట్టించుకున్నాడు. ఉన్న పొలం చాలు. రోజురోజుకి చట్టాలు మారే ఈ ప్రభుత్వంలో ఎక్కువ పొలం ఉండడం కూడా మంచిది కాదు అనేవాడు, అప్పుడప్పుడు వినిపించే భూస్వామ్య సంస్కరణలు అన్నమాట వినటం వల్ల.
అందువల్లే చంద్రయ్య కాలువక్రింద పొలం అమ్ముతానని బేరం పెడితే తనకక్కర్లేదని చెప్పి పంపాడు. మళ్ళీ మళ్ళీ కబురంపిన చంద్రయ్య కనీసం రమణయ్యకయినా అమ్మిపెట్టమని చెప్పి పంపాడు.
ఇప్పుడు ఆ పనిమీదే బావవద్దకు వచ్చాడు రామశేషు.
"రా బావా! రా! ఎలా వుంది వ్యాపారం?"
"ఏం వ్యాపారంలే" బావా! ఒట్టిప్రయాసతప్ప, పైసలు మిగలటంలేదు. ఆయనన్నట్టు దమ్మిడీ ఆదాయంలేదు. గడియ పురసత్తులేదు. అరుగుమీద కూర్చుని స్తంభానికి చేరగిలబడి అన్నాడు రామశేషు.
"ఎందుకొచ్చిన శ్రమ బావా? శుభ్రంగా వ్యాపారం మానెయ్యరాదూ? వ్యవసాయం చూసుకోరాదూ?"
"అదే కదా బావా, దీనితో వచ్చిన చిక్కు! ఆ గడ్డలో పడిన కుక్కకి అదే వైకుంఠ మన వ్యాపారంలో దిగాక మరొకటి రుచించదు. ప్రయాణానికి అలవాటు పడిన ప్రాణం. రకరకాల తిండికి బానిసైన నాలుక. ఇంటిపట్టున ఎలా ఉండగలం? అందుకే మానలేక ఏదో చేస్తున్నాం. ఖర్చులు గిడుతూ ఉన్నంతవరకు వదలలేను కదా?"
నవ్వాడు రమణయ్య. "బావా! నేనేం నీతో పోటీకి రానులే. అసలు ఈ ఊళ్ళో వ్యాపారం చేద్దామన్న యావ ఎవరికీ లేదు. ఫెర్టిలైజర్స్ తెచ్చి ఇస్తున్నావు. అందులో కొంత లాభం. తిరిగి వసూళ్ళలో కొంత లాభంగానే వాళ్ళతో ధాన్యం కొంటావు. దాన్ని జిన్నింగ్ చేయిస్తూ మిల్లుఖర్చులు రాబడతావు. ఇక బియ్యంలో వచ్చేదంతా లాభమే కదా?"
"ఆఁ. ఏదో లెద్దూ! తింటున్న మనిషి తాను తింటున్నానని ఒప్పుకుంటాడా ఎక్కడయినా? ఎన్ని చెప్పినా వ్యవసాయానికి అన్నీ తగ్గే కదా?"
"అది మాత్రం నిజం! మేము పండించింది మీకులేదు, ప్రజలకి లేదు. ప్రభుత్వానికీ లేదు."
సిగరెట్ ముట్టించి, గట్టిగా దమ్ము పీల్చి. "ఇదిగో వ్యవసాయం చేసుకుంటున్న నీవు ఎలా ఉన్నావో చూడు. వ్యాపారంలో ఉన్న నన్ను చూడు. ఈ సిగరెట్లూ, చట్టుబండలూ వ్యాపారంలో దిగాకే నేర్పారు" అన్నాడు రామశేషు.
నవ్వాడు హాయిగా రమణయ్య.
ఒక నిమిషం ఆగి రామశేషే అన్నాడు: "బావా! నీతో కాస్త పని ఉండి వచ్చాను."
