Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 17

 

    "అంటే .....' అనుమానంగా చూసింది.
    "నా సెక్రటరీగా"
    "మీరు.....?"
    'జనరల్ మేనేజర్. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్ మెంట్.'
    ఆమె నిరుత్సాహపడింది. "సారీ మీకు ఉద్యోగం లేదని తెలియదు."
    సురేష్ టైం చూసుకున్నాడు.
    "ఎక్కడైనా మీకు సూటబుల్ వేకన్సీ వుంటే తప్పకుండా చెపుతాను.'
    ఇద్దరూ మళ్ళీ చౌరస్తా దగ్గరకొచ్చారు.
    "ఈసారి సినిమాకు రావడానికి రెడీ! మీరు ఎప్పుడంటే అప్పుడు" సిగ్గుపడుతూ అంది.
    సురేష్ నివ్వెరపోయాడు.
    'అలా చూడకండి. ఆ రోజు మీ చెంప పగలకొట్టినందుకు సారీ చెప్పుకుంటున్నాను" కళ్ళలో దీనత్వం.
    "మీరేం తప్పు చేశారని సారీ చెప్పుకోవటం?"
    "ఎప్పుడేవారితో ఏం అవసరం వస్తుందో తెలుసుకోకుండా ప్రవర్తించటం తప్పు కాదంటారా?"
    సురేష్ గ్రాఫ్ గజిబిజిగా వుంది.
    ఏమీ అర్ధం కావడం లేదు.
    "మీ దగ్గరేమైనా డబ్బుందా? ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి! పరిస్థితులు బావుండలేదు" ఆమె కళ్ళలో అర్దింపు. ఆ రోజున ఉరిమి చూసిన కళ్ళే అవి.
    సురేష్ కు మనసు చివుక్కుమంది.
    "సారీ..........అయాం హెల్ప్ లెస్"
    ఆమె అతనికి మరింత దగ్గరగా జరిగింది.
    "పోనీ రేపైనా ఇవ్వగలరా? ఎంతో కొంత.'
    అతని మనసు గిజగిజలాడింది . ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఎప్పుడూ యిరుక్కోలేదు.
    అంత అభిమానం, అంత కోపం , అంతటి అద్భుతమైన కారెక్టర్ ఉన్నా అమ్మాయేనా ఈ అమ్మాయి.'
    "మీరు రేపు మా ఇంటికొస్తే - అందుక్కుడా సిద్దమే" చూపులు వాల్చుకుని నేలతో మాట్లాడింది.
    అతనికి షాక్ తగిలినట్టయింది.
    ఆ డైలాగ్ ఆమె నోటివేంబడి వినటం భరించలేకపోతున్నాడు.
    కళ్ళంబడి ఉప్పెనలా పొంగుకొస్తున్న సముద్రాన్ని అణచివేయడానికి విశ్వప్రయత్నం జరుగుతోంది.
    అనగనగా ఓ శోభాదేవి.
    18 ఏళ్ళ అందాల బొమ్మ శోభాదేవి.
    తన అందంతో , అవయవపు సౌష్టవంతో చుట్టుపక్కల కుర్రకారులందరికీ నిద్ర లేకుండా చేసే శోభాదేవి.
    తల్లి దండ్రుల కోక్కర్తే కూతురవటం వల్ల, గర్వంగా, పెంకిగా జీవితానికి భయపడకుండా పెరిగిన శోభాదేవి.......
    పెళ్ళికి ముందు ప్రేమ, సెక్సు అంతా ట్రాష్ అనీ, ఆడదానికి  కారక్టరే మెరిట్ సర్టిఫికేట్ అనీ నమ్మి నవ్వుతూ బ్రేక్ వేయబోయిన తనలాంటి స్టూడెంట్స్ చెంప పగలగొడుతూ సంచలనం సృష్టించిన నిప్పు.
    ఆ శోభాదేవి ఇప్పుడు 'ఇంటికొస్తే అందుక్కూడా సిద్దమే' అంటోంది. హటాత్తుగా ఎందుకిలా అపశ్రుతి పలికిందామె జీవితం? ఇంకో జన్మ జన్మత్తినట్టు ఎందుకు మారిపోయింది. ఆ నిప్పు ఎందుకిలా చల్లారి బొగ్గుగా మారిపోయింది?
