Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 17


    మోహన్ రాజ్ అదిరిపడ్డాడు. "అదేమిటి సార్! అసలే అది అమ్ముడవక ఛస్తుంటే 'బాన్' చేయించాలా?"
    "మోహన్ రాజ్ అర్జంటుగా నువ్వు మెంటల్ డెవలప్ మెంట్ కోర్స్ తీసుకుంటేగానీ నీ మెదడు అభివృద్ధి చెందదని నాకనుమానంగా వుంది."
    మోహన్ రాజ్ గాబరాపడ్డాడు "అదిగాద్సార్!..."
    "ఆర్గ్యుమెంట్ వద్దు ఫ్రెండ్. అర్జంటుగా నేను చెప్పిన పని చేసెయ్. నువ్వు నా బాస్ వి. నేను నీ సబార్డినేట్ ని అన్నసంగతి కొద్దిసేపు మర్చిపో. వెంటనే వెళ్ళి హోమ్ డిపార్టుమెంట్ లో ఇన్ ఫ్లుయెన్స్ చేయించు. ఎలాగయినా మన పుస్తకం 'బాన్' చేయించు. దాన్నిండా పుష్కలంగా ప్రజా విప్లవ ప్రబోధాలున్నాయని, అంచేత ప్రభుత్వం 'బాన్' చేయాలనీ నచ్చజెప్పు."
    "కానీ అది పేరుకే గానీ లోపల వున్నది వట్టి సినిమా కథ కదా. 'ఎర్రమట్టి' అనే ఊళ్ళో బస్ చెడిపోతే అందులో వున్న ప్రయాణీకుల్లో ఒక హీరో హీరోయినూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకుని ఆ ఎర్రమట్టినే సాక్ష్యంగా తీసుకుని పెళ్ళిచేసుకుంటారు. అలా నడుస్తుంది కథ" బలహీనంగా వాదించాడతను.
    "అదంతా నీకనవసరం మోహన్ రాజ్. ముందు నేను చెప్పినట్లు చెయ్. సాయంత్రానికల్లా 'బాన్' ఆర్డర్ రావాలి. ఈలోగా పుస్తకాలన్నీ తీసుకెళ్ళి నగరంలోని అన్ని పుస్తకాల షాపుల్లోనూ డంప్ చేయండి. వారం రోజుల తర్వాత స్టాక్ అమ్ముడవకపోతే వాపస్ తీసుకెళ్ళిపోతామని చెప్పండి."
    "సరే సార్." అయోమయంగా బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయాడతను.
    అతను వెళ్ళిపోగానే భవానీశంకర్ ఆనందంగా బయటకు నడిచాడు.


