"మరింక ముద్దు పెట్టుకోవటం ఎప్పుడు ఆపాలో ఎలా తెలుస్తుంది?"
"ఎప్పటికీ తెలీదు."
బేరర్ వారి ముందు పొగలు కక్కే భోజన పదార్థాలు ఉంచేసరికి ఆ వేడికి ఇద్దరి తలకాయలూ దూరంగా జరిగాయి.
భోజనం అద్భుతంగా వుంది.
"ఆహా!" అన్నాడు చిరంజీవి భోజనం ముగించి.
"సూపర్బ్" అంది సంగీత.
"కాసేపలా లాన్స్ లో కెళ్దామా?" అడిగాడు చిరంజీవి.
"ఓ! అయామ్ రడీ!"
"నో! బయటికెళ్ళడానికి వీల్లేదు" ఆ పక్క టేబుల్ దగ్గరే కూర్చున్న కిడ్నాపర్ కోపంగా అరిచాడు.
చిరంజీవికి వళ్ళు మండిపోయింది.
"ఎవడాడు అరిచింది?"
"నేను" అన్నాడు కిడ్నాపర్.
"ఏమిటా పిచ్చి అరుపులు. నువ్వు కొంతకాలం అసెంబ్లీలో పనిచేశావా? ఇంకోసారి అరిచావంటే ఊరుకోను చెప్తున్నా."
"అయితే నువ్వు ఈ హోటల్ వదిలి బయటకెళ్ళడానికి వీల్లేదు."
"షటప్!" కోపంగా అరిచింది సంగీత. "మా ఇష్టమొచ్చిన చోటుకి మేం వెళ్తాం. వద్దంటానికి నువ్వెవరు?"
"నేను కిడ్నాపర్ ని?"
"ఏడ్చావ్! కిడ్నాపర్లు ఎక్కడయినా ఇలా ఇంత దద్దమ్మల్లాగుంటారా? ఎప్పుడో అడవుల్లోకి తీసుకెళ్ళి రాన్సమ్ కోసం ఫోన్ చేసేవాళ్ళు."
"ఏయ్ పిల్లా! నువ్వు నూర్మూసుకో"
"నువ్వే నోర్మూసుకో"
చిరంజీవి ఆనందంగా తప్పట్లు కొట్టాడు.
"తిక్కొదిలిపోయిందా? నన్నంటే ఊరుకున్నాను కాని అందర్నీ అంటే ఊరుకుంటారేమిటి?" అన్నాడు పొంగిపోతూ.
ఇద్దరూ లేచి లాన్స్ లో కొచ్చారు.
"ఆహా! వెన్నెల ఎంత బావుందో చూశారా?" అడిగాడు చిరంజీవి.
"చాలా బావుంది"
"ఈ గార్డెన్ ఎంత బావుందో"
"చాలా బావుంది"
"ఈ పూలు ఎంత బావున్నాయ్"
"అచ్చం పూలలా వున్నాయ్"
"ఇది ఎంత బావుంది"
"అవును! చాలా ఇదిగా వుంది"
"సంగీతా!"
"ఊ!"
"మనం పెళ్ళి చేసుకుందామా?"
"ఆ మాట ఎప్పుడడుగుతావా అని ఎదురు చూస్తున్నాను"
"ఆ! నిజంగానా?"
"ప్రామిస్!"
"అయితే రేపే నా బర్త్ డే కనుక రేపే మన పెళ్ళి కూడా."
"మైగాడ్! ఇంత త్వరగానా?"
"నీకు త్వరగా అనిపిస్తోందేమోగానీ నాకు ఒక రోజు ఒక యుగం అనిపిస్తోంది. ఎప్పుడు నీ కౌగిలిలో అలా అలా మేఘాల్లో తేలిపోదామా అని వుంది."
"నో! ఈ హోటల్ దాటి బయటకు పోడానికి వీల్లేదని ముందే చెప్పాను" అరిచాడు కిడ్నాపర్ పొదల చాటు నుంచి.
ఇద్దరూ కోపంగా అతనివేపు చూశారు.
మరుక్షణం మరో ఇద్దరు కూడా గన్స్ తో వచ్చారక్కడికి.
"ఇంక చాలు! వీడిని మనం వదిలేయవచ్చు. టైమ్ పదకొండయిపోతోంది" అన్నారు కిడ్నాపర్ తో.
కిడ్నాపర్ ఆనందంతో ఎగిరి గంతేశాడు.
'సక్సెస్' అంటూ అరిచాడు.
అందరూ చిరంజీవికీ, సంగీతకూ షేక్ హాండిచ్చి బయటకు పరుగెత్తారు.
* * * *
సింహాద్రి ఉలిక్కిపడి నిద్ర లేచాడు.
టైమ్ అర్దరాత్రి పన్నెండవుతోంది.
బయట కారు హారన్ భయంకరంగా మోగుతోంది.
సింహాద్రికి అర్థమయిపోయింది.
అది చిరంజీవి కారే!
లేచి తలుపు తెరిచాడు.
"ఒరే సింహాద్రీ! ఇవాళేం జరిగిందో తెలుసా?" ఎగ్జయిట్ మెంట్ తో అడిగాడు.
"తెలీదు"
"నా పెళ్ళి సెటిలయిపోయింది."
సింహాద్రి ఉలిక్కిపడ్డాడు.
"నువ్వు పెళ్ళి చేసుకుంటున్నావా?"
"అవును"
"ఎందుకు?"
"పెళ్ళి ఎందుకేమిట్రా? వివాహం అనేది మానవుడికి దేవుడిచ్చిన వరం."
సింహాద్రికి మరింత ఆశ్చర్యం కలిగింది.
"కానీ నువ్వు 'జాలీ లైఫ్' క్లబ్ మెంబర్ వి కదరా. నీకు పెళ్ళేమిటి?"
"ఒరేయ్! జీవన జీవితోన్నతా పథంలో వింత విచలత సాదృశ్య సర మానస మహీధర ధరణీకృత మనోహర చరత చరణంలో ఎప్పుడే వింత జరుగుతుందో ఎవరూ చెప్పలేర్రా."
సింహాద్రి గాబరా పడిపోయాడు.