    పెళ్ళి చేసుకున్నోడు కట్నాల కోసం తన్ని తగలేశాడా? అత్తా గారు కిరసనాయలు తీసుకుని వెంతపడిందా? తల్లి దండ్రులు ఈ దృశ్యం చూడలేక కళ్ళు మూశారా?
    ఏదీ కాకపోతే తను ప్రేమించే 'కారెక్టర్ ' ని గంగలో ఎందుకిలా కలిపేసింది?
    దిసీజ్ లోఫ్, దిసీజ్ లైఫ్ దిసీజ్ లైఫ్.
    దీన్నే నటాషా నవ్వుతూ చెప్పింది ఆ రోజు - వేరే పదాల్లో.
    "మనందర్నీ , మనం చేసే పనుల్లోకి పరిస్థితులు దించుతాయి.'
    'మాట్లాడవేం? నేనంటే ఇప్పుడు ఇష్టం పోయిందా?" ఆమె కళ్ళల్లో సుడులు తిరుగుతున్న నీళ్ళు.
    సురేష్ కి అక్కడి నుంచి పారిపోవాలని వుంది.
    "రేపు వస్తాను.'
    "ప్రామిస్?" ఆశ.
    "ప్రామిస్."
    "మీ కోసమే వెయిట్ చేస్తుంటాను.'
    ఆమె వెళ్ళిపోయింది జన ప్రవాహంలోకి! ఆ ప్రవాహంలో మరో జన్మ ఎత్తిన పాత్రలు ఎన్ని వున్నాయి?
    దీపా, తులసి ఉత్సాహంగా ఏదో మాట్లాడుకొంటూ వస్తున్నారు. తనను చూడగానే దీప ,ముఖంలో కాంతి మాయమవటం గమనించాడు సురేష్. ఇరిటేషన్ కళ్ళల్లో నుంచి తొంగిచూస్తోంది. అది తనకు మరింత ఇన్ స్పిరేషన్ కలిగిస్తుంది.
    "హలో దీపాజీ! "
    "హలో" ముక్తసరిగా అందామె.
    "ఇవాళ దీప మన గెస్ట్" నవ్వుతూ చెప్పింది తులసి.
    'అయితే పవర్ ఫుల్ యాప్రోడిసియాక్ తెచ్చుకుంటాను మెడికల్ స్టోర్ కెళ్ళి.'
    దీప కర్ధం కాలేదు.
    'అంటే ఏమిటి?"
    "ఇంట్లో ఇద్దరు గాళ్స్ వున్నప్పుడు....."
    దీప ముఖం మరింత మాడిపోయింది.
    తులసి బ్యాగ్ తో అతని భుజం మీద లాగి కొట్టింది. నవ్వాపుకుంటూ.
    "పదండి వెళ్దాం"
    ముగ్గురూ బస్ లో బయల్దేరారు.
    "రెండు అడ టికేట్లేనా?" నవ్వుతూ అడిగాడు కండక్టర్.
    "ఇవాళ మూడు! బిజినెస్ అభివృద్ధి అయింది."
    ఇంటిలో కేళుతుంటే గంగాభవాని తనను చూసి నవ్వింది. అతనికి సంతృప్తి కలిగింది. ఉదయం తను వాడిన మందు పనిచేసిందన్నమాట. లేకపోతె తెల్లారి లేస్తే ఆమెతో పేచీ పడటం కష్టం! ఇప్పుడిక ఏ గొడవా వుండదు.
    తులసి 'టీ' తయారుచేస్తోంది.
    దీప టవల్ తో ముఖం తుడుచుకుంటోంది అద్దం ముందు నిలబడి.
    "ఏమిటివాళ ఇంత సడెన్ గా వచ్చారు?" దీప నడిగాడు.
    "అయన కాంప్ కెళ్ళారు. తులసితో సరదాగా గడిపి చాలా రోజులయిందని......"
    "నేను చెప్పలేదూ - పెళ్ళి చేసుకుంటే థ్రిల్ వుండదనీ?"