                            *    *    *    *


    కె.యస్.ప్రకాష్ కారు నెమ్మదిగా వచ్చి ఫుట్ పాత్ మీద నడుస్తోన్న సుష్మ పక్కన ఆగింది.
    "హలో" అన్నాడు ఆమెవైపు చూసి చిరునవ్వు నవ్వుతూ.
    "హలో" అంది సుష్మ ఆశ్చర్యంగా అతనివైపు చూస్తూ. అతను ఎవరో ఠక్కున గుర్తొచ్చేసిందామెకు.
    "రండి! కార్లో డ్రాప్ చేస్తాను. నేనూ అటే వస్తున్నాను" అన్నాడతను.
    "ఎటు?" అడిగిందామె.
    అతను కన్ ఫ్యూజన్ అయ్యాడు. "ఎటు అంటే ఫలానా అటు అని ఏమీ ఇది లేదనుకోండి! ఎటంటే అటేనన్నమాట. ఐ మీన్! నేనెటు వెళ్ళాలన్నా మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళగలను? అంటే నేనసలు సిటీలో చాలా చోట్లకు వెళ్ళాల్సి వుంటుంది కదండీ! కనుక మీరెటువెళితే అటు నాకు ఏదో పని వుండకుండా వుండదన్నమాట."
    "ఓ...! అలాగా..." అందామె కారు ఎక్కాలా వద్దా అని ఆలోచిస్తూ.
    ఈలోగా ఆ కారు వెనుకే హైద్రాబాద్ రోడ్ల వైశాల్యం ప్రకారం పదహారు కార్లు, ఎనిమిది బస్ లు, పాతిక లారీలు, రెండు వందల స్కూటర్లు, రెండు వందల పాతిక ఆటోలు క్యూ కట్టేసి భయంకరంగా హారన్లు మోగిస్తున్నాయి.
    హారన్లతో అతని కారు కదిలేటట్లు లేదని వెనుక క్యూ కట్టిన వాళ్ళ సంఘం అధ్యక్షుడు విసురుగా, కోపంగా ప్రకాష్ దగ్గరకొచ్చాడు.
    "ప్లీజ్...కారెక్కండి" అన్నాడు ప్రకాష్ సుష్మతో ఆ అధ్యక్షుడ్ని లెక్కచేయకుండా.
    "ఎందుకండీ మీకు శ్రమ" అంది సిగ్గుపడుతూ.
    "అబ్బే! ఇందులో శ్రమేం లేదండీ ఇటీజ్ ప్లెజర్. ఓ సారీ...ఇటీజ్ ప్లెజర్. ప్యూర్ ప్లెజర్. టోటల్ ప్లెజర్"
    "నా వలన మీ పనులన్నీ పాడయిపోతాయేమోనని..."
    "నథింగ్ దట్ సార్ట్! నా పనులన్నీ ఇన్ ఫాక్ట్ మీ తర్వాతే...ఐ మీన్...మీరు ఇప్పుడు కాదంటే యింక నేనేమీ చేయలేనన్నమాట. మూడ్ ఆఫ్ అయిపోయి పనులన్నీ కాన్సిల్ చేసేసుకుని ఇంటిదగ్గరే వుండిపోతానన్నమాట."
    ఈసారి కారు వెనుక క్యూ కట్టిన వాళ్ళ సంఘం అధ్యక్షుడి పక్కన ఇంకొంతమంది మెంబర్లు వచ్చి చేరారు. "అరె! రోడ్డు మధ్యన దిల్లగీ నడుస్తున్నదేమయ్యా! దిల్ బహలాయించల్నంటే పార్కులకు గట్టా పోవాలె...! పబ్లిక్ రోడ్డు మీదేం శౌక్ వయ్యా."
    "ఏయ్ కార్ వాలా...! కారు ముంగటికి నడుపుతావా...? ఎత్తి పడేయాల్నా?" ఇంకొకడు చొక్కా చేతులు ముడుస్తూ దగ్గరకొచ్చాడు.
    వీళ్ళ వ్యవహారం చూసి సుష్మ కంగారుపడింది "అయ్యో మనవల్ల ట్రాఫిక్ మొత్తం ఆగిపోయినట్లుంది" అంది జాలిగా.
    ప్రకాష్ చిరునవ్వు నవ్వాడు. "ఏం ఫర్లేదు. హైద్రాబాద్ లో ట్రాఫిక్ ఆగనిదెప్పుడు? వాళ్ళ పిచ్చి కేకలు పట్టించుకోకండి. అన్నట్లు మొన్న హోటల్ లో అడగటం మర్చిపోయాను. నేనే ఎప్పటికైనా సినిమా తీస్తే ఎలాంటి సబ్జెక్ట్ తీసుకోమంటారు? హీరోయిన్ ఓరియంటెడ్ అయితే బెరటని నా ఉద్దేశ్యం. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం వుంటుంది. మీరేమంటారు?"
    "అంటే మీరు నిజంగానే సినిమా తీస్తారా?" ఆశగా అడిగింది.
    "భలేవారే...! మీకోసమైతే తీస్తాను. కాకపోతే కొంచెం ఆలస్యం అవచ్చు. అంతే.."
    "ఆలస్యం ఎందుకు?"
    "ఫైనాన్స్! మా మావయ్య నా ఆస్తినంతా ఫ్రీజ్ చేసేశాడు. రిలీజ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది."
    "ఓ...అలాగా..."
    "అవునండీ"
    "అయితే సరే! మీరన్నట్లు హీరోయిన్ సబ్జెక్ట్ అయితేనే బాగుంటుంది."
    "అయితే అదే రడీ చేయిస్తాను. నాకు తెలిసిన ఒక రైటరున్నాడు. వాడితో కథ తయారుచేయమని చెప్పేస్తాను."
    "ఎవరా రచయిత?"
    "విజయ్ అనీ - గ్రేట్ ఫెలో! పాపం... ఎంకరేజ్ మెంట్ లేక అలా వుండిపోయాడు."
    "అలాగా"
    ఈసారి క్యూ కట్టిన వాళ్ళ సంఘం సభ్యులు ప్రకాష్ మీదకు వచ్చేశారు.
    "ఏయ్! బోలేతో సమజ్ మేనై ఆరైక్యా? హఠో వహాసే" ఇంకొకడు అరిచాడు.
    ప్రకాష్ కారు దిగి వారికెదురుగా నిలబడ్డాడు.
    అతని పర్సనాలిటీ చూడగానే అందరూ జంకారు. "ఏంలేదు సార్! కారు జర పక్కకు తీస్తే మేము పోతాం. ట్రాఫిక్కంతా రుకాయించి పోయింది"
    "మరి ఆ సంగజ్జెప్పక రూవాట్ చేస్తారెందుకు? ఇప్పుడు 'హఠో వహాసే' అని అరిచిందెవరు?"
    అధ్యక్షుడితో సహా అందరూ వెనక్కి తిరిగి చూశారు.
    "ఎవరో పాగల్ గాడు అరిచి వుండొచ్చు. జాన్ దేవ్ అన్నా..." అధ్యక్షుడు బ్రతిమాలాడు.
    ప్రకాష్ శాంతించి తిరిగి కార్లో కూర్చున్నాడు.

 Previous Page Next Page