"డబ్బేమయినా కావాలా?" అప్పుడప్పుడు వ్యాపారంలో సర్దుబాటు చేసుకోవటానికి డబ్బు తీసుకెళుతూ ఉంటాడు. అతను చెప్పినట్టుగా తిరిగి ఠంచన్ గా ఇచ్చేస్తూ వుంటాడు. దానితో ఏ చిక్కూలేని రమణయ్య బావకి సర్దుతూ ఉంటాడు.
అన్నగారి గొంతు విని గ్లాసునిండా కాఫీ తీసుకుని వచ్చింది సరోజ పలకరింపుగా నవ్వి, కాఫీ గ్లాసు అందించింది.
"ఇదిగో, అది ఇంకో అలవాటు" అని అందుకున్నాడు రామశేషు.
కాఫీతాగి గ్లాసు కిందపెట్టి, అటుగా వచ్చిన అల్లుడిని ఎత్తుకుని ముద్దాడి వాడి చేతిలో అయిదు రూపాయలు పెట్టాడు రామశేషు.
"గ్లాసు కాఫీ ఖరీదు అయిదు రూపాయలన్నమాట!" అన్నాడు నవ్వుతూ రమణయ్య.
"అదికాదులేవయ్యా, బావా! అల్లుడిని మంచి చేసుకుంటున్నాను. ఎంతయినా ఆడపిల్లలు గలవాళ్ళం."
"అబ్బ! మా వాడికి మీ అమ్మాయి వద్దయ్యా! మీ సంబంధం మాకు అక్కర్లేదు."
గ్లాసుకొరకు వచ్చిన సరోజ ఆ మాటలు విని, "పాపం! నన్ను చేసుకుని పడరాని పాట్లు పడుతున్నారు అన్నయ్యా, ఇక మనఇంటికి ఆడపడుచును ఇవ్వద్దురా" అంది తనూ నవ్వుతూ.
"వీడికేమే? బంగారుబాబు! ఏ ఆడపిల్ల తండ్రయినా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు. మీ చీమిడిముక్కు చిన్నదేం అక్కర్లేదు" అన్నాడు రమణయ్య.
"ఓయబ్బ మా పిల్లకే మగడు దొరకడు!" అంది సరోజ.
"ఇదిగో సరోజా! రాసిపెట్టి ఉంటే తప్పిస్తామా? నా కూతురి పేర అయిదెకరాల తోట, పదివేలు ఫిక్స్ డ్ డిపాజిట్ వున్నాయి. నాకున్నదీ ఒక్కతే కూతురు. దాని ఆస్తికయినా పెళ్ళాడతాడు వీడు" అని మేనల్లుడి బుగ్గగిల్లాడు రామశేషు.
"నాకేం వద్దు" అని తల్లి చంకనెక్కాడు బాబు.
"చూశావా?" అన్నట్టు చూశాడు రమణయ్య.
మూతి సున్నాలా చుట్టి చూశాంలెండి అన్నట్లుగా వెళ్ళిపోయింది సరోజ.
మళ్ళీ సిగరెట్ ముట్టించాడు రామశేషు.
"బావా! అతిగా తాగవద్దు. ఒళ్ళు చెడిపోతుంది" అన్నాడు రమణయ్య.
"ఇదిగో బావా! తాగేవాడెవడయినా లిమిట్ గానే తాగాలనుకుంటాడు కానీ రుచి, కైపు, అతన్ని ఆగనివ్వవు. తాగుతూనే ఉండేటట్లు చేస్తాయి. వీటిరుచీ అంతే!" అని, "ఆఁ అన్నట్టు అసలు విషయం వదిలేసి వ్యవహారంలో పడ్డాము" అన్నాడు రామశేషు.
"నీవే చెప్పులే."
"బావా! వ్యవసాయంలో ఎంత వెనకేశావేమిటి?"