    అమె అసహనంగా చూసింది.
    "థ్రిల్ ఏమిటి?"
    "చూశారా 'థ్రిల్ అంటే ఏమిటి అని అడిగేంత డల్ అయిపొయింది మీ లైఫ్ ఇప్పుడు! డల్ అయినప్పుడే కాంప్ కెళ్ళిపోతారు చాలా మంది. ఓ.కే ఇవాళ ఒక్క రోజుకి హెల్ప్ చేస్తాను లెండి.'
    "మీకిలా మాట్లాడటానికి సిగ్గు వేయటం లేదూ?"
    "మా కాలేజ్ మేట్ సీత యిలాగే సిగ్గుపడి కొంపకు చేటు తెచ్చుకుంది."
    "ఎందుకు?"
    "విఠల్ దగ్గర పెళ్ళి సంగతి ఎత్తటానికి - తరువాత అడిగితే నేను తండ్రిని కారు పొమ్మన్నాడు.'
    తులసి 'టీ' తీసుకొచ్చి ఇచ్చింది ముగ్గురికి.
    "త్వరగా వెజిటబుల్స్ తీసుకురా! మళ్ళీ దీప వాళ్ళింటి కెళ్ళాలి భోజనము చేశాక.'
    సురేష్ సంచీ తీసుకుని బయల్దేరాడు.
    గంగాభవానీ మళ్ళీ నవ్వింది.
    "ఎక్కడికి?"
    "వెజిటబుల్స్ కి"
    "మన పాదులున్నాయిగా?"
    "మళ్ళీ తులసితో కంప్లయింట్ చేయటానికా?"
    ఆమె నవ్వింది మళ్ళీ. తులసి త్వరత్వరగా వంట ముగించింది.
    భోజనం చేశాక ముగ్గురూ బయల్దేరారు.
    "పోనీ రాత్రికిక్కడే వుండిపోరాదూ?" అంది తులసి.
    "ఊహు! వద్దు అయన తెల్లారుజామున వచ్చేస్తానన్నారు.'
    'అలా అయినా లాభం ఏమీ వుండదు" అన్నాడు సురేష్. "పెళ్ళి చంపెశాక ఇంక బ్రతకదది? మీరెంత ప్రయత్నించినా సరే!"
    దీప క్కూడా నవ్వాగలేదు గానీ అతి కష్టం మీద నొక్కి పట్టింది.
    ఆమె బస్ లో ఎక్కగానే ఇద్దరూ తిరిగి ఇంటివేపు బయల్దేరారు.
    తులసి వార పత్రికలో తను చదివిన డాక్టర్ సమాధానాల గురించి చెబుతోంది పెద్దగా నవ్వుతూ.
    "డాక్టర్ అక్కా! నేను కావాలని కోరి పెళ్ళి చేసుకున్నతను నిజంగా సెక్స్ రాక్షసుడని తెలిసిందక్కా! నన్ను ఒంటరిగా ఒక్క క్షణం కూడా వదలడం లేదు. రాత్రి పగలు లేదు. పొద్దున్న కాఫీ కాస్తున్నప్పుడూ, వంట చేస్తున్నప్పుడూ, ఇల్లు శుభ్రం చేస్త్గున్నప్పుడూ, స్నానం చేస్తున్నప్పుడు టి.వి చూస్తున్నప్పుడు - అబ్బ ప్రాణం విసిగిపోతోంది. నువ్వే నాకు సహాయం చేయాలక్కా , ఏదో ఒకదారి చూపితే నీ మేలు మర్చిపోను - అన్నట్లు సారీ అక్కా! హ్యాండ్ రైటింగ్ యిలా షేకీగా వున్నందుకు."
    'హలో!"
    ఇద్దరూ స్పృహలోచ్చి పక్కకు చూశారు.
    సురేష్ ఆమెను చూసి ఉలిక్కిపడ్డాడు.
    అందంగా, స్మార్ట్ గా వుందా అమ్మాయి! ఆంగ్లో ఇండియన్. ఆ రోజు బుద్దుడి బొమ్మ కోసం వెళ్ళిన గిప్టు షాప్ గాళ్!

 Previous Page Next Page