"నాబొంద! ఏం మిగులుతోంది బావా! మొదట కొన్నప్పుడు పొలంమీద అప్పుచేసింది తీర్చాను. అదే మిగులు, ఈ ఇల్లు కట్టాను అది మిగులు, ఆ పాక కొన్నాను అది మిగులు. తమ్ముడిని చదివించాను. వాడి డిగ్రీ మిగులు. మీ చెల్లి నగలో అంటూ ఉంటే చేయించాను. అవి మిగులు అంతే!"
"బాగుంది బావా నీ సంభాషణ. ఏమీ మిగలనట్టే మిగిలించావు" అని, "ఇంతకీ డబ్బేం లేదంటావు?" అన్నాడు.
"ఒట్టు,"
"అదెందుకులే! నీకింతకూ ఏదో ఒక బరువంటూ వుంటే కానీ మిగల్చలేవు. నీ భూమి విరగబండదు. అందుకే నేను ఓ కార్యం పైన వేసుకుని వచ్చాను."
"రైసు మిల్లు కడుతున్నావన్నాను కొంపదీసి నన్ను వాటా కలవమంటావేమిటి? నాకక్కర్లేదు బాబూ! ఉన్నది చాలు. వ్యాపారంపై మోజు నాకులేదు. అయినవాళ్ళతో, డబ్బుతో పేచీలెందుకు?"
"నీదంతా ఊహాగానమే! పూర్తిగా వినవుకదా?" అని "మన చంద్రయ్య కాలవకింద పొలం అమ్ముడు పెడుతున్నాడు. నన్ను పిలిచి తీసుకోమన్నాడు. వ్యాపారం నాకు చాలు. పొలం అక్కర్లేదన్నాను. నీవు కొంటావేమో కనుక్కోమన్నాడు. మంచి పొలం. నీవు పండించి చూశావు బేరం కూడా అట్టే పైన లేదు, ఎనిమిదెకరాలూ ఏభై వేలకి ఇచ్చేస్తాడు. అది నీ చేతికి వస్తే లక్షకి తక్కువ పలకదు. డబ్బయినా అంతా ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు కొంత ఇచ్చి, పంట పంటకీ ఇంత ఇస్తే చాలు" అని మెల్లిగా "టౌనుకెళ్ళటానికీ ఇస్తూ ఉంటే చాలు అతనికి" అన్నాడు.
నిర్విణ్ణుడయ్యాడు రమణయ్య.
అతను సంసారానికి దూరమైనా ఆ ఇంటి విషయాలు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. పక్షవాతంతో మాణిక్యమ్మ మూలబడటం మొదలుకొని, ఆమె చనిపోయాక చంద్రం ఎలా విచ్చలవిడిగా తిరుగుతున్నదీ అతనికి తెలుస్తూనే ఉంది. కారుకారుకీ అతను పొలం అమ్ముతూనే ఉన్నాడు.
"అది విశాల భాగం కదా? అని అడిగాడు రమణయ్య.
"అవును. ఇంక చంద్రయ్య పేర ఆ చెరుకుతోట తప్ప లేదు అంతా దానాల క్రింద, విక్రయాల క్రిందా ఖాళీ అయింది. చెల్లెల్ని ఏరికోరి అంగీకరింపజేశాడు.
నిట్టూర్చి. "నా కక్కర్లేదు, బావా! ఉన్న పొలంచాలు. దీన్ని సక్రమంగా పండిస్తే మాకుటుంబానికి చాలు" అన్నాడు రమణయ్య, ఇంకేమి అనలేక.
"బావా,"
"అవును, బావా! ఇంక పొలం కొనే ఉద్దేశ్యంలేదు నాకు. అత్యాశకు వెళ్ళి ఉన్నది పోగొట్టుకోవటం నాకిష్టంలేదు."
"ఇది మంచి అవకాశం. నీకాట్టే కష్టం కూడా ఉండదు."
రమణయ్య లేచాడు. టవలు దులిపి భుజంమీద వేసుకుని, ఈ బేరానికెవరయినా కొంటారు. పుల్లయ్యకి పొలం కావాలట చూడు. కళ్ళ కద్దుకుని తీసుకుంటాడు" అన్నాడు.